Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 15


    నాకు ఆ పిల్లలో పిచ్చిలక్షణాలేమీ కన్పించలేదు.

 

    పిచ్చివాళ్లంతా పిచ్చివాళ్లలా కన్పించరు.

 

    ఆ మాటకొస్తే మనం రోజూ చూసేవాళ్లల్లో ఎందరో పిచ్చివాళ్లుంటారు. ఆ లక్షణాలు పూర్తిగా ముదిరితేగాని ఎవరూ వాళ్లకు పిచ్చి అని గ్రహించలేరు.

 

    "బాబూ!"

 

    గిర్రున తల తిప్పి చూశాను.

 

    "ఈ అమ్మాయి కూడా ఊళ్లోకి మనతో వస్తుంది."

 

    "నాకేం అభ్యంతరంలేదు!" అన్నాను ఆమెను చూస్తూ మైమరపుగా.

 

    ఆమె బండి ఎక్కింది.

 

    ఎదురుగా కూర్చుంది.

 

    మోకాళ్లు ముడుచుకొని ముఖం మోకాళ్ల మీదకు దించుకొని కూర్చుంది.

 

    తను ఎదురుగా ఉన్నట్టు గమనించినట్టుగా కూడా లేదు.

 

    అవును పాపం! ఈ వయసులో ఈమెను పిచ్చి ఎత్తడం ఏమిటి? పిచ్చి ఎత్తలేదు. ఎత్తించారు.

 

    మల్లెల వాసన చల్లగాలితోపాటు నా నాసాపుటాలను తాకుతోంటే నాలో ఏవేవో కోరికలు తలెత్తసాగాయి.

 

    ఆ పిల్లను అలా చూస్తూ కూర్చున్నాను. అలా చూడటాన్నే గుటకలు వెయ్యడం అంటారు.

 

    గుర్రంబండి చక్రం ఒకటి కొంచెం పల్లంలోకి పడి లేచింది.

 

    అకస్మాత్తుగా లీల నామీద పడిపోయింది.

 

    గాభరాగా సర్దుకొని కూర్చుంది.

 

    "సారీ!" అంది నా కళ్లల్లోకి చూస్తూ.

 

    "ఫర్వాలేదు" అన్నాను.

 

    ఆమె కనురెప్పల్ని టపటప లాడించింది.

 

    ఆమె అలా మరికొంతసేపు నా ఒళ్లోనే ఉంటే బాగుండుననే కోరిక లీలగా మెదిలింది.

 

    "మీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. నీళ్లలోనుంచి మిలమిల లాడుతూ పరుగులు తీసే చేపల్లా ఉన్నాయి.

 

    ఆ అమ్మాయి కిసుక్కున నవ్వి తల వంచుకొన్నది.

 

    ఆ నవ్వు నా మనసుకు గిలిగింతలు పెట్టింది.

 

    ఇంతకుముందేగా గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది. ఇంతలో ఎలా నవ్వగలుగుతోంది?

 

    పిచ్చిది. పిచ్చివాళ్లు ఎందుకు నవ్వుతారో, ఎందు కేడుస్తారో ఎవరు చెప్పగలరు? అందుకే వాళ్ళను పిచ్చివాళ్ళంటున్నాం.

 

    ఆమె తల ఎత్తింది.

 

    నాకేసి ఓరగా చూస్తోంది.

 

    పెదవులు కదిలాయి.

 

    ఒంపులు తిరిగిన ఆ పెదవుల మధ్య చిరునవ్వు.

 

    నాకు వళ్ళు జల్లుమంది.

 

    ఆ నవ్వు మామూలు నవ్వుకాదు.

 

    పిచ్చివాళ్ళు నవ్వే నవ్వు.

 

    నాకు పిచ్చివాళ్లంటే భయంలేదు.

 

    వాళ్ల నవ్వంటేనే భయం. అదీ చిరునవ్వు మాత్రమే. వాళ్ళు వెర్రిగా విరగబడి నవ్వుతోంటే నాకు భయం అనిపించదు. ఆ నవ్వే పిచ్చివాళ్ల సహజమైన నవ్వుగా అన్పిస్తుంది. చిరునవ్వు అసహజంగా అన్పిస్తుంది.

 

    నా ఎదురుగా కూర్చున్న అందాలరాణి పిచ్చిది.

 

    నన్ను చూసి నవ్వుతోంది. ముసిముసిగా నవ్వుతోంది.

 

    నేను బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాను.

 

    నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది.

 

    ఒక సిగరెట్ కాల్చుకుంటే బాగుండు ననిపించింది.

 

    జేబులోనుంచి సిగరెట్ పెట్టె తీశాను. అగ్గిపెట్టె తీశాను, పుల్ల బయటకి తీసి గియ్యబోయాను.

 

    నా చేతిలోంచి అగ్గిపెట్టె ఎగిరి అల్లంతదూరంలో పడింది. అదే వేగంతో ఆ పిల్లకూడా బయటకి దూకింది.

 

    నేను ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆ పిల్ల బండిలోలేదు. నేను చూపు అందినంతవరకు చూశాను. రోడ్డు ప్రక్కగా ఉన్న చిన్న పొదల్లోనుంచి ఏదో నీడ పరుగెత్తడం చూచాను.

 

    "రహమాన్ బండాపు!"

 

    "ఎందుకు బాబూ!"

 

    "ఆ పిచ్చిపిల్ల బయటకు దూకింది."

 

    "పర్వాలేదులెండి."

 

    "అదేమిటి? పాపం అర్దరాత్రిపూట అరణ్యంలాంటి ఈ ప్రదేశంలో ఎక్కడ తిరుగుతుంది? బండి ఆపి పిలువు."

 

    "అది ఇక మనకు చిక్కదు బాబూ!"

 

    "అసలెందుకలా ఉన్నట్టుండి ఎందుకు దూకింది?"

 

    నా ప్రశ్న నాకే పిచ్చిగా అన్పించింది. ఆ పిల్లకు పిక్చి౧ ఎందుకు దూకిందో ఎవరు మాత్రం చెప్పగలరు? అలా దూకి పారిపోవాలనిపించి ఉంటుంది. అందుకే దూకింది.

 

    "మీరు అగ్గిపుల్ల గీచారు. అందుకే పారిపోయింది!" అన్నాడు రహమాన్.

 

    "ఆ పిల్లకు అగ్గంటే భయమా?"

 

    "ఆ పిల్లకేంటి? ఏ దయ్యానికైనా అగ్గి అంటే భయమే. మీరు వినలేదా?"

 

    ఒక్కసారిగా బండిలోనే ఎగిరి పడ్డాను.

 

    నెత్తికి బండిటాపు కొట్టుకుంది.

 

    దిమ్మెరపోయాను. అరచేతో నెత్తిని రుద్దుకున్నాను.

 

    రహమాన్ కేసి చూచాను.

 

    వాడు నాకేసి చూడటంలేదు. ముఖం తిప్పుకొని నవ్వుకొంటున్నట్టుగా అన్పించింది.

 

    దొంగ వెధవ!

 

    వీడూ నాటకం ఆడుతున్నాడు.

 

    వీడూ భూతరాజూ కలిసే నన్ను భయపెట్టే ప్లాను వేసుకొని ఉంటారు. వీడికీ ఆ హత్యతో సంబంధం ఉండి ఉంటుంది. ఇవన్నీ ఇద్దరూ కలిసి చేసిన ఏర్పాట్లే. దయ్యాలను నమ్మని నేను రీజనింగ్ లేకుండా దయ్యాలని భయపడటం ఏమిటి!

 Previous Page Next Page