ఇకరాడా? వస్తాడు! తప్పక వస్తాడు.
రాకుండా ఉండడు!
అతను ఏం చేస్తున్నాడో?
ఎలా ఉన్నాడో! తనను గురించి ఆలోచిస్తున్నాడా?
తనను గురించి ఆలోచిస్తూ వుండి వుంటాడు. కాదు! అతను తనను గురించి ఆలోచించడం వల్లనే తనూ అతన్ని గురించి ఆలోచిస్తోంది. అతనికి తన భావాలను మరొకరికి అందజేసే శక్తి వుంది.
అలాగని అతనే చెప్పాడు.
అసలు అతనెవరు?
ఎందుకు ఈ షిప్ లో మారువేషంలో ప్రయాణం చేస్తున్నాడు"
అతనిలో ఏవో అద్భుత శక్తులున్నాయి!
అసలు అతను మనిషేనా... లేక....
సీత వెన్నెముకలోకి ఏదో జరజరా పాకినట్టయింది, భయం వేసింది. చివ్వున లేచి కూర్చుంది.
నోనో! అతను మనిషే! ఏ దెయ్యమో, భూతమో కాదు. అతను తనచేతిని అందుకున్నాడు.ఆ స్పర్శానుభూతి ఇంకా తను అనుభవిస్తూనే వుంది.
నాన్న చెప్పేవాడు - ఇండియాలో ఒక గూఢచారి సంస్థ ఉన్నదని, దాని పేరు దిగ్రేట్ గేమ్ అని కూడా చెప్పాడు. అందులో పనిచేసేవాళ్ళు చాలా సాహసాలు చేస్తారట. ప్రాణాలను సహితం లెక్కచెయ్యరట. వాళ్ళంతా తమదేశాన్ని ఎంతో ప్రేమిస్తారట.
ఆ దేశభక్తి వాళ్ళచేత ఎన్నో సాహసాలు చేయిస్తుందట. ఎందరో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారట.
"వాళ్ళకు శత్రువులు ఎవరు డాడీ?" తను తండ్రిని అడిగింది.
"ప్రస్తుతం రష్యావాళ్ళు వాళ్ళ సైనికులు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ లో మనవాళ్ళ మీద దౌర్జన్యాలు జరుపుతూ వుంటారు." తండ్రి సమాధానం ఇచ్చాడు.
"ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు?"
"ఇండియా మీద అధికారాన్ని సంపాదించాలని. వాళ్ళకు మనమంటే గిట్టదు. ప్రపంచం మీద మనకున్న అధికారాలను చూసి వాళ్ళకు ఈర్ష్య. మన ఆధీనంలో వున్న ఇండియాను వాళ్ళు తమ హస్తగతం చేసుకొనే ప్రయత్నంలో వున్నారు.
ఆమెకు తండ్రి చెప్పిన విషయాలు అర్థంకాలేదు.
"అందుకే వాళ్ళు అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఒక కులాన్ని మరో కులం మీదకు పురికొల్పుతున్నారు. ఒక మతం వాళ్ళను మరో మతం మీదకు ఉసిగొల్పుతున్నారు. అందువల్లనే ఇండియాలో మనం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నాం" తన తండ్రి తనకుతానే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు.
"నువ్వు కూడా ఇండియాలో వున్నప్పుడు 'దిగ్రేట్ గేమ్' లో వున్నారా డాడీ?"
తను కుతూహలంగా అడిగింది.
"లేదు, ఆ సంస్థలో వున్నవాళ్ళంతా చాలా తెలివయినవాళ్ళు. ఎవరెవరు ఆ సంస్థకు సంబంధించినవాళ్ళో కూడా తెలియదు. వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా పకడ్బందీగా వుంటుంది.
"అందులో మనవాళ్ళు కూడా వున్నారా డాడీ?"
"గుడ్ హెవెన్స్! మనవాళ్ళు లేరు. ఇండియన్సు మాత్రమే వుంటారు. రష్యాకు అధికారం వస్తే తమ జీవితాలు ఇంకా అధ్వానం అవుతాయని వారి భయం. రష్యన్స్ అంటే మనం చాలా బెటర్ అని వాళ్ళు గుర్తించారు."
ఆ సంస్థ గురించి పుస్తకాలు వచ్చాయా?"
"తెలియదు."
తన తండ్రికి ఆ రహస్య సంస్థ గురించి ఎక్కువ తెలియదని తనకు అర్థం అయింది.
అతను కూడా ఆ రహస్య సంస్థకు సంబంధించినవాడేమో?
ఆ రహస్య సంస్థ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఆమె అతన్ని చూశాక, అతని మాటలు విన్నాక రెట్టింపయింది.
మిష్టర్ హారే ఆలోచనలు వేరుగా వున్నాయి. ఇండియా చేరగానే సాధారణంగా ఆడంబరంగా స్వాగతం లభిస్తుందో లేదోనని ఆలోచన అతన్ని పట్టుకొన్నది.
షిప్ కలకత్తా చేరబోతున్నది. వైస్ రాయ్ అక్కడే వుంటాడని విన్నది సీత.
ఈస్టిండియా కంపెనీ పేరుతో ఇండియాలో ప్రవేశించిన ఇంగ్లీషువాళ్ళు ఆ దేశం మీద ఆధిపత్యం సంపాదించారు.
ఇండియాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల ఇంగ్లీషువారి గౌరవప్రతిష్టలు పెరిగాయని సీతకు ఆమె తండ్రి చెప్పాడు.
షిప్ కలకత్తా చేరింది.
మిష్టర్ హారేకు వైస్ ఆతిధ్యం లభించింది. హారే కళ్ళల్లో గర్వం తొంగి చూసింది. తన ప్రాముఖ్యాన్ని గుర్తించినందుకు ఆనందంతో ముఖం విప్పారింది.
సీత తన బాబాయి అంత సంతోషంగా వుండటం అంతకు ముందెన్నడూ చూడలేదు.
మిలటరీ అధికారి వాళ్ళను సగౌరవంగా కోచ్ లో తీసుకెళ్ళాడు. సీతకు అదంతా థ్రిల్లింగ్ గా వుంది.
"బాబాయి ఇంత గొప్పవాడా?" అని మనసులో అనేకసార్లు అనుకొన్నది. అంతకుముందు అతనిమీద ఏర్పడ్డ ద్వేషం ఇట్టే కరిగిపోయింది.
హారేనూ, అతనికి శాల్యూట్ చేసిన సైనికాధికారినీ ఏదో అద్భుతమైన సినిమాను చూసినట్టు చూసింది.
కలకత్తా బజార్లు ఇరుగ్గా వున్నాయి. జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇండియన్స్ ధరించిన రకరకాల దుస్తుల్ని చూస్తూ కూర్చుంది సీత కోచ్ లో.