Previous Page Next Page 
మహావృక్షం పేజి 15

"ఓ. కే."ఆ తరువాత ఇంకా ఏమేం చేయాలో అరగంట మాట్లాడుకున్నారు అనూష, మణి. తరువాత భోజనాలు చేసి, వాళ్ళందరికీ భయపడద్దని మరీ మరీ చెప్పి బయలుదేరారు. బయలుదేరేముందు వామనముర్తికి పోన్ చేసి వీణ చెప్పిన మాట చెప్పింది అనూష. ముందు అరిచినా తరువాత సరే అన్నాడు.
"గుడ్" వీణ అనూష భుజం తట్టింది.
వాళ్ళు ఎక్కిన కార్లు బయలుదేరాయి.

                                                *    *    *    *
అది నాలుగు గదులున్న ఒక పోర్షను. ముందుగదిలో టేబులు, కుర్చీ, టేబులుమీద పోను, ఒక ఇంటర్ కమ్, గోడకి అనించి వేసిన నాలుగు కుర్చీలు అతిదులకోసం అని తెలియచేస్తున్నాయి. టెలిపోన్ ఆపరేటర్ స్వప్న తేరగా వచ్చింది కదా అని కుర్చీలో వెనక్కివాలి, సావకాశంగా తన బాయ్ ఫ్రెండ్ తో పోను లో మాట్లాడుతొంది. ఆమె కూర్చున్న కుర్చీకి వెనుక గోడమీద రెండు సినిమా పోస్టర్లు, నాలుగు న్యూసుపేపరు  కటింగులు అతికించబడి వున్నాయి. ఆమె టేబుల్ పక్కనే వున్న ద్వారంలోంచి వెళితే, నాలుగు టేబుల్స్, ఎనిమిది కుర్చీలు వున్నాయి. పది మంది మగవాళ్ళు కాగితాలకట్టతో కుస్తీపడుతున్నారు. అక్కడక్కడా చిందరవందరగా న్యూసుపేపర్లు, మానుస్క్రిప్టులు   పడి వున్నాయి.
రెండు టేబుల్స్ మీద రకరకాల మాగజైన్లు, ఇంగ్లీషు, తెలుగువి వున్నాయి. కుడిపక్క వున్న ద్వారంలోంచి వెళితే, ఎడిటర్ అని బోర్డ్ వున్న ఓ గదికి కర్టేను వేళ్ళాడుతొంది. ఆ కర్టేను తీసుకుని లోపలికి వెడితే ఒక టేబిలు, రివాల్వింగ్ కుర్చీ, గోడలకి చక్కటి తైలవర్ణచిత్రాలు, ఓ మూల గాద్రెజ్ బీరువా, కొంచెం ఆడంబరంగా వుంది గది. రీవాల్వింగ్ కుర్చీలో కూర్చున్న భరిణి చాలా కుతూహాలంగా పేపరు చదువుతున్నాడు. ఆ పేపరు ఆంద్రదేశంలో అత్యదిక సర్క్యులేషన్ వున్న పేపర్.
భరణి నుంచి ఆదర్శభావాలు, ఉత్సాహం వున్న ముప్పై ఏడేళ్ళు యువకుడు. జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ పాసైనా అతను కోతకాలం కొన్ని పత్రికలలో పనిచేశాడు. కానీ ఆ పత్రికల పద్దతి నచ్చక ఆ ఉద్యోగాలు వదిలేసి, తండ్రితో ఆస్తికోసం దెబ్బలాడి,తన వాటా ఆస్తిలో రెండు లక్షల రూపాయలు తీసుకొని, స్వంతంగా పత్రిక ప్రారంబించాడు. దాని పేరు 'తోలికిరణం.'
ఒక స్నేహితుడి ప్రెస్సు లో పత్రిక ప్రింటు చేయిస్తూ , రెండు పేజీలతో ప్రారంభించిన ఆ పత్రిక ముందు పదిహేను రోజులకొకసారి,తరువాత నెలకోసారి, ఆ తరువాత మూడు నెలలకోసారి అలా కుంటినకడ మొదలు పెట్టింది. పత్రిక నడిపించడం  జర్నలిజం  పాసైనంత సులువు కాదని, ఆ పత్రిక ప్రారంభించిన ఎడాదిలోగానే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పెట్టుబడి పెట్టిన డబ్బులో పదో వంతు కూడా సంపాదించలేకపోయాడు. పత్రిక సజావుగా సాగాలంటే కేవలం ఓ లక్ష రూపాయలు సరిపోవని, బోలెడన్ని వనరులు కావాలని తెలుసుకున్నాడు వనరులు సమకూర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడు.ఉన్న పదిమంది ఎంప్లాయిలలో ఒక్కోరికి ఐదేసివందల చొప్పున ఇస్తున్నాడు.
సంవత్సరంలోనే నాలుగుసార్లు మార్చాడు స్టాపుని. ఎవరూ పట్టుమని రెండు నెలలు చేయకుండానే వేరే ఉద్యోగాలు చూసుకొని వెళ్లిపోతున్నారు.భరణి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా నాలుగైదు అడ్వర్ టైజ్ మెంట్లు సంపాదించుకుంటూ పత్రికని నెట్టుకొస్తున్నాడు ఎప్పటికైనా డెయిలీ పేపరుగా చేయాలని, సమాజంలో జరిగే అన్యాయులని,దౌర్జన్యాలని, చీకటి బజారులో జరిగే ఘోరాలనూ బైటపెట్టి డాషింగ్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలని భరణి కోరిక. సంపాదనలేని అతనికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇంకా బ్రాహ్మచారిగా వుండిపోయాడు.
ఇప్పుడు అతను చదువుతున్న పేపరులో వార్త అతనిని ఎంతో  ఆకర్షించింది 'పెద్దమనిషి ముసుగులో వ్యభిచార గృహన్ని నడిపిస్తున్న వ్యక్తి అరెస్టు'అనే హెడ్డింగ్ తో ప్రచురించబడిందా వార్త.
"నెల్లూరునుంచి అమాయకురాళ్ళయిన యువతులను మాయమాటలతో మభ్యపెట్టి, హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచార గృహాలను నిర్వాహిస్తున్న వామనమూర్తి అనే ఒక నలబైఅయిదేళ్ళవ్యక్తిని అతని అనుచరులను పోలీసులు నిన్న రాత్రి పదకొండుగంటల ప్రాంతంలో పంజాగుట్టలో వున్న ఒక అపార్ట్ మెంట్ లో అరెస్టు చేశారు.
వారంరజుల క్రితం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రినుంచి డెలివరీ అయిన ఇరవై నాలుగ్గంటలకే తన శిశువుతోసహా పారిపోయిన ఓ ఇరవై ఏళ్ళ యువతిని ప్రఖ్యాత కార్డియాలజిస్టు డాక్టర్ అనూష రక్షించి, నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో కూకట్ పల్లి అవతల స్టాపించిన ఓ బాధిత మహిళల ఆశ్రమంలో చేర్పించారు. ఆ ఆశ్రమానికి పౌండర్ సెక్రటరీ అయిన డాక్టరు అనూష దగ్గరకి బాధితురాలి మేనమామని, ఆమెని తీసికెళ్ళడానికి వచ్చాడని ఒక వ్యక్తి రావడంతో అతడిని ఆశ్రమానికి తీసికెళ్ళారు. అక్కడికి వచ్చిన అతనిని  చూసి బెదిరిపోయిన బాధితురాలు నీరజ తిరిగి పారిపోవడంతో రంకెలు వేసిన వామనమూర్తికి నచ్చచెప్పి,  ఆమె ఎక్కడ వున్నా వెతికించి అతనికి అప్పచేబుతామని శాంతింపచేశారు.
అయితే వాడుకలో లేని ఓ సిమెంటు తొట్టిలో కూర్చున్న నీరజని బైటికి తీసిన ఆశ్రమవాసులు ఆమె ద్వారా వామనమూర్తి సాగిస్తున్న కార్యాకలాపాలు, చేస్తున్న ఘోరాలు తెలుసుకొని అతని అకృత్యాలు బైటపెట్టడానికి పకడ్బందిగా వల పన్నారు ఆ వలలో చిక్కుకున్న వామనమూర్తిని డాక్టరు అనూష, ఆమె స్నేహితురాలు, ఆశ్రమానికి ప్రెసిడెంటు అయిన పేరుపొందిన లాయరు వీణ కలిసి రెడ్ హండెడ్ గా పట్టించి అరెస్టు చేయించారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు."
భరణి అప్పటికే అనూష గురించి  విని వున్నాడు. అడపాదడపా, ఆమె రోగులకు చేస్తున్న సేవల గురించి, ఆమె సమాజసేవ గురించి పేపర్లలో చదువూతూనే వున్నాడు. అయితే ఈ వార్త అతనిని మరీ ఆకట్టుకుంది. అనూష డైనమిక్ లేడీ అనుకున్నడే కానీ, ఇంత సాహసం వుందని అతని ఊహకు తట్టలేదు. వెంటనే ఆమెని చూడాలని అన్పించింది అతనికి.
ఇంకా నాలుగైదు రోజుల్లో రాబోతోన్న నెక్ట్స్ ఇష్యూలో ఆమె ఇంటర్వ్యూ వేస్తే ఎక్కువ సంఖ్యలో తన పత్రిక కాఫీలు అమ్ముడవచ్చు అని అతనికి బలంగా అనిపించింది. వెంటనే కుర్చీలోంచి లేచి, లెదర్ బ్యాగ్ తీసుకుని బయటకి వచ్చాడు. ఐదు నిమిషాల్లో అతని హీరో హొండా ఉస్మానియా హాస్పిటల్ వైపు పరుగు తీసింది .

 

 Previous Page Next Page