Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 13

                                 


    
    రాజకుమారి! చూడు మొక రాజతనూజఁ డనభ్రవిభ్రమ
    భ్రాజిత భానుతేజుఁడు శరాసన మెక్కిడలేక "సింహ మం
    దే జనియించి సింహధను వెక్కిడుటల్ గృహవేధ" యంచు స
    వ్యాజవిరాగి వెన్కడుగు వైచె సగోత్రత వెల్లడించుచున్.
    
    అల్లదుగో కనుంగొనవె అంబుజపత్రవిశాలనేత్ర! రా
    మల్లుఁ డొకండు పెల్లుబికి మత్తగజేంద్రము భంగి స్పర్ధ రా
    జిల్లఁగ వచ్చి కట్టెదుట సింహధనుస్సును గాంచి గుండియల్
    జల్లన కాల్ కదల్చడు! భుజాలు మెదల్పడు! రెప్ప వాల్పడున్!

                                 విజయ సిద్దార్ధము
    
    విన్నావా విమలేందు సుందరముఖీ! విచ్చేయుచున్నారటే
    కన్నాకై యువరాజ గౌతములు; శాక్యస్వామి చేపట్టునే
    నిన్నీనాఁడు' లతాంగి! యింత దనుకన్ వీక్షించి వీక్షించి నీ
    కన్నుల్ కాయలుగాచె; నేఁడు భవదాకాంక్షల్ ఫలించుంగదే!
    
    అప్పుడె పెండ్లిసిగ్గు లవురా! జవరాలికి; మోము ప్రక్కకున్
    ద్రిప్పుకొనెం గదమ్మ! నునురెప్పలలోన ప్రమోదబాష్పముల్
    చిప్పిలుచుండె; మేన విరిసెం బులకల్; హృదయానురాగముల్    
    చెప్పక చెప్పుచున్నయవి చెక్కులు ముద్ద గులాబిరేకులై.
    
    ఎవ్వని కోసమై కలవరించితివో రసరమయగీతులం;
    దెవ్వని రూపురేకల స్మరించితివో మధురానుభూతులం;
    దెవ్వనికై ధరించితివో యీ విరిదండను రెండుచేతులన్;
    జవ్వని! వాఁడె ముందునకు సాగెను సింహధనుస్సు నెక్కిడన్.
    
    చకచక వచ్చి, తద్దనువు చయ్యన వంచి, గుణంబు గూర్చి, అం
    బకము లమర్చి, యుక్తమగు పట్టులకుం గురిపెట్టి  కొట్టుచున్
    'సకలకళావిదుం' డనుచు సభ్యుల మెప్పుల గన్న దెవ్వరో
    వికచసరోరుహాక్షి! కనవే! వినవే! జయ మంగళధ్వనుల్.
    
    ఆకర్ణాంత వికృష్ణ సింహధను రుద్యన్మేఘ విస్ఫూర్జితం
    బాకర్ణించిన రాజహంసములు చీకాకై దిశల్ పట్టఁగా,
    కేకల్ వేయుచు నాట్యమాడెనుగదే కేళీమయూరంబులై
    ఆకర్ణాంతవిశాలలోచన! త్వదీయాకాంక్ష లుత్కంఠముల్.
    
    తాళమహీజముల్ విరిగి ధాత్రి పయిం బడుచుండె ఖండఖం
    డాలయి, వీరశాక్యనరనాథకుమారుని ఖడ్గధారకున్;
    ఫాలము నేలమోపి ప్రణిపాత మొనర్చెగదే తదంఘ్రి ప
    ద్మాలకు పర్వతాభము ప్రమత్తవనేభము కుంచితాంగమై!
    
    పోతులవంటి మల్లురను పొంకమడంచె; నహంకరించు నా
    బోతుల లోగొనెన్; పొగరుబోతు హయమ్ముల నొంచె; ఖడ్గవి
    ద్యాతిశయమ్ము జూపి పెనుతాళములం ధర గూల్చె; శాక్యరా
    ట్సూతి భుజా విజృంభణము చూడగదే జగదేకసుందరీ!
    
    కాంచియుగాంచనట్టు లటు గాంచెద వెంతటి నంగనాచి రా
    యంచవె! సిగ్గు చాలిక స్వయంవరమాలిక  స్వామి కంఠమం
    దుంచవె! సారసోదరసహోదరముల్ కరముల్ రవంత  సా
    రించవె! మందహాసమధురీకృతచారువిలోచనాంచలా!
    
    సత్యముతో అహింసవలె, శౌర్యముతో జయలక్ష్మిమాడ్కి, సా
    హిత్యముతో రసధ్వని రహిన్, శ్రుతితో స్మృతిరీతి, స్తుత్య స
    త్కృత్యముతో యశోద్యుతిగతిన్ పతితో జతగూడి నిత్య దాం
    పత్యసుఖంబు చూరగొనుమా కులకాంతల మేలుబంతివై.
    
    అమ్మ! యశోధరా! వధువువైతివి; నీ హృదయాధినాథు హ
    స్తమ్ము గ్రహింపు; ప్రీతిమెయి సప్తపదిం గమియింపు; బ్రహ్మబం
    ధమ్మును గౌరవింపు; సహధర్మిణివై యశముం గడింపు; మీ
    కమ్మని సౌహృదం బలరుగాథ రసార్ద్ర మహాప్రబంధమై.
    
                                         * * *
    

    బృందారకానంద మందార మకరంద
        బిందు నిష్యందాల విందు పెండ్లి;
    రంగారు ముంగారు బంగారు సరసాంత
        రంగాల సత్యనర్తనము పెండ్లి;
    సోగకన్నులరాణి రాగరంజిత పాణి
        రాణించు మాణిక్యవీణ పెండ్లి;
    చిన్నారి పొన్నారి చిగురుచెక్కిళ్ళలో
        నవ్వులొల్కు గులాబిపువ్వు పెండ్లి;
    
    ప్రేమతో దేవతలు పెట్టు భిక్ష పెండ్లి;
    అక్షయంబైన శ్రీరామరక్ష పెండ్లి;
    పులకిత యశోధరా గౌతముల రసార్ద్ర
    నవనవోన్మేష హృదయబంధనము పెండ్లి.

                                        


    ప్రాత రహస్కరాంబుజ పరస్పరభావ సమైక్యరూపమై,
    శీతమయూఖ కైరవ విశేష మనోజ్ఞ కళాకలాపమై,
    జ్యోతిరుదాత్త దీపమయి సొంపుల నింపుకొనెన్ యశోధరా
    గౌతమ నూతనప్రణయకావ్య ముదాత్తగుణాణుభావ్యమై.
    
    మూడు కాలమ్ములను సౌఖ్యమును ఘటించు
    మూడు సౌధాలు కట్టించినాఁడు రేఁడు;
    వలచి వలపించుకొన్న ముద్దుల వెలంది!
    దాస దాసీజనమ్ము వందల కొలంది!


    నిర్విరామ వీణా వేణు నిస్వనములు,
    నవ్యలావణ్య నర్తకీ నర్తనములు,
    మంజు మంజీరా శింజినీ శింజితములు,
    నూత్న దాంపత్య సుమనో మనోరథములు.
    
    కమల పత్రమ్ముపై హిమకణము కరణి
    శాక్యరాణ్ణందనుని మానసప్రవృత్తి
    అంటి అంటదు రాజ్యసౌఖ్యముల యందు
    విశ్వకారుణ్య భావానావేశ వశత.
    
    శాక్యచంద్రు విశాల వక్షమ్మునందు
    తన ముఖము దాచుకొని యశోధర వచించె-
    పలుకు పలుకున నెమ్మేను  పులకరింప
    తళుకు గన్నుల వలపులు తొలకరింప.
    
    "రతినై నీ నవమన్మథాకృతి సమారాధింతు; కల్యాణ భా
    రతినై నీ చతురానన ప్రభలలో రాణింతు; కప్రంపు టా
    రతినై నీ చరణాంబుజద్వయము నీరాజింతు; నానాథా! ఈ
    బ్రతుకెల్లన్ విరజాజినై కదలి నీపై పూలు వర్షించెదన్.
    
    తన్మహా నటరాజ పాదముల యందు
    నొక్క టీవగు; మేను వేరొక్క టగుదు;
    ఘల్లు ఘల్లున కదలి జగమ్ములందు
    నింపుదము నిత్యకల్యాణ నిక్వణములు.
    
    స్వామి కారుణ్యమయ విలోచనములందు
    ఒకటి నీవగు; మేను వేరొకటి యగుదు;
    కనులు రెండయ్యు దృష్టి యొక్కటిగ సాగి
    నింపుదము సృష్టిలో ప్రేమసంపదలను.
    
    దవ్వుల నుండి పిల్చు తమ దగ్గరకున్; ప్రియదర్శనంబులై
    ఎవ్వరిజోలి కేగవు; మరేమియు పల్క; వమాయికంబుగా
    నవ్వుచునుండు; విశ్వకరుణాలహరీ మధుశాలలైన ఈ
    పువ్వులబాల లీశ్వరుని ముద్దుల బిడ్డలు చూడుమో ప్రభూ!"

 Previous Page Next Page