"రెండు రౌండ్లు అయింది. ఒక్క షో లేదు" అన్నాడు శేఖర్.
"ఏం పోయిందిలే, కష్టపడి సంపాదిస్తున్నావా? మీ అన్నయ్య డబ్బే కదా? ఆయనకీ పిల్లా జెల్లా లేరు. నిన్నూ నీ పిల్లల్ని భార్యని చూసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు."
"ఇదిగో చౌదరికి యిలాంటి మాటలేవచ్చు. భార్గవితో కత్తు కలపడమంటే"- చేయి అడ్డంగా తిప్పేడతను.
"అదేమంత సులభమా?"
"కష్టపడితేనే కదా లక్షల ఆస్తి చేతికి చిక్కేది."
"ఎలా వస్తుందోయ్ తమ్ముడుగాడు ఒకడున్నాడు అడ్డం, పైగా కొడుకు వుండనే వుండే!"
"ఆస్తి రావాలా? అయివేజు చాలదూ?"
నసిగేడు చౌదరి.
"నీ కేమిటంత శ్రద్ద?"
మునసబు ధర్మారెడ్డి ప్రశ్నకు సమాధానం యివ్వలేదు శేఖర్.
"అసలు మనవూళ్ళో అంత అందగత్తె వుందాని? సినిమాల్లోకి దించాలని ఎవరూ అనుకోలేదు కానీ ప్రయత్నిస్తే హీరోయినవుతుంది."
"హీరో ఎవరంటా వోయ్?"
"చెప్పాగా చౌదరి."
"నా మీద పట్టించావేం శేఖర్?"
"ఇదిగో మావా నాకు తెలుసు నీ సంగతి, వూరికే బుకాయించవద్దు. నిజంగా చెప్పు. నీ మనసులో లేదూ?"
"ఛ! ఛ!"
"అయితే ఆమె విషయం వదిలేద్దామా?"
"ఇప్పుడు పట్టుక కూర్చున్నానా?"
"నేననేది అది జరగటం లేదనే"
ఫక్కున నవ్వాడు నాయుడు. అందరూ నవ్వేరు నవ్వుల మధ్య మునసబు షో చేశాడు.
"ఖాళీ" అన్నాడు శేఖరం.
"ఏమిటి?"
"మూడొందలు, మా అన్నయ్య కెవరో యిచ్చారీ రోజు బీరువాలో పెట్టకుండా దస్తుపెట్టెలో వుంచాడు. జేబులో వేసుకుని వచ్చాను"
"అవును మీ అన్నయ్య కనుక్కోలేడా?" మళ్ళీ ముక్కలు వేయబోయాడు నాయుడు.
"నాకు పంపకం వద్దు." ఆ ప్రశ్నకి సమాధానం యివ్వకుండా అన్నాడు శేఖర్.
"ఏం?" ఆశ్చర్యంగా అడిగాడు.
"చెప్పాగా జేబు ఖాళీ"
"అయితేనేం గాత్రంపాడు. లేదా చౌదరి వద్ద బదులు తీసుకో, కాదంటే నేనిస్తా"
"వద్దు."
"ఏంటోయ్ గొడవ?"
"నేను యిప్పటినుంచి బాకీ అడగదలుచుకోలేదు. ఎప్పుడైనా తీర్చాల్సిందే గదా!"
"ఎగేద్దా మనుకున్నావా?"
"అందుకే వద్దంటున్నాను."
"బావుంది! బార్ లో, క్లబ్ లో అప్పు చేయకూడదనుకుంటే ఎలా? ఇదిగో శేఖర్! మనకేమిటి యీ నీతులు? మనంమనం ఒకటి ఇదిగో రెండొందలు. వున్నపుడే యిచ్చెయ్!" అన్నాడు చౌదరి.
"అది అందుకున్నాడు శేఖర్." "ఇదిగో! యీ డబ్బు మాత్రం పేకలో గెలిస్తేనే తీరుస్తా లేదా అప్పు అలాగే వుంటుంది."
"వుండనీ....పెరుగుతూనే వుంటుంది కదా?"
"అమ్మ ఎంత ఆశ? ఎప్పుడూ వడ్డీ చింతేనా? ఈ చింతలో కాస్తంత ధ్యాస భార్గవిపై వుంచితే__"
"అబ్బబ్బ! నన్ను చంపకయ్యా బాబూ!"
"వూరకే అలా అంటావు కాని! అటు చూడు ముఖాన ముసి ముసి నవ్వులు___"
"సర్లే! సర్లే! ముక్కలు వెయ్!"
"అబ్బ! యిప్పటికి సరే అన్నాడు మామా! మాకు డైలీ ప్రోగ్రెస్ రిపోర్టు కావాలి తెలుసా"