గ్లాస్ లోని మంచినీళ్ళు తీసి అతని నెత్తిమీద గుమ్మరించింది వైజయంతి.
"నెలకో ప్లెజర్ ట్రిప్... ఆ మాట నాకు చాలా బావుంది" అంది చిత్ర.
"గర్ల్ ఫ్రెండ్స్ ని తిప్పడానికి బైక్స్ అంటే ఇస్తాడు సరే...పాకెట్ లో పర్స్ ఎవరు నింపుతారు?" వెంకట్ దిగులుగా అడిగాడు.
"అందుకే నీది పీనట్ బ్రైన్ అంటారు. మంచి రిచ్ గర్ల్ ఫ్రెండ్ ని చూసుకోవాలిరా..." అన్నాడు ప్రతాప్.
నేను పుస్తకం తెరిచి అందులో వాక్యాలు ఒకటికి రెండుసార్లు చదువుకుంటూ కూర్చున్నాను.
'ప్రణయలీలా విహార విలాసినులగు తారకల గాంచుమా! నీ హృదయము నందు భావ నక్షత్ర కాంతుల పర్వునేమో!'
ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చి చాలాసేపు మొహం కడిగాను. అమ్మ పిలుస్తుంటే వినిపించుకోకుండా అనవసరంగా తిట్లుతిన్నాను. మాటి మాటికి అతని రూపం, నవ్వూ గుర్తొస్తోంది. ఇదంతా ఏమిటి?
బహుశా ఆకర్షణేమో...తప్పేంవుంది? హీరోలంటే ఆకర్షింపబడని వాళ్లెవరని సమర్థించుకున్నాను.
అతను నావైపు ప్రత్యేకంగా చూడటం గుర్తొచ్చి అద్దంలో చూసుకొన్నాను. చిన్న మొటిమ ముత్యపు బిందువులా చెక్కిలిమీద మెరుస్తూ 'వయసొచ్చింది సుమా' అని చెప్తున్నట్లు అనిపించింది. ఆడపిల్ల వెల్లకిలా పడుకొని పుస్తకం గుండెలమీద పెట్టుకుంటే, అది పడిపోకుండా నిలిస్తే ఆమెకి వయసొచ్చినట్లే!
మరునాడు నిదరలేచి ఎర్రని కళ్ళతో కాలేజీకి వెళ్ళాను. సెల్ఫ్ ప్రింటున్న తెల్లని చుడీదార్ గంజిపెట్టి ఇస్త్రీ చేయడం వలన బుట్ట బొమ్మలా ఉన్నాను.
రోజూ కంటే జడ వేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. సమయానికి పూయని కుండీలోని రోజాపువ్వు మీద చచ్చేంత కోపం వచ్చింది!
ఆ రోజు క్లాస్ లో స్థిమితంగా కూర్చోలేకపోయాను.
కళ్ళు అస్థిమితంగా గుమ్మంవైపు చూస్తున్నాయి.
"ఏవిటీ ఈ రోజు స్పెషల్ గా కనిపిస్తున్నావు? అడిగాడు ప్రతాప్.
"బర్త్ డేనా?" రఫీ ఆత్రంగా అడిగాడు.
"ఏం కాంటీన్ ఖర్చు తప్పించుకోవడానికా?" చిత్ర ఏడిపించింది.
"చిత్ర... ఆ గోపీగాడు ఈ మధ్య నీతో తెగ మాట్లాడ్తున్నాడు ఏవిటి సంగతి?" అడిగాడు వెంకట్.
"వాడి మొహం!" తీసిపారేసింది చిత్ర.
ఆ తర్వాత మాటిమాటికీ ఫెయిలయ్యే వైజయంతి ప్రేమకథల గురించి జోక్స్ కట్ చెయ్యసాగారు.
ఇంతలో నా మొహం అప్పుడే వెలిగించిన హారతి కర్పూరంలా అయిపొయింది.
సందీప్ వస్తున్నాడు.
హడావుడిగా జడ సర్దుకున్నాను.
సందీప్ ఒక్కడే రాలేదు! వెంట పదిమంది వచ్చారు. వాళ్ళల్లో నలుగురు అమ్మాయిలున్నారు.
ఆ నలుగురూ నాకంటే అందంగా ఉన్నారు. నవ్వులూ, కబుర్లతో ఆ ప్రాంతం ధనధనలాడించేశారు. చాలా స్టయిలుగా మోడల్స్ లా ఉన్నారు!
"సంగీత్ లో కొత్త పిక్చర్ రిలీజ్..."
"సందీప్ సంఘీ వెళ్దామా"
"ఎలక్షన్స్ అయ్యాక అందర్నీ గోవా తీసుకెళ్తానన్నాడు తెలుసా?"
"సందీప్ ఆ నీతా ఆప్టేకి ఫోన్ చేసి స్పెషల్ గా, ఓట్ చెయ్యమని అడిగావుటగా! అది కాలేజ్ అంతా చెప్పుకు తిరుగుతోంది తెలుసా?"
"అవసరం నాది. రోజూ వందమందికి చెప్తాను. ఏం తప్పా?" అన్నాడు సందీప్.
"ఫోన్ ఏం ఖర్మ? ఏదైనా చేస్తాడు!" ఓ అమ్మాయంది.
నా చెవులన్నీ అటే ఉన్నాయి. అతను నా వైపు చూస్తాడని ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్నాను.
అంతలో బెల్ మోగింది.
"పద...పద..." అంది వైజయంతి.
నేను ఇంకా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాను.
అతను నా వైపు చూడలేదు.
నేను లేచి క్లాస్ కి వెళ్ళిపోయాను.
* * *
సాయంత్రం చిత్రతో వాళ్ళింటికెళ్ళాను.
చిత్ర తన గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే. చిత్ర రకరకాల కాస్మొటిక్స్ యూజ్ చేస్తుంది. మామూలుగా ఉండే చిత్ర తయారయితే అందగత్తెలా కనిపిస్తుంది.
నేను డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న లిప్ స్టిక్ చేతిలోకి తీసుకొన్నాను. ధర అంచనా వేస్తుండగా, ఫ్రూట్ జ్యూస్ తీసుకుని చిత్ర లోపలికి వచ్చింది.
"వాట్? అది నీకు నచ్చిందా?" అడిగింది.
"లేదు...ధర చూస్తున్నాను" అన్నాను.
"మా బావ సింగపూర్ నుండి తెచ్చాడు. ఇక్కడ ఆరువందలపైనే ఉండచ్చు! అంది.
నేను గబుక్కున తీసినచోటే పెట్టేశాను.
"వై డోంట్ యూ ట్రైయార్?" చిత్ర అందుకుని నాకు వెయ్యబోయింది.
"ఒద్దు...నాకు అలవాటు లేదు" అన్నాను.
"అలా అమ్మమ్మలా ఉండక్కర్లేదు. అందంగా తయారయితే తప్పేంలేదు. అందరూ మన చుట్టూ వెంపర్లాడ్తూ తిరుగుతుంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది!" అంది.
నేనూ ఆలోచించాను. జీన్స్ లో ఉండే అమ్మాయిల పక్కన ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు.