ఓ క్షణం ఆగి సిగరెట్ ముట్టించుకున్నాడు!
సరోజ ఊపిరి బిగబట్టుకుని హరికృష్ణ ముఖంలోకి చూడసాగింది.
హరికృష్ణ తాపీగా సిగరెట్టు కాలుస్తున్నాడు.
మధ్యలో ఆపినందుకు సరోజకు హరికృష్ణ మీద కోపం వచ్చింది. చిరాకు వేసింది.
"ఆ తర్వాత ?" ఏం చెప్పాలో వెంటనే తోచ లేదు హరికృష్ణకు.
ఆలోచిస్తూ సిగరెట్ పొగను చూశాడు.
"చెప్పండి ఆ తర్వాత ఏమౌతుంది ? ఆ అమ్మాయి కన్పిస్తుందా ?" మహా ఆతృతగా అడిగింది!
హరికృష్ణ సరోజ ముఖంలోకి అదోలా చూశాడు.
"కన్పించదు" వళ్ళుమండి అన్నాడు హరికృష్ణ.
"అయ్యో? మరి అతను ఏం చేస్తాడు?"
"ఏం చేస్తాడా. ఉరేసుకొని చస్తాడు" విసుగ్గా అన్నాడు.
ఆ మాట అని సరోజ ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం చూస్తుంటే హరికృష్ణ జాలి వేసింది. బిక్కమొహం పెట్టింది.
"కాదులే. చెప్తాను విను. అతను ఆ వీణతీగను జేబులో పెట్టుకొని ఏడుస్తూ పాటలు పాడుతూ ఆ ఊరంతా తిరుగుతాడు. ఎవర్ని అడిగినా ఆ ఊళ్ళో వీణ వాయించే అమ్మాయే లేదంటారు, నిరాశతో తిరుగుతున్న ఆ యువకుడికి ఒకరోజు ఊరికి దూరంగా పొలాలమధ్య వున్న గుడిలోనుంచి వీణానాదం విన్పిస్తుంది. పరుగులు తీస్తూ గుడి చేరుకుంటాడు."
"అమ్మయ్య!" సరోజ పైకే అనేసింది.
"ఆత్రంగా గుడి లోపలకు పరిగెత్తిన ఆ యువకుడు కొయ్యబారిపోయినిల్చుంటాడు. ఎదురుగా, బోడిగుండూ, నామాలు, పెద్దబొజ్జా వున్న స్థూలకాయుడు వీణ వాయిస్తూ భక్తీగీతలు పాడుతూ కన్పిస్తాడు."
"పాపం!" బాధగా అన్నది సరోజ.
హరికృష్ణకు నవ్వొచ్చింది. కాని నవ్వలేకపోయాడు!
"బాగుందా కథ? ఇలా రాయమంటావా?"
"ఎన్ డింగ్ బాగాలేదు. చివరకు ఒక అందమైన అమ్మాయిని కలుసుకున్నట్టు రాయండి" అన్నది సరోజ.
"పోనీయ్ ఈ కథ నువ్వు రాయకూడదూ?"
"నేనా" ఆశ్చర్యంగా అడిగింది సరోజ.
"నువ్వే"
"నాకు రాయడం రాదు"
"నువ్వెప్పుడూ పత్రికలకు ఉత్తరాలు రాయలేదా?"
"అప్పుడప్పుడు రాస్తూంటాను. పత్రికల్లో వచ్చాయి కూడా? చూపించనా?" ఉత్సాహంగా లేవబోయింది.
"ఆహ! ఇప్పుడొద్దులే! తర్వాత చూస్తాను. ఇంకేం ఉత్తరాలు రాస్తున్నావుగా? అలాగే నేను చెప్పిన కథ రాసెయ్!"
"ఎలా రాయాలి?"
హరికృష్ణ పక పక నవ్వాడు.
సరోజ బోలెడంత సిగ్గుపడిపోయింది.
"రాస్తూపోతేసరి! అదే వస్తుంది" అన్నాడు హరికృష్ణ.
సరోజ ఆలోచనలో పడింది.
"రాసేసేట్టే వుంది" అనుకున్నాడు హరికృష్ణ మనసులో.
"ఏమిటీ రాస్తావా?" చిలిపిగా అడిగాడు.
సమాధానంకోసం చూశాడు.
సరోజ ఆలోచిస్తూ సమాధానం ఇవ్వలేదు.
"ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నావా?"
తల ఊపింది సరోజ "అవును" అన్నట్టుగా.
"ఏముందీ? మీ అన్నయ్యను అడిగి కాసిని డబ్బులు తీసుకో. ఆ డబ్బుల్తో కాగితాలూ, కలం, సిరా కొనుక్కో. ఆ తర్వాత కూర్చుని రాసెయ్ , వెరీ సింపుల్!"
సరోజ ముఖం ఆలోచనలతో గంభీరంగా ఉంది.
"ఏమిటోయ్? మా చెల్లాయితో సాహిత్యచర్చలు చేస్తున్నట్టున్నావ్?" అంటూ సత్యనారాయణ ప్రవేశించాడు.
"అవునోయ్! మీ చెల్లెలు నన్నొక మంచి ప్రేమ కథ రాసెయ్యమంటూంది" అన్నారు హరికృష్ణ నవ్వుతూ.
సరోజకు బోలెడంత సిగ్గు వేసింది. మొగ్గలా ముడుచుకుపోయింది.
"ఇంకేం, రాసెయ్! మంచి హీరోని సృష్టించి మా సరోజకు హీరోయిన్ గా చేసెయ్యి!" నవ్వుతూ అన్నాడు సత్యనారాయణ.
"ఏం చెల్లెమ్మా! అలా రాయమంటావా?" చెల్లెల్ని అడిగాడు సత్యనారాయణ వస్తున్న నవ్వును పెదవులమధ్య బంధిస్తూ.
"పో అన్నయ్యా?" అంది సరోజ సిగ్గుపడిపోతూ.
"మీ చెల్లెల్నే రాసెయ్యమంటున్నాను నేను రాస్తే పత్రికల్లో అచ్చుకాదు. మీ చెల్లాయి రాస్తే వెంటనే గ్యారంటీగా అచ్చు అవుతుంది" అన్నాడు హరికృష్ణ గంభీరంగా ముఖంపెట్టి.
సత్యనారాయణ పకపక నవ్వాడు.
హరికృష్ణ నవ్వలేక పోయాడు.
సరోజ ముఖం సిగ్గుతో మందాపువ్వే అయింది.
"హరీ! మా చెల్లాయికి ఒక మంచి మొగుణ్నిచూడు. అచ్చం అహల్యగారి నవలల్లోని హీరోలా వుండాలి."
"పో అన్నయ్యా!" సరోజ బుగ్గలో రక్తం చిమ్మింది.
చివ్వున లేచి పరుగులాంటి నడకతో లోపలకు పోయింది సరోజ.
హరికృష్ణ గొల్లున నవ్వాడు సత్యాన్ని చూస్తూ.
"ఏమిటి స్నేహితు లిద్దరూ తెగనవ్వేస్తున్నారు?" అంటూ పద్మ ప్రవేశించింది.
"మీ ఆడబిడ్డ గురించే...." అన్నాడు హరి.
10
"సత్యం నేను ఒకటి అడుగుతాను నిజం చెబుతావా?" అన్నం కలుపుకుంటూ అడిగాడు హరికృష్ణ.
"ఏమిటి? ఆశ్చర్యంగా చూశాడు సత్యం.
"నువ్వు ఎందుకో బాధ పడుతున్నావు. నువ్వెంత ఉత్సాహంగా కన్పించడానికి ప్రయత్నించినా తెలిసిపోతూనే వుంది. చెప్పకూడని కారణం అయితే చెప్పవద్దు. కాని నీ స్నేహితుడిగా న్నెఉ చెయ్యగలిగిన సహాయం ఏదైనా వుంటుందేమోననే ఉద్దేశంతో అడుగుతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు!" అన్నాడు హరికృష్ణ.
"అబ్బే ఏంలేదే? నాకు దిగులేమిటి?" అన్నాడు సత్యనారాయణ రాణి నవ్వును పెదవులమీదకు తెచ్చుకుంటూ.
"ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆయనబాధంతా చెల్లెలి పెళ్ళి గురించే!" అన్నది పద్మ.
"ఏరా సత్యం! చెల్లాయి చెప్తున్నది నిజమేనా?"
"నీ ఎరికలో ఎవరైనా మంచి కుర్రవాడుంటే చూడరా!" సమాధానంగా అన్నాడు సత్యనారాయణ.
"నాలుగైదు వేల వరకు కట్నం కూడా ఇద్దాం!" అన్నది పద్మ.
హరికృష్ణ ఆలోచిస్తూ వుండిపోయాడు.
"పిల్లవాడు బుద్థిమంతుడై కట్నం కొంచెం ఎక్కువయినా ఫర్వాలేదు" అన్నాడు సత్యనారాయణ.
"ఏరా సత్తిగా? నీ చెల్లెలికి నేను పెళ్ళికొడుకును చూడాలా, నీకు అసలు బుద్థివుందా?" అన్నాడు హరికృష్ణ.