Previous Page Next Page 
మరీచిక పేజి 16


    "అర్థం చేసుకోగలను!"

 

    "నీ పేరు మేరీ గదూ?"

 

    "అవును"

 

    "ఏ దేశం నుంచి వచ్చావ్?"

 

    "న్యూజెర్సీ! యు.యస్.ఏ."

 

    "ఇంతదూరం ఈ బతుకును వెతుక్కుంటూ వచ్చావా?"

 

    "అవును! మా గురువుతో వచ్చాను."

 

    "గురువా! ఇది మా దేశపు మాటగదూ?"

 

    "అదుగో! మీ వెధవ మెంటాలిటీ పోనిచ్చారు గాదు. మాటల్ని కూడా జాతీయం చేసుకుంటారు" మేరీ నవ్వింది.

 

    జ్యోతి మేరీ ముఖంలోకి చూసింది. మేరీ కళ్లలో మత్తు, ఆనందం, ముఖంలో సంతృప్తి కన్పించాయి. వీళ్ళు నిజంగా సుఖంగా వున్నారా?

 

    "హిప్పీస్ కు మీ దేశం చాలా అనుకూలమయిన దేశం! వండర్ ఫుల్ కంట్రీ!"

 

    జ్యోతి ఆశ్చర్యంగా చూసింది మేరీ ముఖంలోకి.

 

    "నిజంగానా!" ఉత్సాహంగా అడిగింది శబరి.

 

    "అవును! ఇక్కడి వాతావరణం క్లయిమేట్ హిప్పీస్ కు హాయిని ఇస్తుంది. అందుకే మీ దేశంలో అనాది నుంచి హిప్పీ కల్చర్ వుంది."

 

    జ్యోతి విస్మయంగా చూసింది.

 

    "అంతా అబద్ధం! మా పురాణకాలం గురించి నీకేం తెలుసు?"

 

    "తెలుసు! అన్ని బంధాలనూ వదిలించుకొని ఎందరు అరణ్యాల్లో తిరగలేదు? గడ్డాలు పెంచుకుని తపస్సులు చెయ్యలేదు? ఆ మునులంతా హిప్పీలే!"

 

    "వాళ్ళు హిప్పీస్ కారు. వాళ్ళకు ఒక లక్ష్యం వుంది!"

 

    "ఏమిటా లక్ష్యం? నిర్వాణమెగా? స్వర్గాన్ని పొందాలని కోర్కేగా! మా లక్ష్యం కూడా అదే!"

 

    "మీది విశృంఖల జీవితం!"

 

    "ఈనాటికీ మీ యాత్రాస్థలాల్లో సాధువులూ, సన్యాసులు గంజాయి దమ్ము పీలుస్తూ కన్పిస్తారు. జుట్టు పెంచుతారు. గడ్డాలు పెంచుతారు. కాళ్ళకు చెప్పులు వేసుకోరు."

 

    జ్యోతికి యీ విషయంలో వాదించాలనిపించలేదు. ఒకవేళ వాదించినా వాళ్ళు అర్థం చేసుకొనే స్థితిలో లేరనిపించి ఊరుకుంది.

 

    "ఆ మాటకొస్తే మీ దేవతలు కూడా హిప్పీలే!"

 

    జ్యోతికి భగవంతుడి మీద నమ్మకం లేదు.

 

    "అదేమిటి?" కుతూహలంతో అడిగింది.

 

    "శివుడు హిప్పీయే! పులి చర్మం ధరిస్తాడు.భిక్షాటన చేస్తాడు. స్మశానంలో నివసిస్తాడు. నాట్యం చేస్తాడు. పైగా అతనికి మామూలు డ్రగ్ చాలదు. చాలా స్ట్రాంగు డోస్ కావాలి!"

 

    జ్యోతి విస్మయంగా మేరీ ముఖంలోకి చూసింది.

 

    "శివుడు డ్రగ్స్ సేవించాడని ఏ పురాణంలోనూ లేదు!" ఆలోచిస్తూ అన్నది జ్యోతి.

 

    "విషం మింగడమంటే ఏమిటి? పాముల్ని ధరించడం దేనికి? ఈ డ్రగ్సు ఏమీ పనిచెయ్యని స్థితిలో ఇప్పటికీ పాములచేత కాటు వేయించుకొనేవారున్నారు. మీ శివుడు మహా గొప్పహిప్పీ."

 

    జ్యోతి ఆలోచిస్తూ వుండిపోయింది.

 

    "అందుకే మీ దేశం అంటే మాకు అభిమానం!"

 

    "అతనెవరూ?" ఇంకా కిందనే మత్తుగా పడుకొనివున్న అతనికేసి చూస్తూ, సంభాషణ మార్చే ఉద్దేశ్యంతో అడిగింది జ్యోతి.

 

    "మేమిద్దరం కలిసే ఈ దేశం వచ్చాం!"

 

    "మీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారా?" కళ్ళు పెద్దవిచేసి అతనికేసి చూస్తూ అడిగింది శబరి.

 

    "పెళ్ళా? నువ్వనుకునేలాంటి పెళ్ళికాదు మాది!"

 

    "అంటే?" శబరి ఉత్సాహంగా అడిగింది.

 

    "ఇద్దరం కలిసి బతుకుదామనుకున్నాం! కాని మామధ్య కట్టడులు వుండకూడదని కూడా అనుకున్నాం!"

 

    "నాకూ అదే ఇష్టం!" శబరి అమాయకంగా అన్నది.

 

    జ్యోతి చివ్వున తల తిప్పి శబరి ముఖంలోకి లోతుగా చూసింది.

 

    'గుడ్! బేబీ మన ఫిలాసఫీని అర్థం చేసుకుంది!" జాన్ శబరిని ప్రశంసించాడు.

 

    జ్యోతికి వళ్ళు మండిపోయింది. "ఏమిటి మీ బోడి ఫిలాసఫీ! కట్టడులు కాకుండా కలిసి బతకడమంటే?"

 

    "అంటూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఒకే మంచం మీద పడుకోవాలనే బానిసత్వం మాకులేదు!" అన్నది మేరీ.

 

    జ్యోతి ఆలోచిస్తూ వుండిపోయింది.

 

    "అర్థం కాలేదా? మేము మొదట ఇరవై ఏడు మందిమి కలిసి తిరిగాం. ఒకే కుటుంబంగా జీవించాం! ఐదుగురిమి మాత్రమే ఆడవాళ్ళం వుండేవాళ్ళం! మేము ఐదుగురుమే, ఇరవై ఏడు మంది బాయిస్ తో ఎప్పుడు ఎవర్ని ఎవరు కోరుకుంటే-"

 

    "చాలు! ఇక చెప్పకు!" మధ్యలోనే అందుకుంది జ్యోతి.

 

    "మీరు పిరికివాళ్ళు. స్వార్థపరులు. సెక్స్ గురించి వినడానికి కూడా భయమే!" అన్నది మేరీ.

 

    "మాకు స్వార్థంలేదు. వన్ షుడ్ హ్యావ్ ఫ్రీ సెక్స్!" జాన్ అన్నాడు గర్వంగా.

 

    జ్యోతికి తను వాదించి లాభం లేదని అర్థం అయింది. వింటూ వుండిపోయింది.

 

    "మేము నూతన సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం. పాత విలువలకూ, బూజుపట్టిన విశ్వాసాలకూ, స్వస్తివాచకం పాడాము.

 

    మాలో ఎవరి దగ్గిర ఏది వున్నా అది అందరిదీ! అందరం సమానంగా అనుభవిస్తాం! రొట్టెలూ, చీస్, డ్రింక్స్, పాట్, చరస్, హీరాయిన్, మార్జువానా, యల్.యస్.డి. శరీరమూ, మనసూ అన్నింటిలోనూ అందరికీ సమాన వాటా వుంటుంది. ఎవరికీ తనదంటే ఏదీ ఉండదు! ఈ హిప్పీ ధర్మపు ప్రధాన సిద్ధాంతం ఇదే!" అన్నాడు జాన్ నిర్లిప్తంగా.

 

    "నువ్వు ఎప్పుడు ఎలా హిప్పీగా మారావో వినాలని వుంది" అన్నది జ్యోతి మేరీతో. మేరీ గతాన్ని మననం చేసుకోసాగింది.

 

    "ఇష్టం లేకపోతే చెప్పొద్దులే!"

 

    "ఇంట్లో బాధలు భరించలేక పారిపోయి వచ్చి హిప్పీ ధర్మంలో చేరావా?" శబరి అడిగింది.

 

    "నో!నో! నా కెలాంటి బాధలూ లేవు!"

 

    "మరెందుకిలా తయారయ్యావ్?"

 

    "ఎలా తయారయ్యానా? ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చాను."

 

    "బీదవాళ్ళా మీరు? ఇంట్లో నీకు కావాల్సినవీ, కోరుకున్నవీ లభించలేదా?" శబరి కళ్ళు తిప్పుతూ అడిగింది.

 

    "నో! నో! మా నాన్న మిలియనేర్! నేను కావాలంటే క్షణంలో కొండమీది కోతినయినా తెప్పించి ఇచ్చేవాడు."

 

    జ్యోతీ, శబరీ ఆశ్చర్యంగా మేరీ ముఖంలోకి చూశారు.

 

    "ఎంతో సంపాదించాడు. ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. బటన్ నొక్కితే కావాల్సినవన్నీ నాకు వచ్చేవి."

 

    "మీ మమ్మీ అంటే నీ కిష్టంలేదా?" శబరి ప్రశ్న.

 

    "ఆమె నన్ను చాలా ప్రేమగా చూసేది. కాని చిత్రం! అన్నీ ఉన్నా నాకు ఏదో వెలితిగా అనిపించేది. నాకేదయినా చెయ్యాలని వుండేది. కాని ఏది చెయ్యాలో తెలిసేది కాదు. కోరిన ప్రతివస్తువూ మరుక్షణంలో నా ముందు ఉండేది."

 

    "నాకూ అచ్చం అలాగే అనిపిస్తుంది!" శబరి కళ్ళు తిప్పుతూ అమాయకంగా అన్నది.

 

    "నన్ను ప్రతినిమిషం ఏదో అశాంతి వెన్నాడింది. నేను ఎందుకు పుట్టాను? ఎందుకు బతుకుతున్నాను? అనే ప్రశ్నలు పదేపదే నన్ను నిలదీసేవి. ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి. అందుకే ఈ అన్వేషణ. సెర్చ్! ఎటరన్ సెర్చ్!" మంద్రస్థాయిలో తనకు తనే చెప్పుకుంటున్నట్టు అన్నది మేరీ.

 

    "ఊఁ చెప్పు! తర్వాత కుతూహలంగా అడిగింది శబరి.

 Previous Page Next Page