"ఏడుపు! ఆడదాని ఏడుపు."
నిజంగానే నాకు భయంకంటే కోపం ఎక్కువ వచ్చింది. వాడ్ని అమాంతం బండిలో నుంచి తోసెయ్యాలనిపించింది.
అరే అదేమిటి?
నిజంగానే విన్పిస్తోంది.
ఆడదాని ఏడుపు!
అది మామూలు ఏడుపు కాదు.
అనాదిగా ఆడదాని గుండెను బద్దలు కొట్టుకొని వస్తున్న ఏడుపు.
అతిదీనంగా, గుండెల్ని కరిగించేలా ఉంది ఆ ఏడుపు.
ఆ సమయంలో, ఆ పరిసరాల్లో ఆ ఏడుపు జాలికంటే భయాన్నే కలిగిస్తోంది.
"అటు ఆ చెట్టుమీద చూడండి!"
చెట్టు ఆకుల మధ్య ఏదో కదిలినట్టుగా ఉంది. కొమ్మలు ఊగుతున్నాయి. ఆ ఆకారం తెల్లగా ఉండి చెట్టుమీదకు జాలువారుతున్న వెన్నెల్లో కలిసిపోతున్నట్టుగా ఉంది.
బండి దగ్గరౌతున్నది.
"అదేంమోత?" భయంతో బిగిసిపోతూ అడిగాను.
"గాజులమోత!" అన్నాడు రహమాన్.
"అవును గాజుల మోతే! మట్టిగాజుల మోత! తెల్లటి ఆకారం! అదీ మర్రిచెట్టు మీద!"
నాకు గుండె ఆగిపోయినట్టుగానే ఉంది.
"ఆ పిల్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతది. ఆ పిల్ల నాన్న డబ్బుకు కక్కుర్తిపడి ముసలాడికిచ్చి చేశాడు. ఆ పిల్ల ఎదురు తిరిగింది. ఏడ్చింది. ఈ పెళ్లి జరిగితే ఎవడితోనో లేచిపోయి రెండు కుటుంబాల తలలూ వంచుతానన్నది. అయినా వినిపించుకోలేదు. అరవయ్యో పడిలో పడ్డ భద్రయ్య తరలివచ్చాడు. పెళ్లి బ్రహ్మాండంగా చేశారు. ఏం లాభం? ఆ భద్రయ్య మాత్రం సుఖపడి చచ్చాడా? శోభనం రాత్రే ఆ అమ్మాయికి పిచ్చి పట్టింది." ఓ క్షణం ఆగాడు.
"మళ్లీ అదే ఏడుపు!"
"ఊఁ చెప్పు!" అన్నాను. ఆ ఏడుపు వినడం కంటే వీడి మాటలు వింటుంటేనే భయం తక్కువగా ఉంది.
"చాలా మంది అంటారు- 'దీనికి పిచ్చీలేదు పాడూలేదు. ఆ మొగుడు నచ్చక వేషాలు వేస్తుందని! ఇంకా ఏదేదో అంటారు. దాని బుద్ధి మంచిది కాదనీ, రాత్రిపూట ఎక్కడకో వెళ్తుందనీ అంటారు. కాని బాబూ! దీని బుద్ధి బంగారం, నాకు తెలుసు. అప్పుడప్పుడు నేను ఈ అమ్మాయిని నా బండిలో తీసుకెళ్ళి దిగబెడ్తాను. దాంతో మా ఇద్దరికీ ఏదో ఉందని పుకారు పుట్టించారు!" అని నిట్టూర్చాడు.
అర్దరాత్రి రెండుగంటలకు ఇక్కడకు రావడం ఏమిటి?
భయం వెయ్యదా?
పిచ్చివాళ్లకు భయం ఏమిటి?
మరి చెట్టెక్కెందు క్కూర్చోవాలి?
పిచ్చివాళ్ళు ఏది ఎందుకు చేస్తారో అందరికీ తెలిస్తే ఈ సైకియాట్రిస్టు లెందుకూ? పోనీలే ఇది దయ్యంకాదు, పిచ్చిది. నా గుండె కుదుట పడింది.
బండి చెట్టును సమీపిస్తోంది.
ఆ తెల్లటి ఆకారం చెట్టుమీదనుంచి దూకింది.
నేను అప్రయత్నంగా "కెవ్వు" మన్నాను. వెంటనే అది దయ్యం కాదని గుర్తొచ్చి నా భయానికి నేనే సిగ్గుపడ్డాను.
"భయంలేదు బాబూ!" అంటున్నాడు రహమాన్.
దూకిన తెల్లటి ఆకారం చెట్టుకింద అలాగే నిల్చుంది.
బండి ఆగింది.
"రాలిలా! బండెక్కు!" పిల్చాడు రహమాన్.
ఆ ఆకారం కదులుతోంది.
ఒక్కొక్క అడుగే వేస్తుంటే, నా వెన్నెముకలో నలికిల పాము ఒక్కొక్క మెలికే తిరుగుతున్నట్టుగా వళ్ళు జలదరిస్తోంది.
ఈమె దయ్యంకాదు. భయం ఎందుకూ? నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్నాను.
ఆ ఆకారం చెట్టునీడలోనుంచి వెన్నెల్లోకి వచ్చింది.
అక్కడే నిలబడిపోయింది.
నాకేసి చూస్తూ నిల్చుంది. రెప్పవాల్చకుండా చూస్తోంది.
ఆమె అపురూప సౌందర్యవతి!
తెల్లటి చీర.
తెల్లటి రవిక.
తల్లో తెల్లటి పూలు.
గాలివాటుకు మల్లెపూల వాసన నాసాపుటాలను తాకుతోంది. మనసులో అంతవరకూ పేరుకొన్న భయం కరిగిపోతున్నది.
ఆమె నిల్చున్న బాట తెల్లగా ఉంది.
చుట్టూ తెల్లగానున్న వాతావరణం.
ఆమెను చూస్తున్నకొద్దీ నాలోని భయం మాయమైంది. ఇన్ని గంటలు అనుభవించిన మానసిక అస్థిరత కుదుటపడినట్టు అయింది. హాయిగా గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాను.
ఎంత అందంగా ఉంది?
సాక్షాత్తు ఆ వనదేవతే వచ్చి నిల్చుందనిపిస్తోంది.
ఆమె నన్నే చూస్తోంది ఇంకా!
నాకు స్త్రీ బలహీనత లేదు. తాజ్ మహల్ చూసినప్పుడు మనసు చలిస్తుందా! గులాబితోటను చూస్తే మనసు చలిస్తుందా? అలాగే అందమైన స్త్రీని చూడగానే మనసెందుకు చలిస్తుంది. అందాన్ని చూసినప్పుడు అందమైన అనుభూతి కలగాలి. అంతేగాని అనుభవించాలనే కోరిక కలుగకూడదు. అదే ఎదిగిన మనిషి మనసు. ఆరోగ్యకరమైన మనసు. ఇవి తన భావాలు.
కాని ఇవ్వాళ ఇదేమిటి? ఆమెను చూస్తుంటే ఆమెను తాకాలనిపిస్తోంది. ఆమెను గుండెలకు హత్తుకోవాలనిపిస్తోంది.
రహమాన్ బండి దిగి ఆమె దగ్గరగా వెళ్ళాడు.
"లీలా రా వెళ్దాం!"
ఆమె మౌనంగా నడిచింది. నిద్రలో నడిచినట్టు నడిచింది.
"బండెక్కు!" అన్నాడు రహమాన్.
ఆమె బండి దగ్గరకు వచ్చింది.