Previous Page Next Page 
ఆలింగనం పేజి 15


    అదే లంగా ఓణిల్లో ఉండే అమ్మాయి పక్కన అమ్మాయిలే ఉంటారు! ఎందుకో?

 

    "ఇంకా లోపల చాలా షేడ్స్ ఉన్నాయి" అంటూ చిత్ర చిన్నసైజు దుకాణాన్నే నా ముందు పెట్టింది.

 

    నేను నేచురల్ కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకుని -

 

    "ఇది నాకు ఇస్తావా?" అడిగాను.

 

    "అది చాలా చీప్...ఇంకొకటి తీసుకో" అంది.

 

    "ఉహూ! ఇది చాలు" అన్నాను.

 

    మరునాడు అమ్మకి తెలీకుండా లిప్ స్టిక్ వేసుకోవడానికి నేను చాలా తంటాలుపడాల్సివచ్చింది.

 

    అలవాటులేక చుట్టుపక్కలవారు అందరూ నన్నే చూస్తున్నారనే ఇబ్బందికరమైన ఫీలింగ్, బట్టలు విప్పుకుని నడుస్తున్నట్లు అనిపించింది. సందీప్ పక్కన ఉన్న అమ్మాయిలు లిప్ స్టిక్ వేసుకోవడం నా మనసులో ముద్రపడిపోయింది. ఇంకేం ఆలోచించలేదు!

 

    వెంకట్, రఫీ మాత్రం "కోతి గుర్తొస్తోంది" అని నా చేత చివాట్లు తిన్నారు.

 

    ఆ రోజు సాయంత్రానికల్లా నాకు నీరసం వచ్చింది. ఎక్కడ నవ్వులూ, కబుర్లూ వినపడినా కళ్ళతో వెదకి వెదకి తలనెప్పొచ్చింది.

 

    సందీప్ కనబడలేదు. రికార్డ్ వర్క్ పూర్తి చెయ్యలేదు. మేడమ్ చేత చివాట్లు తిన్నాను.

 

    లంచ్ బాక్స్ తెరవబుద్ధికాక వెనక్కి తీసుకొచ్చినందుకు అమ్మచేత తిట్లు తిన్నాను.

 

    కారణం లేకుండా చిరాగ్గా అనిపించింది.

 

    ఏడుస్తూ పడుకున్నాను. గూట్లో పెట్టిన లిప్ స్టిక్ వెక్కిరిస్తున్నట్లు కనబడ్తోంది.

 

    మరునాడు అస్సలు తయారవబుద్ధికాలేదు. గట్టిగా అమ్మ జడవేసింది. తెల్లలంగా మీద ఎర్ర ఓణీ వేసుకున్నాను. లిప్ స్టిక్ తీసి పెట్టె అడుగున పారేశాను. పుస్తకాలు తీసుకుని నీరసంగా అడుగులు వేస్తూ బయల్దేరాను. కాలేజ్ కి వెళ్ళేసరికి హడావుడిగా ఉంది.

 

    వైజయంతి ఎదురొచ్చి "ఈ రోజు ఫ్రెండ్ షిప్ డేట. సందీప్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఎరేంజ్ చేశాడు. మ్యూజికల్ చైర్స్ లో నీ పేరు కూడా ఇచ్చేశాం" అంది.

 

    "ఎందుకిచ్చారూ?" విసుగ్గా అడిగాను.

 

    "థ్రిల్లింగ్ గా ఉంటుంది. అవునూ...ఈ అవతారం ఏవిటీ?" నన్ను ఎగాదిగా చూసింది.

 

    నేను మాట్లాడలేదు. క్లాస్ లోకి వెళ్ళి పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చున్నాను.

 

    నాకు పెద్దక్క గుర్తొచ్చింది. మధ్యతరగతి ఆడపిల్లకి పెద్ద పెద్ద కోర్కెలు ఉండకూడదని దాన్ని చూసినా నాకింకా బుద్ధి రాలేదేవిటో అనుకున్నాను.

 

    గ్రౌండ్ లో అంతా కోలాహలంగా ఉంది. ఒకటే కేకలూ, నవ్వులూ. అందరూ ఆనందంగా ఉన్నారు. నేను తప్ప! అనిపించింది.

 

    చిన్నక్క గుర్తొచ్చింది! బుద్ధిగా చదువుకోమనీ మెడిసిన్ ఎంట్రెన్స్ కి ప్రిపేర్ అవమనీ అదేపనిగా ఉత్తరాలు రాస్తుంది. పాపం పిచ్చిది... దానికి చదువు తప్ప వేరే లోకం తెలీదు అని జాలిపడ్డాను.

 

    "ముక్తా...రా...మ్యూజికల్ చైర్స్ కి టైం అయింది" చిత్ర వచ్చి చెయ్యిపట్టి లాగింది.

 

    "నాకు రావాలని లేదు"

 

    "అలా అనకు. సందీప్ వెయిట్ చేస్తున్నాడు"

 

    ఆ పేరు వినగానే నేను ఠక్కున లేచాను.

 

    అక్కడ అందరూ ఫ్యాషన్ పెరేడ్ లా ఉన్నారు. మినీలు, మిడ్డీలూ తప్ప మోకాలు దిగిన బట్టలు ఒక్కమ్మాయి వేసుకోలేదు! నేను అందరి మధ్యా దిష్టి పిడతలా నిలబడ్డాను. ఆ సమయంలో నా మీద నాకే అసహ్యం వేసి తలవంచుకున్నాను.

 

    మ్యూజిక్ మొదలయింది.

 

    అందరూ కుర్చీలచుట్టూ రౌండ్ గా తిరుగుతున్నారు. ఆగిపోగానే కూర్చుంటున్నారు.

 

    ఒకటి... రెండు... మూడు... నాకు ప్రతి రౌండ్ లో కుర్చీ దొరుకుతూనే ఉంది. నా మనసులో రకరకాల ఆలోచనలు ఇంకా గుండ్రంగా తిరుగుతున్నాయి.

 

    సందీప్ ఎక్కడున్నాడో? తల ఎత్తడానికి కూడా సిగ్గుగా వుంది. ఈ రోజే ఇలా అమ్మమ్మలా తయారయిరావాలా? ఛీ! నాకు బుద్ధిలేదు.

 

    మళ్ళీ మ్యూజిక్ ఆగిపోయింది.

 

    నేను గభాల్న కూర్చోబోయాను.

 

    అనుకోని సంఘటన జరిగిపొయిన్ది౧ నాతోబాటు మిగిలిన అమ్మాయి కూర్చోలేక కాలితో కుర్చీని పక్కకి తన్నేసింది! నేను కిందపడిపోయాను!

 

    ఒక్కసారిగా అందరూ నవ్వులు.

 

    నేను వెంటనే లేవలేకపోయాను. సిగ్గుతో, అభిమానంతో తల ఎత్తలేక పోయాను. లంగా నిండా ఎర్రటి మట్టి అంటుకుంది. "వాట్ హేపెండ్ రే..." "క్యా హువా?" అని కలగాపులగంగా గొంతులు వినిపిస్తున్నాయి.

 

    నా కళ్లలో చివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.

 

    నెమ్మదిగా లేవబోతుండగా ఎవరిదో బలమైన చెయ్యి ముందుకొచ్చింది. రఫీనో ప్రతాపో అనుకుని, తల అడ్డంగా ఊపాను.

 

    కానీ అతను నా రెక్క పట్టుకుని బలంగా పైకి లేపాడు. అతను... సందీప్!

 

    అతని దృష్టిలో పడాలని ఆకర్షణీయంగా తయారయి ఎదురుచూసినప్పుడు పట్టించుకోని సందీప్... ఇలా మట్టికొట్టుకుపోయిన బట్టలతో జిడ్డుకారుతున్న నన్ను గట్టిగా పట్టుకుని పైకిలేపాడు.

 

    పడిపోయినవాళ్ళు సిగ్గుపడక్కరలేదు. పడిపోతే పైకి లేవలేమేమో అనుకుని భయపడేవాళ్ళు సిగ్గుపడాలి. ఓటమిని హుందాగా స్వీకరించలేక చీట్ చేసేవాళ్ళు సిగ్గుపడాలి" అన్నాడు గట్టిగా సందీప్.

 Previous Page Next Page