అంతర్వాణి
"చిన్ని కుమారు చిర్నగవు చెక్కిలిలో పులకించు రాణి క్రీ
గన్నుల నీడలన్ సుఖముగా సుమడోలల తన్మయుండవై
ఉన్నత భర్మసౌధముల నూగెడి రాజుల చిన్నవాఁడ! నీ
కన్నులు విప్పి సల్దెసలు కన్గొనరా! ఇఁక నిద్ర చాలురా!"
"నిదురన్ భంగము చేసినాననుచు గానీ, కూర్మిదేవేరి ప
య్యెద బాంధవ్యము బాపుచుంటినని గానీ కిన్కగైకోకు; నీ
హృదయమ్మున్ హృదయేశ్వరీ హృదయ మందె కాదు సుప్తప్రజా
హృదయాబ్జమ్ముల మేలుకొల్పు ఉదయశ్రీలో ప్రపంచింపరా!"
"ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గ మొక్కటే
ధ్యేయము కాదు; హీను లతిదీనులు మ్లానతనుల్ దరిద్రనా
రాయణు లేడ్చుచుండిరి; తదశ్రువులన్ దుడువంగఁబొమ్ము నీ
ప్రేయసితోడ; నీ కట లభించును కోట్లకొలంది స్వర్గముల్."
"ఆ ప్రక్క చూచినావా! మండుటెండలో
పొలము దున్నెడు కృషీవలులు వారు;
ఆ వైపు గాంచినావా! పొట్టకూటికై
మేనమ్ముకొన్న కార్మికులు వీరు;
ఆ దిక్కు కనుగొంటివా! వట్టి జోలెతో
కుమిలి కృశించు భిక్షుకులు వారు;
ఆ మూల అరసినావా! గంజి లేక య
ల్లాడు దరిద్రబాలకులు వీరు;
కష్టనిష్ఠుర మోయి ఈ సృష్టి యెల్ల;
శోకవిహ్వల మోయి ఈ లోక మెల్ల;
వేదనాపూర్ణమైన ఈ విశ్వమందు
శాంతి ఎచ్చట? ఎచట విశ్రాంతి నీకు?"
"బుద్దుఁడవై సుషుప్తుల ప్రబుద్దులఁ జేయుము;శాంతి సత్య ధ
ర్మోద్దరణార్ధమై బ్రతుకు నొగ్గుము; మానవసంఘసేవయే
సిద్ధికి త్రోవ; వత్సలత చిందెడి ప్రేమసుధాస్రవంతులన్
శుద్ధ మొనర్పు ముజ్జ్వల యశోధర! జర్జరిత ప్రపంచమున్."
"లెమ్మిఁక మేలుకొమ్ము! కదలిమ్పుము క్రాంతిరథమ్ము శాంతిమా
ర్గమ్మున; కాంతిపుంజము లఖండములై నవజీవన ప్రభా
తమ్ములు నింప సర్వసమతా సుమకోమల మానవాంతరం
గమ్ముల ప్రేమసూత్రమునఁ గట్టుము మంగళతోరణమ్ములన్."
"గుటగుటలాడ ప్రాణములు గొంతుకలో, పసి కన్నుగొల్కులన్
బొటబొట రాల బాష్పకణపుంజము, బోరున నేడ్చు నల్లదే
కటికి కసాయి కెంపు చురకత్తి గనుంగొని గొఱ్ఱెపిల్ల; సం
దిట గదియింపవే! దిగులు దీర్పవె! ముద్దుల బుజ్జగింపవే!"
"ఈ మహి స్వర్గఖండ మొనరింపుము; ఘోరహలాహలమ్ము ది
వ్యామృత మాచరింపుము; జయోస్తు కుమార! శిరస్సుపై అహిం
సా మకుటద్యుతుల్ దశదిశల్ వెలిగింప ప్రపంచ మెల్ల నీ
ప్రేమరసైక వృష్టి గురిపింపుమురా! కరుణా కళాధరా!"
* * *
ఎవరో నిద్దుర లేపినట్టు, లెవరో యేమో ప్రబోధించిన,
ట్లెవరో రమ్మని పిల్చినట్టు, లెవరో యెల్గెత్తి వాపోయిన,
ట్లెవరో ప్రార్ధన చేసినట్టులయి పృథ్వీశాత్మజుం డెంతయున్
వివశుండై వికలాత్ముఁడై చకితుఁడై వేగం దిగెం దల్పమున్.
పానుపు దిగి శుద్దోదన
సూనుఁడు సవిధమునఁ గల యశోధర శయన
స్థానమునకుఁ జనియెను పసి
వానిన్ గల్యాణిఁ జూడవలెనను కాంక్షన్.
అర్ధాంగి
చిన్ని వరాలతండ్రిపయి చేయిడి నిద్దురపోవుచున్న ఆ
యన్నుల మిన్న నెమ్మొగము నట్టె కనుంగొను రాకుమారు వా
ల్గన్నుల బాష్పబిందువులు కాంత కపోలతలాన రాలినన్
గ్రన్నన మేలుకాంచి ప్రియుఁగాంచి దరస్మితవిస్మితాస్యయై.
"ఇది యేమీ? ఇది యేమి? ఏమిటిది స్వామీ! అర్ధరాత్రమ్మునన్
గది కేతెంచిరి; రీ శిశుం గనుటకో! కన్నీటిజాలేమి? మీ
వదనశ్రీ వసివాడెనే" మని నిజప్రాణేశు నెమ్మోము ప
య్యెదతో నద్దెడి ముద్దరాలిఁ గని పృథ్వీశాత్మజుం డిట్లనెన్-
"లోకము శోకవిహ్వలము లోలవిలోచన! ఈ భవంబు ల
జ్జాకర; మీ సుఖంబు లవిచారమనోజ్ఞము; లీ చిరాకు చీ
కాకుల మూలకారణము గన్గొన ఘోరతపమ్ము చేసి ఈ
ర్హ్యాకుటిలప్రపంచమును శాంతిమయ మ్మొనరింపఁగావలెన్.
కల గంటిన్ కనుగొంటి లోకమిది శోకవ్యాకులంబైన య
ట్టులు; తారాధ్వము బద్దలై పడినయట్టుల్; విశ్వవిశ్వంభరా
స్థలి విద్వేష విషాగ్నికుండముల మధ్యం జిక్కియున్నట్లు; వి
హ్వలకంఠమ్ము లవెన్నొ గద్గదికతో వాపోవుచున్నట్టులున్.
కనుగొంటి - దుబ్బు గట్టిన రాగిజుట్టుతో
గంజి త్రాగు దరిద్ర కర్షకులను;
కంటి - సూదుల వంటి కంకరరాళ్ళలో
కండలు కరగించు కార్మికులను;
వీక్షించితిని - వీథి వీథుల తిరుగాడు
కుక్షినిండని దీన భిక్షుకులను;
కాంచితి - పూరిపాకల ముందు కూర్చుండి
పస్తున్న నిరుపేద బాలకులను;
అకట! చూచితి ఘాతుక వికట ఖడ్గ
ఖండితానేక మృగపక్షి కంఠ రుధిర
వాహినుల; నిర్విరామ దుర్వార శోక
భయ పరాజయ వేదనామయము జగతి."
అంచు పలికెడి తన హృదయాధినాథు
వ్యగ్రత గ్రహించి, చిత్తమ్ము నిగ్రహించి,
నెచ్చెలి వచించె "సమయము వచ్చెనేని
స్వయముగా నేనె పంపింతు స్వామి! మిమ్ము.
విశ్వ కల్యాణయాత్రలో విభుని దారి
కడ్డువత్తునె? నా హృదయాధినాథ!
ప్రొద్దుపోయె, నేఁటికి నిద్రపొం" డటంచు
తరుణి నాథుని శయనమందిరము చేర్చె.
* * *
ఇది విభ్రాంతియొ! వాస్తవంబొ! కలయో! ఎవ్వారు వాక్రువ్వలే
'రిద మిత్ద'మ్మని; రాకుమారునకు కూర్కే లేదు; తల్పమ్ముపై
కదలున్-లేచు-పరిక్రమించు-నిలుచున్-గన్మూయు-నిట్టూరుచున్-
పదముల్ తొట్రిల నేగు-ఆగు-తనలో భాషించు నేమేమియో!!
"ఈ యెడ తల్లి తండ్రి హృదయేశ్వరి బిడ్డఁడు రాజ్యవైభవం;
బా యెడ దీన హీన పతితార్త జనోద్దరణంబు; రెంటిలో
నే యది ముఖ్యమో తెలియ కీగతి వెన్కకు ముందుకున్ మనం
బూయల లూగుచున్నది; అయోమయముల్ ప్రణయప్రభావముల్.
చెప్పుదునా యశోధరకు! చెప్పిన కాలు కదల్పనిచ్చునా?
చెప్పక పోదునా! కఠినచిత్తుఁడ వంచు ననున్ శపింపదా?
చెప్పియొ చెప్పకో చనుట! చెప్పెద రెవ్వరు? నా ప్రయాణమా
తప్పదు; విప్రయోగమును తప్పదు; తప్పదు ధర్మదీక్షయున్."
* * *