Previous Page Next Page 
బంధితుడు పేజి 13


    ఇట్లా ఒకరికోసం ఒకరు నానా బాధలూపడి చివరికి కలుసుకుంటారు.

    ఆ అమ్మాయి ఆ అబ్బాయిని క్షమాపణ కోరుతుంది. ఇద్దరికీ పెళ్ళవుతుంది" అని సిగరెట్ పోగలోకి చూస్తూ ఓ క్షణం వుండిపోయాడు హరికృష్ణ.

    "బాగుంది, చాలా బాగుంది. ఇదే వ్రాయండి. అహల్యకూడా ఇలాంటి నవలే వ్రాసింది. రంగమణి కూడా వ్రాసింది"

    "అయితే మళ్ళీ నే నెందుకు రాయడం?"

    "మీరు రాయండి. ఇలాంటివి ఎంతమంది రాసినా బాగానే ఉంటాయి."

    "పోనియ్. మరొకటి చెబుతాను. ఇద్దరమ్మాయిలుంటారు. ఒక అమ్మాయి అందంగా వుండదు,గంభీరంగా వుంటుంది. ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు. అబ్బాయి మాత్రం అందంగా లేని అమ్మాయిని ప్రేమిస్తాడు...."

    "కాదు. అందంగా వుండే అమ్మాయినే ప్రేమిస్తాడు" టక్కున అనేసింది సరోజ.

    "ఏం, ఎందుకని?" కొంటెగా అడిగాడు.

    "ఎందు కేమిటి? ఎవరైనా అందంగా లేని వాళ్ళను ప్రేమిస్తారా ఏమిటి?" సాగదీస్తూ తమాషాగా అన్నది.

    "ఎందుకు ప్రేమించరేమిటీ?" అదే ధోరణిలో అన్నాడు హరికృష్ణ.

    సరోజ మహా సిగ్గుపడిపోయి తలవంచుకుంది.

    "నేను అందంగాలేని అమ్మాయిని ప్రేమించినట్టే రాస్తాను."

    "అట్లారాస్తే ఏం బాగుండదు."

    "అందమైన అమ్మాయిని ప్రేమించడం. అందంగా లేని అమ్మాయి చివరికి చచ్చిపోవడం ఎవరూ రాయలేదా?"

    "ఎందుకు రాయలేదూ? చాలామంది రాశారు. అందరికంటే క్రాంతిమార్ రాసిన నవల చాలాబాగుంది" కథను మననం చేసుకుంటూ అన్నది సరోజ.

    "ఇంతమంది రాశాక మళ్ళీ నేనెందుకు రాయడం? అయితే మరో ప్లాట్ చెబుతాను! ఇది చాలా  నచ్చుతుందను కుంటాను!"

    సరోజ మరికొంచెం ముందుకు జరిగి ఉత్సాహంగా "చెప్పండి" అన్నది!

    "ఒక అందమైన అబ్బాయి ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు" ఆగి ఆమె ముఖంలోకి చూశాడు.

    సరోజ నీరసంగా కుర్చీలో వెనక్కు జరిగింది!

    "ఏం? బాగుండదా?" నవ్వుతూ అడిగాడు!

    "ముందే పెళ్ళయిపోతే ఏం బాగుంటుందీ?" అన్నది సరోజ నిరుత్సాహంతో రాగయుక్తంగా.

    "పూర్తిగా విను! పెళ్ళికిముందే ఇద్దరిలో ఒకరు అమ్మాయిగానీ, అబ్బాయిగానీ ఒక షర్తు పెడ్తారు" ఆగి సరోజ కిళ్ళల్లోకి చూశాడు!

    "ఏం షర్తూ?" కళ్ళు మెరిపిస్తూ అడిగింది సరోజ!

    "పెళ్ళి అయిన తర్వాత ఇద్దరూ భార్యాభర్తలుగా ప్రవర్తించకూడదు! కేవలం ఈ పెళ్ళి ప్రపంచం కోసమే! లేకపోతే మరొకరికోసం ఒకరు చేసిన త్యాగం! ఆ తర్వాత ఇద్దరూ దూరదూరంగా వుంటారు! దూరంగా అంటే వేరు వేరు ప్రదేశాల్లోకాదు! ఒకే చోట....ఒకే ఇంట్లో...కాదు ఒకే గదిలో వుంటారు! క్రమంగా షర్తు పెట్టిన వాళ్ళలో మార్పువస్తుంది! తనకు ఆ రెండో వ్యక్తిమీద బోల్డంత ప్రేమ వుందని తెలుస్తుంది! అయినా పైకి చెప్పుకోలేదు. ఒకే  గదిలో నిట్టూర్పులు విడస్తూ, కన్నీరు కారుస్తూ కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి, ఆకస్మాత్తుగా అనుకోకుండా ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతారు.

    అంతవరకూ చెప్పి "ఎలా వుంది?" అన్నట్టు సరోజ ముఖంలోకి చూశాడు హరికృష్ణ.

    సరోజ కళ్ళు తుడుచుకుంటున్నది.

    హరికృష్ణకు ఆశ్చర్యం వేసింది. సరోజమీద జాలి కూడా కలిగింది!

    "చాలా బాగుంది. ఇదే రాసెయ్యండి! ఈ మధ్య ఇటువంటివి రెండు మూడు నవలలు చదివాను! ఎంత బాగున్నాయో?" పైటకొంగుతో ముక్కు తుడుచుకుంటూ అన్నది!

    "చచ్చాం పో!" అన్నాడు హరికృష్ణ తలపట్టుకుని

    "ఏమిటి!" సరోజ ఆశ్చర్యంగా హరికృష్ణ ముఖంలోకి చూసింది. ఇంకా ఆమె గొంతు బొంగురుగానే ఉంది.

    "ఈ సబ్జెక్టు కూడా చాలా మంది రాశావంటున్నావుగా? మళ్ళీ నేనెందుకు రాయడం?"

    సరోజకు వళ్ళు మండిపోయింది.

    "ఎంతమంది రాస్తే ఏమిటో ? ఎంతమంది రాసినా ఇలాంటివి బాగానే వుంటాయి" అనుకుంది. కానీ పైకి అనలేక పోయింది. హరికృష్ణ ఏమనుకుంటాడోనని.

    "చాలామంది రాసునా కథలు వేరువేరుగా వుంటాయిగా? మీరు కూడా అటువంటిదే వేరేకథ రాయండి."

    సరోజ అమాయకత్వానికి హరికృష్ణ నవ్వుకున్నాడు.

    "కథలు వేరుగా వుండవు. పాత్రల పేర్లు వేరుగా వుంటాయి" అన్నాడు.

    సరోజ  ముఖం చిన్నబుచ్చుకుంది.

    "రాస్తాలే, కొట్టరకమైన ప్రేమకథ రాస్తాను."

    "ఎటువంటిది రాస్తారు? కథ చెప్పండి."

    ఒక అబ్బాయి పట్నంలో చదువుకుని పల్లెకు తిరిగి వస్తాడు. మంచి సూటూ బూటూ వేసుకుని 'పల్లెకు పోదా  పారును చూద్దాం' అని పాడుకుంటూ రైలుకట్ట వెంబడి నడుస్తూవస్తూ వుంటాడు."

    సరోజ ముఖంలోకి చూశాడు హరికృష్ణ.

    సరోజ తన్మయత్వంలో వుంది. ఆమె కళ్ళముందు ఒక యువకుడు కన్పిస్తున్నట్లు చూస్తూవుంది!

    "ఊ...తర్వాత" ఆ తన్మయత్వంనుంచి పూర్తిగా బయటపడకుండానే అన్నది.

    హరికృష్ణకు ఆమె జడ పట్టుకొని ఊపుతూ "పిచ్చిపిల్లా!" అని అనాలనిపించింది.

    అయినా అనలేదు. చెప్పసాగాడు.

    "అకస్మాత్తుగా అబ్బాయి కాలుకు ఏదో తగిలింది. ఆగివంగి చూశాడు. తన కాళ్ళకు అడ్డుపడినదాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. అది ఒక తెగిపోయక వీణ తీగ. ఆ వీణతీగను కన్నార్పకుండా చూస్తూ అలాగే నిలబడి పోయాడు. అలా ఎంతసేపు నిలబడిపోయాడో అతనికే తెలియదు! ఆ వీణతీగ సౌందర్యానికి సౌకుమార్యానికీ ముగ్దుడై పోయాడు!" అంటూ ఆగి సరోజ ముఖంలోకి చూశాడు.

    "ఊఁ తర్వాత?" కుతూహలంగా చేటంత ముఖం చేసుకొని అడిగింది సరోజ!

    "వీణ తీగ అందంగా, సుకుమారంగా వుండటం ఏమిటీ" అని అయినా అడుగుతుందనుకున్నాడు హరికృష్ణ.

    సరోజ మీద చిరాకువేసింది.

    "నీలాంటి పాఠకులు వుండబట్టే ఆ కథలకు అంతగిరాకి" అనాలానుకున్నాడు. అన్నా  ఆమెకు అర్థంకాదని తెలుసు! అందుకే అనలేకపోయాడు!

    ఆ తర్వాత ఏం జరిగింది?" ఆరాటంగా అడిగింది!

    "ఈ తీగతో వీణ వాయించిన చిన్నది, అపురూప సౌందర్యవతి అయివుండాలి. ఆమె మృదుత్వం వచ్చింది. ఏమైనా సరే, ఆ చిన్నది ఎక్కడున్నా సరే.... కాకులు  దూరని  కారడవుల్లో, చీమలుదూరని చిట్టడవుల్లో.... సప్త సముద్రాలవతల కీ కారణ్యంలోని మర్రిచెట్టు తొర్రలో..... ఎక్కడ వున్నాసరే వెతికి పెళ్ళాడాలి. అని నిర్ణయించుకున్నాడు" నాటకంలో డైలాగులు చెబుతున్నట్టుగా చెప్పాడు హరికృష్ణ.

 Previous Page Next Page