సత్యనారాయణ తెల్లముఖంవేసి చూశాడు.
పద్మ ఓ క్షణం హరికృష్ణ ముఖంలోకి పరిశీలనగా చూసింది. చిక్కు ప్రశ్నకు చూసినట్టు చూసింది.
"మీరెందుకు ఇంత కాలం పెళ్ళి చేసుకోలేదు అన్నయ్యా?' అడిగింది పద్మ సాలోచనగా.
"నీకంటే నీ భార్య తెలివైందిరా!" అన్నాడు హరికృష్ణ మందహాసం చేస్తూ.
పద్మ సిగ్గుపడింది.
సత్యనారాయణకు అంతరార్థం అర్థం కాలేదు. విస్మయంగా భార్యనూ, హరికృష్ణనూ మార్చి మార్చి చూశాడు.
"అర్థం కాలేదు కదూ?" అడిగాడు హరికృష్ణ.
"కాలేకు" అన్నట్టు తల వూపాడు సత్యనారాయణ.
"మీ రెందుకు పెళ్ళిచేసుకోలేదూ? అని చెల్లాయి అడిగిందా?"
"అవునూ? అడిగిందీ? అయితే?"
"అంటే మా సరోజను మీ రెందుకు చేసుకోకూడదూ అని ఆమె అడిగింది. నీది వట్టి మట్టిబుర్ర" అన్నాడు హరి.
సత్యనారాయణ ముఖం వికసించింది. భార్య కేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు.
"ఏయోయ్ మాట్లాడమే? నేను నీ చెల్లెలికి తగనా" హరికృష్ణ అన్నాడు.
"హరీ! నిజంగా నువ్వు ణా చెల్లెల్ని చేసుకుంటావా" సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అడిగాడు సత్యనారాయణ.
"ముందునువ్వు నీ చెల్లెల్ని చేసుకోమని అడుగు! అప్పుడు సమాధానం చెబుతాను!"
"ఆడపిల్లవాళ్ళం! అడక్క తప్పుతుందా" పద్మ పులుసు వడ్డిస్తూ అన్నది.
"ఆహరంపట్లా, వ్యవహారంపట్లా మొహమాటం పనికిరాదు. కట్నం ఎంత కావాలో చెప్పు" అన్నాడు సత్యనారాయణ.
పద్మ చివ్వున తలెత్తి భర్త ముఖంలోకి చూసింది ఆశ్చర్యంగా! సత్యనారాయణ తన ధోరణిలో వున్నాడు.
హరికృష్ణ ముఖం గంభీరంగా మారింది.
"నేను చేసేది చిన్న ఉద్యోగమే అయినా అందంగా వుంటాను! బి.ఏ పాసయాను. కథలు రాస్తాను! మంచి ఆఫర్లేవస్తున్నాయి, ఆ మధ్య ఒక సంబంధం వచ్చింది. ఇరవై వేలు ఇస్తామన్నారు. పిల్లనాకు నచ్చలేదు, మరీనల్లగా వుంది. అందుకే ఆ సంబంధం వదులుకున్నాను."
"ఆగి సత్యనారాయణ ముఖంలోకి లోతుగాచూశాడు హరికృష్ణ.
సత్యనారాయణ బిగిసిపోయాడు.
పద్మకేసి చూశాడు హరికృష్ణ.
పద్మ ఆలోచిస్తూ హరి ముఖంలోకి చూసింది!
"మె చెల్లెలు నాకు నచ్చింది. అందుకే కొంత కన్ సెక్షన్ ఇస్తాను. పదివేలు చాలు" హరికృష్ణ కంఠంలో ఎగతాళి.
"పోనీయ్ ఏడువేలు" మళ్ళీ అన్నాడు!
పద్మ ముఖం చిట్లించుకుంది.
"ఒరేయ్! రాస్కెల్! నాకు కట్నం ఇస్తావట్రా? కట్నాల కోసం ఆశపడే వాణ్నయితే ఇంతకాలం పెళ్ళిచేసుకోకుండా వుంటానా? చూశావా చెల్లెమ్మా! వాడు నన్ను ప్రాణస్నేహితుడు అంటాడు అంతా నాటకమే. నా చెల్లెల్ని నన్నాను. కట్నం ఇస్తాడుట కట్నం" అన్నాడు హరి మందలిస్తున్నట్టుగా.
"హరీ! నువ్వెంత మంచివాడివిరా!"
"ఆపు నీ పొగడ్తలు. ఇందులో నా మంచితనం ఏమీ లేదు! నీ చెల్లెలు నాకు నచ్చింది. పెళ్ళి చేసుకోవాలనిపించింది. అదే చెప్పాను."
"మా సరోజ అదృష్టవంతురాలు" పద్మ సంతోషంగా అన్నది!
సత్యనారాయణ కళ్ళల్లో నీరు తిరిగింది.
"ఒరేయ్! సెంటిమెంటల్ పూల్, ఏడుస్తున్నావా?"
"ఇవి కన్నీళ్ళు కావురా! ఆనందభాష్పాలు" గద్గద స్వరంతో అన్నాడు సత్యనారాయణ.
"ఏడ్చావులే, నీ సినీ డైలాగూ నువ్వునూ. మా చెల్లెలునీతో ఎట్లా వేగుతుందో ఏమో!"
"నిజం చెప్పావు అన్నయ్యా!" అన్నది పద్మ.
"అన్నా చెల్లెళ్ళు ఒకటై పోయాక నేనేం మాట్లాడగలను" అన్నాడు సత్యనారాయణ నవ్వుతూ తేలిక పడిన మనసుతో.
"ఒరే సత్యం! ఏమైనా చెప్పు! సెంటిమెంట్సు ఎక్కువగా వున్నవాళ్ళు జీవితంలో సుఖపడరురా!"
"ఏడ్చావులే"
"చూశావామ్మా వీడి వాలకం! వీడేం మారలేదు. చిన్నప్పుడు కూడాచాలా సున్నితంగా వుండేవాడు! ఎవరు బాధపడుతున్నా తనే ముందు ఏడ్చేసేవాడు" అన్నాడు హరికృష్ణ సత్యనారాయణను చూస్తూ.
"ఎంతసేపు తింటావురా! త్వరగా తినిలే!" అంటూ సత్యనారాయణ చెయ్యి కడుక్కోవడానికి లేచాడు.
11
సరోజ హరికృష్ణను పెళ్ళిచేసుకోవడానికి సంతోషంగానే ఒప్పుకుంది. ఆమె రాజారావుని మర్చిపోయి చాలా కాలం అయింది.
కథల్లో హీరోలాంటి వాడు భర్తగా దొరక్కపోయినా కథలు రాసేవ్యక్తి లభించినందుకు సంబరపడి పోయింది. పైగా హరి పొడవుగా ఆకర్షణీయంగానే ఉంటాడు.
హరికృష్ణ భార్యను తీసుకొని హైదరాబాద్ వెళ్ళి పోయాడు.
పద్మ రిలీఫ్ గా నిట్టూర్చింది.
నెలతిరక్కుండానే హరికృష్ణ వెంటనే బయలుదేరి రమ్మని సత్యనారాయణకు టెలిగ్రాం ఇచ్చాడు.
ఆ టెలిగ్రాం చూసిన పద్మ దిగాలుపడింది. సరోజ పూలిష్ గా ప్రవర్తించి ఉంటుందని ఆమె భావించింది.
చెల్లెలికి ఏం ప్రమాదం వాటిల్లిందోనని సత్యనారాయణ బెంబేలు పడిపోయాడు!
"నేను కూడా రానా?" ప్రయాణం అవుతున్నా సత్యనారాయణ భార్యఅడిగింది.
"వద్దులే అసలు విషయం ఏమిటో తెలుసుకుని అవసరం అయితే టెలిగ్రాం ఇస్తాను" దిగులుగా అన్నాడు సత్యనారాయణ.
పద్మకు కూడా భయంగానే వుంది.
తొందరపాటు పిల్ల మొండిఘటం భర్తమీద కోపం వచ్చి ఏ అఘాయిత్యానికైనా పాలుపడిందో ఏమో!
పద్మ మనసు పరిపరి విధాలాపోయింది.
సత్యనారాయణ హైదరాబాద్ ఎలా చేరాడో అతనికే తెలియదు.
సత్యనారాయణకు హరికృష్ణ వాకిట్లోనే ఎదురుపడ్డాడు.
"రావోయ్ రా" ఆహ్వానించాడు.
"ఏమిటి? ఏమయింది? టెలిగ్రాం ఎందుకిచ్చావ్? సరోజ ఏది?" గాబరాగా అడిగాడు.
"మరీ అంత గాబరా పడకు. ఏమీ కాలేదు. నీ చెల్లెలు బాగానేవుంది" అన్నాడు హరికృష్ణ.
"మరి అయితే ఆ టెలిగ్రాం?" ఆశ్చర్యపోతూ అడిగాడు.