నిండుగుండెలపై వ్రాలి నిర్వికల్ప
పారవశ్యమ్ముతో నిట్లు పలుకుచున్న
హృదయరాజ్ఞిని కౌఁగిట నదిమిపట్టి
పలికె నీరీతి శాక్యభూపాలసూతి.
"ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర
మిరుసు లేకుండనే తిరుగుచుండు;
ఏ ప్రేమమహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలిచియుండు;
ఏ ప్రేమమహిమచే పృథివిపై పడకుండ
కడలిరాయఁడు కాళ్ళు ముడుచుకొనును;
ఏ ప్రేమమహిమచే నీరేడు భువనాల
గాలిదేవుడు సురటీలు విసరు;
ఆ మహాప్రేమ శాశ్వతమైన ప్రేమ
అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ
నిండియున్నది బ్రహ్మాండభాండ మెల్ల
ప్రియసఖీ! సృష్టియంతయు ప్రేమమయము."
ఉద్విగ్న సిద్దార్ధము
"చిక్కని సౌరభమ్ము విరజిమ్ముచు చూపర కన్నుపండువై
చక్కని రంగుతో మధురసంబుల చిందు ప్రసూనబాలలం
దక్కట కొన్ని పూలు దరహాసము గోల్పడి వాడి వత్తలై
చిక్కి కృశించిపోయినవి చిత్రము చూచితివా తలోదరీ!
ఏమని చెప్పమందువు సభీ! ఎటు విందువు? దేవదైత్య సం
గ్రామము సాగుచున్నది నిరంతర మీ హృదయాంతరమ్ములో;
భూమియు నింగియున్ కల్సిపోవుచునుండెను; విశ్వమానవ
ప్రేమసముద్రమందు వినిపించె తరంగా మృదంగ ఘోషణల్.
ఏనుఁగు నెక్కి నిక్కు వసుధేశ్వరుఁడైన శ్మశానవాటిలో
పీనుఁగు కాక తప్పదు విభీత మృగేక్షణ! యే క్షణాననో;
తా నవుగాము లారయక, దానవుఁడై శఠుఁడై కృతఘ్నుఁడై
మానవుఁ డుగ్రకృత్యముల మానఁడు జేనెడు పొట్టకోసమై.
తలపయి మండు టెండలను దాలిచి చల్లని నీడ లిచ్చు పాం
ధులకు; కఠోరమౌ శిలలతో పడమోదిన పూలు కాయలున్
ఫలము లొసంగు; ప్రాణములు బాసియు కాయము కోసియిచ్చు; నీ
యిల నరజాతికిన్ తరువులే గురువుల్ పరమార్ధబోధనన్.
ఫలము లిచ్చెడి పాదపప్రతతి గనియు
పాలు గురిసెడి గోసమూహాల గనియు
కరిగి వర్షించు నీలమేఘాల గనియు
కనికరము నేర్చుకొనని ముష్కరుఁడు నరుఁడు.
దేవి! నీ వాక్కు లందున ఈ విశాల
విశ్వ కల్యాణవాణిని వింటి నేను;
నిజమయిన ప్రేమపాఠాలు నేర్చుకొంటి;
కలువకంటి! జీవితములో విలువ గంటి. ఇద్దరి నద్దరిన్ దొరయు ఈ మన యిద్దరి ప్రేమవార్నిధిన్
ముద్ధియు! ఈ సుధాంశుఁడు సముద్భవ మయ్యె కళా ప్రపూర్ణుఁడై;
ముద్దులతండ్రి రాహులుని మోముపయిన్ జెరలాడుచున్న క్రొ
న్నిద్దపు నీలిముంగురులు నీ హృదయేశుని కాలి సంకెలల్!
నీనా ప్రేమఫలమ్మగు
వీని స్మితాస్య మ్మొకింత వీక్షింపు చెలీ!
ఈ నా వివశత్వ, ముదా
సీనత్వము గాంచి పరిహసించుచునుండెన్.
కన్నులలోన కన్నులిడి కౌతుక మొల్కఁగ నట్లు చూడకే
యన్నుల మిన్న! యేవొ జననాంతర సౌహృదముల్ ప్రబుద్ధమౌ
చున్నవి గుండెలో; పలుకుచున్నవి స్వాగతముల్; ప్రణయమౌ
చున్నవి వెఱ్ఱియూహ లెటులో చన; బాలకురంగలోచనా!"
రాకుమారుని నగరావలోకమున
కనుమతించె శుద్దోదన జనవిభుండు;
గౌతముఁడు రమ్యదృశ్యముల్ గాంచుచుండ
రథము నడపె చెన్నుఁడు రాజపథముగుండ.
ఆకస మ్మంటు సౌధమ్ము లందమైన
మందిరమ్ములు కందోయివిందు సేయ
రథము ముందుకు సాగె; సారథిని గాంచి
"స్యందనం బాపు" మనె రాజనందనుండు.
"నడుము వంగెను;ముడతలు పడె మొగమ్ము;
నడక తడబడె; గుంటలు పడెను కనులు;
గడగడ మటంచు వడకుచు కఱ్ఱ పట్టి
వచ్చుచున్నాఁడు చెన్న! ఈ వ్యక్తి చూడు."
"ఈ యయ్య ముసలివాఁడై
పోయెను; యౌవనము గడచిపోయెను; జను లి
ట్లే యగుదురు; సహజ మ్మిది
మాయాదేవీ కుమార! మనుజుల కెల్లన్."
"చితచితలాడు పుండ్లపయి చీమలు దోమలు గ్రమ్మ, దగ్గుతో
సతమత మౌచు, చేతు లరసాచుచు, గుండెలు బాదుకొంచు, పెన్
వెతలు భరింపలేక పలవించుచు కేకలు పెట్టుచున్నవాఁ
డితఁ డెవడోయి చెన్న! వచియింపుము వీని చరిత్ర మెట్టిదో!"
"ఇది యొక వ్యాధి; కృపామయ
హృదయా! వ్యాధు లివి పెక్కురీతులు; రుజ య
న్నది ఎంతవారికిని త
ప్పదు మూర్ఖుండైన పెద్ద పండితుఁడైనన్."
"చూడుము, కాళ్ళు చాచుకొని చోద్యముగా పడియున్నవాఁడు; మా
టాడఁ; డొకింతయేని కదలాడఁడు; త్రాళ్ళ బిగించి కట్టి; రె
వ్వాఁడొ యితండు? మోసికొని వత్తురు నల్వురు; పల్వురెందుకో
యేడుచుచున్నవారు; వివరింపుము వీని విశేషమెట్టిదో!"
"ప్రాణము పోయిన నరుని శ్మ
శానమునకు మోసికొనుచు చనెదరు; మృతుఁడౌ
వానిని శవ మని యందురు;
మానవ సహజమ్ము సుమ్ము మరణమ్ము ప్రభూ!"
శోచనీయ దృశ్యా లివి చూచినంత
రథము వెనుత్రిప్పు మన్నాఁడు రాజసుతుఁడు;
రాచనగరికి పోవు మార్గమ్ము నందు
కానవచ్చెను పురుష పుంగవుఁ డొకండు.
"బ్రహ్మతేజ మొలుకు ఫాలభాగమ్ముతో,
కాంతు లీనుచున్న కనులతోడ,
కఱ్ఱ బట్టి కావి గట్టి కోవెలవైపు
అన్న! చెన్న! పోవుచున్న దెవరు?"
"భోగభాగ్యాలు విడిచి విరాగి యగుచు
చింత రవ్వంత లేక ఏకాంతమందు
ద్యాన మొనరించు విశ్వకల్యాణ భావ
యోజకుం డాతఁ డొక పరివ్రాజకుండు."
ఏమి భావించెనో చెప్పలేము గాని
సాదరోత్ఫుల్ల లోచనాబ్జముల తోడ
రాజనందనుఁ డా యోగిరాజుఁ గాంచె;
రథము మెలమెల్ల రాణ్మందిరమ్ము సేరె.
"తనయ! కనుగొంటివా! రాజధానిలోని
శ్రీలు పొంగు అశేషవిశేషములను;
సంతసము కల్గెనా?" యంచు జనకుఁ డడుగ
"అంతయును గనుగొంటి నేఁ" డనియె సుతుఁడు.