అంతా అయోమయంగా వుంది సుధకు.
"పని అవలేదా?" జంకుతూనే అడిగింది.
"అని ఎవరు చెప్పారూ?" తోకతొక్కిన పాములా కస్సుమన్నాడు.
సుధ పొర్లుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంది.
"పక్కింటి బామ్మగారు బలవంతంచేస్తే గుడికి వెళ్ళాను. మీకోసం నిన్నటినుంచీ ఎదురుచూస్తున్నాను. మీరు వెళ్ళినదగ్గరనుంచీ నాకేమీ తోచలేదు. బామ్మగారింటికి వెళ్ళాను. వాళ్ళ కోడలితోపాటు నన్నూ గుడికి తీసుకెళ్ళింది."
"ఈ బోడి ఎక్స్ ప్లనేషన్స్ నిన్నెవడడిగాడూ?" కసిరాడు కృష్ణ.
సుధ నిర్విన్నురాలైపోయింది. నిస్సహాయమ్గా చూసింది.
కృష్ణ ఆఫీసుబ్రీఫ్ అందుకొని బయలుదేరాడు.
"భోంచేసి వెళ్ళండి."
సుధ మాట వినీ విననట్టే విసురుగా తలుపు తెరచుకొని బయటికి వెళ్ళిపోయాడు.
నివ్వెరపోయి చూస్తూ నిలబడింది సుధ.
వెనకే పరుగెత్తు భర్తను రోడ్డుమీద నిలవేసి టై పట్టుకొని "ఏమిటి మీ ఉద్దేశ్యం?" అని అడగాలనిపించింది.
కాని అడుగు ముందుకు పడలేదు.
ఆమె చూస్తూ ఉండగానే, ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోయాడు కృష్ణ.
9
సాయంకాలం ఐదు దాటింది. సుధ మనసులో మనసు లేదు. క్షణ క్షణానికీ ఆమెలో ఆవేదన పెరగసాగింది. ఉదయం కృష్ణ అలా వెళ్ళి పోయినదగ్గరనుంచీ ఇంటిలో కాలుకాలిన పిల్లిలా తిరగసాగింది. వండిన అన్నం వండినట్టే వుండిపోయింది. ఒకవైపు నీరసం, మరోపక్క మనిశిని ఊపేస్తున్న రోషం, ఆలోచనలు ఆమె బుర్రను తొలిచేస్తున్నాయి.
హఠాత్తుగా ఈ మనిషి ఇలా అయిపోయాడెందుకూ? ఈ మూడు రోజుల్లో ఏం జరిగింది? కృష్ణ తనపట్ల ఇలా ప్రవర్తిస్తాడని కలలోకూడా ఊహించలేదు. అతను ఇంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? నవనీతంలాంటి అతని హృదయం ఇంతలోకే పాషాణంలా ఎలా మారింది?
పువ్వుల్లో పెట్టి ఇంతకాలం పూజించిన తన భర్త తనమీద రాళ్ళు విసురుతున్నాడు, అతను వెళ్ళిన పని కాలేదా? తన అసమర్ధతవల్లగానీ మరే కారణంగా గానీ వెళ్ళినపని సమర్ధవంతంగా నిర్వహించలేకపోయాడా? తను ఆఫీసులో బాస్ ముందు ఎదుర్కోబోయే అవమానాన్ని ఊహించుకుంటూ బాధపడుతున్నాడా? ఆ బాధలో వుండే తనతో అలా ప్రవర్తించాడా?
అలా అయితే మాటమాత్రంగా తనతో అనవచ్చుగా? ఆయన బాధను అర్ధం చేసుకోలేని మూర్ఖురాలు కాదుగా తను? ఆ మాత్రం అతనికి తెలియదా? ఒక్కమాట చెబితే సరిపోయేడానికి తనతో ఎందుకంత కఠినంగా ప్రవర్తించాలి!
తను పొరపాటు చేసిందేమో? ఆయన మూడ్ ను గ్రహించి విసిగించకుండా వుంటేపోయేది.
నిజానికి తను కృష్ణను విసిగించేదేమీ చెయ్యలేదు. మాట్లాడలేదు కూడా. ఆఫీసు వ్యవహారంలో కృష్ణ మరీ ఇంత అప్ సెట్ అవుతాడా? ఇదేదో స్వంత విషయమే కావచ్చును. ఏమై వుంటుంది?
తనకు తెలిసినంతవరకూ ఆయనకు అలాంటి సమస్యలు ఏమీ లేవు. తనకు తెలియనివి ఏమైనా వుంటే తప్ప!
మద్రాసులో ఆయనకుండిన సబంధాలేమిటి! అక్కడాయనకు సంబంధించినవాళ్లెవరున్నారూ? ఎవరో వుండే వుండాలి. లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడూ? ఎవరయి వుంటారూ? ఏమి జరిగి వుంటుంది? ఇంత ఎడముఖం పెడముఖం పెట్టాడంటే ఏదో బలీయమైన కారణమే వుండి వుండాలి! లేకపోతే ఇంత ఇదిగా ఎందుకు ప్రవర్తిస్తాడు? అది తనతో చెప్పకూడని కారణం అయివుండాలి.
ఆఁ! ఇప్పుడు అర్ధమౌతుంది తనకు. తను ఎంత పిచ్చిమొద్దు?
అది ఎవతి?
దానికి పెళ్ళి అయిందా?
లేక ఇంకా ఈయననే పట్టుకొని వేళ్ళాడుతుందా? మరయితే దానినే కట్టుకోలేకపోయాడూ? తన గొంతు ఎందుకుకోయాలి? తన తండ్రి మంచీ చెడూ తెలుసుకోకుండానే తనను ఈయన కిచ్చి కట్టాడు. తన గొంతు కోశాడు. నాన్న స్నేహితుడుతెచ్చిన సంబంధం స్నేహితుడు మంచివాడైతే అతను తెచ్చిన సంబంధంకూడా మంచిది కావాలని ఎక్కడుంది? బాగా చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒడ్డూ పొడుగూ వుంది. అందగాడు అంటూ స్నేహితుడు చెప్పగానే నాన్న ఎగిరి గంతేశాడు. అమ్మ ఉబ్బితబ్బిబైపోయింది.
తనువాళ్ళను అనడం దేనికి? తన బుద్ది ఏమయిపోయింది? ఎం.ఏ. చదువుకుంది. అయినా మరో ఆలోచనే లేకుండా వెంటనే పెళ్ళికి ఒప్పుకొంది. మనిషికి అందం-చందం, చదువు-సంధ్య, ఉద్యోగం, వున్నంత మాత్రాన అన్నీ ఉన్నట్టేనా? అతని గతాన్ని గురించి ఆలోచించాల్సిన పని లేదా? ఆ మాటకొస్తే అదే ముఖ్యం. సంస్కారం, సభ్యత, గుణం గురించి ఆలోచించవలసిన అవసరం లేదా?
ఒకర్తెను ప్రేమించడం- మరొకర్తెను పెళ్ళి చేసుకోవడం- ఛ! ఛ! ఏం మనిషి!
అసలు ఇంతకీ దానినికూడా చేసుకొన్నాడేమో? మద్రాసులో మరోకాపురం పెట్టాడేమో?
మరి తనను ఎందుకు చేసుకున్నట్టు?
విశాఖపట్టణం తన పేరున వుండిన ఇల్లుచూసి చేసుకున్నాడా? లేక తన పేరుమీద వుండిన బ్యాంకుబాలెన్స్ చూసి చేసికొన్నాడా? తన వంటి మీద వుండిన బంగారాన్ని చూసి చేసుకొన్నాడా!
తను మోసపోయింది!
ముమ్మాటికీ మోసపోయింది!
"అమ్మగారూ! ఓ సుధమ్మగోరూ!"
బయటినుంచి విన్పించింది.
సుధ త్రుళ్ళిపడింది. బెడ్ మీద లేచి కూర్చుంది. ఏమిటిది? తనెంత పిచ్చిగా ఆలోచించింది? కృష్ణను గురించి అంత నీచంగా ఆలోచించడమా? అందునా తను? ఛ! ఛ!
బెడ్ రూంలోనుంచి లేచి వెళ్ళి వీధితలుపు తెరిచింది. పంకజం తల్లి ఎదురుగా కన్పించింది.
"ఏంటమ్మగారూ పిల్లదాన్ని రావద్దన్నారా?"
"అవును."
"ఏం చేసిందమ్మగారూ?"
"ఏం చేసిందా?" ఏదో ఆలోచిస్తూ అంది సుధ.
"నాకు తెలుసమ్మగోరూ! అది వట్టిరాలుగాయిముండ. దాని నోరు తిన్నగా ఉండదు. ఎక్కడలేని వైనాలన్నీ దానికే కావాలి. నాలుగు తిట్టి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చానమ్మా" గుక్క తిప్పుకోకుండా చెప్పుకుపోతూనే వుంది పంకజం తల్లి.
"ఇంతకీ ఏం చెప్పింది పంకజం?"
"ఏం లేదమ్మగారూ?" దీర్ఘం తీసింది పంకజం తల్లి.
"ఫర్వాలేదు చెప్పు."
"ఆఁ ఏం చెప్పమంటారూ? మూడురోజులతర్వాత అయ్యగారొచ్చారట."
"అయితే?"
"దాని బొందలేమ్మా! ఏదో వాగింది. మీరేం తప్పు పట్టించుకోకండి తల్లీ!" అంటూ పనిమనిషి లోపలకు వచ్చింది.
"దానికి త్వరగా పెళ్ళి చేసేయ్ అంజమ్మా?" అంజమ్మ వెనకే నడుస్తూ అంది సుధ.
"అదే తల్లీ చూస్తున్నాను. ఈమధ్య రెండుసంబంధాలు వచ్చాయి."
"ఇంకే మరి? ఏదో ఒకటి ఖయమ్చేసి పంకజం మెళ్ళో తాడు వేయించేసెయ్!"
"అంత బాగుంటే దాని పెళ్ళి ఈ నెల్లోనే చేయించేద్దామనుకున్నాను."
"కట్నం ఏమైనా అడుగుతున్నారా?"
"కట్నకానుకల గొడవేం లేదు. కాని ఆ సంబంధాలే నచ్చలేదు."
"ఎవరికీ? నీకా! పంకజానికా?"
"నాకేనమ్మా! ఒకడేమో వట్టి తాగుబోతూసన్నాసి- రెండోవాడేమో ముండను పెట్టుకొని వుంటున్నాడట."
"మీరే నయం!" ఎక్కడో చూస్తూ, ఏదో ఆలోచిస్తూ అంది సుధ అప్రయత్నంగా.
తెరచిన నోరు తెరిచినట్టే ఉంచి ఆశ్చర్యంగా చూసింది అంజమ్మ.
"అదే అంజమ్మా! మంచీ చెడూ బాగా ఆలోచించి చూశారంటున్నాను."
"మరి సూడకపోతే ఎట్టాగమ్మా? పెళ్ళంటే నూరేళ్ళపంటగదమ్మా! తొందరపడి చేశానే అనుకోండి. ఇంకేమైనా ఉందా? ఆడు తాగొచ్చి రోజూ తంతాఉంటే దాని దారి అది చూసుకోదూ? ఆడికి ఇంకో పెళ్ళాం ఉందని తెలిస్తే, ఇది మరొకడిని వెతుక్కొని లేచిపోతే? ఈకాలం పిల్ల సంగతి తవరికి తెలియందేముందమ్మా? పంకజం సంగతి మాకు తెలుసు గదా? ఈ కాలం పిల్లముండలు సినీమాలు చూసి మరీ సెడిపోతున్నారమ్మా!"