Previous Page Next Page 
మరీచిక పేజి 13


    "పేరు గౌతమ్ అన్నావుగా!"

 

    "ఆపేరు నేను పెట్టుకొన్నదే" ఆనందంతో కళ్ళు మెరుస్తున్నాయి.

 

    జ్యోతికి శబరి అమాయకత్వం చూస్తుంటే జాలి వేసింది.

 

    "అతను ఎక్కడుంటాడు? ఏం చదివాడు? ఏం చేస్తున్నాడు?"

 

    "ఏమీ చెయ్యడు! ఎక్కడయినా వుంటాడు. అతను వున్న చోటునే స్వర్గం వుంటుంది.

 

    "హిప్పీగాడా?"

 

    "అవును."

 

    జ్యోతి ఆలోచనలో పడింది. శబరి మార్గం తప్పుతున్నది. వాడెవడో అమాయకులైన వారికి మత్తుమందుల రుచి చూపించి ఆకర్షిస్తున్నాడు. వాడికి బుద్ధి చెప్పాలి. శబరికి రక్షించాలి.

 

    "స్నానం చెయ్యలేదా? ఆ బట్టలేమిటి? ఆ జుట్టు ఏమిటి?"

 

    "రోజూ స్నానం యెందుకు చెయ్యాలి? బట్టలు ఎలా వుంటేనేం. గౌతమ్, మేరీ ఇద్దరూ బట్టలు సరిగా వేసుకోరు."

 

    "ఆ మేరీ ఎవరు?"

 

    "గౌతమ్ గరల్ ఫ్రెండ్! వాళ్ళెంత హాయిగా వుంటారనుకున్నావ్?"

 

    "నువ్వూ బట్టలు వేసుకోవడం మానేస్తావా?"

 

    "ఎందుకు మానెయ్యకూడదు? రాతియుగంలో మనుషులు బట్టలు వేసుకొనే వారా? నగ్నంగా తిరుగుతూ, దొరికింది తింటూ, పక్షులతో, పూలతో ఆడుకుంటూ బతికేవారట! ఈ పాపపుణ్యాల భావమే వుండేది కాదట! మనిషిలో స్వార్థం ప్రవేశించింది. బట్టలు వేసుకోవడం ప్రారంభించాడు. శరీరంతోపాటు ఆత్మకు కూడా నీతి, నియమం అంటూ పరదాలు వేశాడు. మనిషి పూర్తిగా హిపోక్రాట్ అయ్యాడు. స్వార్థం పెరిగింది. చుట్టూ కొన్ని బంధనాలను ఏర్పరచుకున్నాడు. ఆ బంధాల్లో బతకడాన్నే సంస్కృతి, నాగరికతా అన్నాడు."

 

    "ఇవన్నీ నీకు ఆ హిప్పీగాడే బోధించాడా?" జ్యోతి విస్మయంగా అడిగింది.

 

    "అవును!"

 

    "అతన్ని నాకు చూపిస్తావా?"

 

    "ఓ! నిజంగా వస్తావా? నీకూ స్వర్గం చూపిస్తాడు. ఇద్దరం ఈ కుళ్ళు సమాజం నుంచి పారిపోదాం!" కళ్ళు తిప్పుతూ ఉత్సాహంగా అన్నది శబరి.

 

    "అలాగే! పద! అతన్ని చూపించు!" ఇద్దరూ బయలుదేరారు.

 

    "అమ్మాయిగారూ ఎక్కడికి?" పోచమ్మ ఎదురుగా వచ్చి నిల్చుని అడిగింది.

 

    "నీకు చెప్పాలా?"

 

    "అమ్మగారు మిమ్మల్ని బయటికి పోనివ్వద్దన్నారు."

 

    "చూశావా వెధవబంధాలు? అందుకే...."

 

    "ఫర్వాలేదు పోచమ్మా! నేను ఉన్నాగా!" మధ్యలో అందుకుని అన్నది జ్యోతి.

 

    "అమ్మగారికి తెలిస్తే చంపేస్తారమ్మా! నా కొలువుపోతుంది."

 

    "ఇప్పుడే వస్తాం! మీ అమ్మగారు వచ్చేలోపలే వచ్చేస్తాంగా" అన్నది జ్యోతి.

 

    "బోడి! దానికి చెప్పేదేమిటి? పద పోదాం"౧ దురుసుగా అన్నది శబరి.

 

    "అలా అనకు శబరీ! ఆమె భయం ఆమెది. కొలువు పోతుందని భయం."

 

    "అంత భయంతో బతక్కపోతేనేం? వెధవ కొలువు పోతే ఎంత? ఉంటే ఎంత? ఆ డ్రైవర్ గాడికి కూడా ఒకటే భయం!"

 

    జ్యోతి ఏడవలేక నవ్వినట్టు నవ్వింది.


                                                           9


    అల్లంత దూరంనుంచే సన్నగా గిటార్ స్వరం వినిపిస్తూ ఉన్నది.

 

    దూరంగా చెరువుగట్టున ఉన్న చెట్టుకింద మూడు మానవాకారాలు కన్పించాయి. మగవాళ్ళో ఆడవాళ్ళో పోల్చుకోలేకపోతున్నది జ్యోతి.

 

    "అడుగో! అతనే గౌతమ్ ఈ రోజు మరో కొత్త అబ్బాయి కూడా ఉన్నాడు!" ఉత్సాహంగా అన్నది శబరి.

 

    "అమరూ అబ్బాయిలేనా?"

 

    శబరి పకపక నవ్వింది. "ఇద్దరు అబ్బాయిలూ - ఒక అమ్మాయి. ఆ అమ్మాయే మేరీ! నీకు అందరూ ఒకలాగే కన్పిస్తున్నారుగదా?" మళ్ళీ పకపక నవ్వింది. జ్యోతి మౌనంగా నడుస్తూంది.

 

    "ఆ గిటార్ వాయిస్తున్నాడు చూడు! అతనే నా బాయ్ ఫ్రెండ్!"

 

    జ్యోతి వినిపించుకోనట్టే నడుస్తూంది.

 

    "ఆ మ్యూజిక్ బాగుందికదూ! మిగతా ఇద్దరూ ఎంత తమాషాగా మూవ్ మెంట్స్ ఇస్తున్నారో చూడు! మ్యూజిక్కుకు అనుకూలంగా!" దాదాపు తనూ ఊగిపోతున్నట్టే అన్నది శబరి.

 

    "వాళ్ళిద్దరి పేర్లూ ఏమిటి?"

 

    "అమ్మాయి పేరు మేరీ అని చెప్పానుగా? చూడు ఎంత బాగా డ్యాన్సు చేస్తుందో!"

 

    "అది డ్యాన్సా!"

 

    "ఏం కాదా?"

 

    ఒకడు గిటార్ వాయిస్తున్నాడు. మిగతా ఇద్దరు ఒకర్నొకరు పెనవేసుకొని చిందులు వేస్తున్నారు. ఎవరికీ ఒంటినిండా బట్టలు లేవు. మగవాళ్ళిద్దరూ కేవలం మురికిపట్టిన నిక్కర్స్ మాత్రం వేసుకొని వున్నారు. మేరీ షర్ట్ కు బటన్స్ లేవు. మోకాళ్ళపైకి చిన్నబట్ట చుట్టుకున్నది. నడుముకు పట్కా పెట్టుకున్నది. ఆ పట్కాకు ఒక గుడ్డ సంచిని వేలాడదీసింది.  

 

    జ్యోతి, శబరి కొద్దిదూరంలో నిల్చున్నారు. తన్మయత్వంలో ఎవరూ గమనించలేదు. శబరి కళ్ళు పెద్దవి చేసుకొని వాళ్లను చూస్తూ నిల్చుంది. జ్యోతికి వాళ్లను చూస్తుంటే అసహ్యం వేసింది. ఆలోచిస్తూ నిల్చుంది జ్యోతి.

 

    ప్రేమా... శాంతీ... ఆనందం-స్వర్గం... నిర్వాణం... విముక్తి అనే మాటల్ని పదేపదే వల్లించే ఈ పూలబాలలు... మాదక ద్రవ్యాలు దొరకడం ఆలస్యం అయితే ఎన్నో ఘోరాలు చేస్తారని తను విన్నది. ఆ నరాల బాధ నుంచి విముక్తి పొందడానికి, ఎంత నికృష్టమైన పనిచెయ్యడానికి కూడా వెనుదియ్యరట! కొందరు దొంగతనంచేస్తే, మరికొందరు వ్యభిచరిస్తారట! ఒకోసారి తన తోటి వాడినికొట్టి, అవసరం అయితే చంపి కూడా ఆ మందును లాక్కుంటారట! ఈనాటి సమాజం కుళ్ళిపోయింది. రోగగ్రస్తమైంది. ఆరోగ్యాన్ని కొలిచే బ్యారోమీటర్స్ హిప్పీస్. అవును "హిప్పీస్ ఆర్ ది బ్యారో మీటర్స్ ఆఫ్ ద సిక్ సొసైటీ" అంటారు.

 

    ఈ కుళ్ళిన సమాజపు కంపును భరించలేక ఈ సమాజంతో ఇమడలేక... సమాజంలో జరిగే అన్యాయాలకూ, అక్రమాలకూ తట్టుకోలేక... సమాజాన్ని ఎదిరించి నిలబడే శక్తిలేక దూరంగా పారిపోయి చెట్టూ పుట్టా పట్టుకుని తిరిగే వాళ్ళే హిప్పీస్. వాళ్ళను చూస్తుంటే చాలా జుగుప్స కలుగుతుంది. రోగగ్రస్త శరీరంమీది కురుపులాంటిదే ఈ హిప్పీఇజం!

 

    ఈ హిప్పీ ఇజాన్ని నామరూపాలు లేకుండా చేసి యువతరాన్ని రక్షించాలంటే ఏం చెయ్యాలి? వీళ్ళను శిక్షించినంత మాత్రాన ఫలితం వుంటుందా? పుండుకు మందువేసి మాన్పితే శరీరం రోగంనుండి విముక్తి చెందుతుందా? రక్తమంతా క్రిములమయంగా వున్నప్పుడు ఒక్క పుండును మాత్రం మాన్పితే ప్రయోజనం? అక్కడ మాని, మరోచోట పుడుతుంది. రక్తంలోవున్న రోగక్రిముల్ని అంతమొందించినప్పుడే ఆ శరీరం రోగం నుండి విముక్తి పొందగలదు.

 

    గిటార్ మోగుతూనే వుంది. డాన్సు మాత్రం ఆగిపోయింది.

 

    "చూడు! చూడు!" అన్నది శబరి.

 

    జ్యోతి ఆలోచనలనుండి బయటపడింది. వాళ్ళకేసి చూసింది. మేరీ నడుం పట్కాకు వేలాడుతున్న సంచితీసి విప్పింది. ఏవో మాత్రలు బైటికి తీసింది. నోట్లో వేసుకుంది. పక్కవాడి చేతిలో పెట్టింది. అతను కూడా ఆత్రంగా మాత్రలు నోట్లో వేసుకున్నాడు. గిటార్ ఆగింది. అతను కూడా చెయ్యి చాపాడు.

 

    మేరీ "లేవు అయిపోయినాయ్!" అన్నట్టు చేతితో సైగ చేసింది. సంచిని మళ్ళీ పట్కాకు తగిలించింది. జాన్ కు కోపం వచ్చింది. మేరీమీద కలియబడి సంచీని లాక్కున్నాడు. మేరీ పకపక నవ్వింది. జాన్ కూడా శృతి కలిపాడు. సంచిని ఊడదియ్యబోతున్న జాన్ దృష్టి శబరిమీద పడింది.

 

    "హాయ్ బేబీ? వచ్చావా? ఎందుకు రావూ? తప్పక వస్తావు. నీకు కూడా" అంటూ రెండడుగులు ముందుకు వేసి జ్యోతిని చూసి ఆగిపోయాడు.

 Previous Page Next Page