Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 17

                                 


                                 అహింసా ప్రబోధము
    
    మండెడు హోమగుండములు, మంత్రములం బఠియించు ఋత్విజుల్
    నిండిన - బింబిసారధరణీవిభుఁ డుండిన - యజ్ఞశాల కె
    వ్వండొ తపస్వితల్లజుఁడు వచ్చె కరాగ్రకురంగుఁడౌ త్రినే
    త్రుం డన! పూర్ణిమా శశధరుం డన! సందిట మేకపిల్లతో!    అరుణ మయూఖమాలివలె ఆ మఘవాటిక కేగుదెంచు ఆ
    తరుణ తపస్వివంక వసుధాపతి గాంచె సగౌరవంబుగా;
    కరమున దండమున్, కటిని కావి ధరించెను గాని, శాంతమున్
    గరుణయు చిందు ఆ కనులు గందుమ! శాక్యకులెందు డందుమా?
    
    రాజగృహంబులో మగధరాజవారేణ్యుల యాగశాలలో
    యాజకు లెల్ల విస్మయమునంద సదస్యులు మేలనన్, పరి
    వ్రాజకమౌళి - ఆ కపిలవస్తునరేంద్రునిపట్టి - పాణి పం
    కేజము పైకిఁ జాచి పలికెన్ కరుణా మధురస్వరంబుతో.
    
    "భూపాలా! ఈ యజ్ఞము
    లాపింపుఁడు! విశసన క్రియల్ వలదని యా
    జ్ఞాపింపుఁడు! కనికరముం
    జూపింపుఁడు వివశమగు పశుప్రకరముపై.
    
    యాజకులారా! క్రతు సం
    యోజకులారా! త్రయీ నియోజకులారా!
    ఈ జంతు మారణక్రియ
    యోజింపుం డెంత శోచ్యమో! నైచ్యమ్మో!
    
    'మేమేమి క్రూరమృగముల
    మే!! మేల్ కాంక్షించుచుందుమే!! పశువులమే!!
    మేమేమి లడ్డు లడిగితి
    మే!! మేదిని గడ్డిమేతుమే!! మేకలమే!!'
    
    అంచు గళమెత్తి బిట్టు రోదించుచున్న
    మూగజీవాల నవరంధ్రములు బిగించి
    చీల్చి వప దీసి అగ్నిలో వేల్చ - మెచ్చి
    మేకతోల్ గప్పుదురటయ్య మీకు సురలు!
    
    వేలుపులు పిశిత శోణిత
    లోలుపు లగుదురటె! మాంసలోలుపు లైనన్
    వేలుపు లగుదురె? ముడుపుల
    లాలింపగ లంచగొండులా? దుండగులా?
    
    జన్నములందు జంతువులఁ జంపుట యుక్తము కాదు; దీన నే
    పున్నెము రాదు; దుష్కృతము పోదు; ప్రయోజనమింత లేదు; ఈ
    యన్నెము పున్నెముం దెలియునట్టి అమాయిక మూక జీవముల్
    కన్నుల నీరు కార్చుటలు కాంచిన గుండెలు దద్దరిల్లెడిన్!!
    
    ఇమ్మెయి యూపబంధము విధించి వధించి మథించు జంతు సం
    ఘమ్ములు స్వీయకాయములు గైకొని, బాకులవంటి వాడి వా
    ల్గొమ్ములఁ గ్రుమ్మి క్రుమ్మి మిము గుండెలు చీల్చి వధింప రేపు స్వ
    ర్గమ్మున వేచియుండు నను ప్రాజ్ఞుల పల్కులు విస్మరింతురే!!
    
    ప్రాణము తీయ నందరును పండితులే మృతులైనవారికిం
    బ్రాణము పోయనేర్చిన సమర్దుఁ డొకండును లేడు ధాత్రిలో;
    ప్రాణ మదెంతయో ప్రియము ప్రాణుల; కందరప్రాణ మొక్కటే!
    ప్రాణము నీయఁజాలని యపాత్రులు ప్రాణము దీయ నర్హులే?
    
    ఇది యొక మేకపిల్ల; పరువెత్తెడి మేకల మంద వెంబడిన్
    బదపదమంచు గోపకులు పల్మరు తోయగ దీనదీనమై
    పదములు కుంటుచుండఁ గొనివచ్చితి; నిట్లు సమాజమందు కా
    ల్గదపెడు శక్తిలేక వెనుకంబడి కుందు అభాగ్యు లెందరో!
    
    మేకల మందలు క్రతువుల
    కై కొనిరమ్మనిరి ప్రభువు లని విని యిటులన్
    మీకడ కరుదెంచితి నా
    లోకించితి యాగశాలలో ఛాగములన్.
    
    కుయ్యిడు పశువుల రుధిరము
    తియ్యని సుధవోలె త్రావి త్రేన్చు కఠోరుల్
    దయ్యములో! దేవతలో!
    అయ్యా! చింతింపుఁ డంతరాత్మలలోనన్.
    
    'హింసాకర్మ మధర్మ; మ    
    హింస పరమధర్మ' మన మహీశ్వర! వినవే!
    హింసాత్మక యజ్ఞములు ప్ర
    శంసా పాత్రములె? సత్యసందేశములే?"
    
    అంచు నుచ్చైస్వరాన భాషించుచున్న
    తరుణతాపసి వాక్సుధాఝరులలోన
    మునిగితేలెను శ్రోతల మనము లెల్ల
    పొంగి పులకించెనట! యజ్ఞపురుషుఁ డచట!
    
    బొమ్మల భంగి ఋత్విజులు భూరమణుండును నిర్నిమేషులై
    యమ్ముని వాక్కులన్ విని ముదశ్రులు చెక్కుల జాలువారగా
    కిమ్మనకుండ శాక్యమునికిన్ బ్రణమిల్లిరి; రాజు జంతు బృం
    దమ్ముల బంధముక్తము లొనర్ప ననుజ్ఞనిడెన్ వినమ్రుఁడై.
    
    అఖిల సంక్షేమకరములౌ మఖములందు
    నీచమగు జీవహింస మన్నింపరాని
    నేరమని రాజ్యమున మేదినీవిభుండు
    చాటఁబంచెను శాక్యర్షి సంతసింప.   

                                     

    "రెక్కలుమబ్బులో నిడి, కిరీటము చుక్కలలోన దాచి, ఈ
    చిక్కని రావి క్రింద దయచేసిన మీ అసలైన రూపు నే    
    నొక్కతెనే యెరుంగుదు ప్రభూ! మముబోంట్ల ననుగ్రహింపఁగా
    దిక్కులు దిద్దితీర్చు వనదేవతలై విలసిల్లినారులే.
    
    దేహము దాల్చినట్టి వనదేవత వీవు మహానుభావ! సం
    దేహము లేదు; భవ్య భవదీయ దయామయ భాగ్యలక్ష్మి నా
    గేహమునందు ముద్దులొలికించుచునున్నది నేఁడు, మన్మనో
    మోహనమూర్తియై చిగురుమోవి పయిన్ జిరునవ్వు చిందఁగన్.
    
    పేరు "సుజాత" లెండి; కనిపించుచునున్న దదే సుమండి మా
    యూరు; యథేచ్చగా బ్రతుకుచుందుము; పెద్ద భవంతి మాది; మా
    వారు ప్రసిద్దులైన ధనవంతులు; పచ్చని పంటచేలతో
    నూరెకరాల భూమి; పదినూరులు చక్కని పాడియావులున్.
    
    లోపము లేదు వైభవములో, అధికారములో, ప్రతిష్ఠలో,
    కాపుర మెంతయున్ సుఖముగా జనుచున్నది, కాని యింటికిన్
    దీపము వంటి నందనునిదే ఒక తీరని కోరికై మన
    స్తాపముతో నొనర్చితి వ్రతమ్ములు; నోచితి నోము లెన్నియో!

 Previous Page Next Page