Previous Page Next Page 
మరీచిక పేజి 15


    "వీడిమొహం! అనుకొంది జ్యోతి.

 

    "అవును! మనదేశంలో మొదటి హిప్పీ యెవరో తెలుసా?"

 

    "ఎవరు?"

 

    "బుద్ధుడు!"

 

    "బుద్ధుడు హిప్పీ ఏమిటి? అర్థం లేని మాటలు!"

 

    "అవును! బుద్ధుడు హిప్పీ! రాజ్యాన్ని త్యజించాడు. రాజభోగాలనూ, రంభలాంటి భార్యనూ కాలదన్ని కాననం చేరుకున్నాడు. భిక్షాటనం చేసి జీవించాడు."

 

    "సిద్ధార్థుడు ఇంకా చాలా చేశాడు!" అన్నది జ్యోతి.

 

    "సిద్ధార్థుడా? వాడెవడు?" ఆశ్చర్యంగా అడిగాడు జాన్.

 

    జ్యోతికి నవ్వొచ్చింది. 'మిడిమిడి జ్ఞానం!" అనుకొంది మనసులోనే. "అది పోనీయ్! ఈ సమాజాన్ని మార్చాలని లేదా?'

 

    "వుంది కాని అది సాధ్యం అయ్యేది కాదు."

 

    "ఏం? ఎందుకు కాదూ?"

 

    "కుళ్లిపోయిన వస్తువును మళ్లీ మంచి వస్తువుగా మార్చగలమా? అందుకే మేము కొత్త సమాజాన్ని ఏర్పరచుకున్నాం."

 

    "ఏం సాధించాలని?"

 

    "సుఖశాంతులతో నిండిన స్వేచ్చా జీవితం..."

 

    "ఈ జీవితంలో మీకు సుఖశాంతులు లభిస్తున్నాయా?"

 

    శబరి కుతూహలంగా వింటూ నిల్చుంది.

 

    "ఆ! శరీరాన్ని నిద్రపుచ్చి, మనసును మేల్కొల్పాలి. అందులో వున్న శాంతి ఏమిటో అందరికీ బోధించాలి."

 

    జ్యోతి జాన్ ముఖంలోకి తీవ్రంగా చూసింది.

 

    "ప్రపంచం అంతా ప్రేమమయం కావాలి. యెలాంటి బంధాలూ వుండకూడదు. మనిషి స్వేచ్చలు అరికట్టే కృత్రిమ శాసనాలు వుండకూడదు. నాదబ్రహ్మలా ఝంకారం చేస్తూ పువ్వునుంచి పువ్వుకు వెళ్ళే భ్రమరం మాదిరిగా మనిషి మైమరిచి జీవించాలి. వినీలాకాశం కింద స్వేచ్చగా ఎగిరే పక్షిలా, బంధనరహితుడై చరించాలి!"

 

    "తెలివైనవాడే!" అనుకుంది జ్యోతి.

 

    శబరి జాన్ ముఖంలోకి ప్రశంసా పూర్వకంగా చూసింది.

 

    "నో! నో! మనిషి పశువులా, పక్షిలా, పురుగులా బతకడంకాదు సాధించాల్సింది. మనిషి మనిషిగా బతకడం కావాలి. ప్రతి మనిషికీ మనిషిగా జీవించే అవకాశాన్ని అందించే వ్యవస్థను నిర్మించాలి. ప్రస్తుత వ్యవస్థలో ఇది సాధ్యంకాదు. అందుకే ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలి. పునాదుల్తో కూల్చాలి!" జ్యోతి ఆవేశంగా అన్నది.

 

    జాన్ ఆశ్చర్యంగా జ్యోతి ముఖంలోకి చూస్తూ "వ్యవస్థను మార్చడమా - లాభం లేదు - అది మారదు. అందుకని దాన్ని మేమే వదిలేశాం! అది మారదు... నువ్వు కూడా దాన్ని వదిలేసి మాలోకి వచ్చేయ్!"

 

    "ఎందుకు మారదూ?"    

 

    "ఎలా? ఏం చెయ్యాలి?"

 

    "విప్లవం ద్వారా."

 

    "విప్లవమా? జాన్ మధ్యలోనే అందుకున్నాడు.

 

    "అవును!"

 

    "అంటే రక్తపాతం కావాలంటావా?"

 

    "అవసరం అయితే..."

 

    "నో! నో! నో బ్లెడ్ షెడ్!" దాదాపు అరిచినట్లే అన్నాడు.

 

    శబరి బెదురుగా జ్యోతి ముఖంలోకి చూసింది.

 

    "ప్రతి జీవి విస్తరణలోనూ, పురోగతిలోనూ రక్తపాతం వుంది. ప్రతి జీవి పుట్టుకలో హింస వుంది. రక్తపాతం వుంది. తల్లి ఎంతో వేదనకు గురి అయి ఒక కొత్త జీవికి ప్రాణం పోస్తుంది. అలాగే నూతన వ్యవస్థ పుట్టుక కూడా...!"

 

    "నో! నో! నో వార్! మేక్ లవ్! పీస్! లవ్!" జాన్ దాదాపు అరిచినట్టే అన్నాడు.

 

    లవ్! పీస్! నువ్వు పదే పదే ఈ పదాలను వల్లిస్తేనే 'లవ్వూ పీసూ' లభిస్తాయా?! చిరాకుగా అన్నది జ్యోతి.

 

    "లభిస్తాయి! మేం వాటిని సాధించాం. కావాలంటే మానవులందరికీ వాటిని అందించవచ్చును. మా మిషన్ లక్ష్యం కూడా అదే!"

 

    "అంటే నీ వుద్దేశం అందరూ డ్రగ్స్ మింగాలనా?"

 

    "అవును! అందరూ డ్రగ్స్ తీసుకోవాలి. శరీరాన్ని నిద్రపుచ్చి మనసును విడిపించాలి. ప్రేమలోని మాధుర్యాన్ని జుర్రుకోవాలి. స్వర్గం డ్రగ్స్ లోనే వుంది. ఇంకెక్కడో లేదు. ఫ్లవర్ పవర్! నాట్ గన్ పవర్! పూలశక్తిలో శాంతి వుంది. తుపాకి గొట్టంలో శాంతి లేదు. నో బ్లడ్ షెడ్! నో వార్!" ఓ క్షణం ఆగి జాన్ శబరి ముఖంలోకి చూశాడు. శబరి కళ్ళు మిలమిలా మెరిసిపోతున్నాయి.

 

    "చూడు ఆ బాల కళ్ళలోని కాంతిని చూడు! ఆ కాంతి నీ కళ్ళలో లేదు. నీ కళ్ళలో అగ్ని వుంది, హింస వుంది, హత్య - మనిషిని చంపడం... వ్యక్తిని హతమార్చడం - నో! నో!"

 

    "హూ! హింస! ఏది హింస? కండలు కరిగించి, రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కొక్క రక్తపు బొట్టును వెచ్చించి అసంఖ్యాకులు తయారు చేసిన ఉత్పత్తినీ, సంపదనూ, కొద్దిమంది, చాలా కొద్దిమంది మాత్రమే అనుభవిస్తూ కండలు పెంచుకోవడం హింసకాదూ?" జ్యోతి ఉద్రేకంతో వూగిపోయింది.

 

    "అయినా వ్యక్తి హింస, ఒక మనిషి మరో మనిషిని చంపడం..." అగ్నిగోళంలా మండిపోతున్న జ్యోతి ముఖాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆగిపోయాడు జాన్.

 

    "హింసా? వ్యక్తి హింసా? మనిషిని మనిషి చంపడమా? ఎవరా వ్యక్తి? ఎవరా మనిషి? అతను వ్యక్తి కాడు. ఈ వ్యవస్థకు ప్రతినిధి. వర్గ శత్రువు. ఈ దోపిడీ వ్యవస్థకు సింబల్. కాదు - కాదు...అతనే ఈ వ్యవస్థ, ఈ వ్యవస్థే అతను! ఈ వ్యవస్థ మారాలని నువ్వూ అంటున్నావుగా?"

 

    శబరి జాన్ ముఖంలోకి కుతూహలంగా చూసింది.

 

    "నో! నో! అంత కౄరంగా మాట్లాడకు! మేక్ లవ్! నువ్వు పువ్వు లాంటి సుకుమారివి. నువ్వూ మా ధర్మంలో చేరిపో! హావ్ ట్రిప్! మేక్ లవ్!"

 

    వీళ్ళతో మాట్లాడి లాభం లేదు అనుకున్నది జ్యోతి.

 

    "శబరి విన్నావుగా మా సంభాషణ!" అడిగింది జ్యోతి.

 

    శబరి తల ఆడించింది.

 

    "నీ ముందు రెండు మార్గాలున్నాయి. ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో బాగా ఆలోచించి మరీ అడుగు ముందుకు వెయ్! తొందరపడి అడుగుముందుకు వెయ్యకు." జ్యోతి ఆగి శబరి ముఖంలోకి చూసింది. శబరి ఏమిటా మార్గాలు అని అడగలేదు. చూస్తూ వుండిపోయింది.

 

    "ఆ మార్గాలు ఏమిటని కూడా అడగవేం?"

 

    "చెప్పు!" జాన్ ముఖంలోకి చూస్తూ అన్నది.

 

    "ఒకటి... సుఖాన్నీ, ఆనందాన్నీ - అందరికోసం కాదు... నీ కోసం మాత్రమే అన్వేషిస్తూ, కాళ్ళకు చెప్పులు లేకుండా, వంటినిండా బట్టలు లేకుండా, తల విరబోసుకుని, మురికి బట్టలు కట్టుకుని, డ్రగ్స్ మింగుతూ, పార్కుల్లో, సముద్ర తీరాల్లో, కొండలోయల్లో విచ్చలవిడిగా తిరుగుతావా?"

 

    "అందులోవున్న ఆనందం నీకేం తెలుసు?" మధ్యలోనే అందుకొని అన్నాడు జాన్.

 

    "నువ్వు మాట్లాడకు!" మందలించింది జ్యోతి.

 

    జాన్ బిక్కచచ్చిపోయి నిల్చున్నాడు. శబరికి జ్యోతి మీద కోపం వచ్చింది. జాన్ కేసి జాలిగా చూసింది.

 

    "రెండో మార్గం... అందరి సుఖం కోసం నీ సుఖాన్ని లెక్క చేయకుండా, ఈ దోపిడీ వ్యవస్థను మార్చడానికి జరుగుతున్న ప్రయత్నంలో పాలుపంచుకోవడానికి నాతో వస్తావా?"

 

    శబరి జ్యోతి ముఖంలోకి అయోమయంగా చూసింది.

 

    "మనిషిగా పుట్టిన నీకు మంచిగా బతకాలని లేదూ?"

 

    శబరి వెర్రి చూపులు చూడసాగింది.

 

    "ఏం? మేము మంచిగా బతకడం లేదూ? ఆనందంగా, హాయిగా, స్వార్థమనేది లేకుండా, మరికొన్ని బాధించకుండా బతుకుతున్నాం!" మేరీ అక్కడికి ఎప్పుడు వచ్చిందో, వారి సంభాషణ ఎంత సేపటినుంచి వింటున్నదో ఎవరూ గమనించలేదు.

 

    "నీకు తెలుగు వచ్చా?" జ్యోతి ఇంగ్లీషులోనే అడిగింది.

 Previous Page Next Page