Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 14


    "పోనీ ఓసారి తసుకురాకూడదూ" అంది ఆశ్రిత.

    రిషి అదిరిపడి చూసాడు. "ఎవర్ని?" అన్నాడు.

    "అదే.... మీ అమ్మగార్ని" అంది.

    అతనికి లాగిపెట్టి కొట్టాలనిపించింది. "మీ సలహాకి ధన్యవాదాలు. తా దూర కంత లేదు మెడకో డోలు అన్నట్లు నా వుద్యోగం ఏ నిమిషాన వూడుతుందో నాకే తెలియట్లేదు. మీరొక రొచ్చి నా ప్రాణం మీద దిగబడ్డారు. ఇంక ఆవిడ్ని తెచ్చి ఏం చెయ్యనూ?" అన్నాడు.

    "మనతోబాటే...." అంది ఎంతో మామూలుగా. పదేళ్ళ నించీ కాపురం చేస్తున్న ఇల్లాలులా.

    రిషి సీరియస్ గా చూసాడు "తొమ్మిదో ఎక్కం వచ్చా?" అడిగాడు.

    ఆమె అయోమయంగా చూస్తూ "ఊ!" అంది.

    "వెనక నించి చెప్పగలరా?" అడిగాడు.

    "ఊ చెప్పగలను"

    "అయితే చెప్పండి" అన్నాడు.

    ఆమె చెప్పింది.

    చెప్పడం పూర్తవగానే రిషి గట్టిగా అరిచాడు. "తొమ్మిదో ఎక్కం వెనకనించి కూడా చెప్పగలిగి నప్పుడు కన్నతల్లి దండ్రులెవరో చెప్పలేక ఏం రోగం?"

    ఆమె అంతకన్నా గట్టిగా "తొమ్మిదో ఎక్కానికీ కన్నతల్లిదండ్రులకీ ఏవిటి సంబంధం?" అంది.

    రిషి తల గోక్కున్నాడు. "అదంటే! ఇది గుర్తున్నప్పుడు అన్నీ గుర్తుండాలి.... వేషాలు చెయ్యకండి. నిజం చెప్పండి" అన్నాడు.

    "నాకేం గుర్తులేదు" ఆమె మొండిగా అంది.

    రిషి ఆవేశంగా అరిచాడు. "అన్నం తినడం, బట్టలు కట్టుకోవడం ఇవన్నీ గుర్తున్నాయిగా మరి!"
    ఆశ్రిత వెంటనే క్రింద కూలబడి భోరున ఏడుపు మొదలెట్టింది.

    "నీ ఏడుపుకి నేను బెదిరే రకాన్ని కాను. నిజం చెప్పు! ఎవర్నువ్వు? ఏదైనా దొంగతనం కానీ హత్య కానీ చేసి పారిపోయి వస్తున్నావా? లేక ఎవడితోటైనా లేచి పోయి వస్తూ...."

    అతని మాట పూర్తవకముందే పెద్ద చప్పుడుతో అతని చెంప అదిరిపోయింది.

    ఆశ్రిత కొట్టిన దెబ్బకి రిషి అవాక్కయిపోయాడు.

    ఆమె ఆవేశంగా "నోటికి వచ్చినట్టల్లా మాట్లాడితే వూరుకోను. నేను వెళ్ళిపోవాలి అంతే కదా! సరే వెళ్ళిపోతాను" అని లేచి చెప్పులు కూడా వేసుకోకుండా బయటికి వెళ్ళిపోయింది.

    రిషికి ఏం చెయ్యాలో తోచక అలాగే కూర్చుని చూస్తుండిపోయాడు. వర్షం తగ్గుముఖం పట్టేటట్లుగా లేదు. బాగా ముసురేసింది. ఈ వానలో ఆమె ఎక్కడికెళ్తుంది? అనుకున్నాడు. అంతలోనే ఎక్కడికెళ్తే నాకేం? అని కూడా అనుకున్నాడు. మామూలుగా వుండడానికి ప్రయత్నించాడు. లేచి ట్రాన్ సిస్టర్ ఆన్ చేసాడు.

    "గోరింక గూటికే చేరావూ చిలకా....

    భయమెందుకే నీకు బంగారు మొలకా...." అని వినిపించగానే, ఠకీమని దాన్ని ఆపుచేసేసాడు. ఎందుకో తెలియని దడగా అనిపించింది. ఆమెకి ఏమైనా అవుతుందేమో అని ఆదుర్దాగా వుంది. తనని నమ్మి తనతో బాటు అమాయకంగా తన ఇంటికి వచ్చేసింది. ఏ మాత్రం భయం లేకుండా ఒక్కగదిని తనతోబాటు పంచుకుంటూ నిస్సంకోచంగా వున్న ఆమె లోకం అంతా ఇంత స్వచ్ఛంగా అందంగా వుంటుందని భావిస్తుందేమో! అసలే చాలా అందమైన అమ్మాయి. ఆ భావన రాగానే అతను ఇంక ఆగలేక పోయాడు. గబగబా వీధిలో కొచ్చాడు. ఇంకా వర్షం పడుతూనే వుంది. రైల్వే స్టేషన్ వైపు అడుగులు వేసాడు.

        *        *        *        *
    రైల్వే స్టేషనూ బస్టాండు అన్నీ తిరిగి తిరిగి రిషి అలసి పోయాడు. అతనికి ఆమె మీదా తన మీదా అందరి మీదా కోపంగా వుంది. దార్లో కనిపించిన రాయిని కాలితో బలంగా తన్నాడు. బొటన వేలు చిట్లి రక్తం వచ్చింది.

    అసలు తనని ఎందుకు కలవాలి? కలిసినా తను అందరిలాగే ఆమెని అక్కడే వదిలిపెట్టకుండా ఎందుకు వెంట పెట్టుకుని వచ్చినట్లు? తెచ్చిన వాడు నోరు మూసుకుని వుండకుండా ఆమెని ఈ విధంగా వర్షంలో ఎందుకు వెళ్ళగొట్టినట్లు? అతనికి చాలా పిచ్చిగా అనిపించింది. కోపంలో ఆకలిమాట మరిచిపోయాడు. కానీ కడుపులో నరాలు మెలి తిరుగుతున్నాయి. నడుస్తున్న వాడల్లా రిషి ఠక్కున ఆగిపోయాడు. ఎదురుగా చిన్న అమ్మవారి గుడి కనిపించింది.
అందులో ఒక రాయికి పసుపూ, కుంకుమా పెట్టి వున్నాయి. ఎవరో వెలిగించిన అగరొత్తులు ఆరిపోయి వున్నాయి.

    రిషి చెప్పులు విప్పి తలవంచి నమస్కరించాడు.

    "నీ పేరు నాకు తెలీదు ట;తల్లీ! కానీ ఆశ్రిత దొరకాలి" దండం పెట్టుకుని చెంపలు కొట్టుకున్నాడు. ఆమె దొరికితే రేపు నీకు కొబ్బరికాయ కొడ్తాను. అని కూడా అనుకున్నాడు. ఇంటికి వస్తుంటే అతను చేసిన పనికి అతనికే ఆశ్చర్యం వేసింది. ఆఫీసుకి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ ఆ రాయికి మొక్కుతున్న వాళ్ళని చూసి నవ్వుకునేవాడు. అడ్డంగా అక్కడ గుడి కట్టిన వాళ్ళని విసుక్కున్నాడు కూడా. అవసరం, ఆపదా మనిషిని ఇట్టే మార్చేస్తాయి కదా!

    సందు మొదట్లోనే హైమా ఆంటీ ఎదురొస్తూ "ఎవరో అమ్మాయి దిగుడు బావిలో దూకిందట.... కొన ప్రాణాలతో వుందట, హాస్పిటల్ నుండి కబురొచ్చింది" అంది.

    "ఎంత సేపయిందిరా?" అని రిషి ఆత్రంగా అడుగుతుండగానే ఆమె పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.

    రిషి కూడా ఆమె వెంట వెళ్ళడానికి వెనుతిరుగుతుండగా ఎవరో భుజంమీద చెయ్యివేసి ఆపారు. విసుగ్గా చూసేటప్పటికీ కాళిదాసు వెకిలిగా నవ్వుతూ "ఓ పదికొట్టు" అన్నాడు.

    రిషి ఆలోచించలేదు. శక్తి కొద్దీ బలంగా కొట్టాడు. కాళిదాసు వెళ్ళి ఎదురుగా వున్న బురదలో పడ్డాడు. లేచి చొక్కా దులుపుకుంటూ బండబూతులు మొదలు పెట్టాడు. అసలే చిరాకుమీద  వున్న రిషి అతన్ని చొక్కా పట్టి లాగి మరో రెండు తగిలించాడు.

 Previous Page Next Page