"అలా అనకండి. త్వరలోనే రావాలి మీరు. భగవంతుడి దయ వలన ఈ యుద్ధం ఆగిపోవాలి. త్వరగా వచ్చేయాలి" అతని హృదయానికి హత్తుకుంటూ అంది విచారంతో. బరువెక్కిన హృదయాలు మూగగా రోదించాయి.
"ఏమండీ! ఈ రాత్రి ఇలాగే ఆగిపోతే! ఎంత బాగుంటుంది. నవ్వుతూ విచారాన్ని దాచుకుంటూ అంది ఆమె.
"పిచ్చిదానా విచారపడుతున్నావు కదూ! ఇటు నిన్నూ, అటు నాన్ననీ ఇద్దర్నీ బాధపెడుతూ నేనెందుకు వెళుతున్నానో నాకే తెలీదు."
"బాధ్యత. బాధ్యతలు నెరవేర్చేటప్పుడు న్యాయం తప్ప బాంధవ్యం అడ్డు రాకూడదు. దేశరక్షణ కోసం మీరు తీసుకున్న నిర్ణయమే న్యాయమైనది" నవ్వుతూ అతని తలకట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ అంది.
"మిమ్మల్ని విచారపరచటం కూడా న్యాయమేనంటావా?"
"ఛఛ... బాధేంలేదు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగొచ్చిననాడు నేనూ, నాన్నగారు కూడా సంతోషిస్తాం."
అతని గుండెల మీద తల ఆనించి అంది మాధవి.
"మధూ! నేనెంతో అదృష్టవంతుణ్ణి. రూపవతి, సుగుణవతి అయిన నిన్ను భార్యగా పొందినందుకు గర్విస్తున్నాను. ఆడది అబల కాదని అర్థం చేసుకోగల దేవత అని నిరూపించావు. మధూ! జన్మజన్మలకీ నిన్నే భార్యగా పొందే అదృష్టాన్ని ఇవ్వమని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను" కౌగిట్లో బంధించి, ముద్దులతో నింపేస్తూ అన్నాడు అజయ్. అతని కౌగిటిలో కరిగిపోతూ సురలోక సుఖాన్ననుభవించింది ఆమె.
విడువలేక విడవలేక మాధవిని విడిచి బయలుదేరాడు అజయ్. దుఃఖాన్నంతా కడుపులోనే దిగమింగుకుంటూ, నవ్వుతూ సాగనంపింది ఆమె.
కొడుకుని చూడగానే చింకి చాటంత అయింది మృత్యుంజయరావుగారి ముఖం. "బాబూ! ఇదేనా రావడం" అంటూ పలుకరించారు.
మాసిన గడ్డం, పీక్కుపోయిన మొహం చూసి అడిరిపోయాడు అజయ్. నాన్నా! ఒంట్లో బాగోలేదా? అలా వున్నారేం?" అన్నాడు నెమ్మదిగా.
"బాగానే వున్నాన్రా. నాకేం? బంగారంలా వున్నాను" అన్నారు నవ్వుతూ. ఆ నవ్వులో పూలజల్లులు కురిసినట్లనిపించినా, ఏవో ముళ్ళు కూడా గుచ్చుకున్నట్లనిపించింది అజయ్ కి. విచారం గుండెల్లో వుండచుట్టుకు పోయింది.
అంతలో గోపీ వచ్చాడు. "బావా! ఇదేనా రావడం?" అంటూండగా రావుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. "అవున్రా నాన్నగారెలా వున్నారు? అదోలా కనిపిస్తున్నారే? ఆరోగ్యం బాగుందా?" అడిగాడు అజయ్.
"ఆరోగ్యం బాగానే వుంది. మనసే బాగులేదు. ఈ నాలుగురోజులూ ఇంటిపట్టునే ఆయన్ని కనిపెట్టుకునుండు బావా" అన్నాడు గోపీ.
"అలాగేరా! కానీ నాన్నగారు బాధపడకుండా చూడు" గోపీ కేసి ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు అజయ్.
"అలాగేలే!"
నాలుగు రోజులూ నాలుగు నిమిషాలలాగ గడిచిపోయాయి. అజయ్ బయల్దేరేరోజు రానే వచ్చింది. సామాన్లు సర్దాడు గోపీ. అజయ్ తండ్రినంటిపెట్టుకునే వున్నాడు.
రోజంతా పసివాడిలాగా, గుండె గుండెలో అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నా పైకి మాత్రం గంభీరంగా వున్నారు రావుగారు, అజయ్.
రైలు కదిలింది. కన్నీరు పొరలు చూపును దాచేస్తూంటే, కళ్ళొత్తుకుంటూ కనిపించినంత వరకూ చెయ్యూపారు రావుగారు. అజయ్ గుండెల్ని అదిమి పట్టుకుని సీట్ లో కూర్చున్నాడు.
రావుగారిని చెయ్యి పట్టుకుని నడిపించి కారుదాకా తీసుకెళ్ళాడు గోపీ. కారు కదలగానే హృదయం బద్దలయ్యేలా ఏడ్చేశారు రావుగారు. ఓదార్చడం తప్ప గోపీ మాత్రం ఏంచెయ్యగలడు? కలత పడ్డ మనసులతో, గాయపడ్డ హృదయాలతో ఇల్లు చేరుకున్నారందరూ. అజయ్ స్నేహితులు కూడా. రావుగారికి ఇంటిదాకా సాయం వచ్చి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు.
"శ్రీరామ శ్రీరామ గోవిందా రామ, సీతారామ గోవిందా... ఏడుకొండలవాడ గోవిందరామ, వెంకటరమణా గోవిందా" రుద్రాక్షమాలను వూపుతూ గోవింద నామాలు చదువుకుంటోంది గోవిందమ్మ.
"అమ్మా నన్నూ ఆశీర్వదించు. నేను వెళ్ళిపోతున్నాను" అన్నాడు గోపీ.
"ఎక్కడిరా?" సోఫాలోంచి లేచి నుంచుంటూ కంగారుగా అడిగింది గోవిందమ్మ.
"బావతోపాటే సైన్యంలో చేరిపోతున్నాను"
"నీకేం ఖర్మరా? నిధి నిక్షేపాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇహనుంచి ఈ ఆస్తికంతా నువ్వే వారసుడివి. వాడి ఖర్మాన వాడు పోయాడు. అనుభవించడానికైనా అదృష్టం వుండాలి" కొడుకు తల నిమురుతూ సంతోషంగా అంది.
"అయితే నువ్వు చెప్పిన నీతులన్నీ, మామయ్యకీ, బావకీ మాత్రమేనా అమ్మా."
"అవునురా వెఱ్ఱి నాగన్నా! యుద్ధానికెళ్ళినవాడు, కాశీకెళ్ళిన వాడు తిరిగి కలుసుకునేది కాటి దగ్గరే అంటారు. ఈ ముసిలాడు కాస్తా గుటుక్కుమంటే ఈ ఆస్థి, ఐశ్వర్యం అంతా నీదేరా బాబూ!" సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ, అప్పుడే ఆస్థంతా వచ్చేసినట్టుగా ఊహించుకుంటూ చెబుతోంది.
"అమ్మా! ఇదంతా నాకోసమే చేస్తున్నావా అమ్మా? ఆనాడు కైకేయి కూడా అచ్చు నీలాగే చేసింది. భరతుడికి పట్టం కట్టాలని చెప్పి శ్రీరాముణ్ణి అడవులకి పంపించింది."