చూస్తూ చూస్తూ కూతురి కాపరంలో బొగ్గులు చల్లడం భద్రయ్యకు బాధ కలిగించింది. 'కానీ, అల్లుడిపేర ఆస్తి రాస్తే, రేపు అతడు కాస్తా గుటుక్కుమంటే కూతురి బతుకు ఏం కాను? అన్నదమ్ములు చూస్తారా?'
కథ అడ్డం తిరిగింది. భద్రయ్య ససేమిరా అన్నాడు. మంగమ్మ మొండికేసింది. ఆ ఇంటి కాకి ఈ ఇంటిమీద వాలడం లేదు. భద్రయ్య ఇంట్లోవాళ్ళు మంగమ్మ వుండే మెరక వీధికి రావడానికి భయపడుతున్నారు. పొద్దున్నే అరకిలో బియ్యం అల్పాహారంకింద ఆరగించి, వాకిట్లో కూర్చుని వచ్చేపోయే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి పంచాంగం విప్పుతుంది మంగమ్మ.
ఆరు నెలలు గడిచాయి. మొదటి మూడు నెలలూ మామగారిమీద అలగడం సరదాగానే అనిపించింది చలపతికి. రాను రాను భార్యా వియోగం భరించరానిదే అయింది. ఓ రోజు సాయంత్రం చలపతి మామగారు వుండే వీధికి వెళ్ళాడు. ఇంటికి బాగా పొద్దుపోయాక వచ్చాడు. కొడుకు వాలకం చూడగానే మంగమ్మకు అర్ధం అయింది.
"ఎక్కడా చచ్చావురా?" మంగమ్మ గుడ్లెర్రజేసింది. చలపతి నీళ్ళు నమిలాడు. దిక్కులు చూస్తూ బిక్కపోయి నిల్చున్నాడు.
"సిగ్గు లేకపోతే సారి. ఇక నుంచి చీకటి పడగానే ఇంటికి చావు" అన్నది మంగమ్మ మండిపడుతూ.
కొడుకు తన పట్టునుంచి జారిపోతున్నట్లు అనిపించింది మంగమ్మకు. కోడలు గంగాభవానిమీద పళ్ళు నూరింది. భద్రయ్యను దుమ్మెత్తిపోసింది. ఆ రోజునుంచి మంగమ్మ కొడుకును వెయ్యి కళ్ళతో కనిపెడుతూ వుంది.
ఒకరోజు వీధి భాగవతం చూపిస్తానని వెళ్ళిన చలపతి మామగారింటికి వెళ్ళాడు. తెలతెలవారుతూ వుండగా ఇంటికి చేరాడు.
ఆల్సేషియస్ డాగ్ లాంటి మంగమ్మ, కొడుకు ఎక్కడికెళ్ళాడో ఇట్టే వాసన పట్టేసింది.
తెల్లవారి కొడుకు చేతికి ఓ ఏభై రూపాయల నోటు అందించి అన్నది__"తెనాలివెళ్ళి సినిమాచూసి సర్దాగా తిరిగి రారా నాయనా!"
ఏనాడూ తల్లి చలపతి చేతిలో పది రూపాయలు పెట్టి ఎరగదు. ఒక్కసారి ఏభై రూపాయల నోటు చేతిలో పడగానే చలపతి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
ఇప్పుడు చలపతి పని పైలాపచ్చీసుగా వుంది. పుష్కలంగా డబ్బు అందుతూంది. అప్పుడప్పుడు రాత్రిళ్ళు కూడా తెనాలిలోనే మకాం పెడుతున్నాడు. మంగమ్మ అదేమని అడగడం లేదు. భద్రయ్య మీద కసి తీర్చుకుంటున్నందుకు మంగమ్మకు తృప్తిగా వుంది. చలపతి పూలరంగడిలా తయారయ్యాడు. గ్లాస్కో పంచె కట్టుకొని, బూట్లు వేసుకొని, కాళ్ళు ఎత్తెత్తివేస్తూ నడుస్తూ వుంటే ఆ ఊరివాళ్ళు నోళ్ళు తెరుచుకొని చూడసాగారు.
చలపతి మనసులోనుంచి గంగాభవాని బొమ్మ సినిమా రీలులా ఫేడ్ అవుట్ అయిపోయింది. మంగమ్మ కొడుక్కి రెండో పెళ్ళి చేసే ప్రయత్నంలో వుందని విన్న భద్రయ్య నిప్పులు తొక్కాడు.
'రెండో పెళ్ళి' అన్న మాట విని గంగాభవానికి నవనాడులూ కుంగిపోయాయి. చేతిలోవున్న కోడిపెట్టను అమాంతం నేలకేసి కొట్టింది. కాళ్ళకు చుట్టుకున్న పెంపుడు పిల్లిని కసితీరా తన్నింది. కసి కసిగా వుంది. చలపతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని వుంది. మంగమ్మ నోటిమీద కసితీరా కొట్టాలని వుంది. గంగాభవానికి అన్నం సహించడం లేదు. నిద్ర పట్టడం లేదు. గంగాభవాని గోడకు చేరబడి ఆలోచనల్లో మైమరచి వుంది.
"పాతచీర ఒకటి ఇయ్యండమ్మగోరూ" అంటూ గణాచారి లోపలకు వచ్చింది. గంగాభవానికి కస్సున కోపం వచ్చింది. "చీరా లేదు గీరా లేదు. పో అవతలకు." కోపంగా అరచింది గంగాభవాని.
"ఏంది గంగమ్మగోరూ అట్టా కసురుకొంటారూ? ఈ గణాచారి ముండకు మీరు కత్తి పారేసిన చీర
ఇవ్వకూడదా? ఈ ఏడు ఏందోగానీ ఎవర్ని అడిగినా ఇట్టాగే కసురుకొంటున్నారు. ఆ పోలేరమ్మకు కూడా దయ కలగలేదు."
"ఆ పోలేరంమనే అడుగు పో." కసికసిగా అన్నది గంగాభవాని.
"పోలేరమ్మ తల్లి దయ లేకుండానే ఇంతకాలం బతికానా?" గొణుక్కుంటూ వెళ్ళిపోయింది నాంచారమ్మ.
ఒకరోజు సుబ్బయ్యగారి చిన్న కొడుక్కి కలరా వచ్చి రాత్రికి రాత్రే చచ్చిపోయాడనీ, ఆ రాత్రే హరిజనవాడలో ఇద్దరు చనిపోయారనీ నాంచారమ్మ చెవిన పడింది. వర్షాకాలం ప్రారంభంలో ఆ ఊళ్ళో అలాంటి అంటువ్యాధులు రావడం మామూలే. రెండు రోజుల్లో పదిమందిదాకా కలరా సోకి చనిపోయారు.
మూడో రోజు ఉదయం పోలేరమ్మ గుడి ముందున్న వేపచెట్టుమీద నాంచారమ్మకు గణం పెరిగింది. జుత్తు విరబోసుకొని ఊగసాగింది.
"అద్దద్దా? ఆఁ -హూఁ! ఇరుచుకు తింటా! నలుసుకు తింటా!" అంటూ అరవసాగింది. ఊళ్ళో ఈ వార్త పిడకల గూటి పొగలా వ్యాపించింది. జనం నాంచారమ్మ చుట్టూ చేరారు.