Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 15

    సుధకు అంతరాంతరాల్లో ఏదో తొలుస్తున్నట్టుగా వుంది.
   
    "వీళ్ళే నయం" మనసులోనే అనుకొంది.
   
    "ఇదిగో చెడిపోవడం ఏముంది అంజమ్మా! మగవాడు తప్పులు చేస్తుంటే, ఆడది వదిగి వదిగి వాడి కాళ్ళకాడ ఎందుకు పడి వుండాలి?"
   
    "ఏందమ్మగారూ? మీరుకూడా అట్టాగే మాట్టాడేత్తున్నారు? మా అయ్యకు ఇద్దరు పెళ్ళాలు. పంకజంఅయ్య అయితే పెళ్ళి చేసుకోలేదుకాని మరోదానితో వుండేవాడు. అయినా మా అమ్మా, నేనూ కాపరాలు చెయ్యలేదూ?"
   
    "ఆ కాలం మారిపోయిందిలే అంజమ్మా!"
   
    "అదేనమ్మా మరి!" నిట్టూర్చింది అంజమ్మ.
   
    డ్రాయింగ్ హాలు దాటి డైనింగ్ టేబుల్ దగ్గరగా వచ్చిన అంజమ్మ "అదేంటమ్మగారూ? ఇంకా అన్నం తినలేదా?" టేబుల్ మీద ఉండిన గిన్నెల్నీ, బోర్లించి వుండిన పళ్ళాలను చూస్తూ అంది.
   
    "లేదు - అర్జంటుపని వుందని అయ్యగారు హడావుడిగా ఆఫీసుకెళ్ళారు."
   
    "అయ్యగారు తినలేదుసరి! మరి మీరో?"
   
    "తినాలనిపించలేదు- తినలేదు అంజమ్మా!"
   
    "ఆరు రాలేదని ఉపవాసం వున్నావా తల్లీ! అయ్యగారు బయట తినేసే ఉంటారు. మీర్రాండమ్మా!" బోర్లించి వుండిన పళ్ళెం తీసిపెడుతూ అంది అంజమ్మ.
   
    సుధ మనసు ద్రవించిపోయింది. అంజమ్మ పనిమనిషే కావచ్చు. ఆమెలో ఎంత ఆర్ద్రత వుంది? ఆప్యాయతా, ఆదరణా అంటే ఏమిటో స్త్రీ హృదయానికి తెలుసు. కాని ఈ మగవాళ్ళను?
   
    ఆయనకు తన సర్వస్వం ఆర్పించింది. అతనితోనే తన లోకంగా భావించింది. అతని కోసమే బ్రతుకుతుంది.
   
    అయినా ఆయన ఎంత కఠినంగా మాట్లాడాడు?
   
    అతను చూపించిన ఉదాసీనతను ఏ ఆడదైనా భరించగలదా? ఆత్మాభిమానంగల ఏ స్త్రీ గుండెలు బద్దలుకావు?
   
    "పెరుగన్నం అన్నా తిందురుగాని రండమ్మా!"
   
    అన్నపు గిన్నెమీద మూతతీసి అన్నం వడ్డించే 'హస్తం'పట్టుకొని, సుధను పిలిచింది అంజమ్మ.
   
    సుధ కళ్ళు చెమ్మగిల్లాయి.
   
    అమాంతం వెళ్ళి అంజమ్మను కౌగిలించుకుని బావురుమని ఏడవాలని పించింది.
   
    ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమించుకొని "అంజమ్మా! అయ్యగా రొచ్చాక__"అంది.
   
    ఆ తర్వాత ఆమె గొంతునుంచి మాటలు పెగల్లేదు.
   
                                                10
   
    "కంగ్రాట్స్! వెల్ డన్ కృష్ణా!"
   
    "థాంక్యూ సర్!"
   
    కృష్ణ నమ్రతగా బాస్ తో అన్నాడు.
   
    "ఓ.కే. నౌ ఐ థింక్ ఉయ్ కెన్ ప్రొసీడ్ విత్ దట్ ప్రాజెక్ట్!"
   
    "యస్సర్! రేపే పని మొదలుపెడ్తాను."
   
    "గుడ్!" అంటూ బాస్ రివాల్వింగ్ చైర్ లో గిర్రున తిరిగి ఫోన్ అందుకున్నాడు.
   
    కృష్ణ లేచి ఆఫీసర్ దగ్గిర శెలవు తీసుకొని బయటికి వచ్చాడు.
   
    కృష్ణ ఉషారుగా చేతులు ఊపుకుంటూ తన గదిలోకి వచ్చాడు. వస్తూనే బాయ్ ని పిల్చాడు.
   
    బంట్రోతు వచ్చి ఎదురుగా నిల్చున్నాడు.
   
    "కేంటిన్ లో ఏం దొరుకుతుంది?"
   
    "ఏమీ దొరకదు సార్!"
   
    "ఏం? కాఫీకూడా...."
   
    "నాలుగయిపోయింది సార్! కాంటిన్ మూసేశారు."
   
    "సరే నువ్వెళ్ళు."
   
    ఆఫీసుకుర్రాడు డోర్ దాకా వెళ్ళి ఆగాడు. "వెంకటేశ్వరా విలాస్ నుంచి తెమ్మంటారా?" అనడిగాడు.
   
    "అవసరంలేదు, నువ్వెళ్ళు."
   
    కుర్రాడు వెళ్ళిపోయాడు.
   
    మురళీకృష్ణ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ సైడ్ రాక్ లోకి సర్ధాడు.
   
    కాళ్ళు టేబుల్ కు తాటించి కుర్చీలో వెనక్కు వాలి కూర్చున్నాడు.
   
    కడుపులో మండిపోతూంది.
   
    ఫ్లయిట్ లో హోస్టెస్__ఆమె పేరు ఏమిటీ? ఆఁ విమలా చౌదరి ఇచ్చిన బ్రేక్ ఫాస్టు తప్ప ఉదయంనుంచీ తనేమీ తినలేదు. ఆ బ్రేక్ ఫాస్టు మాత్రం తిన్నాడా? లేదు. అంతా కిందే__కాదు పక్కసీటులో వున్న పెద్దమనిషిమీదే పడిపోయింది.
   
    అలా ఎందుకు జరిగింది?
   
    అదంతా తల్చుకుంటేనే మనసులో దేవినట్టుగా అన్పిస్తోంది.
   
    ఆఫీసర్ అభినందించాడు. డిపార్ట్ మెంటులో తను గుర్తింపు పొందాడు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తనకు ప్రమోషన్ వస్తుంది. ఐదేళ్ళకి గాని రాని ప్రొమోషన్ తనకు మూడేళ్ళకే రాబోతూంది, ఇది తన ప్రతిభకు గుర్తింపు.
   
    ఈ విషయం వింటే సుధ ఎంత సంతోషిస్తుందో?
   
    సుధా! సుధా!
   
    ఎవరీ సుధ?
   
    సుధాప్రియ!
   
    ప్రియసుధ!
   
    ఈమె తనకేమౌతుంది?
   
    ఏమీ కాదా?
   
    ఆమెను తను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు. ఒక సంవత్సరం__మూడువందల అరవైఐదు రోజులు__ఆమెతో కాపురం చేశాడు. కలిసి జీవితాన్ని పంచుకున్నాడు. ప్రేమించి ప్రేమించబడ్డాడు.
   
    సుధ తనను నిజంగా ప్రేమిస్తూందా?
   
    సందేహంలేదు. ఆమె తనను మనసారా ప్రేమిస్తూంది.
   
    అయితే జగన్మోహన్ ను ప్రేమించడంలేదా?
   
    అది ఒకప్పుడు!
   
    కానీ ఇప్పుడు తననే ప్రేమిస్తూంది.
   
    అనుక్షణం తనను ఆరాధిస్తూ తనకోసమే బ్రతుకుతూంది.
   
    ఒకసారి ఒక మగవాడికి మనసిచ్చిన మగువ మరొకడిని ప్రేమించ గలదా?
   
    అలా ప్రేమించగలిగితే ఆ ప్రేమకు అర్ధమేమిటి?
   
    పెళ్ళికి ముందు ప్రేమించబడినవాడు ప్రియుడయితే__
   
    పెళ్ళయాక ప్రేమించబడేవాడు భర్తవుతాడు.
   
    తేడా అంతేనా?
   
    మరి పెళ్ళయాక మొదటి ప్రియుడు తటస్థపడితే?
   
    ఏం ఐతే? కొంపలేం మునిగిపోవు!
   
    వాణ్ని అసలు ఎన్నడూ చూడనట్టే నటించవచ్చును. కాని ఎప్పుడు భర్తముందో__నలుగురి మధ్యలోనో తటస్థపడినప్పుడు__
   
    మరి వంటరిగా ఎదురైతే?
   
    మాజీ ప్రియుడిని అమాంతం వాటేసుకొని బావురుమంటుందా?
   
    "సార్! లాస్టు బస్ బయలుదేరబోతూంది" బంట్రోతు డోర్ తోసుకొని లోపలకొచ్చి చెప్పాడు.
   
    కృష్ణ కంగారుగా లేచాడు.
   
    డ్రాయర్స్ లాక్ చేసి బయటికి నడిచాడు.
   
    "హల్లో కృష్ణా! నేను మీ ఏరియాకే వెళుతున్నా. ఐ విల్ డ్రాప్ యూ కమాన్!" లిఫ్ట్ దగ్గిర బాస్ కలిసి చెప్పాడు.
   
    "థాంక్యూ సర్! నేను బస్ లో వెళతాను సర్!" నమ్రతగా చెప్పాడు కృష్ణ.
   
    "వై సో! ఫర్వాలేదు. వచ్చేయ్! అటే పోతున్నాగా?"
   
    ఆఫీసర్ తో పాటు లిఫ్ట్ దిగి, వచ్చి కారులో కూర్చున్నాడు. గేటు ముందు కారాగింది.
   
    కృష్ణ కారు దిగి బా కు థాంక్సు చెప్పాడు. మళ్ళీ కారు కదలబోతుండగా, హఠాత్తుగ ఏదో గుర్తుకొచ్చినట్టు డ్రైవర్ తో కారాపమని చెప్పాడు ఆఫీసర్.
   
    "కృష్ణా! కెన్ ఐ యూజ్ యువర్ టెలిఫోన్?"
   
    "ష్యూర్ సర్! ప్లీజ్!" అంటూ కృష్ణ కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు.
   
    ఆఫీసర్ కారుదిగి కృష్ణ వెనకే లోపలకు నడిచాడు. ఆఫీసర్ కు ఫోన్ అందించి పడకగదిలోకి వెళ్ళాడు కృష్ణ.
   
    మూర్తీభవించిన శోకదేవతలా కూర్చొని ఉంది సుధ.
   
    కృష్ణ మనసు ఆమెను చూడగానే చివుక్కుమంది.
   
    అతడిని చూస్తూనే "వచ్చారా?" అంటూ సుధా లేచినిలబడింది.

 Previous Page Next Page