పొమ్మనినట్లొ! పోవలదు పోవలదం చనినట్లొ! వెన్కకున్
రమ్మనినట్లొ! రావలదు రావలదంచు వచించినట్టులో!
సెమ్మెలలోని దీపములు చిత్రముగా తలలూపె, రాజహ
ర్మ్యమ్మున వెచ్చనూర్చుచు నృపాత్మజుఁ డిట్టటు సంచరింపఁగన్.
నమ్మి జీవనసర్వస్వ మమ్ముకొన్న
ప్రణయమయి శాశ్వత ప్రేమ బంధనములు
త్రెంపుకొని బైట పడు ప్రయత్నింపు లేమొ!
తడబడుచు కాళ్ళు గడపలు దాటవేమి?
గేహమే వీడలేకనో, గృహిణి తోడి
స్నేహమే వీడలేకనో, శిశువు మీఁది
మోహమే వీడలేకనో సాహసించి
దేహళిని దాట నింత సందేహపడును!
ప్రణయభాగ్యేశ్వరీ బాహు పాశ మట్లు
జారిపోలేక ముందుకు సాగనీక
వెంట జీరాడుచు బుజమ్ము నంటి వచ్చు
నుత్తరీయాంచలము చక్కనొత్త డేమి?
కెలుగవ సాచి ఆర్ద్రనేత్రాలతోడ
మెట్టుమెట్టుకు పాదాల జుట్టుకొనెడి
ప్రేయసీ కల్పనా ప్రతిబింబ శత స
హస్రముల గాంచి నిస్తబ్దుఁ డగుచు నిలుచు.
ఒడలు తెలియక ప్రక్కపై బడి, యనంత
మోహన స్వప్నలోకాలలో హసించు
ముద్దుపాపాయి చిరునవ్వు ముత్తియములు
దొరలుచున్నవి వాలు కందోయి తుదల.
పదియు ముందుకు వెనుకకే ప్రాకులాడు
ప్రభువు చరణాలు స్ఫటిక సోపాన పంక్తి,
గాలి కెదురుగా సెలయేటి జాలులోన
పయన మగు రాజహంస దంపతుల భంగి.
ఆపుకోలేని హృదయమ్ము నదిమిపట్టి
దూరమగుచుండె ప్రభువు సంసారమునకు;
శ్రీయు శ్రీమతియును చిరంజీవి లేని
ఈ మహానిష్క్రమణ కర్ధమేమి కలదో!
"సారథీ! రమ్ము! కంధకాశ్వమును వేగ
సిద్ద మొనరింపు" మని యాజ్ఞ చేసె స్వామి;
"చిత్త"మని చెన్నుఁ డశ్వమ్ము సిద్దపరుప
రయమున హయమ్ము నెక్కెను రాజసుతుఁడు.
"స్వామి మహాభినిష్క్రమణ చక్కఁగ సాగిన కల్గు విశ్వసం
క్షేమ" మటంచు వేల్పు లరచేతులు గుఱ్ఱము కాళ్ళక్రింద క్రొం
దామరపూలుగా పరచినారటె! పర్విడు వాజి పాదముల్
భూమికి తాకి శబ్దములు పుట్టి జనమ్ములు లేవకుండఁగన్!
నాఁడు వైశాఖ పూర్ణిమ; నభమునందు
వెలుగు నెలరాజు పండువెన్నెలలు గురిసె;
నిండు చంద్రుండు సాక్షి చెన్నుండు సాక్షి
రాకుమారు మహాభినిష్క్రమణమునకు.
కరుణామయి
"అద్దమరేయి నిర్ధయుఁడవై చనినాఁడ విదేమి స్వామి? నన్
నిద్దుర మేలుకొల్పి "తరుణీ! నవ మానవ భాగ్యరేఖలన్
దిద్దుట కేగుచుంటి" నని తెల్పిన వాకిలి కడ్డువచ్చి పో
వద్దని యందునా హృదయవల్లభ! అంతటి మూర్ఖురాలనా!
లోకముకోసమై బ్రతుకులో బడబాగ్ని భరించు ప్రేమ ర
త్నాకరుఁడమ్మ! నా ప్రణయదైవము; పొంగులువారు గుండెతో
నా కనుగప్పి పోయె విపినాలకు; చక్కని చుక్కలార! మీ
రాకస మెక్కి నల్గడల నారసి నాథుని జాడ తెల్పరే!
తెలియని దాని, నా ప్రణయదేవు డ్పహంములు దప్ప లోకమే
తెలియని దాని, క్రొవ్వలపు తియ్యని శయ్యపయిన్ శరీరమే
తెలియనిదాని నన్ను విడదీసెను నా పతినుండి; భాగ్యముల్
తెలతెలవారుచుండ దురదృష్టము చిట్టెపురాతిగుండెతో!
ఆ చిరునవ్వు లొల్కు అరుణార్ధ్రకపోలము, లా దయారస
శ్రీ చెలువారు నేత్రసరసీజము, లా హృదయానురాగముల్
దాచిన స్నిగ్ధసుందర సుధామధురాధర, మీ భవమ్ములో
జూచెదనా? అభాగిని యశోధర కంతటి భాగ్య మున్నదా?
ఇలు విడిపోయినారు హృదయేశ్వర! పూరుషు లౌట మీరు; నే
నిలు విడి వచ్చినన్ బ్రతుకనిచ్చునె లోకము నన్ను? సృష్టియం
దలి ప్రతిరేణువున్ పదపదమ్మున కడ్డమువచ్చి నిల్చి శా
క్యుల కులగౌరవానికి కిది కూడ దటంచును హెచ్చరింపదే!
చక్కనివాఁడు; కుందనపుచాయ తనూద్యుతివాఁడు, తళ్కుమేల్
చెక్కులవాఁడు; సౌహృదము చిందు కనుంగవవాఁడు; చూడు మో
చుక్కలరాజ! నా ప్రణయసుందర మోహనమూర్తి ఒక్కఁడై
యెక్కడ నుండెనో! మది నొకించుక నన్ స్మరియించుచుండెనో!
విచ్చెడు తమ్మిపూల నులివెచ్చని తేనెలతోడ స్వాగతం
బిచ్చుచు నుండె పొంగి పులకించుచు పద్మిని అంశుమాలికిన్;
ఎచ్చటి కేగినావు హృదయేశ్వర! యీ అరుణోదయమ్ముతో
ముచ్చటలాడు నీ నయనముల్ పయనమ్ముల కిచ్చగించెనా?
నాఁటి కళాప్రమోద కలనల్ గహనమ్ముల పా లొనర్చి యే
నాఁటి దురంత దుర్విధియొ నన్ దెరచాటుకు నెట్టి బాటలో
నాటెను ముండ్లతీవ; లిఁక నాయికనైనను కాకయున్న నీ
నాటక మందు నేనొక అనామిక భూమిక గాకపోనులే!
లోకాలు వెలిగించు రాకాసుధాకరు
నింటిలో బంధింప నెంచు టెట్లు!
జగతి కత్యుజ్జ్వల ప్రగతి చూపెడు ధ్రువ
జ్యోతిని దాచుకో జూచు టెట్లు!
విశ్వజనీనమౌ, ఐశ్వర్యమును మేడ
గోడలలో నిల్పుకొనుట యెట్లు!
సర్వంకషంబైన జ్ఞానవారాశిని
పైటచెంగున మాటుపరచుటెట్లు!
భువనబంధుని మణిమయభవన మందు
పవలు రాత్రులు నిర్భంధపరచు టెట్లు!
ప్రేమమయు నిన్ను నా బాహుసీమలందు!
చుట్టుకొని పట్టుకొని నిలబెట్టు టెట్లు!
రిత్తతురంగము గని మా
చిత్తము కంపించె; మూర్చ జెంది రవశులై
అత్తయు మామయు; లబ లబ
మొత్తుకొనిరి సఖులు శోకముకుళితముఖులై!
చెన్నుఁ డరుదెంచి తడిసిన
కన్నులతో, జెప్పె స్వామి కాషాయము గై
కొన్నారని, కాననముల
నున్నారని, తపము చేయనున్నారనియున్.
ఆ కాననము వైపు పోకు నా ప్రియతమా!
కోడెత్రాచులు బుస కొట్టునేమొ
ఆ కొండపై కెక్కబోకు నా హృదయేశ!
శైథిల్యమున కాలు జారునేమొ
ఆ యేటిలో స్నానమాడకు నా నాథ!
సుడిగుండములు తొంగి చూచునేమొ
ఆ కుశాంకురముల నంటకు నా స్వామి!
చిన్నారి మునివ్రేళ్ళు చీరునేమొ
నా మనోవల్లభా! వాని నమలబోకు
పచ్చిదుంపలు దంతముల్ నొచ్చునేమొ
నా ప్రభూ! చుట్టుకోకు మా నారబట్ట
అందములు చిందు నెమ్మేను కందునేమొ.
భూషలు త్యజించి, తాపస
వేషము ధరియించి, విపిన వీథుల సుఖ సం
తోషములు మరచి, సత్యా
న్వేషణపరులైన మీకు 'విజయో స్తు' ప్రభూ!"