Previous Page Next Page 

కారణం ఏదైనా సీతకు ఆ బంగళా ఎంతో నచ్చింది. అక్కడ ఉండటం, వైస్ రాయ్ దంపతులతో డిన్నర్ చెయ్యడం జీవితంలో మరిచిపోలేని ఒక అపూర్వ అనుభవంగా భావించింది.
కింద నేల నిగనిగలాడే నల్లరాళ్ళు పరిచి ఉన్నది. ఆ రాళ్ళలో నీడలు కన్పిస్తున్నాయి. సీత వాటిమీద అతిజాగ్రత్తగా నడుస్తోంది. తను నడిస్తే అవి మురిగ్గా అయిపోతాయోమోనన్నట్లుగా కాళ్ళు పెడుతున్నది.
ఆమెకు కేటాయించిన గదిని చూపడానికి ఒక సైనికుడు ముందుకు నడుస్తున్నాడు.
"ఇదే వైస్ రాయ్ కూర్చునే సింహాసనం" అన్నాడు సైనికాధికారి. సీత కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఆ సింహాసనం అంతా బంగారు పూత వేసి వున్నది. దానిమీద పర్చిన బట్ట బంగారు జడీ ముద్దలా వుంది. "వైస్ రాయ్ కి కూడా ఇంత మంచి సింహాసనం ఉంటుందా?" అమాయకంగా అడిగింది సీత. అ"వును! మన ఇంగ్లండు రాజుగారి ప్రతినిధి రాయ్. ఈ దేశానికి ఇతనే పెద్ద" అన్నాడు సైనికాధికారి.
"చాలా బాగుంది!"
"ఏమిటి?"
"ఈ బంగళా - ఈ సింహాసనం"
"బంగళాలో కొన్ని ఇబ్బందులున్నాయి. వసతులు తక్కువే!"
సీత అతని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది.  
"కిచెన్ కనీసం బంగళా బయటఉన్నా దగ్గరగా వుంటే బాగుండేది. వైస్ రాయ్ గారి భార్య కిచెన్ కలకత్తాలో మనం ఊరు చివర - అంటూ వుంటారు" అన్నాడు.
భోజన పదార్థాలు చెక్కపెట్టెల్లో పెట్టుకొని వంటవాళ్ళూ, పనివాళ్ళూ మోసుకొని రావడం ఆమె చూసింది.
ఆమె తనకు కేటాయించిన గెస్టు రూంలోకి వచ్చింది. అదికూడా ఎంతో విశాలంగా వుంది. పాతకాలపు అద్దాలతో, చిత్రాలతో గోడలు నిండివున్నాయి. సీత ముఖం ఆనందంతో విప్పారింది.
స్నానానికి నీళ్ళు కావాలని అడిగింది.
వెంటనే ఒకడు నీళ్ళు వేడిచేశాడు.
మరొకడు నీళ్ళు కలిపి పెట్టాడు.
ఆమె స్నానం చేసింది.
తర్వాత మరొకడు వచ్చి బాత్ రూం శుభ్రం చేశాడు.
తనకు గైడ్ గా వున్న అతన్ని ఈ చిన్నపాటి పనికి నలుగురెందుకని ఆశ్చర్యంగా అడిగింది సీత.
"అందరూ వేరు వేరు కులాలవాళ్ళు" అన్నాడు ఆ సైనికుడు.
ఆమెకు అతను చెప్పింది అర్థంకాలేదు.
గది అందంగా అలంకరించి వున్నది. కాని అందులో వెలుగు మాత్రం సరిగాలేదు.
పొగచూరిన క్యాండిల్ దీపాలు అక్కడే కూడపెట్టి ఉన్నాయి.
ఈ విషయం లార్డు రిప్పన్ ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో?
ఇలాంటి చిన్న విషయాలను పెట్టించుకోవడానికి ఆయనకు సమయం ఎక్కడుంటుంది?
తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పుకుంది సీత.
డ్రాయింగు రూంలో వైస్ రాయ్ దంపతులు కూర్చుని వున్నారు. అనేకమంది వారిని చూడటానికి వస్తున్నారు. తలలువంచి తమ అభివాదం తెలిసి కూర్చుంటున్నారు. స్త్రీలు మరీ అణకువగా కన్పిస్తున్నారు.
అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. ప్రతి కుర్చీ వెనకా తెలుపూ, ఎరుపూ కలిపిన దుస్తుల్లో చక్కగా అలంకరించుకున్న సిపాయిలు నిల్చున్నారు.
ఏదో జంతువు అరిచినట్టు విన్పించింది.
సీత తలెత్తి చూసింది. ఎవరూ ఆ అరుపును పట్టించుకున్నట్టుగా అన్పించలేదు.
ఆమె పక్కన కూర్చున్న యువకుడు "నక్క అరుస్తోంది! ఈ బంగళా చుట్టూ పెద్ద ఖాళీస్థలం వుంది. చిన్నపాటి అరణ్యంలా వుంటుంది. రాత్రిళ్ళు నక్కలూ, గుంటనక్కలూ, తోడేళ్ళూ తిరుగుతూ వుంటాయి."  
"ఇంకా ఏముంటాయ్?" సీత చిన్నగా, బిడియపడుతూ అడిగింది.
"పిల్లులు...ఇండియాలో పిల్లలు ఎక్కువగా వుంటాయి. పెద్ద పెద్ద గండుపిల్లులు వుంటాయి. అవి చెట్లు ఎక్కి అరుస్తుంటాయి. ఒకసారి కిటికీలో నుంచి దూకింది. నా భార్య భయంతో చూస్తూ కూర్చుంది. అది అక్కడవున్న పాలన్నీ తాగి నాలుకతో మూతి తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ కిటికీనుంచే..." అదేదో అద్భుతమైన విషయం చెప్పినట్లు చెప్పాడు.
సీత కూడా తానేదో విచిత్రకథ వింటున్నట్టే చెవులు రిక్కించి, కళ్ళు వెడల్పుచేసి విన్నది.
ఆమెకు ఇండియా అంతా పిల్లులతో నిండిపోయినట్టు అనిపించింది.
వైస్ రాయ్ భవనం వదిలి హైదరాబాదు బయలుదేరుతున్నప్పుడు తన బాబాయి ఎంత గొప్పవాడో సీతకు అర్థం అయింది.
వాళ్ళెక్కిన క్యారేజ్ లో ఎదురుగా ఇద్దరు సైనికులు కూర్చున్నారు. ముందూ వెనకా 130 మందితో రక్షణ సిబ్బంది బయలుదేరింది. వాళ్ళనూ, వాళ్ళు వేసుకున్న దుస్తుల్నీ కళ్ళు పెద్దవి చేస్తూ కూర్చుంది.
వైస్ రాయ్ బంగళా, ఆమెకు "అరేబియన్ నైట్స్" లో తాను చదివిన బంగళా వుంది. అలాంటి బంగళాను చూడాలనే ఆమె కోరిక ఈ బంగళా చూశాక తీరినట్టుగా సంతృప్తి కలిగింది.
ఆ వాతావరణంలో ఆమెకు నోరు తెరవాలంటే భయంగా వుంది. మౌనంగా కూర్చుండిపోయింది.
స్టేషన్ చేరారు. ట్రైన్ కు వైస్ రాయ్ ప్రయాణంచేసే కోచ్ తగిలించారు మిష్టర్ హారే కొరకు. సీతకు బాబాయి మీద ఎనలేని గౌరవం ఏర్పడింది. అవునుమరి వైస్ రాయంతటివాడు అంటే ఇండియాకు రాజులాంటివాడు. బ్రిటీష్ రాజుగారి ప్రతినిథి మిష్టర్ హారేను తనతో సమానంగా గౌరవిస్తున్నాడు.
మిగతా రైలు పెట్టెలకూ, దానికీ ఎంతో వ్యత్యాసం వుంది. స్టేషన్ లో ఉన్నవాళ్ళంతా ఆ పెట్టెలో ఎక్కబోయేవాళ్ళకోసం కుతూహలంగా చూస్తున్నారు.
అది గమనించిన మిష్టర్ హారే ముఖం గంభీరంగా పెట్టి హుందాగా గడిచి పెట్టెలోకి ఎక్కాడు. అతని పక్కనే నడుస్తున్న సీత ఒక యువరాణిగా మారిపోయినట్టుగా అన్పించింది.

 Previous Page Next Page