"మళ్ళీ నీ కిదేం బుద్దిరా?" చలపతి కొయ్యపెట్టె తెరిచి పెళ్ళినాడు అత్తగారు పెట్టిన అత్తాకోడలంచు కండువా తీసి భుజంమీద వేసుకోబోతూ ఆగిపోయాడు.
వెనక నిల్చున్న తల్లి వాలకం మనసులో మెదులుతూ వుంటే గుండె దడదడలాడింది.
"పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో విను. పెద్దవాళ్ళ మాట విని చెడ్డవాళ్ళు లేరు."
కెనడియన్ ఇంజన్ లా మంగమ్మ చేస్తున్న రొదకు చలపతి హృదయం కాలవమీద వంతెనలా గజగజలాడి పోయింది.
'నువ్వా గడప తొక్కితే నీకూ నాకూ ఇక ఇంతే!'
మంగమ్మ నోరంటే నోరు కాదు. మనిషికంటే నోరే పెద్దది.
మంగమ్మకు ఇరవైఏళ్ళు నిండకుండానే భర్త పోయాడు.ఆమె అదృష్టం బాగుండి అప్పటికే ఓ కాయ కాసింది.
మంగమ్మ భర్త పోయాడనే వార్త అందడమే ఆలస్యంగా పిండాకూడు చుట్టూ చేరే కాకుల్లా అయినా వాళ్ళూ, కానివాళ్ళూ మంగమ్మ చుట్టూ వచ్చి చేరారు. పోటీలమీద మంగమ్మను ఆదుకొనే ప్రయత్నాలు చేశారు.
'ఆడకూతురు. చిన్న వయస్సు. భర్త చచ్చి పుట్టెడు దుఃఖంలో వుంది. ఇరవై ఎకరాల మాగాణి_ దొడ్లూ_దోవలూను. ఎవరూ ఆదుకోకపోతే ఏమైపోతుంది?' ఆమె చుట్టూచేరిన వాళ్ళ ఆలోచనలు ఇలా వుంటే_
మంగమ్మకు మాత్రం వాళ్ళ సహాయం అక్కరలేదనిపించింది.
'వెధవ సంత. గుంటనక్కలు. తేరగా వచ్చిందని మింగడానికి చేరారు. వీళ్ళంతా తనకు సహాయం చెయ్యడానికి వచ్చారా? గద్దలా అందినంతవరకు తన్నుకెళ్ళడానికి వచ్చారు. తన దగ్గరా వీళ్ళ వేషాలు?' వాళ్ళ మాటలు వింటూ మనసులో అనుకొనేది మంగమ్మ.
పెద్దదినం కాగానే ఎక్కడివాళ్ళ నక్కడ తరిమేసింది. పుట్టింటివాళ్ళను కూడా నమ్మలేకపోయింది.
పాతికేళ్ళుగా మంగమ్మ ఇంటిమీద కాకి వాలకుండా ఆస్తిని కాపాడుకొంటూ వచ్చింది. సమస్యలు ఎదురై నప్పుడల్లా మంగమ్మను ఆమె నోరే ఆదుకుంది.
ఆ నోటికి భయపడే అటు అత్తింటివాళ్ళు, ఇటు పుట్టింటివాళ్ళు భళ్ళున పగలేసిన కుండపెంకుల్లా చెల్లాచెదురై పోయారు.
ఆమె కొడుకు చలపతిని పెద్దపులుల్లా నోరుతెరుచుకొని వున్న వారసులనుంచి ఆ నోటితోనే కాపాడుకొంటూ వచ్చింది. అంతేకాదు. కొడుకును కొంగుచాటునే పెంచింది. బయటి ప్రపంచం తెలియకుండా పెంచింది. బడికి పంపకుండా ఇంట్లోనే పంతుల్ని పెట్టి రాయడం, చదవడం నేర్పించింది. బయటికివెళితే తన కొడుకును తనకు కాకుండా చేస్తారనే భయం పట్టుకుంది మంగమ్మకు. చలపతి మంగమ్మ కొడుకుగానే పెరిగి పెద్దవాడయ్యాడు.
లోకం పోకడ తెలియని చలపతి _ ఆడ పెత్తనంలో పెరిగిన చలపతి నాసిరకం వాజమ్మలా తయారయ్యాడు.
పాతికేళ్ళు నిండిన చలపతికి మంచి సంబంధమే చూసి పెళ్ళి చేసింది మంగమ్మ.
భద్రయ్యకు ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుళ్ళూ. ఊళ్ళో సంబంధం అని, కూతురు తన కళ్ళముందే వుంటుందని చలపతికిచ్చి రంగ రంగ వైభవంగా పెళ్ళి చేశాడు భద్రయ్య.
అల్లుడి కిస్తానన్న ఐదెకరాల మాగాణి కూతురిపేర రాశాడు భద్రయ్య. దానికి కారణం లేకపోలేదు. కూతురు పుట్టినప్పుడు తెనాలివెళ్ళి జాతకం రాయించాడు. జాతకం చూసిన సిద్దాంతి ఆమెకు వైధవ్యం వుందనీ, సంతానయోగం కూడా లేదనీ చెప్పాడు. భద్రయ్య గుండె చెరువయింది. ఆ జాతకం అక్కడే చింపి పారేశాడు. ఆ రహస్యం భార్యకు కూడా చెప్పకుండా గుండెలోనే దాచుకొన్నాడు.
భద్రయ్య తన కొడుక్కు ఇస్తానన్న పొలం కూతురి పేర రాశాడన్న వార్త మంగమ్మ చెవిన పడింది.
మంగమ్మకు అరికాలిమంట నెత్తికెక్కింది. ఆమె నోటికి పని తగిలింది.
'ఔరా భద్రయ్యా! ఎంత గుండెలుతీసిన బంటువురా? నా కొడుక్కు ఇస్తానన్న పొలం కూతురి పేర రాశాడన్న వార్త మంగమ్మ చెవిన పడింది.
మంగమ్మకు అరికాలిమంట నెత్తికెక్కింది. ఆమె నోటికి పని తగిలింది.
'ఔరా భద్రయ్యా! ఎంత గుండెలు తీసిన బంటువురా? నా కొడుక్కి ఇస్తానన్న పొలం నీ కూతురి పేరా రాస్తావా? నా కొడుకు అమాయకుడనేగా నీ ధీమా? నాకు అడిగే దిక్కు లేదనేగా నీ ధైర్యం? నేనూ చూపిస్తా ఈ మంగమ్మంటే ఏమిటో?'
కోడల్ని పంపించవద్దని భద్రయ్యకు కబురు పంపింది.
"పోనియ్యమ్మా! ఎవరి పేరా వుంటేనేం? ఎటు తిరిగీ తినేది నీ కొడుకు బిడ్డలేగా?" అన్నాడు భద్రయ్య రాయబారిగా వచ్చిన రామయ్య.
"చాల్లేవయ్యా మహా చెప్పొచ్చావ్? ఆ గడ్డి ఏదో ఆ భద్రయ్యకే పెట్టకపోయావ్? ఆడదాన్ననీ, ఒంటరిదాన్ననీ ఆ వార్త నాదాకా మోసుకొచ్చావా? ఏం పెద్దమనిషివయ్యా?" గఁ య్యిన లేచింది మంగమ్మ.
మంగమ్మ నోటి ధాటికి తట్టుకోలేక పై పంచె దులిపి భుజాన వేసుకొని నిలబడ్డాడు వచ్చిన పెద్దమనిషి.
"ఇదుగో రామయ్యా! మా చలపతిపేర ఆస్తి రాస్తాడా సరేసరి. లేదా కూతుర్ని శాశ్వతంగా ఇంట్లోనే పెట్టుకోమను. ఆఁ ! తెగతెంపులు అయిపోయినట్లేనని చెప్పు" అన్నది మంగమ్మ.