Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 16


    కళ్ళు ఆర్పకుండా నిప్పు దగ్గరకు ఒంగుతున్నవాడిలా అతను ఆమె ముఖం మీదకి వంగాడు. అతని పెదవులు ఆమె పెదవులకు తగిలీ తగలనట్లుగా తగిలాయి. ఆమె వెచ్చనిశ్వాస అతనిలోకి ప్రవహించింది. ప్రవాహానికి ఎదురీదుతున్న వాడిలా వున్నాడు. అతను ఏ నిముషాన్నైనా మునిగిపోయేటట్లుగా....

    అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది.

    రిషి కంగారు పడలేదు. "నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను" అన్నాడు స్థిరంగా.

    ఆమె కళ్ళు పెద్దవిచేసి విస్మయంగా చూసింది.

    అతను ముందుకు వంగి తన పని పూర్తి చేసుకున్నాడు.

    ఆమె సున్నితంగా అతని గుండెలమీద చేతులువేసి వెనక్కి తోసేసింది. లేచి మోకాళ్ళచుట్టూ చేతులు వేసుకుని కూర్చుని "అమ్మ ఆరోగ్యం కోసం డబ్బు సంపాదించడం తేలిక అనుకుంటున్నారు కదూ!" అంది.

    రిషి మాట్లాడలేనట్లు చూసాడు. అతనికి కాస్త అభిమానంగా అనిపించింది.

    "దేనికయినా కష్టపడాలి. కష్టం ఒక్కటే సరిపోదు తెలివికూడా ఉపయోగించాలి. అవతలివాళ్ళకి నష్టం కలుగచేస్తూ మనం లాభం పొందగలగడం లౌక్యం. రెండోది ఉపయోగించి ప్రపంచంలో చాలా సాధించవచ్చు. కావలసినదల్లా కాస్త తెలివి.

    ఆ ముడిపదార్ధం దేవుడు మన మెదడులోనే దాచాడు. కావల్సిందల్లా దాన్ని ఉపయోగించగల సత్తా!" అంది నవ్వుతూ.

    ఆమె ఆ మాటలు ఎందుకు చెపుతోందో అతనికి అర్ధం కాలేదు.

    ఆమె ఆవలిస్తూ "పడుకోండి. ప్రొద్దుటే అసలే ప్రయాణం కూడానూ!" అంది.

    రిషి చాలా నెమ్మదిగా అడిగాడు "ఆశ్రితా నువ్వెవరు?"

    "నేను దేవకన్యని. ఒకరోజు ఆకాశంలో విహరిస్తూ వుండగా యీ కొండల్లో నువ్వు కనిపించావు. వెంటనే భూమిమీదకి దిగి వచ్చాను చాలా!" అడిగింది.

    అతను గంభీరంగా "నాకు నిజం కావాలి!" అన్నాడు. ఆమె కూడా గంభీరంగా మారి "కావాలి అనేగానే అన్నీ దొరకవు. సాధించాలి. అందుకు చాలా కష్టపడాలి" అంది.

    "ఏం చెయ్యాలి?" వెంటనే అడిగాడు. "వెంటనే గోడవేపు తిరిగి నిద్రపోవాలి! ప్రొద్దుటిదాకా నిద్రపోవాలి. కష్టపడి సాధించడం అంటే.... అమ్మాయికి నిద్రపట్టేదాకా ఓపిక పట్టి, ఆ తర్వాత దొంగచాటుగా ముద్దు పెట్టుకోవడం కాదు!" అంది.

    రిషి మొహం ఎర్రబడింది. అతను వెంటనే గోడవైపుకి తిరిగి పడుకున్నాడు.

    ఆశ్రిత అలాగే కూర్చుని అతనివైపు చూడసాగింది.

    పెంకులమీద యింకా వర్షం నీరు చప్పుడు చేస్తూనే వుంది. ఉండీ.... ఉండీ ఓ చుక్క ఆమె చెంపమీద కూడా పడ్తోంది. మూలన పెట్టిన గిన్నెలో నీళ్ళు నిండి ఏ నిమిషానయినా పొర్లి పోయినట్లుగా వున్నాయి. ఓ సన్నని గాలి తెమ్మెర కిటికీగుండా వచ్చి ఆమె వెన్నుతట్టి వెళ్ళిపోయింది.

    గోడవైపుకి తిరిగి పడుకున్న అతను నిద్రపోవడం లేదన్న విషయం ఆమెకి తెలుసు.

    ఆమె ఇంక ఆ ఇంటిలో నిశ్చింతగా నిద్రపోలేదన్న విషయం అతనికీ తెలుసు.

    ఇద్దరూ ఆ రాత్రి జాగారం చేసారు.

                                                                      *   *   *    *
     ఉదయం చూసేసరికి ప్రకృతి చక్కగా సింగారించుకుని యెదుట నిల్చున్నట్లుగా వుంది. కొప్పులోని ముద్దమందారంలో కొండల మధ్య నుండి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. తడి కురుల చివర్లనుండి జారిపడుతున్న నీటి చుక్కల్లా చెట్ల ఆకులు నీటిబొట్లు రాలుస్తున్నాయి. ఉతికి ఆరేసిన ఆకుపచ్చ చీరతో వక్షాన్ని కప్పుకున్నట్లుగా వున్నాయి కొండలు. వెలిసిన నీలం రవికెలావుంది ఆకాశం. ఏడ్చి మొహం కడుక్కున్న ఆడదాని మొహంలా వున్నాయి వీధులు. కుచ్చులటోపీ సవరించుకుంటున్న నవాబుల్లా వూగుతున్నాయి తాటిచెట్లు....రాత్రి ఏమీ జరగలేదు అంతా మామూలే అన్నట్లు పశువులు పచ్చిక మేస్తున్నాయి. ఓ కోడి కొక్కొరోకో అని కప్పెక్కి కూస్తోంది.

    "డబ్బు సరిపోతుందా? లేకపోతే ఇదికూడా వుంచండి!" అని ఆశ్రిత రెండో చేతిగాజు కూడా తీసి రిషికి అందించబోయింది.

    రిషి జేబులోంచి ఆమె రాత్రి ఇచ్చిన నోట్లు తీసి, ఆమె అరచేతిలో కుక్కి "ఇదికూడా వుంచు! అవసరం వచ్చినప్పుడు యిద్దువుగాని" అన్నాడు.

    "అవసరం రాగానే అడక్కుండా నీ అంతట నీవే తీసేసుకుంటావుగా!" ఆమె అల్లరిగా నవ్వు బిగపట్టి అంది.

    రిషికి ఆమె శ్లేష అర్ధమయి చిన్నగా నవ్వాడు.

    "మధ్యాహ్నం బస్సుకి వెళతాను. ఎల్లుండిదాకా ఒక్కదానికీ భయం వెయ్యదుగా" అన్నాడు.

    "ఒక్కదానికీ భయం ఎందుకు? ఇద్దరు వుంటేనే భయపడాల్సిన పరిస్థితి" అంది.

    రిషి నవ్వేశాడు. "మళ్ళీ అడుగుతున్నాను. చెప్పు! నువ్వు ఎవరు?" అన్నాడు.

    "చెప్తాను" ఆశ్రిత గంభీరంగా అంది.

    "నువ్వు వచ్చేటప్పటికి తెలుస్తుంది సరేనా! ఇంక బయలుదేరు" అంది.

    రిషి అమెవైపు కన్నార్పకుండా ఓ నిమిషం చూశాడు. రవివర్మ తైలవర్ణ చిత్రాలూ, అజంతా గుహల్లోని శిల్పసుందరీ మణులనీ అతను చూడలేదు. బహుశా ఇలాగే ఉంటాయేమో అందుకే అంతగా పొగుడుతారు అనుకున్నాడు.

    "టైం అవుతోంది" ఆమె హెచ్చరించింది. అతను తలవూపి, పెదవులు కదపబోయాడు. ఆమె చటుక్కున ముందుకివచ్చి అతని పెదవులని తన అరచేత్తో మూసి "వీడ్కోలు చెప్పద్దు!" అంది.

 Previous Page Next Page