Previous Page Next Page 
రాగోదయం పేజి 15


    నవ్వేడు జానయ్య. "వాళ్ళకు యీ పెద్దమనిషి ఆనడు పెద్ద మనుషులంటే మున్సబు, సర్పంచ్, కరణం నాయుడు లాంటి వాళ్ళు అంతే! చౌదరికి చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళే!"
    "మనం రాజీకి పోవటంలా?"
    "వ్యవహారానికి తెగకపోతే పోట్లాడటానికి"
    "పోట్లాడ్తావా? ఏం ఆ చదువరి తల నరుకుతావా?"
    విచిత్రంగా చూశాడు సోము ఆ మాటలకి "నాయనా! నువ్వు అనుకున్నంత జరగదు. అదే జరిగితే యీ వూరు బాగుపడుతుంది అట్లా అంతా తిరగ బడితే దేశమే బాగుపడుతుంది. కానీ అది జరగదులే" అన్నాడు.
    "ఓరే సోమన్నా! కొరివితో తల ఎందుకు గోక్కోవాలిరా? అది మన కర్మ అనుకుందాం, అప్పు తీర్చుకుందాం."
    "ఎట్లా తీర్చుకుందాం, నువ్వే చెప్పు?" నిలేశాడు సోము.
    జానయ్య సమాధానం యివ్వలేదు. తండ్రి సమాధానం యివ్వలేడని అతనికీ తెలుసు. అందుకే అన్నాడు మళ్ళీ "మనం ఒక అప్పు తీర్చటానికి మరో అప్పు చేయాలి అంతే! అంతకు మించి గతి లేదు. మనకు అప్పెవరిస్తారు యిచ్చి నా వాడూ యిదే తంతు కాబట్టి రెండే మార్గాలు ఎగెయ్యాలి, లేదా న్యాయంగా తీర్చాలి. వూరికే నీలాగా పండిన పంట అంతా వాడి ముఖాన కొడుతూ వుంటే వాడు బాండు ఎత్తి రాయిస్తావుంటే మనం యింతే యిట్టాగే బ్రతకాల!"
    "మరి నువ్వేం చేస్తావో చెప్పు?"
    "ముందు జయన్నను రానీ!"
    "అయితే పిల్చక రాపో" అంది చంద్రమ్మ.
    తండ్రివైపు ఓసారి చూసి కదిలాడు సోము.
    కొడుకు అటు వెళ్ళగానే "అయితే వెనుక నీ చెయ్యి ఉందన్న మాట! వాడిని రెచ్చగొట్టింది నువ్వేనా" అని అడిగాడు.
    ముక్కు చిట్లించింది చంద్రమ్మ "నాకేం పని అంది.
    జానయ్యకి మనసు మనసులో లేదు.
    మరో అయిదు నిమిషాలకి వచ్చారిద్దరూ.
    వెంటనే వ్యవహారంలోకి దిగాడు జయన్న "పెద నాయనా! ఇప్పుడే వెళదామా?" అని అడిగాడు.
    "వెళ్ళి ఏం చేయాల?"
    "అడుగుదాం" అప్పెంత అయిందో లెక్క కట్టమందాం" మీ కూలీలు అన్ని జమ వేసుకోమందాం?"
    "ఊహూ లాభం లేదు అప్పున్నందుకు మనం వూరికే చేయాల!"
    "వెట్టి చాకిరా?" ఆశ్చర్యంగా అడిగాడు జయన్న.
    "నువ్వేమయినా అదంతే!" మొండిగా అన్నాడు జానయ్య.
    "పనికి రామంటే?"
    రచ్చబండ దగ్గరికి పిలిపిస్తారు. స్థంభానికి కట్టేసి చింత బరికెతో బాత్తారు మనం చావు దెబ్బలు తినాలి. మళ్ళీ పన్లోకి పోవాలి. అంతే! అంతకు మించి లాభం వుండదు. నిరాశగా అన్నాడు.
    "మనం తిరగ బడదాం!" ఆవేశంగా అన్నాడు సోము.
    అంటే నువ్వూ తంతావా?" సూటిగా ప్రశ్నించాడు.
    "ఆఁ" దృఢంగా జవాబిచ్చాడు.
    నివ్వెర పోయాడు జానయ్య. తరతరాలుగా పెద్దరికానికీ, బానిసత్వానికీ అలవాటు పడిన రక్తం తహతహలాడి పోయింది "ఒరే" అన్నాడు యింకేమీ అన్లేక.
    చంద్రమ్మ కొడుకు వైపు ప్రశంసా పూర్వకంగా చూసింది.
    "అది లాభం లేదులే! పోలీసు రిపోర్టు యిద్దాం!" అన్నాడు జయన్న.
    "ఏం లాభం? వాళ్ళు వస్తారు. వీళ్ళ యిండ్లల్లో కడుపు నిండా విందు చేసుకుంటారు. మనల్ని పిలిపిస్తారు. తిడతారు, కొడతారు. తర్వాత మనతో వేలిముద్ర వేయించుకొని వెళతారు. ఏం రాసుకుంటారో ఏమో! ఎవరికీ తెలియదు." ఎప్పుడూ జరిగేదింతే అన్నట్టు జవాబిచ్చాడు జానయ్య.
    "అందుకే జయన్న ఉన్నాడు అన్నీ చూస్తాడు".

 Previous Page Next Page