ఎలాగో అతికష్టం మీద ఉద్యోగానికి మాత్రం వెళ్ళొచ్చేది. మాధవిని చూస్తుంటే అమ్మమ్మకి ఏం చెయ్యాలో తెలీక బాధ కలిగేది.
ఆరోజు శుక్రవారం ఆఫీసునుంచి రాగానే 'నీకుత్తరం వొచ్చిందే' అని ఒక కవరు అందించింది అమ్మమ్మ. ఆత్రుతతో విప్పి చదివింది.
డార్లింగ్ మధూ, కింద సంతకం చూసింది. 'నీ అజయ్' సంతోషంతో మనసు ఉక్కిరిబిక్కిరవుతూంటే పర్సు పక్కన పడేసి మంచంమీద వాలిపోయింది, ఉత్తరాన్ని చదువుతూ.
డార్లింగ్ మధూ,
ఎలా వున్నావ్? నాకు తెలుసు నీ మనసంతా నేనే వుంటానని. నా పరిస్థితీ అంతే. క్షణం క్షణం నువ్వే జ్ఞాపక మొస్తున్నావు. నిన్ను చూసి అప్పుడే ఎన్నో ఏళ్ళయినట్లు అనిపిస్తోంది. రెక్కలు కట్టుకుని నీ ముందు వాలాలనిపిస్తోంది. గడచిన కాలంలోని మధుర క్షణాలు గిలిగింతలు పెడుతూంటే, మనసు నీకోసం పరితపిస్తోంది.
ఉత్తరం చదువుతూంటే గుండె అతి వేగంగా కొట్టుకుంటోంది మాధవి మనసు. అజయ్ రూపంతో నిండిపోయింది. అతను మెల్లగా చెవిలో మాట్లాడుతున్నట్లు అనిపించింది. సిగ్గు ముంచుకొచ్చి కళ్ళు బరువెక్కాయి. ఉత్తరాన్ని పెదవులపై వుంచుకుని, మెల్లగా ముద్దు పెట్టుకుంది. కొన్ని నిమిషాలు అలా తన్మయత్వంతో దొర్లిపోయి మళ్ళీ చదవడం మొదలెట్టింది.
"మధూ! మన పెళ్ళి విషయం నాన్నగారికి రాశాను. నిన్ను చూసి నాన్నగారెంత మురిసిపోతారో. తనే స్వయంగా వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళతారు. జాగ్రత్తగా వుండు. మళ్ళీ రాస్తాను. అమ్మమ్మని అడిగినట్లు చెప్పు. ఉంటా మరీ - ఏదీ... ఇవ్వవూ...తియ్యటి ముద్దు! జాగ్రత్తగా పోస్టు చెయ్యి. నీ జవాబు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ వుంటాను. కాదు ముద్దుకోసం! ఎలా పంపాలో తెలుసా? నువ్వు రాసే కాగితాన్ని ముద్దు పెట్టుకుని పంపు. నేను దాన్ని ఇక్కడ ముద్దు పెట్టుకుంటాను. అందిపోతుంది. బై...బై...
ప్రేమతో
నీ
అజయ్.
ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, పదిసార్లు చదివింది ఉత్తరాన్ని. కొండంత ధైర్యం వొచ్చింది. అమ్మమ్మకి చదివి వినిపించింది. మామగారి రాకకోసం అనుక్షణం ఎదురుచూస్తూ ఉంది. సంతోషాన్నంతా పొందుపరచి, అజయ్ కి జవాబు రాసింది.
"పోస్ట్" అన్న కేక విని పరిగెత్తుకొచ్చింది గోవిందమ్మ "ఎవరికి బాబూ?" అంటూ.
"మృత్యుంజయరావుగారికి"
"ఇలా ఇవ్వు" అందుకుంది.
* * *
కాస్త కాఫీనీళ్ళు పొయ్యడానికైనా సాయంగా వుంటోంది పక్కింటి సుశీలమ్మ. ధైర్యం తెచ్చుకోమని సలహాలిస్తోంది. వీళ్ళ పరిస్థితులు తెలిసిన ఆ ఇల్లాలు.
"హు... ఏం ధైర్యం తెచ్చుకోను పిన్నీ. నా జీవితం మూడునాళ్ళ ముచ్చటగా ముగిసిపోయింది. పెంచిన అమ్మమ్మా, కట్టుకున్న భర్త ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు" - ఏడుస్తూ చెప్పింది మాధవి.
"నువ్వు బతకాలి. నీకు పుట్టబోయే బిడ్డకోసమైనా నువ్వు బతకాలి. అతని ప్రేమ గుర్తు ఆ బిడ్డ. ఆ నీడలో మళ్ళీ నువ్వు నవ్వాలి" - ధైర్యం చెప్పింది సుశీలమ్మ.
"చమురు లేని దీపం ఎంతసేపు వెలుగుతుంది పిన్నీ. వట్టి భ్రమ కానీ! ఒత్తి మాడిపోయాక దీపం ఆరిపోతుంది. ఆ తరువాత మిగిలేదంతా చిమ్మ చీకటి."
"చీకటిలోంచే వెలుతురు పుడుతుందమ్మా. రేపో, మాపో నీ యింట వెలిసిన జ్యోతే నీకు వెలుగు నిస్తుంది. మీ మామగారి దగ్గరికెళ్ళు. జరిగినదంతా ఆయనతో చెప్పు."
"మా పెళ్ళి ఆయనకిష్టం లేదేమో పిన్నీ? అందుకే వారెన్ని ఉత్తరాలు రాసినా నా దగ్గరికి రాలేదు. నన్ను చూళ్ళేదు" నిరుత్సాహంగా అంది మాధవి.
"అలా ఎందుకనుకోవాలి మధూ! ఆయన వద్దామనుకునే లోపలే ఈ దారుణం జరిగి వుండొచ్చుగా! ఈ వార్త వినగానే మీ అమ్మమ్మే ప్రాణాలొదిలేసిందే పాపం! ఆ తండ్రి పరిస్థితి ఎలా వుందో? నీ యింటికి నువ్వెళ్ళడంలో తప్పేమీ లేదు. నా మాట విని నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళు" ఓదార్చింది సుశీలమ్మ.
చిమ్మచీకట్లో దీపం పురుగు వెలుతురిని నమ్మి ప్రయాణం చేసినట్లు, ఎండిపోయిన ఎడారిలో చిన్న చిగురుటాశలో బయలుదేరింది మాధవి.
అదురుతూన్న గుండెల్ని అరచేతితో అదిమి పట్టుకుని లంకంత ఇంట్లో అడుగుపెట్టింది మాధవి.
"ఎవరు కావాలమ్మా" అంటూ పనివాడు పలకరించాడు.
"అయ్యగారున్నారా?"
"ఉన్నారమ్మా- కూర్చోండి. అయ్యగారికి చెప్పొస్తా" అంటూ లోపలికి వెళ్ళాడు.
"గోవింద, గోవింద, గోవిందరామ, గోపాలకృష్ణా గోవిందా" అనుకుంటూ సావిట్లోకొచ్చింది గోవిందమ్మగారు.
"మీరు గోవిందమ్మ కదూ! నమస్కారం" అంది లేచినుంచుని మాధవి.
"అవును. నువ్వెవరూ?"
"నా పేరు మాధవి... నేను" చెప్పబోతుండగానే "రండమ్మగోరూ... అయ్యగోరు పిలుస్తున్నారు" అంటూ పనివాడు చెప్పడం వలన, మాట మధ్యలోనే ఆపేసి అతని వెనకాలే వెళ్ళింది మాధవి.
రావుగారిని చూడగానే కాళ్ళకి నమస్కారం చేసింది. తడబడుతూ కాళ్ళు వెనక్కి తీసుకుని "ఎవరమ్మా నువ్వు?" అన్నారు.