Previous Page Next Page 
రాగోదయం పేజి 14


    చౌదరి పలకలేదు. పేక ముక్కలో సీరియస్ గా లీనమైపోయాడు.
    శేఖర్ రెట్టించలేదు. అతని మనసు నిండా భార్గవి.
    
                                *    *    *    
    
    మూడోనాటికి వచ్చాడు జానయ్య. అయితే అతనొచ్చే దాకా వ్యవహారం ఆగలేదు. ఆ రోజు సాయంకాలం అల్లరి జరిగిన తర్వాత మరురోజు వుదయమే సోముకోసం మనిషి వచ్చేడు.
    చౌదరి రాజకీయం తెలిసిపోయింది చంద్రమ్మకి అందుకే కొడుకుని లోపలికి తీసికెళ్ళి చెప్పింది.
    "ఒరే! వాడు కర్కోటపు ముండాకొడుకు. మీ నాయన వచ్చేదాకా పేచీవద్దు. మీ నాయన ఏం పనిమీద ఎల్లినాడో రానీ! తర్వాత చూసుకుందాం!"
    సోము అగ్ని పర్వతంలా మండిపడుతున్నాడు ఆశక్తత, నిస్సహాయత అతన్ని కుంగదీశాయి. తలూపి విధిలేక కాడి గట్టుకుని వెళ్ళేడు.
    పొలంలో సోముని చూసిన చౌదరి విషంగా నవ్వేడు గర్వంగా విజయ సూచకంగా చూశాడు.
    సోము అసహ్యించుకుని తల తిప్పుకున్నాడు.
    ఎలాగో ఆ రోజు గడిచిపోయింది.
    తండ్రి రాగానే నిలేశాడు సోము.
    "నువ్వు వెళ్ళి లెక్కా డొక్కా చూసుకో. మనం ఎంత బాకీ వున్నామో తేల్చు. అప్పు క్రింద ఈ కూలీని జమ వేసుకోమను. లేదా పైరు వచ్చినాక చెల్లు పెడదాం అదీ యిదీ కాదంటే యింకవరికన్నా "పనికిపోయి వాని అప్పు తీరుద్దాం!" అన్నాడు.
    జానయ్య నోరు విప్పలేదు. కొడుకు వేపు నిరాశగా చూశాడు. అతని కళ్ళనిండా నిస్పృహ.
    "మనం బతికినన్నాళ్ళూ చేసినా వాని అప్పుతీరదు. ఇట్టాగే మనల్ని పీల్చి పిప్పి చేస్తాడు. మన రక్తం తాగుతాడు. ఎన్నాళ్ళని యీ బానిస బతుకు? ఏనాడయినా తిరగబడాల్సిందే. అదేదో యిప్పుడే కానీ!"
    "నిన్న నువ్వే తిరగబడకూడదూ?" బలహీనంగా అన్నాడు జానయ్య.
    సోము ముఖం ఎర్రబడింది. "మొన్న అదే జరిగింది. మల్లా సిగ్గులేక నిన్న మనిషిని పంపినాడు. అమ్మ వెళ్ళమని బలవంతం చేస్తే ఈ రోజు పనికిపోయినా రేపు సస్తే వెళ్ళను" అన్నాడు దృఢంగా.
    "సస్తే ఎవరూ వెళ్ళరు!"
    "ఏందా సావు బతుకులు? ఆ ఎదవ కోసం ఇంత రాద్దాంతమా?" కల్పించుకుంది చంద్రమ్మ.
    "ఎదవలు వాళ్ళు కాదే! మనం ఎదవలమి అప్పు చేసి న్నాడే ఎదవలమై పోయాం. అప్పు తీరేదాకా ఎదవలమే." బాధగా అన్నాడు.
    తండ్రి కసి అర్ధమైంది సోముకి. జాలిగా చూశాడు అతని వైపు ఆ జాలి భరించలేక పోయాడు జానయ్య.
    "మన పేదతనమే పాడుది. మన పుట్టుకలే హీనం. ఇంక మన బ్రతుకుల గురించి చెప్పాల్నా? ఎదవ బతుకులు బతుకుతున్నాం. గొంగళిలో తింటూ ఎంట్రుకలు లెక్క పెట్టటం ఎందుకు? యిట్లాగే బ్రతుకు యీడుస్తాం."
    సోము లేచి నుంచున్నాడు. "నాయనా నాకు నీఅంత ఓర్పు లేదు వాళ్ళ వెకిలి చూపులు, వెధవ చేష్టలు బూతులు నే భరించలేను. మనకేం కర్మ? అప్పు చేయటం పాపం, నేరం అయితే అది మన వ్యవస్థ తప్పు పేదరికం తప్పు కాదు. పాపం అంత కంటే కాదు. మరి మనం యీ బ్రతుకులు యిలా యీడ్చవలసిన పని లేదు.
    "ఏం చేస్తావ్?"
    "జయన్నని పిలుచుకు వస్తా?"
    "వాడేం చేస్తాడు?"
    "పత్రం తీసుకుని లెక్క వేస్తాడు, అప్పు తేలుస్తాడు"
    "నీకు రాదా ఆ మాత్రం చదువు?"
    "రాకేం వచ్చు. అయినా పెద్దమనిషి వుండాల మద్దెన"

 Previous Page Next Page