Previous Page Next Page 
ఆలింగనం పేజి 13


    "నీ సౌకుమార్యం నీ బలహీనత కాకూడదు. నీ లాలిత్యం నీ అశక్తత కాకూడదు!

 

    నువ్వు స్త్రీవైనంత మాత్రాన ఎవడి పాదదాసిగానో వాడి విమ్స్ అండ్ ఫాన్సీలు తీర్చే విలాస వస్తువుగానో బ్రతకఖ్కర్లేదు!" అంది.

 

    నేను స్త్రీని. చాలా అందంగా లలిత కోమలంగా, సృష్టిలోని సౌకుమార్యానికి రూపంగా భగవంతుడు సృష్టించాడు. నేను బయట ఏమైనా ఏపనైనా సాధించనీ, ఎంత గొప్పదాన్నైనా కానీ పురుషుడు మాత్రం నాలో స్త్రీ తనకి హాయినిచ్చేందుకే వాడుకుంటాడు.

 

    'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి..." అంటూ స్త్రీ కాఫీ కప్పుతో ఎదురురావాల్సిందే, లేదా భర్తకి ఉతికిన షర్ట్ ఇవ్వనందుకు నలుగురిలో తలదించుకునే ఎడ్వర్ టైజ్ మెంట్ లోలా చిన్నతనం పడాల్సిందే!

 

    'నీ సౌకుమార్యాన్నీ లాలిత్యాన్నీ అతని విలాసాలకోసం ఖర్చుపెడుతూ, అబల అనే ముద్ర మోస్తూ ఇంకా ఎన్ని యుగాలు?' అని లిల్లీ నిలదీస్తున్నట్లు చూస్తోంది!

 

    అమ్మాయిలకీ అబ్బాయిలకిచ్చినట్లు ఆదుకునేందుకు బ్యాట్, గన్, లండోరీలు ఇవ్వకుండా చిన్నప్పటి నుండి లక్క పిడతలూ, చందనం బొమ్మలూ ఎందుకూ? నరాల్లో వారి భవిష్యత్ ని ఇంజెక్ట్ చెయ్యడానికి కాకపోతేనూ! నేను ఆలోచనలో పడ్డాను.

 

    "నువ్వేం చెయ్యాలని ఆలోచించుకున్నావు ముక్తా?" మొదటిసారిగా నా మెదడులో నా భవిష్యత్ గురించిన ఆలోచనలకి పురుడుపోసింది లిల్లీ!

 

    పైనుండి ఓ విమానం 'జు...య్యి'మంటూ ఆ ఆలోచనలకి చెదరగొడుతూ వెళుతోంది. నా ఆలోచనలు కూడా ఆ ఎత్తులకి వెళ్ళాయి.

 

    'అయిగిరి నందిని నందిత మోదిని...విశ్వ వినోదిని నందినుతే... అంటూ గుడిలోంచి దుర్గా స్తోత్రం వినిపిస్తోంది. ఎవరో ఆపకుండా గంటలు కొడుతున్నారు. అవన్నీ నా మనసులోనే కొడ్తున్నట్లుగా ఉన్నాయి.

 

    ఆ తర్వాత కాలం వేగంగా పరుగులెత్తింది... శివా, లిల్లీ, నా క్లాస్ మేట్స్ అందరూ ఉరవకొండలోనే ఉండిపోయారు. మేం మాత్రం నాన్నగారికి ట్రాన్స్ ఫర్ అవడంతో హైద్రాబాద్ వచ్చేశాం.

 

    కో ఎడ్యుకేషన్ కాలేజీలో చేరడం, రకరకాల స్నేహాలూ అంతా పరుగులు, ఉరుకులుగా, సందడిగా ఉంది! మగపిల్లలతో కబుర్లు చెప్పడం, వాళ్ళ బైక్ లమీద లిఫ్ట్ లు తీసుకోవడం ఇక్కడ చాలా సాధారణమైన విషయం. ప్రతాప్, వెంకట్, రఫీ, నేనూ, చిత్రా, వైజయంతీ ఒక గ్రూప్ గా మారాము. ఎవరికీ ఎవరితో ఎఫైర్స్ లేవు! అందరం జాయిగా ఒకళ్ళమీద ఒకళ్ళం జోక్స్ వేస్తూ ఎంతో సరదాగా ఉండేవాళ్ళం.

 

    ఎలక్షన్స్ వచ్చాయి. సీనియర్స్ కేంపైనింగ్ చెయ్యడానికి మా క్లాస్ కి వచ్చారు.

 

    అప్పుడు తెలుగు క్లాస్ అవుతోంది. నేను క్లాస్ లో ఉంటే మేడమ్ నా చేత రీడింగ్ చేయించకుండా వదిలిపెట్టేది కాదు!

 

    ప్రణయ పల్లకి పల్లకీ! ప్రసవభర
    వసంత వల్లిక పల్లకీ!
    శుక్రచాప వక్రరేఖ పల్లకీ!
    మదు స్వప్నశాఖ పల్లకీ!

 

    అని కృష్ణశాస్త్రిగారి పద్యం హృద్యంగా చదువుతున్నాను.

 

    "వా...క్యా బాత్ హై" అని వినిపించింది.

 

    అందరం తలలు అటు తిప్పి చూశాం.

 

    ఓ స్ఫూరద్రూపి అయిన యువకుడు చప్పట్లు కొడుతూ లోనికొచ్చి "మే ఐ కమిన్ మేడం? ఐయామ్ సందీప్, సెకండ్ ఇయర్ బి.కాం" అన్నాడు.

 

    అతని చూపులన్నీ నా మీదే ఉన్నాయి.

 

    మా కంటే వన్ ఇయర్ సీనియర్ అన్నమాట!

 

    "సందీప్...సందీప్" అంటూ వైజయంతి నా చెవుల్లో నెమ్మదిగా గుసగుసలాడింది.

 

    "ఎవరతను?" నేను చిరాగ్గా చూసాను.

 

    "చైర్మన్ గారి మనవడు. కాలేజీలో పెద్ద హీరోలే" ఆరాధనగా చూస్తూ అంది.

 

    సందీప్ లెక్చరర్ తో "విత్ యువర్ పర్మిషన్...స్టూడెంట్స్ తో మాట్లాడాలి" అన్నాడు.

 

    "కేంపైన్ చెయ్యడమేగా!" ఆవిడ నవ్వింది.

 

    సందీప్ డయాస్ ఎక్కి "డియర్ స్టూడెంట్స్... నెలకో ప్లెజంట్రిప్, వారానికో హిందీ పిక్చర్, కాలేజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ లుగా ఫేమస్ పాప్ సింగర్స్... గర్ల్ ఫ్రెండ్స్ ని తిప్పడానికి బైక్ లు ఎరేంజ్ చెయ్యడం, అమ్మాయిలని ఇష్టంలేని అబ్బాయిలు ఏడిపిస్తే చితకబాదడం, ఇష్టం ఉన్న అబ్బాయిలతో రాయబారాలు... ప్రతి అమ్మాయీ, అబ్బాయీ బర్త్ డేకి క్లాస్ రూంలో కేక్ కట్టింగ్... ఇంకా ఇంకా ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఎన్నో... ఎన్నెన్నో కావాలా?" అని అడిగాడు.

 

    "కావాలి...కావాలి" అబ్బాయిలు లేచి అరిచారు.

 

    అమ్మాయిలు కూర్చునే, వారి ఆమోదం పెద్దగా క్లాప్స్ కొడ్తూ చూపించారు.

 

    "దెన్...ఓట్ ఫర్ సందీప్!" అతని వెనకాల వచ్చిన అమ్మాయిల్లో ఒకత్తె అరిచింది. అందరూ సందీప్ జిందాబాద్" అంటూ అరిచారు.

 

    ఇంత హడావిడిలోనూ సందీప్ నన్నే చూడటం, చిన్నగా నవ్వడం నేను గమనించాను.

 

    "థాంక్యూ..." సందీప్ స్టేజీదిగి వినయంగా మేడమ్ ముందు తలవంచి చెప్పాడు.

 

    "బెస్ట్ ఆఫ్ లక్ సందీప్" అందావిడ.

 

    లంచ్ టైంలో క్యాంటీన్ లో సందీప్ గురించే చర్చ.

 

    "ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు?" తన్మయంగా అంది వైజయంతి.

 

    "హలో...డ్రీమ్ బ్లాక్ అండ్ వైటా? కలరా? లొకేషన్ ఏం సెలెక్ట్ చేశావు? కాశ్మీర్ ఒద్దు... టెర్రరిస్టులుంటారు!" రఫీ వైజయంతిని ఏడిపించాడు.

 Previous Page Next Page