"చాల్లే పెద్దగా అరవకు. గోడలకి చెవులుంటాయి, బడుద్దాయి బుఱ్ఱాని! అంతా నాన్న పోలికే. అమ్మ పోలిక ఏ కోశానా లేదు. ఎలా బాగుపడతావో ఏమో?"
"అబ్బో తల్లీ కొడుకులు ఇంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారే" అంది గౌరి.
"ఏదో ఏడుస్తున్నాం, శనిగ్రహంలాగా దాపురించావ్, వెళ్ళు" చీదరించుకుంది గోవిందమ్మ.
ఆవిడ మాటలు పట్టించుకోకుండా "ఏం బావా! ఏదైనా నాటకంలో వేషం వేస్తున్నావేమిటి? ఈ ఖాకీ బట్టలూ నువ్వూనూ" నవ్వుతూ అంది.
"ఏమిటే ఆ ఎగతాళి? వాడు వీరుడిలా సైన్యంలోకి వెళతానూ అంటుంటే... అది విన్నప్పటినుంచి దిగులుతో ఛస్తుంటే నీకేమే వెళ్ళు" కసిరికొట్టింది గోవిందమ్మ.
గౌరీ పగలబడి నవ్వింది.
"ఏమిటే అలా నవ్వుతావూ? తిన్నది అరగక పిచ్చిపట్టలేదు కదా?"
"పిచ్చి నాకు కాదత్తయ్యా...మీకే పట్టింది. నవ్వాపుకుంటూ చెబుతుంది కోపంగా చూస్తున్న గోవిందమ్మతో. "మరి లేకపోతే ఏమిటత్తయ్యా...బావేమిటి?... యుద్ధమేమిటీ?" మళ్ళీ నవ్వుకుంది.
"ఓసి నీ నోరు పడ. ఎంత మాటన్నావే? వాడు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావుటే? నీ నాలిక చీల్చెయ్య. నా సొమ్ము తింటూ నాకే ద్రోహం చేస్తావుటే?" శాపనార్థాలు పెడుతూ అరుస్తోంది గోవిందమ్మ, కొట్టినంత పనిచేస్తూ.
గోపీ జేబులోంచి మెల్లగా అయిదు రూపాయల కాగితం తీసి ఆవిడ కాళ్ళదగ్గరగా పడేసాడు.
"అమ్మా ఊరుకోమ్మా... దాంతో నీకేమిటి? నువ్వు పద. దాని సంగతి నేచూసుకుంటాలే" అని ఆవిణ్ణి లోపలికి తోస్తూ "గౌరీ! అమ్మతో అలాగేనా మాట్లాడ్డం?" అంటూ గౌరీ దగ్గరికొస్తాడు. గోపీ అటు తిరగ్గానే కాళ్ళ దగ్గర ఎగురుతూన్న నోటు చూసి 'జేబులోంచి పడేసుకున్నాడేమో! పిచ్చి పీనుగ' అనుకుంటూ కళ్ళకద్దుకుని తీసుకుంటుంది గోవిందమ్మ.
"గోవింద గోపాల గోవింద రామ, గోపాలకృష్ణా గోవిందా" అనుకుంటూ వెళ్ళిపోతుంది.
"నా మొహం భక్తి. చదివేది గోవింద నామాలూనూ, చేసేవి వెధవ పన్లూనూ" విసుక్కుంది గౌరి.
"ఏమిటే ఏం కూశావ్! నన్నా వెక్కిరిస్తున్నావ్? దరిద్రురాలా! 'రుద్రాక్షమాలా, నువ్వూ అచ్చు మీరాబాయిలా వుంటావే గోవిందూ' అనేవారాయన" కళ్ళు తుడుచుకుంటుంది.
"పాపం! అందుకే సన్యాసుల్లో కలిసిపోయాడు మానవుడు. బతికుంటే బచ్చలాకు తినొచ్చనీ, ఎక్కడో వుండుంటాడు పాపం, మామయ్య."
"ఏమే, నీకు బతకాలని లేదా? ఏదేదో వాగుతున్నావ్? నాకు సమాధానాలు చెప్పేంతదానివయ్యావూ? ముదనష్టపుదానా? అసలు నిన్నని ఏం లాభం? అతగాడు కట్టుకున్నాడు ఈ పుణ్యం. కనిపారేసి మీ అమ్మ చచ్చింది. పెంచలేక మీ నాన్న ఏడ్చాడు. ఈ పాపిష్టిదాన్ని తెచ్చి నా మొహాన పారేసి చక్కా తప్పుకున్నాడు నా మొగుడు" కసిగా అంది గోవిందమ్మ మెటికలు విరుస్తూ.
"అత్తయ్యా! లక్షసార్లు చెప్పేను. మా అమ్మానాన్నల పేర్లు ఎత్తొద్దని. చాతనయితే నన్నను. కానీ మావాళ్ళనన్నావో భరించను జాగ్రత్త!"
"ఏమే ఏం చేస్తావ్?" విరుచుకుపడింది గోవిందమ్మ.
"అమ్మా...అమ్మా... ఊరుకోవే... దానికి నేను బుద్ధి చెబుతాను" అంటూ మరో అయిదు రూపాయల కాయితం చూడనట్టు కింద పడేశాడు. ఆవిణ్ణి లోపలికి తోస్తూ. 'జాగ్రత్తలేదు మనిషికి' అంటూ ఆ నోటు కూడా వేసుకుని వాళ్ళెక్కడ చూస్తారో అన్నట్లు గబగబా లోపలికెళ్ళిపోయింది. 'గోవింద, గోవింద' అనుకుంటూ.
"ఏయ్! బావా! ఏమిటి వేషం" అంది అతనికేసి చూస్తూ.
"మా అమ్మ మనసు కనుక్కోవడానికి వేసుకున్న మారువేషం."
"కనుక్కున్నావా?"
"ఓ... ఎప్పుడో కనుక్కున్నాను. ఇప్పుడు కన్ ఫర్మ్ చేసుకున్నాను."
"ఒట్టి డబ్బు మనిషి"
"అవును! డబ్బు కోసం కట్టుకున్న మొగుడైనా సరే, కన్నకొడుకైనా సరే లెక్క చెయ్యదు."
"సరేలే ఆ మాట ఒదిలేసెయ్! మరి ఈ వేషం ఎప్పుడు మార్చుకుంటావ్?"
"ఏం? ఇది బాగులేదా?"
"అదికాదు. ఏదైనా సినిమాకెళదామని."
"ఓ...మరయితే పనులన్నీ పూర్తిచేశావా? లేకపోతే అమ్మ మళ్ళీ దండకం మొదలెడుతుంది."
"తెలుసు. అందుకే అన్నీ చేసేశాను. మామయ్యతో చెప్పాను కూడా. అత్తయ్యకి మాత్రం కడుపునొప్పిగా వుంది డాక్టరు దగ్గరికెళతానని చెప్పాలి."
"సరేలే! ఇది పాత కథేగా? పద, తయారవ్వు"
"ఓ...కే! అయిదు నిమిషాలు!!
అజయ్ వెళ్ళిన దగ్గరనుంచీ మాధవి మనసు మనసులో లేదు. ఏవో ఆలోచనలు ఈగల్లా మసురుతున్నాయి. రకరకాల భయాలు మనసును కృంగదీస్తున్నాయి. అజయ్ పక్కనుంటే 'భయం, సంఘం, భవిష్యత్తు' ఇటువంటివేమీ జ్ఞాపకం రాలేదు సరికదా, అత్జమో గుండెల మీద తల ఆనించి పడుకుంటే ప్రపంచం అంతా జయించినంత సంతోషం కలిగేది. అజయ్ దగ్గరనుంచి ఉత్తరం రాకపోతే? ఒకవేళ అజయ్ తిరిగి రాకపోతే మనసు విలవిల్లాడిపోయేది ఈ ఆలోచన రాగానే. గుండెనిండా చీకటి, దిగులు నిండిపోయేది. నిరాశా, నిస్పృహ పాతాళానికి త్రొక్కేసేవి. బాధ భరించలేక బోరుమని ఏడ్చేసి, హృదయ భారాన్ని తగ్గించుకునేది.