Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 13

"నీ కోరికలో నమ్మకం వుండాలి. ఒకనాడు నువ్వు ఊహించని వింత సంఘటన నీ జీవితంలో జరగవచ్చును. తప్పక జరుగుతుంది. నా మాటమీద నమ్మకం కలిగివుండు."
"అలా జరగాలనే అభిలాష. అసలు విషయం దాటేస్తున్నారు. ఇండియాలో ఎక్కడ కన్పిస్తారు? మీ పేరు ఏమిటి?" అర్థిస్తున్నట్టుగా అతని ముఖంలోకి చూసింది సీత.
"నువ్వు నన్ను చూడగలవు. కాని అప్పుడు నన్ను భిన్న వ్యక్తిగా చూడగలవు.
ఇంతవరకూ నువ్వు చూసిన వ్యక్తిత్వం వేరు. చూడబోయే వ్యక్తిత్వం వేరు."
"ఇప్పుడు చెప్పను."
"నేను నీ గురించి ఆలోచిస్తూనే వుంటాను."
"ఆలోచించక తప్పదు."
"అదేమిటి?"
"నువ్వు నాగురించి ఆలోచించేలా నేను నిన్ను దూరంనుంచే నా ఆలోచనల ద్వారా శాసించగలను."
"నాకు అదే కావాలి. నువ్వు ఉన్నావనీ, నాకు అవసరం అయినప్పుడు నీ సహకారం అందుతుందనీ నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నాకు కొండంత మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలదు."
"ఏదో అతీతశక్తి మనిద్దరి జీవితాలనూ కలిపిందనే నమ్మకంతో వుండు. నేను తప్పక నీకు కన్పిస్తాను. అవసరం అయినప్పుడు నువ్వు పడిపోకుండా నా చేతిని అందిస్తాను."
"అంటే...ఏదో అవాంతరం వస్తేగాని మళ్ళీ కన్పించావా?"
"మరోసారి...అంటే ఈరోజు మళ్ళీ నిన్ను కలుసుకొని ఉండాల్సింది కాదు. ఇది నేను తలపెట్టిన కార్యసాధనకు ఆటంకం కలిగించే అవకాశం లేకపోలేదు. అయినా వచ్చాను. ఎందుకో తెలుసా? నేను మరొకసారి కన్పించడంవల్ల నీకు సంతోషం కలుగుతుందని- అంతేకాదు, నీ వెనుక నేను ఉన్నాననే నమ్మకం నీకు కలిగించాలనే ఉద్దేశ్యం."
"చాలా థ్యాంక్స్! నిన్ను నేను మర్చిపోలేను. నిన్ను ప్రతిక్షణం తల్చుకుంటూనే వుంటాను. నిన్ను తల్చుకోవడంలో నాకేదో చెప్పలేని ఆనందం కలుగుతున్నది. మరోపక్క మళ్ళీ కన్పించవేమోననే భయంతో కూడిన బాధ కూడా కలుగుతున్నది.
"నిన్ను నేను పోగొట్టుకోలేను..."
మనం ఎవరిని ఎవరూ పోగొట్టుకోం. గుడ్ నైట్, ఇక నేను వెళతాను. జాగ్రత్తగా వుండు. పిచ్చిపిచ్చి ఆలోచనలతో ఆరోగ్యం పాడుచేసుకోకు.
అతను ఆమె చేతిని అందుకున్నాడు. పెదవులకు ఆనించుకొని వదిలేశాడు.
సీత మనసు అనిర్వచనీయమయిన అనుభూతితో నిండిపోయింది. చల్లని, తెల్లని వెన్నెల ఆమె శరీరాన్ని కప్పేసినట్టు అనుభూతి చెందింది.
ఆమె ఆ మధుర అనుభూతి నుంచి బయటపడి అతనికేసి చూసింది. కాని అతను ఎదురుగా లేడు. నాలుగువేపులా దృక్కులు సారించింది. అతని జాడ కన్పించలేదు.
ఆమెకు అంతవరకూ జరిగింది కలా నిజమా అనే అనుమానం కలిగింది. తమాషా అనుభూతి కలిగింది. కళ్ళు మూసుకొని అతని రూపాన్ని గుర్తుచేసుకోడానికి ప్రయత్నించసాగింది. అతను తన ఎదురుగా నిల్చి వున్నట్టుగా భావించసాగింది. అతని కంఠం ఇంకా ఆమె చెవులకు విన్పిస్తూనే వున్నది.
చిన్నగా కళ్ళు తెరిచింది. ఆకాశంకేసి చూసింది.
నక్షత్రాల వెలుగు ఆమెకు కొత్తగా కన్పించింది.
అసలు తన జీవితమే ఒక కొత్త మలుపు తిరిగినట్టుగా ఆమెకు అనిపించింది.
ఆమెకు తనముందు బంగారు భవిష్యత్తు వున్నట్టుగా అన్పించింది.
అవును అతను తనకు భవిష్యత్తుమీద నమ్మకాన్ని కలిగించాడు.
కాని...అతను మళ్ళీ కన్పించకపోతే?
కన్పిస్తాడు, తప్పక కన్పిస్తాడు.
అతను ఎలా అకస్మాత్తుగా తనే ముందుకు వచ్చాడో, అలాగే తనకు తెలియకుండా మాయం అయ్యాడు.
ఆనంద సముద్రంలో తలమునకలవుతున్న తను అతను వెళ్ళిపోవడాన్ని గమనించలేదు.
ఆలోచిస్తూ సీత క్యాబిన్ లోకి ప్రవేశించింది.
రెండోరోజంతా తన బాబాయి ఇచ్చిన పనిచేసింది. రాత్రి పొద్దుపోయేవరకూ చేసింది. తలనెప్పిగా అన్పించింది. క్యాబిన్ ఊపిరి సలపనట్టుగా అన్పించి, చివ్వున లేచింది. డెక్ పైకి వెళ్ళింది.
అతనిని గురించి ఆలోచించసాగింది. ఆమెకు అతను కన్పిస్తాడనే నమ్మకం వుంది. ఆ నమ్మకంతోనే దాదాపు రెండు గంటలు డెక్ పైన కూర్చున్నది.
అతను రాలేదు.
ఆమె అశాంతిగా డెక్ మీద అటూయిటూ తిరిగింది. యాంత్రికంగా అతన్ని గురించి ఆలోచిస్తూనే తన క్యాబిన్ లోకి వెళ్ళింది.
నిద్రరావడం లేదు. కాని పనిచేసే మూడ్ లేదు. కళ్ళుమూసుకొని పడుకున్నది.
ఎందుకూ అశాంతి?
తనలో ఏమిటి ఈ అలజడి?
ఎవరి కోసం? ఎవరికోసం? ఇంకెవరి కోసం?
"అతని కోసం" అని ఎవరో అన్నట్టుగా అన్పించి కళ్ళు తెరిచింది.
ఎవరూ లేరు. శూన్యంలోకి నిరాశగా చూసింది.
"అతని కోసమే" అన్నది ఎవరూ?
ఇంకెవరు? తన మనసే!
అతను ఎందుకు రాలేదు?

 Previous Page Next Page