Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 15

    నాంచారమ్మ నెత్తిమీద బిందెల కొద్దీ నీళ్ళు పోశారు. వేపమండలతో విసిరారు. సాంబ్రాణి పొగ వేశారు.

    ''ఏం జరిగింది తల్లీ ?. మా ఊరు ఎందుకొచ్చావ్ ? '' చేతులు జోడించి అడిగాడు ఆ ఊరి పెద్ద.

    ''ఏం జరిగిందా ? ఇంకేం జరగాలిరా ! నన్ను మర్చి పోయార్రా ! ఆఁ_హూఁ! అద్దద్దా ! మిమ్మల్ని నలుసుకు తింటా !'' నాంచారమ్మ చేతులు పక్కలకు విరచుకుంటూ మునికాళ్ళమీద లేచి నిల్చుంది.

    ''తల్లీ, అపరాధం జరిగింది. క్షమించు. ఇప్పుడు ఏం కావాలి ?'' అన్నాడు భక్తిపూర్వకంగా ఊరి పెద్ద.

    ''ఏం కావాలంటా వేందిరా ? నాకు కడుపునిండా తిండేది ?. ఒంటినిండా ఒట్టేది ? ఆహారం కావాలి కొలవండిరా ! కొలువులు కోలవండి '' నాంచారమ్మ ఒంటిమీద అసలే చాలీ చాలని చీర వుంది. దాన్ని మో కాళ్ళ పైకి లాక్కుంటూ చిందులు తొక్కడం ప్రారంభించింది.

    ''తల్లీ ! అట్టాగే కొలచుకుంటాం. శాంతించు తల్లీ !'' జనంలోనుంచి అనేక కంఠాలు పలికాయి.

    గణాచారి ఊగడం తగ్గింది. జనం బిందేలలో నీళ్ళు గుమ్మరించారు. ఆ మధ్యాహ్ననికే ఆ ఊరికి డాక్టర్ల బృందం వచ్చింది. కలరా తగ్గుముఖం పట్టింది.

    పోలేరమ్మ గుడిముందు కోళ్ళూ, ఏటపోతులూ గిల గిల తన్నుకొన్నాయ్. గణాచారి నాంచారమ్మకు ఓ జత అద్దకం చీరెలూ, రవిక గుడ్డలూ ముట్టినయ్. కొలువులు బ్రహ్మాండంగా జరిగాయి.

    ఆ తెల్లవారి గణాచారి నాంచారమ్మ భద్రయ్య ఇంటికి వచ్చింది. గంగాభవాని దీర్ఘాలోచనలో వుంది.
    "గంగమ్మగోరూ! ఇంత పచ్చడుంటే  పెట్టండమ్మా!"

    గంగాభవాని త్రుళ్ళిపడింది. నాంచారమ్మను చూడగానే సంతోషంతో ఆమె ముఖం చేటంత అయింది. 'రా! నాంచారమ్మ రా! కూర్చో!' అన్నది గంగాభవాని ఆప్యాయంగా.

    "నా తల్లి గదే! నీ కెంత కష్టం వచ్చింది తల్లీ. నా మాట విని ఆ పోలేరమ్మకు మొక్కుకో తల్లీ. ఒక చీరా, రికా ఇస్తానని మొక్కుకో. నెల తిరక్కుండానే నీ భర్తనీ కాళ్ళమీద వచ్చి పడ్తాడు."

    'ఒకటి కాదు, రెండు చీరలిస్తాను. నా కష్టం తీర్చమనవే!'

    'మనసులో అనుకొని దణ్ణం పెట్టుకో తల్లీ."

    గంగాభవాని లోపలకెళ్ళి విస్తరాకులో గోంగూర పచ్చడి తెచ్చింది. నాంచారమ్మ పైటచెంగు చాచింది. "నాంచారమ్మా?" "ఏమిటి తల్లి?"

    "ఆ రోజు గణం పెరిగినప్పుడు నిజంగా నీకు ఏమీ తెలియదా?" నాంచారమ్మ కళ్ళలోకి లోతుగా చూసింది గంగాభవాని.

    నాంచారమ్మ బిత్తరపోయింది.

    "అదేంది గంగమ్మగోరూ అట్టా అడిగారూ? తప్పు! ఆ తల్లిని అనుమానించకూడదు."

    "పోనీయ్ ఇది చెప్పు. అలా ఎవరికైనా గణం పెరుగుతుందా?"

    'అంతా ఆ తల్లి దయా. ఆ తల్లిమీద గురి వుండాలి.' మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా నాంచారమ వెళ్ళిపోయింది. నాంచారమ్మ వెళ్ళినవైపే గంగాభవాని సాలోచనగా చూస్తూ నిలబడిపోయింది.

    ఇంకా సంక్రాంతి పండుగ వారం రోజులుంది. అప్పుడే చీకటి పడుతోంది. తెనాలి బస్సు దిగి, చలపతి మామగారి వీధిన నడుస్తున్నాడు. బాగా అలసిపోయివున్నాడు. అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాడు అల్లంత దూరంలోవున్న భర్తను చూసింది గంగాభవాని. తలుపు పక్కగా వీధి వాకిట్లో నిలబడింది. వీధిలో ఎవరూ లేరు.

    ఈ పూట ఈయన సంగతేదో తేల్చుకోవాలి. అడుగో వస్తున్నాడు. వచ్చేశాడు. అరె! తనవైపు చూడడం లేదు. గంగాభవాని తలుపు బాదింది. అయినా అతడు తలెత్తి చూడలేదు. అటూ ఇటూ చూసింది. ప్రహరీగోడమీద కూర్చున్న కోడిపెట్టను రెండు చేతులతో పట్టుకుంది. జాకెట్ లోనుంచి చీటీ తీసి కోడి కాలికి చుట్టింది. వీధిలో తల వంచుకొని, కాళ్ళీడ్చుకుంటూ పోతున్న చలపతి నెత్తిమీదను విసిరింది.

    కోడి "కిక్ కిక్" మంటూ చలపతి భుజంమీద వాలి, కిందకు దూకింది. దాని కాలికి చుట్టివున్న ప్రేమలేఖ కింద పడింది.

    చలపతి వంగి ఆ చీటీ తీసుకొని వెనక్కు తిరిగి చూశాడు. కుక్కుట రాయబారం నడిపిన భార్యామణి వాకిట్లో ఒయ్యారంగా నిల్చుని వలపు చూపుల్ని ఓరగా విసురుతూ, చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. వచ్చీరాని నవ్వొకటి భార్య ముఖంమీధకు విసిరి ముందుకు సాగిపోయాడు.

    ఉత్తరం చదువుకొన్న చలపతి మనసు అడుసుతొక్కిన రేగడి మట్టిలా అయిపోయింది.

    నాలుగు రోజులపాటు మనసులోనే మధనపడిన చలపతి పండుగ రెండు రోజులు వుందనగా తల్లితో అన్నాడు. ...పండక్కు అత్తా గారింటికి వెళ్తూన్నానే అమ్మా"! నోరుతెరచి కొడుకు ముఖంలోకి చూసింది.

 Previous Page Next Page