Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 15



    కాళిదాసు వెంటనే పెద్ద పెద్ద కేకలూ, ఏడుపూ మొదలెట్టాడు, చెదురు మదురుగా జనం కూడా మూగారు.

    కాళిదాసు అక్కడున్న జనాన్ని చూసి గొంతు అర్చేసి "అమ్మలారా, బాబులారా మీరే చెప్పండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? ఎవరో వయసులో వున్న అమ్మాయిని తెచ్చి గదిలో పెట్టుకుని తైతెక్కలాడుతుంటే సంసార్ల ఇళ్ళమధ్యలో ఈ భాగోతం ఏంటిరా అబ్బీ అన్నానని.... చూడండి ఎలా చితక్కొట్టేస్తున్నాడో" అంటూ ఏడుపు మొదలెట్టాడు.

    రిషికి చాలా అసహనంగా అనిపించింది. "మరోమాట మాట్లాడితే చంపి పాతేస్తాను" అని అరిచాడు.

    "చూసారా! నడివీధిలో ఎంత మాటన్నాడో" అంటూ కాళిదాసు మళ్ళీ అరిచాడు.

    "ఇంతకీ ఎవరా అమ్మాయి?" రిషికి తెలిసిన ఒకాయన అడిగాడు.

    "మా వాళ్ళ అమ్మాయే" అన్నాడు రిషి. కాళిదాసు ముందుకు వచ్చి "అంతా అబద్ధం ఆయనగారికి ఆ పిల్ల పేరు కూడా తెలీదుట. మొన్న జరిగిన రైలు ఏక్సిడెంటులో కలిస్తే వెంట పెట్టుకొచ్చాడట. ఆ పిల్ల తన వివరాలన్నీ మరచిపోయిందని డాక్టర్ గారి దగ్గరకు తీసికెళ్ళినప్పుడు చెప్తుంటే నేనంతా విన్నాను" అని రిషివైపు కసిగా చూసాడు.

    రిషి తప్పుచేసినట్లు తల దించుకున్నాడు. "ఏవయ్యా రిషీ నిజమేనా?" రిషి పని చేసే ఫ్యాక్టరీలో పనిచేసే ఒకతను అడిగాడు.

    ఏం చెప్పాలో రిషికి తోచలేదు. మౌనంగా నిలబడ్డాడు.

    "అటువంటప్పుడు పోలీసులకెందుకు తెలియబరచలేదూ?" ఇందాకటతనే అడిగాడు.

    "పిల్ల కాంచనమాలలా వుందని వుంచేసుకున్నాడు" అన్నాడు కాళిదాసు.

    "ఛా! నువ్విలాంటి వాడివనుకోలేదు!" అందొకావిడ.

    "చెప్పు! ఎందుకిలా చేసావు?" అని ఎవరో అడుగుతున్నారు.

    "నేను చెప్తాను" అని వినిపించి అందరూ తలలు తిప్పి చూశారు.

    ఆశ్రిత వాళ్ళ మధ్యలో కొస్తూ "ఇతను నా బావ! నేనూ అతనూ కలిసి వస్తుంటేనే ఏక్సిడెంటయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మధ్యలో ఎవడో తాగుబోతు మాటలు నమ్మి మీరంతా మా బావని నిలెయ్యడానికి మీకు సిగ్గులేదూ?" అంది.

    అందరూ మొహమొహాలు చూసుకున్నారు. "పద బావా!" అంటూ ఆశ్రిత రిషి చెయ్యి అందుకుని నడిచింది.

    రిసీ ఆమెతో నిద్రలో నడుస్తున్నవాడిలా నడిచాడు.

    ఆశ్రిత లోపలికి రాగానే తలుపు గడియపెట్టింది. అతనివేపు తిరిగి గట్టిగా చెంపలు వేసుకుంటూ "తప్పే! ఒప్పుకున్నాను సరేనా!" అంది.

    అతను ఆమెని వింతగా చూడసాగాడు.

    ఆమె అతని దగ్గిరగా వచ్చి అతని చేతిని తన చెంపకి తాకించుకుంటూ "కొట్టాలనుకుంటే కొట్టొచ్చుగా!" అంది.

    రిషి తన చేతిని విడిపించుకుని దూరంగా జరిగాడు. "ఆకలేస్తోంది" అంది కాలి బొటనవేలితో నేలమీద గీతలు గీస్తూ.

    అతను వెళ్ళి గిన్నెలో అన్నం కంచంలోకి వడ్డించాడు. ఆమె పచ్చడితో కలిపి ఓ ముద్ద అతని నోటికి అందించింది. "ఊ నోరు తెరవండి!" అంది.

    అతను ఆమె చేతిని పట్టుకుని ఆమె కళ్ళలోకి తీవ్రంగా చూసాడు. ఆమెది అమాయకత్వమో, అల్లరో, అహంభావమో అతనికి అంతుపట్టలేదు.

    "అబ్బా! నొప్పి" అంది ఆశ్రిత.

    అతను ఉలిక్కిపడి ఆమె చేతిని వదిలిపెట్టేశాడు. అతను పట్టుకున్న చోట ఆమె చెయ్యి ఎర్రగా కందిపోయి వుంది. ఆమె ముఖం అంతకన్నా ఎర్రగా మారింది. పెటీల్మని నక్షత్రం పగిలి నలువైపులా కాంతులు వెదజల్లినట్లు ఆమె కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. వానలో తడిసి వచ్చిందేమో ఆమె ఒంటికి ఉల్లిపొర చీర అతుక్కుపోయి అందాలన్నీ బయటేస్తోంది. అప్పుడే రేకునిచ్చిన గులాబీలా వుంది.

    ఆమె అతని చూపులని తప్పించుకుంటూ చెంపలమీద పడిన జుట్టుని వెనక్కి తోసుకునే నెపంతో తల తిప్పుకుని "చాలా ఆకలిగా వుంది కదూ?" అంది.

    అతని కళ్ళల్లో ఆకలి కదలాడింది.

    ఆమె కంచం అతని ముందుకు తోసి మరో కంచంలో అన్నం పెట్టుకుని గబగబా తినేసింది. అతను తింటూ వుండగానే లేచి అతని కోసం పక్క వేసింది. అతను లేవగానే అతని చేతికి కొన్ని నోట్లిస్తూ "ఇదిగో డబ్బు. రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళి అమ్మగారిని తీసుకురండి" అంది.

    రిషి అవి అప్రయత్నంగా అందుకుని అయోమయంగా చూసాడు.

    ఆమె తన పని అక్కడితో అయిపోయినట్లు గబగబా వెళ్ళి పక్క మీద పడుకుని "గుడ్ నైట్" అని ముసుగు పెట్టేసింది.

    రిషి తన చేతిలోని డబ్బువేపూ, ఆమెవేపూ మార్చి మార్చి చూసాడు.

    ఆ తర్వాత నెమ్మదిగా కదిలి ఆమె దగ్గరకు వెళ్ళాడు.

    దానిమ్మ చిగురుల్లాంటి ఆమె పెదవులు అరివిచ్చి సన్నగా నవ్వుతున్నట్లుగా వున్నాయి. ప్రక్కకు తిరిగి పడుకోవడంవల్ల మెడక్రింద ఒంపు స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్రగా కాచిన పాలరంగులో వున్న ఆమె శరీరాన్ని స్పృశించాలన్న కోరిక ఆపుకోలేనంతగా కలుగుతోంది. నెమ్మదిగా చేయి జాపి ఆమె ముంగురులు సవరించబోయాడు. ఆమె గబుక్కున వెల్లకిలా తిరిగింది. అంత దగ్గర్నుంచి అంతటి మహోన్నత ఈ సౌందర్యాన్ని చూసి తట్టుకోలేనివాడిలా అతను చలించిపోయాడు.

    ఎవరో తనమీద బాణం ఎక్కుపెట్టారు. ఆ విల్లులో ఏడు రంగులు వున్నాయి. ఆ రంగులకి అతని కళ్ళు చీకట్లు కమ్మినట్లున్నాయి. అతని నుదిటిమీద శ్వేదం అలుముకుంది. ప్రకృతిలోని సంగీతం అంతా ఆమె నవ్వులోనే వున్నట్లూ.... సృష్టిలోని సౌందర్యం అంతా ఆమె ముఖంలోనే పొదగబడినట్లూ అతనికి అనిపించింది.

 Previous Page Next Page