అయిదవవారం సీరియల్
రాత్రి... వివేక్ మంచి మూడ్ లో వున్నాడు. నా నైటీ జిప్ మీద చెయ్యి వేస్తుండగా, అతనిచేతిని పట్టుకుని అడిగాను- "అసలు మీ ఉద్దేశ్యం ఏమిటీ?"
"నైటీ విప్పేస్తే నువ్వు ఫ్రీ అవుతావనీ!" అన్నాడు.
"అది కాదు. తన్మయిని ఇంటికి తీసుకువచ్చ్చి చూపించడంలో" అతను విసుగ్గా-" ఇప్పుడా టాపిక్ అవసరమా?" అన్నాడు.
"కాదా? ఆ అమ్మాయితో ఆ ఇకఇకలూ పకపకలూ ఏవిటి? మీ మధ్యన ఏవీలేదంటే నమ్ముతాననుకున్నారా? ఏవైనావుందనితెలిసిందో దాని ప్రాణం తీస్తాను, నేనేంచాతకాని దాన్ననుకుంటున్నారెమో... మా అమ్మామ్మ పేరుచెప్తే మా ఊళ్లో అందరికీ హడల్! ఆవిడ మనవరాల్నినేను...."
అని గొంతు పెంచి ఇమ్కా ఏదో అనాలనుకునే లోపలే అతను లేచి వెళ్ళిపోయాడు.
నేను ఇలాజరుగుతుందని ఊహించలేదు నెమ్మదిగా నచ్చచెప్పి బ్రతిమాలుకుంటాడనో, లేక గట్టిగా పోట్లాట వేసుకుంటాడనో అనుకున్నాను. ఇలా నన్ను వదిలేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం సహించలేకపోయాను. ముందుగదిలోకి నడిచి-" అసలు నాలో లేనిదీ, దాన్లో వున్నదీ ఏవిటట?" అని అరిచాను.
వివేక్ కారుతాళాలు చేతిలోకి తీసుకుంటూ- "చూసొచ్చి ప్రొద్దుట చెప్తాను" అన్నాడు.
"అంటే..." అని నేను అరుస్తుండగానే డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
నా మనసు మొద్దుబారిపోయింది. బొమ్మాలా నిలబడిపోయాను ఎక్కడినుంచో కీచురాళ్ల రొద కర్ణ కఠోరంగా వినిపిస్తోంది.కొంతసేపటికి అది అలవాటైంది బహుశా భార్యలకి కూడా భర్తలు ఇలాగే భరించలేని విషయాలని అలావాటు చేస్తారేమో!
నా భర్త తన ప్రియురాలి దగ్గరికి రహస్యంగా కాదు....నాతో చెప్పే వెళ్లాడు!
నాకు కొత్తగా, బాధగా, చచ్చిపోవాలన్నంత ఉక్రోషంగా, ఇంకా ఏదో చెయ్యలన్నంత కసిగా వుంది. కొన్నాళ్ళకి వుండదు. ఇక్కడే... ఈ సోఫాలోనే కూర్చిని టీ.వీ చూస్తుంటాను.
అతను నా ముందునుండే వెళ్ళిపోతుంటాడు. తిరగి వస్తుంటాడు. మళ్లీ పోతుంటాడు, నేను చూస్తూ కూర్చుంటాను. ఇదేనా జీవితం?
నిర్లిప్తతా, నిరాసక్తతా అనేవి ఒక్కరోజులో పెరిగేవి కావు! మొదట చిన్న మొలకలుగానే ప్రారంభం అవుతాయి. వాటికి ఆ రోజు న మనసులో బీజం వేసి పోయాడు నా మొగుడు!
* * *
ప్రొద్దుట నేను లేవగానే ఎదురుగా చిన్నగా నవ్వుతూ కనిపించాడు వివేక్.
గుడ్ మార్నింగ్ అన్నాడు.
నేను వీలైనంత చీత్కారంగా చూశాను.
"బెడ్ కాఫి తాగుతావా?" అడిగాడు.
"విషం తాగుతాను" అన్నాను.
"ప్రస్తుతం ఇంట్లో ఎవైల బుల్ గా వున్న వాటి గురించి అడుగు. లేనిది ఇప్పటికప్పుడు ఎక్కడినుంచి తెనూ" మళ్ళీ నవ్వుతూ అన్నాడు.
నేను మొహం తిప్పుకుని బాత్ రూమ్ లోకి నడిచాను నాకు అతన్ని చూస్తుంటే చంపేయలన్నంత కొపంగా వుంది. నేను మొహం కడుక్కుని వచ్చేసరికి నిజంగానే కాఫి తీసుకొచ్చాడు.
"అలగడం... బ్రతిమాలించుకోవడం నీకు ఇష్టం అనుకుంట! అలాంటివన్నీ బెడ్ మీదకి వెళ్ళక ముందు చెయ్యాలి వెళ్ళాక కాదు అక్కడై తే వీడు నోరెత్తకుండా మనం చెప్పేదానికి తలూపుతాడులే అని అందర్లా నువ్వూ ఆశపడడంలో తప్పులేదు.
కానీ నేను అందర్లా అక్కడ అలాటివాటికి ఆస్కారం ఇవ్వను. నీకు తెలియాలని చెప్తున్నాను.
ఇంకో విషయం...నేను రాత్రి మొత్తం నా క్లినిక్ లోనే గడిపాను, కావాలంటే ఫోన్ చేసి చెక్ చేసుకో! నన్ను ప్రూవ్ చేసుకోడానికి కాదు. నీకు మనశ్శాంతిగా వుండటానికి చెప్తున్నాను" అన్నాడు.
వివేక్ హాస్పిటల్ కి వెళ్లిపోయాక చాలాసేపు ఆలోచించాను మనసు హాస్పిటల్ కి ఫోన్ చేసి రాత్రి "ఏం కేసులోచ్చాయా? డాక్టర్ గారు అక్కడే వున్నారా?' అని బోయ్ ని అడగమని తొందరచేసింది. కానీ వివేకం వద్దంది.
మధ్యాహ్నం హాస్పిటల్ నుండి బోయ్ వచ్చి, "డాక్టర్ గారు క్యారియర్ లో ఇద్దరికి భోజనాలు పంపమన్నారమ్మా" అన్నాడు.
"ఇద్దరికా?"
"ఔనమ్మా, తన్మయమ్మగారికి కూడా" వాడు మామూలుగానే చెప్పాడు.
"ఏం ఆవిడ ఇంటికెళ్ళాదా?" విసుగ్గా అడిగాను.
"ఇంకా రూమ్ దొరకలేదమ్మా, హాస్పిటల్ లోనే వుంటున్నారుగా" అన్నాడు.
నాకు కత్తివేటులా తగిలిందా మాట!
'రాత్రంతా వివేక్...హాస్పిటల్ లోనే వున్నాడు' నిజమే చెప్పాడు వివేక్ అబద్దం చెప్పడు!
* * *
వివేక్ నామీద చెయ్యివేస్తుంటే నాకు తన్మయి గుర్తొచ్చింది. ఇలాగే ముద్దు పెట్టుకుని వుంటాడా? ఆమె కళ్ళుమూసుకునివుంటుందా... తెరిచివుంటుందా? అతనికి ఇష్టమైనట్లుగా ఏక్టివ్ గా వుంటుందా? కాంప్లీట్ గా... న్యూడ్ గా ... అతను కోరినట్లుగా చేస్తూ... ఆ పైన ఊహించలేకపోయాను. రోషంగా నా గుండెల మీదున్న అతని చేతిని తోసేశాను.
"ఒంట్లో బాలేదా?" అడిగాడు.
"మనసులో"
"నేను బాగుచేస్తానుగా!" తనమీదకి లాక్కున్నాడు.
"అబ్బా... వద్దంటూంటే..." విదిలించుకున్నాను.
నా వైపు పరీక్షగా చూసి "సరే!" అని అటుతిరిగి పడుకున్నాడు. కాసేపటికె సన్నగా గురక పెట్టాడు. నాకు మాత్రం నిద్రరాలేదు.
అతని జుట్టుపట్టి కూర్చోబెట్టి 'ఇంత చక్కని భార్య వుండగా ఇంకో దానితో కులకడానికి సిగ్గులేదూ! నన్నూ ఇష్టపడే చేసుకున్నావుగా' అని కడిగెయ్యాలని ఎంతగానో అనిపిస్తోంది.
కానీ అతికష్టంమీద ఓర్చుకున్నాను.
వద్దనగానే అటుతిరిగి పడుకోడమేనా? బ్రతిమాలడమో బలవంతం చెయ్యడమో చెయ్యచ్చుగా! ఎందుకు చేస్తాడూ? కడుపు నిండిన బేరం, నేనూ పెరటిచెట్టుని! ఉక్రోషంగా అనుకున్నాను.
మరునాడు విజయ వైజాగ్ నుండి గ్రీటింగ్స్ పంపింది. 'అనూ... విష్ యూ హేపీ ఏనివర్సరీ!' అన్న విజయ గ్రీటింగ్ కార్డు చూడగానే నాకు విజయనే ప్రత్యక్షంగా చూసినంత సంతోషం వేసింది.
అంతలోనే నా పెళ్ళయి అప్పుడే సంవత్సంరం గడిచిపోయిందా అని దిగులేసింది.
అమ్మమ్మ దగ్గర్నుండి ఉత్తరం వచ్చింది.
'పాపా ఈనెలైనా తప్పావా?' అని ప్రతి ఉత్తరంలో అడిగే ఆవిడ చాదస్తానికి విసుక్కున్నా నాకూ అది లేకపోవడం లోపంగానే వుంది.
అందరూ పెళ్ళయిన ఏడాదిలోపే బిడ్డనెత్తుకుంటున్నారని ఆవిడ కినుకగావ్రాస్తుంది. నా పిల్లల్ని ఎత్తుకోకుండానే పోతానేమోననే భయాన్ని వ్యక్తం చేస్తుంటుంది.
వివేక్ రాగానే కాఫీతో బాటు రెండు ఉత్తరాలూ అతని ముందు పెట్టాను
"అనూహ్య... రేపునాతో బాటుక్లబ్ కొస్తావా?" అడిగాడు.
"రేపు మన పెళ్ళిరోజు" అన్నాను.
"అందుకే ఫ్రెండ్స్ కి చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను" అన్నాడు.
నాకు ఏ మాత్రం ఛాన్స్ దొరికినా అతనితో పోట్లాడాలనీ, తన్మయి గురించి అడిగి సంజాయిషి అడగాలనీ ఆత్రంగా వుంది.
"ఆవిడకూడా వస్తుందా? అదే మీ తన్మయి!" అన్నాను వత్తిపలుకుతూ.
"వస్తుంది" అన్నాడు.
"నేను రాను తనతో పాటే సెలెబ్రేట్ చేసుకోండి"అని చరచరా అక్కడినుండి వచ్చేశాను.
మంచంమీద బోర్లా పడుకోగానే దుఃఖం ఎగదున్ను కొచ్చేసింది, అమ్మా, అమ్మమ్మా గుర్తొచ్చారు నా భుజం మీద అతని చెయ్యి పడింది.
"తన్మయి గురించి నువ్వు చెడుగా అనుకుంటున్నావు" అన్నాడు.
"మీ గురించి కూడా!" అన్నాను.
"నీవన్నీ పనిలేక కల్పించుకునే కల్పనలు ఈరోజుతో అవన్నీ వదిలేయ్ రేపటినుండీ మరో సంవత్సరంలోకి అడుగు పెడ్తున్న దంపతులం, హాయిగా వుండు. నన్ను హాయిగా వుంచు" అన్నాడు.