రోడ్డు ప్రక్కన చిరిగిన బట్టల్లో అర్థనగ్నంగా మురిగ్గా ఉన్నవాళ్ళను చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు అక్కడే తింటున్నారు. కొందరు పడుకొని వున్నారు. గిన్నెలు కడుక్కొంటున్నారు. స్త్రీలు మూడు రాళ్ళు పెట్టిన పొయ్యిమీద వంటలు చేసుకొంటున్నారు. నగ్నంగా ఉన్న పిల్లలు దుమ్ముకొట్టుకొని వున్నారు.
సీత కోచ్ లో కూర్చుని వున్న ఇంగ్లీషు అధికారుల్నీ, రోడ్డు పక్కన జీవిస్తున్న భారతీయుల్నీ మార్చిమార్చి చూసింది.
కోచ్ ఒక పెద్ద బంగళా ముందు ఆగింది. అది మార్కిస్ వెల్లస్లీ కట్టించాడు. అంతకుముందున్న గవర్నమెంటు భవనం తను ఉండటానికి యోగ్యంగా లేనందువల్లనే శతాబ్దం క్రితం ఈ బంగళాను అన్ని హంగులతో కట్టించాడు.
ఈ విషయం హారే సీతకు చెప్పాడు.
సీతకు తన బాబాయి ప్రవర్తన ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కూడా కలిగించింది. తనతో ఇలాంటి విషయాలు చెప్పడం ఆమెకు వింతగా తోచింది.
బాబాయి చాలా సంతోషంగా ఉన్నాడు. తన గొప్పతనం ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. అందుకే అతను సీతతో చెప్పాడు.
చెబుతున్నది తనకే అయినా, ఆ విషయాలు ఎదురుగా కూర్చున్న ఆ సైనికాధికారి వినాలని చెబుతున్నట్టు సీతకు అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదు.
"ఈ భవంతి కట్టడానికి నాలుగేళ్ళు పట్టింది." సైనికాధికారి అన్నాడు.
సీత ఆ బంగళాను ఊపిరి పీల్చడం మర్చిపోయినట్టు చూడసాగింది. పల్లెటూరి పిల్ల నోరు తెరుచుకుని ఏదైనా అద్భుతమైన వస్తువును చూసినట్టు సీత బంగళా చూస్తున్నది.
గేటు మీద రెండువైపులా సింహాల బొమ్మలు ఉన్నవి. అవి సజీవంగా ఉన్నాయా అన్నంత భ్రమను కలుగజేస్తున్నాయి.
"ఇంత పెద్ద భవంతిలో ఒక్క కుటుంబమే ఉంటుందా?" సీత ఆశ్చర్యంగా అనుకొన్నది.
సీత ఆ బంగళాలో అడుగుపెట్టింది. ఆమెకు ఏదో కొత్త ప్రపంచంలో ప్రవేశించినట్టుగా ఉన్నది. అంత అందంగా అలంకరించబడిన అంత పెద్ద భవంతి ఆమె ఎన్నడూ చూడలేదు. ఆ వైభవం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆ పాలరాతి గోడల మీద వున్న పెద్ద పెద్ద చిత్రాలనూ, అద్దాలనూ చూస్తూ నిల్చుండిపోయింది. ఆ హాలులో ఉన్న ఫర్నిచర్ మహారాజుల కోటల్లో మాత్రమే వుంటాయని సీత అంతకుముందు ఊహించుకొంటూ వుండేది. అద్దాలు బర్మా రాజప్రసాదం నుంచి తెచ్చినవి.
ఆ వైభవాన్ని సదా గుర్తించుకోగలిగేదాకా చూడాలని వున్నది. అద్భుతమైన అనుభూతి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తను తనేనా ? తనకు అదృష్టం కలిగిందా?
సీతను ఆ మార్బుల్ హాలు నుంచి గెస్టు రూములవైపు తీసుకెళ్ళారు. ఆ హాల్లో వున్న నున్నటి, తెల్లటి పాలరాతి స్తంభాలను తాకుతూ, వాటి తాలుకు స్పర్శకు మనసు పులకరించిపోతూ వుండగా, సీత చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయి నడుస్తున్నది. ఆమెకు దారి చూపుతున్న నౌకరు వెనక యాంత్రికంగా నడుస్తున్నది. ఆమెకు ఇంకొంతసేపు ఆ హాల్లో వుండాలని వున్నది. చల్లగా తగులుతున్న స్తంభాలకు చేరబడి నిల్చోవాలని వుంది.
"రెండేళ్ళయింది ఈ దేశం వదిలి. అయినా వీళ్ళు నన్ను మర్చిపోలేదు" ఎంతో సంతృప్తితో అన్నాడు హారే.
సీత తృళ్ళిపడి పక్కకు చూసింది. అంతవరకూ తన బాబాయి తనపక్కనే ఉన్నాడనే విషయం కూడా ఆమెకు స్పురించలేదు.
సీత ముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు.
తన బాబాయి ఆనందంగా నవ్వగలడని మొదటిసారిగా తోచింది సీతకు.
బాబాయికి ఇక్కడ లభించిన స్వాగతం ఎంతో సంతృప్తిగా వున్నది. అతని ముఖంలో తనకు ఇంతకాలంగా తెలిసిన కాఠిన్యం లేదు. రాక్షసుడిగా కన్పించిన తన బాబాయి ఒక్కసారిగా మనిషి అయ్యాడు.
వైస్ రాయ్ దంపతులతో భోజనానికి కూర్చున్నప్పుడు సీత తనలో ఉబుకుతున్న ఉత్సాహాన్నీ ఆనందాన్నీ అణుచుకొనే ప్రయత్నంలో సతమతమైపోతున్నది. ఆమెకు చిన్నపిల్లలా కేరింతలు కొట్టాలని వుంది. మనసులో ఇమడలేని ఆ ఉద్వేగాన్ని ఆడీ, పాడీ, గంతులేసి బయటపెట్టాలని వుంది. అవేమీ చెయ్యలేదు. కనీసం తనతో మాట్లాడేవాళ్ళు కూడా కన్పించలేదు. హారే పక్కన కూర్చుంది వైస్ రాయ్ దంపతులతోపాటు. కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు.
సీత మౌనంగా వింటున్నది.
వాళ్ళ సంభాషణను బట్టి తన బాబాయిని వాళ్ళు ప్రత్యేకమైన పనిమీద ఇక్కడకు పంపించారని అర్థం చేసుకొన్నది.
హారే ముఖం ప్రసన్నంగా వుంది.
కళ్ళు ఆనందంతో మిలమిలలాడుతున్నాయి.
కంఠ స్వరంలో అణకువ వున్నది.
సీత తన బాబాయిని కొత్తవ్యక్తిని చూస్తున్నట్లు చూడసాగింది.
బాబాయి మారిపోయాడు. ఇక్కడ ఉన్నంతకాలం తనను బాగా చూస్తాడు. తనను తిట్టడు, కొట్టడు. ఎంతకాలం ఇక్కడ ఉంటాడో?
తన బాబాయిని అంతమంది గౌరవిస్తుంటే సీతకు కూడా గర్వంగా ఉంది. బాబాయితోపాటు తనకూ ఆ గౌరవంలో భాగం ఉన్నట్లుగా తోచింది.
"వైస్ రాయ్ నా బుర్ర తినేస్తున్నాడు."
సీత చివ్వున తలతిప్పి బాబాయి ముఖంలోకి కుతూహలంగా చూసింది.
లార్డు రిప్పన్ ఒక బిల్లును పాసు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బిల్లు ప్రకారం ఇండియన్ జడ్జి ఇంగ్లీషువాళ్ళ కేసులు తీసుకోవచ్చును. ఇంగ్లీషువాడిని కోర్టులో నిలబెట్టి ఇండియన్ జడ్జి ట్రయల్ చెయ్యడం యూరోపియన్సుకి ఇష్టంలేదు.
ఆ విషయంమీద పెద్ద అలజడి బయలుదేరింది.
ప్రభువుల్ని బానిసలు ట్రయల్ కోర్టులో నిల్చోబెట్టటమా? శిక్షించటమా? ఇండియాలో వున్న యూరోపియన్సే అందరూ ఏకగ్రీవంగా ఈ బిల్లు వ్యతిరేకించారు. ఆ విషయంగానే వైస్రాయ్ హారేను ఇండియాకు పిలిపించాడు. హారే ఈ విషయాల్లో ఆరితేరిన ఘటం. లా పాయింట్సు క్షుణ్ణంగా తెలిసినవాడు.
హైదరాబాద్ వెళ్లకముందే వైస్ రాయ్ మిష్టర్ హారేతో అన్ని విషయాలు చర్చించాలని భావించాడు. అతని సహకారం అర్థించడానికే ఇంత గొప్ప సత్కారం హారేకి ఇవ్వడం జరిగింది.