మళ్లీ కళ్లు మూసుకున్నాను.
"బాబుగారూ!"
"కళ్లు తెరవండి!"
"నేనున్నాను. మీకేం భయంలేదు. కళ్లు తెరవండి."
నేను కళ్లు తెరిచాను.
నా మీదకు వంగి ఉన్న రహమాన్ ముఖం కన్పించింది.
రహమాన్ నా చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టాడు.
నేను చుట్టూ ఉన్న పరిసరాలను తల తిప్పిచూశాను.
చెట్టు మొదట్లో క్రీనీడలో మళ్ళీ ఏదో ఆకారం కన్పించింది.
మళ్లీ పిచ్చిగా అరచి రహమాన్ ను గట్టిగా పట్టుకొన్నాను.
"అదేం చెయ్యదు బాబూ! నేనున్నానుగా? కళ్ళు తెరవండి. ఒరే హనుమాన్ ఇలా వచ్చి బాబుగారికి దణ్ణంపెట్టి వెళ్ళిపో! మళ్లీ కన్పించకు" అంటున్నాడు రహమాన్.
"వద్దు! వద్దు! పిలవకు!" అన్నాను నిలువునా వణికిపోతూ.
"అలాగేబాబూ! ఒరేయ్ ఇక నువ్వెళ్ళిపో!" అన్నాడు రహమాన్.
"బాబూ కళ్ళు తెరవండి" అన్నాడు నాతో.
కళ్ళు తెరచిచూచాను. చెట్టుకేసి భయం భయంగా చూచాను. అక్కడేమీలేదు.
రహమాన్ నీళ్ల బాటిల్ అందిస్తూ "తాగండి బాబూ!" అన్నాడు.
రెండు చేతులతో బాటిల్ అందుకొని గటగట తాగేశాను.
మనసు కొంత కుదటపడింది.
ఖాళీ బాటిల్ ఇస్తుండగా నాకు అంతకుముందే నీళ్ళన్నీ తాగేశానన్న విషయం గుర్తొచ్చింది. మళ్ళీ ఈ నీళ్లు ఎక్కడ్నుంచి వచ్చాయ్?
"రహమాన్! ఈ నీళ్ళెక్కడివీ?"
రహమాన్ మర్మగర్భంగా నవ్వాడు.
మధ్యలో వీడొకడు దాపరించాడు. హాయిగా ఆ భూతరాజుతో వెళ్ళినా బాగుండేది. ఈ ప్రతి నిముషం చస్తూ బతికేకంటే ఒక్కసారే చచ్చేవాడ్ని. వీడు చిత్రహింస పెట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు.
"చెప్పవేం?" రెట్టించాను.
"వద్దులెండి బాబూ! ఇప్పటికే భయపడి పోయారు."
"ఫర్వాలేదు చెప్పు." చావుకు తెగించినట్టుగా అన్నాను.
"ఆ కోతిగాడే క్షణాలమీద ఎగిరెళ్లి తెచ్చాడు" అన్నాడు అదోలా నా ముఖంలోకి చూస్తూ.
నేను వెర్రిచూపులు చూశాను.
"కోతులు కూడా దయ్యాలవుతాయా?" నా గొంతు కీచుమంది.
రహమాన్ నవ్వాడు.
"వాడు కోతికాదు. పన్నెండేళ్లప్పుడు లారీకింద పడి చచ్చిపోయాడు. చిన్న సన్నాసిగా కోతి వేషాలేస్తుంటాడు. మీరు ఈ చెట్టు కిందగా వెళ్తున్నప్పుడే దయ్యాలను నమ్మను అన్నారు. అది ఆ కోతి వెధవ విన్నాడు. కోతిరూపంతో బండిమీద దూకాడు."
నా బుర్ర బండబారి పోతున్నది.
"ఒసేరంగీ! ఆ వెధవను కాస్త అదుపులో ఉంచు." చెట్టుకేసి చూస్తూ అన్నాడు రహమాన్.
"రంగెవరూ?" సగంమూర్ఛలో అడిగినట్టుగా అడిగాను.
"అదే బాబూ! వాడి అమ్మమ్మ! అదీ ఈ చెట్టుమీదే మకాం పెట్టింది. ఆ బోసి నోటితో మిమ్మల్ని చూసి విరగబడి నవ్వుతోంది."
నేను చివ్వునలేచి నిలబడ్డాను. నాలోకి పిచ్చిబలం వచ్చినట్టయింది. బండెక్కి కూర్చున్నాను.
"రహమాన్ పద వెళ్దాం!" అన్నాను.
రహమాన్ బండెక్కి కూర్చున్నాడు.
బండి బయలుదేరింది.
"బాబూ!"
"ఊఁ"
"ఇప్పటికైనా నమ్ముతారా దయ్యాలున్నయ్యని?"
"నమ్ముతాను. నమ్మకేం చేస్తాను? ఇక ఆ దయ్యాల కథలు చెప్పకు. ఊరు చేరే లోపలే నా గుండె ఆగిపోయేలా ఉంది."
"ఇవి కథలు కాదు బాబూ!"
"సరేలేవయ్యా! వాస్తవాలే! కథలు కావు. అంగీకరిస్తాను. ఇక ఆ విషయాలు మాట్లాడకు."
అనేసి వెనక్కు వాలి కళ్ళు మూసుకొన్నాను.
లయబద్ధంగా పడుతున్న గుర్రపు డెక్కల శబ్దం వింటూ మరో ఆలోచన మెదడులోకి రాకుండా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను.
"మై మైండ్ ఈజ్ బ్లాంక్. నా బుర్ర ఖాళీగా ఉంది. నా బుర్రలో ఎలాంటి ఆలోచనలూ లేవు. నా మనసు విశ్రాంతి తీసుకొంటున్నది. నాకు నిద్ర వస్తోంది. నేను నిద్రలోకి పోతున్నాను. నేను నిద్రలాంటి అవస్థలోకి పోతున్నాను."
ఆ మధ్య నేను హిప్నాటిజం మీద పుస్తకాలు తెగ చదివాను. మనసులోని భయాన్ని పారదోలడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొనే ప్రయత్నంలో ఉన్నాను.
గుర్రం బండి ఒక్కసారిగా ఆగింది.
నేను కళ్ళు తెరిచాను.
రహమాన్ గుర్రాన్ని సముదాయిస్తున్నాడు.
"ఫర్వాలేదు పద! అల్లరి చెయ్యకు!" అన్నాడు.
గుర్రం చిన్నగా అడుగులు వేస్తోంది.
మధ్య మధ్య చెవులు నిగడతన్ని మోర పైకెత్తుతోంది.
"ఏమైంది రహమాన్?" మళ్లీ ఏం కొంప మునిగిందన్నట్టుగా అడిగాను.
"మీకు విన్పించడం లేదా!"
బద్మాష్! వీడూ భూతరాజులాగే అడుగుతున్నాడు. వీడు ఇంత వరకూ చెప్పినవన్నీ కట్టుకథలే. ఎంతసేపు గుర్రం పరిగెడుతున్నా దూరం తగ్గడంలేదు.
"అదో వినండి బాబు!" అల్లంత దూరంలో, వెన్నెల్లో, వింతగా మెరుస్తున్న పెద్ద మర్రి చెట్టును చూపించాడు.
"అక్కడేముంది?"
"జాగ్రత్తగా వినండి బాబూ!"
"అసలు సంగతి ఏమిటి? ఏం వినాలి?"