"ఈ పూలబాల ఎవరు? అన్నాడు నుదురుమీద పడుతున్న జుట్టును వెనక్కు తోసుకుంటూ. జ్యోతికి వళ్ళు మండిపోయింది. లాగి చెంప పగలగొట్టాలనిపించింది.
"నా ఫ్రెండ్ జ్యోతి!" శబరి ఉత్సాహంగా పరిచయం చేసింది.
"జ్యోతి, ఇతనే నేను చెప్పానే? నా బాయ్ ఫ్రెండు అని."
"నీ పేరు తెలుసుకోవచ్చా? జ్యోతికి అతన్ని చూస్తూ మీరు అని పిలవాలనిపించలేదు.
"నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలువు బాలా! ఏ పేరుతో పిల్చినా పలుకుతాను!" మెళ్ళో వున్న పూసల దండను సర్దుకుంటూ అన్నాడు.
"అదేమిటి?" నీకు తల్లిదండ్రులు పేరు పెట్టలేదా?" అన్నది జ్యోతి.
"తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే పిలవాలని ఏముంది? గులాబిని గులాబి అనక మరో పేరుతో పిలిస్తే దాని అందం తగ్గుతుందా? లేక దాని సుగంధం దుర్గంధంగా మారిపోతుందా? బ్రహ్మజెముడును మరో పేరుతో - అంతెందుకూ 'గులాబి' అని పిలుస్తామనుకో దాని ముళ్లు గుచ్చుకోవా? దానికి గులాబి పువ్వు అందం వస్తుందా? గులాబి పువ్వును బ్రహ్మజెముడన్నా, బ్రహ్మజెముడును గులాబి అన్నా నష్టం లేదు."
జ్యోతి అతన్ని పరిశీలనగా చూసింది. స్ఫురద్రూపి. కాని మురికి ఓడుతూ ఏవగింపు కలిగించేలా వున్నాడు. జుట్టు చీకేసిన తాటిగింజ పీచులా వుంది. ఆ ఇద్దరివైపు చూసింది. వాళ్ళు వేసుకున్న మందు తలకెక్కినట్టుంది. వాళ్లు ఈ లోకంలో లేరు. అతను పడుకొని వున్నాడు. షర్టులేని అతని ఛాతిమీద తలపెట్టి పడుకొని వుంది. అతని చేతులు మేరీ వంటిమీద త్రాచుపాముల్లా పాకుతున్నాయి. జ్యోతి కళ్ళు తిప్పుకుంది.
వీళ్ళు మనుషులేనా? అవును వీళ్లూ మనుషులే! మానవత్వం అంటే ఏమిటి? కాని వీళ్ళెందుకిలా లక్ష్యరహితంగా కుళ్లు బతుకు బతుకుతూ ఇదే జీవితం అనుకుంటున్నారు! వీళ్లు ఇలా తయారవడానికి కారణం ఏమిటి? ఎవరు? జనరేషన్ గ్యాపా? తరాల అంతరమా? పెద్దతరం వారి బూజుపట్టిన భావాలకూ, కృత్రిమ విలువలకూ విసిరి రెబెల్ అవడం అనాలా ఈ హిప్పీ ధర్మాన్ని? ఒక లక్ష్యం అంటూ లేని వాళ్లలోనే, ఈ తరాల అంతరాలు. రెండు జనరేషన్స్ మధ్య పెద్దగండి ఏర్పడుతుంది. లక్ష్యసిద్ధి కోసం పోరాడేవారి మధ్య యీ తరాల అంతరాలు కన్పించవేం? తాము సాగిస్తున్న పోరాటంలో వయసుల ప్రమేయం లేదు.
"బేబీ! ఈ బాల మాట్లాడదేం?"
శబరి జ్యోతి ముఖంలోకి చూసింది.
"సారీ! మందులు అయిపోయాయి. రేపు రండి స్వర్గం చూడాలని వుంటే! మా ప్యాడుకు వస్తారా! తీసికెళతాను. అక్కడ హెలెన్ దగ్గర మందులున్నాయి" అన్నాడు జాన్.
"ప్యాడా? అంటే-" శబరి అడిగింది.
"మేము వుండే స్థలాన్ని ప్యాడ్ అంటారు."
"నువ్వు హిప్పీగా ఎందుకు మారావు?" జ్యోతి అడిగింది.
జాన్ ఒక్క క్షణం జ్యోతి ముఖంలోకి చూశాడు. "ఎందుకా! ఇంత కుళ్ళూ, దగా, మోసాలతో నిండివున్న ఈ ప్రపంచంలో నేనెందుకు పుట్టానో తెలుసు కోవాలని! నేను ఎవర్నో తెలుసుకోవాలని" అన్నాడు ఆకాశంలోకి చూస్తూ.
ఈ సమాజంమీద వీళ్లకు గౌరవం లేదు. -కాని వీళ్ళు ఎన్నుకున్న మార్గమే సరయినది కాదు. సమాజం నుంచే పారిపోయి దాని విలువల్ని తిరస్కరించి ఏదో సాధించాలనుకుంటున్నారు.
"ఇలా జీవితం నుంచి పారిపోయి మీరు సాధించేదేమిటి?"
మేము జీవితంనుండి పారిపోలేదు. కొత్త జీవితాన్ని... ఎటువంటి బంధాలూ లేని జీవితాన్ని వరించాం. దగా, మోసం, స్వార్థంలేని కొత్త సమాజాన్ని నిర్మించుకున్నాం!"
"ఈ కొత్త జీవితంలో మీరు సాధించిందేమిటి?"
"శాంతి!"
"ఈ జీవితంలో నీకు శాంతి లభిస్తున్నదా?"
"ఓ! యస్! మీకంటే సుఖంగా బతుకుతున్నాం. సంసార తాపత్రయం నుంచి బయటపడ్డాం.
జ్యోతి జాన్ ముఖంలోకి లోతుగా చూసింది. "అది ఎలా సాధ్యం."
"ఒక్కసారి డ్రగ్ వేసుకొని చూడు. ఒక్క ట్రిప్ అనుభవించు. ప్రపంచంలో ఎంత అందం, ఎంత సుఖం వుందో చవిచూడు. చరస్ లోని ఆనందాన్ని అనుభవించు. యల్.యస్.డి... రుచి చూడు... ఐ జస్ట్ కెనాట్ డిస్క్రైబ్!"
"మత్తుమందులు సేవించి వళ్ళు మరిచిపోవడమా శాంతి అంటే? కాళ్లకు చెప్పులు లేకుండా, వంటినిండా బట్టలు లేకుండా తిండికూడా సరిగా లేని మీ బతుకు కూడా ఒక బతుకేనా? మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు!" అన్నది జ్యోతి జాలిగా.
"హింసా? హింస శరీరానికా! మనసుకా!" జాన్ కళ్ళమీద పడుతున్న జుట్టును పైకి తోసుకుంటూ అడిగాడు.
"శరీరం లేనిదే మనసు లేదు." జ్యోతి సమాధానం ఇచ్చింది.
"మేము శరీరాన్ని నిద్రపుచ్చి మనసును జాగృతం చేసుకుంటున్నాము."
"కుళ్ళిన శరీరంలో మనసు జాగృతం కాలేదు!"
"నో! నో! మీకు మా సుఖం అర్థం కాదు. అది అనుభవంమీద కాని తెలియదు. అది మాటలకూ తర్కానికి అతీతమయినది" అన్నాడు జాన్.
శబరి పసిపాపలా ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ వాళ్ల మాటల్లోని అర్థాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ వుంది.
"పోనీయ్! అలాగే అనుకుందాం!"
జాన్ కళ్ళు విజయగర్వంతో మెరిశాయి. శబరి తన బాయ్ ఫ్రెండ్ తర్కంలో గెలిచినందుకు సంతోషించింది.
"మీకు ఈ సమాజంమీద రోత పుట్టింది"
"అవును!"
"సంపద సృష్టించిన అంతరాలు... దారిద్ర్యం... దౌర్జన్యం... దగా-దోపిడీలతో నిండి వున్న ఈ వ్యవస్థ అంటే అసహ్యం! అవునా?"
"అవును!"
"నాకూ ఈ దోపిడీ వ్యవస్థ అంటే అసహ్యమే! కాదు కసికూడా వుంది."
"నిజంగా? అయితే మా ధర్మంలో చేరిపో!" ఉత్సాహంగా అన్నాడు జాన్. జ్యోతి శబరి ముఖంలోకి చూసింది.
"చేరతావా! ఎంచక్కా మనిద్దరం వచ్చేద్దాం?"
జ్యోతి ఆలోచనలో పడింది. వీళ్ళను యెలా యీ పిచ్చినుండి బయట పడెయ్యటం?
"హ్యావ్ ఏ ట్రిప్! యూ కం అవుట్ మాన్!" అన్నాడు జ్యోతి చేయిపట్టుకొని. జ్యోతి చెయ్యి లాక్కుంది. చురుగ్గా జాన్ ముఖంలోకి చూసింది.
"నేను మీలాంటి పిరికిదాన్ని కాదు. జీవితం నుంచి పారిపోవడం నా ధ్యేయం కాదు."
"మరి నీకు కూడా ఈ కుళ్లు వ్యవస్థమీద కసిగా వుందన్నావ్?"
"అవును వుంది."
"కసితో నీ పెదవుల్ని నువ్వే కొరుక్కుంటూ యీ కుళ్ళును భరిస్తూ పడి వుంటావా?"
"పడి వుండను. ఈ కుళ్ళును నానాటికి పెంచుతున్న ఈవ్యవస్థను పునాదులతో పెకిలిస్తాను." ఆవేశంగా అన్నది జ్యోతి.
శబరి జ్యోతి ముఖంలోకి బెదురుగా చూసింది.
"ఏం చేస్తావ్?"
"ఈ వ్యవస్థను మార్చడానికి - ఈ దోపిడీని అంతమొందించడానికి జరుగుతున్న మహాయజ్ఞంలో మహాకవి శ్రీశ్రీ అన్నట్లు నేను కూడా ఈ అగ్నికి సమిధను అవుతాను!"
"ప్చ్! ప్రయోజనం లేదు బేబీ!"
వీడి బొంద. వీడి కళ్లకు అందరూ బేబీలుగానే కనిపిస్తున్నారు.
"ప్రయోజనం ఎందుకు లేదు?"
"క్రైస్తు ప్రజలకు ప్రేమతత్వాన్ని బోధించాడు. కాని ఆ ప్రజలే అతనిని శిలువ ఎక్కించారు. క్రైస్తు మాకు ఆదర్శం! అతనే మొదటి హిప్పీ!"
"క్రైస్తు హిప్పీయా?" కళ్ళు వెడల్పు చేసుకొని అడిగింది శబరి.