"అయిపోయింది, వస్తున్నా సుధా!" టవల్ నడుముకు చుట్టుకొంటూ లోపలనుంచి అన్నాడు కృష్ణ.
బాత్ రూం తలుపులుతియ్యబోతూ ముందుకు చాచిన చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. తలుపుముందు స్థాణువులా నిలబడిపోయాడు.
సుధ ముఖంలోకి తను సూటిగా చూడగలడా?
ఏ కల్మషం లేకుండా ఆమె కళ్ళలోకి చూడగలడా?
అరమరికలు లేకుండా మాట్లాడగలడా?
"ఏం చేస్తున్నారండీ బాబూ! వచ్చెయండీ?" చేతిలోని బొమ్మతీసుకొంటే చిన్నపిల్ల చిందులు తొక్కుతూ మారాం చేస్తున్నట్టు అనిపించింది కృష్ణకు.
అప్రయత్నంగా తలుపు తెరిచాడు.
ఎదురుగా సుధ__
పెద్ద కుంకంబొట్టు, మెడకింద గంధం, పట్టుచీర, చేతిలో పూల సజ్జ- గంధర్వకన్యలా భర్త కెదురు నిలబడిఉంది ప్రియసుధ. కృష్ణ ఆమెను చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోయాడు.
ఆ వదనంలోని ప్రశాంతత - ఆ కళ్ళల్లోని నిర్మలత్వం-స్వచ్చంగా, అపురూపంగా ఉన్న ఆమె అందాన్ని చూస్తూ మంత్రముగ్దుడిలా నిలబడిపోయాడు.
"కృష్ణా!" ఆమె పెదవుల కదలికల్లో బృందావనాలు విరిశాయి. కృష్ణుని కోసం వెదుకుతున్న రాధ అడుగులసవ్వడులు విన్పించాయి.
"ఏమిటండీ ఆ చూపూ మీరూనూ?"
ఆమె కదలిన పెదవులమీద తొణికిన హాసరేఖల్ని చూస్తూనే కృష్ణ ముఖంలో రంగులు మారాయి.
అదే నవ్వు!
మోనాలిసా నవ్వు!
గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి.
వళ్ళంతా చెమటలు పట్టిపోయింది.
"ఏమిటండదీ? వళ్ళంతా తుడుచుకోకుండానూ?" పూలసజ్జ పక్కన పెట్టి భర్తను సమీపించింది. పైటచెంగుతో భర్త ముఖం తుడవడానికి ప్రయత్నించింది.
కృష్ణ చేతులు అప్రయత్నంగా మొలకు చుట్టుకున్న టవల్ మీదకు పోయాయి.
"బాగుంది, టవల్ ఇక్కడే లాగేస్తారా ఏం? పంకజం ఇంటిలోనే వుంది. బాత్ రూమ్ లోకి పదండి" అంటూ సుధ భర్తను బాత్ రూంలోకి తోసి తలుపులు వేసింది.
"త్వరగా తుడుచుకొని బయటికి రండి."
అల్లంత దూరంలో నిలబడి భర్తను మందలిస్తున్నట్టుగా అంది.
తలుపు దగ్గరగా నిలబడితే అతనేం చేస్తాడో తనకు తెలుసు.
ఛీ! పాడు!
తల్చుకొంటే సిగ్గేస్తుంది.
ఆ రోజు తను బాత్ రూంలోనుంచి గాభరాగా బయటికి వస్తుంటే పంకజంముండ చూసింది.
"అదా సంగతీ! అమ్మగారుకూడా బాత్ రూంలోనే ఉన్నారా? ఇందాకటనుంచీ ఇల్లంతా వెదుకుతున్నాను" అనిన పంకజం మాటలు తనకు ఇంకా గుర్తే వున్నాయి.
"ఏమండోయ్! వళ్ళు తుడుచుకోవడం అంతసేపా? మళ్ళీ స్నానం చేస్తున్నారా ఏం? నే వెళుతున్నా మీ ఇష్టం!"
"సుధా! ఆగు వచ్చేస్తున్నా ప్లీజ్!" కృష్ణ లోపలనుంచి అంటాడని ఆశించిన సుధకు ఆశాభంగమే అయింది.
లోపలనుంచి మాటా లేదు, పలుకూ లేదు. ఎందుకాయన ఈరోజు అలా ఉన్నారు?
ఏమైంది?
తలుపు తోసి బాత్ రూంలోకి తొంగిచూసింది.
కృష్ణ అద్దంముందు నిలబడి వున్నాడు.
ఆమె తలుపు తియ్యడంకూడా గమనించలేదు.
తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటూ నిల్చున్నాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుంది ఆ ముఖం.
"ఏమిటండీ? అద్దంముందే నిలబడి ఏం చేస్తున్నారూ?"
సుధ బాత్ రూంలోకి ప్రవేశించింది.
రెండడుగులు ముందుకువేసి ఏదో స్పురించినట్టు అక్కడే ఆగిపోయింది.
తను కావాలనే ఇదంతా చేస్తున్నాడు. నాటకం ఆడుతున్నాడు. మెల్లగా తనను బాత్ రూంలోకి రప్పించి- ఆ తర్వాత....తనకు తెలుసు ఏం చేస్తాడో.
అమ్మదొంగా!
మూడురోజులకే ఇంత ఇదయిపోతున్నాడే! నెలల తరబడి తనను విడిచి ఉండాల్సి వస్తే? ఇంకేముంది?
అడుగు వెనక్కు వేసి "ఏమండీ సారూ! ఆడదానిలా అలా ఆ అద్దంముందు...." పెదవులు గుండ్రంగా తిప్పుతూ అంది సుధ.
కృష్ణ తల తిప్పి ఆమెవైపు చూడకుండానే "వస్తున్నా లే పద!" అన్నాడు.
అది వింటూనే మంచుకొండలమీదనుంచి జారుతున్నట్టు అన్పించింది సుధకు.
అంటీఅంటనట్టు, పట్టీపట్టనట్టు, మాట్లాడుతూంది తన భర్త కృష్ణేనా?
ఏమిటీ మార్పు?
ఎందుకో అతనిమీదపడి రక్కాలనిపించింది.
భర్తవచ్చి అమాంతం తనను కౌగిలించుకొని....అతని చేతుల్లో.....మెత్తగా__తియ్యగా__బాధగా __నలిగిపోవాలనిపించింది.
దక్షుని ఇంట అవమానంపొందిన సతీదేవిలా, పాలరాతి గచ్చుమీద బొటనవ్రేలు రాస్తూ తలవంచుకొని నిలబడ్డ సుధ కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
"నీకే సుధా చెప్పేది, వస్తున్నా పద!"
కృష్ణ అద్దంముందునుంచి కదిలాడు.
అతని గొంతు వింటూనే సుధ నివ్వెరపోయింది.
ఎవరో కొత్త వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా వుంది.
గిర్రున వెనక్కు తిరిగింది.
గబగబ బాత్ రూంలోనుంచి బయటికి వచ్చింది.
హాల్లోనుంచి వంటింటిలోకి వెళుతున్న సుధకు పంకజం ఎదురైంది.
"అమ్మగారూ! అయ్యగారు వచ్చారమ్మా! కాఫీ ఇచ్చాను. స్నానం చేస్తున్నారు" హుషారుగా చెప్పింది పంకజం.
"పనంతా అయిందా?" సుధ అడిగింది.
ఆమె మనసు ఎక్కడో వుంది. యాంత్రికంగా మాట్లాడుతోంది.
"అయిందమ్మగారూ! అయ్యగారేమో...."
"బట్టలు ఉతికావా?"
"ఉతికాను. అయ్యగారు మీరు...."
"గదులు తుడిచావా?"
"తుడిచాను. గుడికెందుకెళ్ళారని అడుగుతున్నారు?"
"ఎవరూ?" కళ్ళుతిప్పుతూ అడిగింది సుధ.
"అయ్యగారేనమ్మా! గుడికెందుకెళ్ళారని అడిగారమ్మా!"
"గుడికి వెళ్ళానని ఎవరు చెప్పారూ?"
"నేనే చెప్పాను,"
"ఇంకా ఏం చెప్పావూ?"
"ఇంకా ఏం చెప్పానూ? ఏమీ చె...." సుధ కళ్ళల్లోకి చూస్తూ పంకజం ఆగిపోయింది. గవదలు బిగిసిపోయినట్టుగా అయింది.
"సరే వెళ్ళు. సాయంకాలం రావద్దు, పనేం లేదు."
పనిపిల్ల పంకజం గుటకలు మింగింది.
సుధని తిరిగి తిరిగి చూస్తూ, మునికాళ్ళమీద నడుస్తూ వెళ్ళిపోయింది.
సుధ చీర మార్చుకొని వచ్చేసరికి, కృష్ణ బట్టలువేసుకొని ఆఫీసుకు వెళ్ళడానికి సిద్దంగా వున్నాడు,
"ఎప్పుడొచ్చారూ?" భర్త ముఖంలో దేన్నో వెతుకుతున్నట్టు చూస్తూ అడిగింది సుధ.
"పంకజం చెప్పలేదా?" ముభావంగా అన్నాడు.
ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
"చెప్పింది."
"అయితే మళ్ళీ ఎందుకడుగుతున్నావ్?" ముఖంమీద ఫెడీమని కొట్టినట్టు అయింది సుధకు.
"నిన్ననే వస్తానన్నారు గదా?"
"వస్తానన్నాను. అయితే?"
మనిషి పూర్తిగా అద్దం తిరిగినట్టు మాట్లాడుతున్నాడు.
ఎందుకు తనమీద ఈ రుసరుసలు?