"నేను అందర్నీ రాత్రిపూట చదువుకోమని పిలిచేది యిందుకే మనకే చదువు వచ్చి వుంటే యింత గొడవరాదు ఎప్పుడూ?" జానయ్య మాటాళ్ళేదు. సోము మాట విన్లేదు.
లేచాడు సోము.
"ఏం?"
"పోదాం పద!"
భార్యవైపు చూశాడు జానయ్య.
ఆమె కళ్ళల్లో మెరుపు! అది ప్రోత్సహిస్తూ వుంది.
విధిలేక లేచాడు జానయ్య.
ఉత్సాహంతో కదిలారు ఇద్దరూ జానయ్య అనుసరించాడు.
6
మొండివాడు రాజు కన్నా బలవంతుడు.
మరి రాజో, రాజస్థానీయుడో, అలాటి వుద్యోగో, వాళ్ళ అండ దండలున్నవాడో మొండి వాడయితే? అప్పుడు వాడి బలం మరీ యినుమడిస్తుంది.
చదువరి అలాటి వాడే!
ఎప్పుడయితే జానయ్య యింట్లో తిరుగుబాటనే ముసలం పుట్టిందో అది అందర్నీ నశింప చేస్తుందని తెల్సుకున్నాడు అతను దానికీ విరుగుడు ఒక్కటే? దాన్ని వ్యాపింపకుండా చేయటం లేదా నిర్లక్ష్యం వహించటం.
అందుకే జానయ్య జయన్న సోమూ రాగానే అతను బిగుసుకుపోలేదు. చిరునవ్వుతో ఆహ్వానించాడు.
ఆ చిరునవ్వులు వెనక వుండే తతంగం తెలుసుకున్న జానయ్య గుండె బేజారైపోయింది. ఏదో ఎత్తువేశాడు అనుకున్నాడు?
సోము మాత్రం అవేవీ ఆలోచించలేదు.
జయన్న నేరుగా వ్యవహారంలోకి దిగాడు.
దానికి సమాధానంగా తీరుస్తావా అని అడిగాడు చౌదరి మామూలుగా.
"వివరం తెలుసుకుని ఆలోచిద్దామని వచ్చామని ఎంత అప్పు? ఎప్పుడు తీసుకున్నారు? వడ్డీ రేటెంత?" అని వివరాలు అడిగేడు జయన్న.
చౌదరికి చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకున్నాడు. శాంతంగా సౌమ్యంగా వివరాలు చెప్పేడు ఆరు నెలల నాడు బాండు రాశాడు. వెయ్యిరూపాయలు అసలు, వడ్డీ దేమిటి? ఎప్పుడెలా యిస్తే అలా తీసుకుంటాను."
"మొదట అప్పు తీసుకున్న దెంత? వడ్డీ ఎంత! చెల్లెంత, ఎప్పుడెప్పుడు చెల్లువేశారు?" వివరాలడిగేడు మళ్ళీ.
జయన్న ప్రశ్నకి "అవన్నీ ఎందుకు? లెక్కలు ఎక్కడుంటాయ్? బాండు ఎప్పటి కప్పుడు చింపేస్తాను. కొత్తది రాస్తున్నాం కదాని!" అన్నాడు చౌదరి.
ఇలా కాలికేస్తే వేలికే, వేలికేస్తే కాలికి తిప్పి తిప్పి సమాధానాలు చెప్పేడు. ఆఖరికి "నా డబ్బు మాటేం చేశారు అని అడిగేడు.
"తీరుస్తాం?"
"ఎప్పుడు?"
"ఉన్నప్పుడు?"
"అది సమాధానం కాదు ప్రొనోటులో ఏం రాశాడో మీ నాన్న నడుగు. అడిగిన తక్షణం చెల్లించగలవాడను అని రాశాడు."
"అది అన్ని ప్రోనోట్లలోనూ రాస్తారు. అది మామూలు మాట!"
"సరే! అప్పు తీరేదాకా మీరు మాకు పనిలో రావాలి పశువులు - మనుషులు-"
"ఆ మాట కడ్డొస్తూ! ఉహూ!" అన్నాడు.
"అలా అంటే ఎలా?"
"మాకు కుదర్దు మేం బ్రతకాలి!"
"మేం చెడిపోవాలా!"
"మీకే మవుతుంది? అప్పు తీరుస్తాం కదా!"
"తీరుస్తావ్ తీరుస్తావ్? అసలూ వడ్డీ తీసుకుని తృప్తి పడ్డానికి యిదేం బ్యాంకా? మేం అప్పిచ్చేది సానుభూతితో దయతో....మా అవసరానికి పనికొస్తారనే ఆశతో, అంతే కాని డబ్బు ఎక్కువై మీకు అప్పు యివ్వలేదు."