Previous Page Next Page 
అనూహ్య పేజి 14

    "వదిలేస్తాను మీరూ తన్మయిని వదిలేస్తారా? తనని పంపించేస్తారా?" అన్నాను.
    అతను నా మీద నుంచి తనచేతిని తీసేస్తూ," ఉహూ! కుదరదు... అలా చెయ్యడానికి  వీల్లేదు..." అన్నాడు.
    "అందుకే నేను  ఏడుస్తున్నాను" అని పెద్దగా ఏడ్పు మొదలు పెట్టాను.
    "నన్ను నమ్ము నువ్వు  అనుకుంటున్నట్లుగా ఏం జరగడంలేదు. అసలూ..." అంటూ అతను ఏదో చెప్పబోయాడు.
    "నాకేం చెప్పద్దు, యూ ఆర్ ఏ ఛీట్!" అని  ఉక్రోషంగా అరిచాను.
    "అది కాదూ..." అని ఏదో చెప్పబోతూవుంటే- "గెట్ లాస్ట్  ఫ్రమ్ మై లైఫ్...దానితోనే   వుండు"    అని   తోసేశాను.
    "మగవాడ్ని హోల్డ్ చెయ్యాలంటే గోంతోక్కటే సరిపోదు!" అనే ఆ గదిలోంచి వెళ్ళిపోయేముందు వివేక్  ఆఖరిగా అన్నమాటలు.
    "అవును! నాకు  హోల్డ్ చేసే  కెపాసిటీ లేదు. ఆ వగలాడికి వున్నన్ని  హొయలు నా కెక్కడివీ! ఛీ! సిగ్గులేదు. నీలాంటివాడికి పెళ్ళాం ఎందుకసలు? పెళ్లి చేసుకుని నిర్ధాక్షిణ్యంగా నా గొంతుకోశావు" అన్నాను.
    అతనినుండి ఏం రెస్పాన్స్ రాలేదు.
    పెళ్ళయ్యాక అతను ఆ మాత్రం  సామరస్యంగా నాతో  మాట్లాడడం, అనునయించడం అదే  మొదటిసారి! అనవసరంగా వున్న  కాస్త బంధం పుటుక్కున విరిచేశానేమో అనిపించింది.
    కానీ  అంతలోనే  అతను  నాలోని   స్త్రీ త్వాన్ని అపమానిస్తే ఎలా సహించడం? అదీ  తన సెక్రెటరీ తో పోల్చి! అని మనసు ఎదురుతిరిగింది.
                                                      *        *        *    
    సమయం పదకొండు గంటలు దాటుతోంది. వర్షం  కుండపోతగా కురుస్తున్నట్లు శబ్దం వినబడోంది.
    నేను సీలింగ్ ని చూస్తూ  వెల్లకిలా పడుకుని, మోచేతిని నుదుటికి ఆన్చుకున్నాను. కన్నీరు నెమ్మదిగా చెంపలమీదికి జారింది. పక్కకి ఒత్తిగిల్లగానే ఉప్పగా పెదవులమధ్యకి జేరింది.
    కన్నీళ్ళు త్రాగి, కష్టాలు దిగమింగి బ్రతకడమేనా ఆడదాని జన్మకి సార్ధకత?' ఈ మధ్యన ఏదో ఓ పుస్తకాలో చదివిన స్త్రి వాద  కవితలో వాక్యం గుర్తు కొచ్చింది. 'కాదు కాదు' అని  ఎలుగెత్తి అరిచింది నా హృదయం కాకపోతే ఏంచెయ్యగలనూ? అని  ప్రశ్నించుకున్నాను జవాబు తట్టలేదు!
    అర్దరాత్రి కావస్తోంది. అతనింకా రాలేదు.
    అక్కడ బహుశా  తన్మయితో అతను తన పెళ్ళి రోజు మహాదానందంగా  సెలెబ్రేట్ చేసుకుంటూ వుండి వుంటాడు నాకు  ఆపుకోలేనంత దుఃఖం ముందు కొచ్చింది. కళ్ళకి చీకటి గంతలు కట్టుకున్నట్లుగా వున్న రాత్రి ఏం జరిగినా పట్టించుకోదు. ఎప్పుడు  తెల్లవారుతుందో! డబల్ కాట్ బెడ్ మీద ఓ పక్కన ఖాళీగా వుంది... నా మనసులాగే!
    బ్లాంకెట్ మీదనుండి తొలగించి లేవగానే  రయ్యిన కొట్టింది చలిగాలి! వేడి వేడి టీ త్రాగితే బావుండ్ను అనిపించి కిచెన్ వైపు కదలబోతుండగా మ్రోగిందిఫోన్! గబుక్కున వెళ్ళి అందుకున్నాను.
    అతను  ఫోన్  చేస్తాడని నా ఆశ!
    "హలో!" అని ఓ  మగగొంతు వినిపించింది.
    "హలో!" అన్నాను.
    "మేడమ్... దయచేసి నేను  చెప్పేది వినండి... ఫోన్  పెట్టేయకండి!" ముద్దముద్దగా వినబడింది ఓ కంఠం.
    నేను అతని  పరిస్ధితి ఊహించి-
    "మీకే నంబర్  కావాలి?" అన్నాను.
    "నాకే నంబర్ అయినా  ఒకటే దయచేసి వినండి...ప్లీజ్' అతను వేడికోలుగా అన్నాడు.
     నేను ఫోన్ పెట్టేయనా, వద్దా అని ఆలోచిస్తూ అలాగే నిలబడ్డాను.
    "పదేళ్ళ కాపురంలో నేనేం లోటు చేశానో తెలియడంఅ లేదు.  వెళ్ళేముందు ఒక్కమాట... ఒక్కమాట కూడా చెప్పకుండా నన్ను వదిలి  వెళ్లిపోయింది... నా ధర్మపత్ని... నా అర్ధాంగి!
    నేనేం తప్పుచేశానో చెప్పి  వెళ్ళచ్చుగా!" ఒక సెకన్ ఆగిమళ్ళీ మొదలు పెట్టాడు. ఈసారి ఇంకా ముద్దగా వుంది అతని స్వరం.
    "అన్నీ..అన్నీ...తన  ఇష్టప్రకారమే చేషానే... ఒకషారి... ఒకషారి నాతో నా తప్పేంటో  చేప్పెకుండా... అషలు.. నేనేం..."
    నేను డిస్ కనెక్ట్ చేసేశాను. అతను ఇంక  ఒక్కమాటకూడా ముందుకి వెళ్ళలేని పరిస్ధితిలో వున్నాడని నాకు అర్ధమైపోయింది. తన గోడు వీనే ప్రాణికోసం తహతహలాడ్తున్న మరో ప్రాణి! ఈ  లెఖ్ఖన ఇంటికో కన్ ఫెషన్ బాక్స్... వారానికో కౌన్సిలింగ్ ఇండియాలో  తప్పనిసరేమో!
    నాకు  ఫోన్ లో మాట్లాడినవ్యక్తి కంఠంలోని దుఃఖం గుర్తొచ్చింది. పెళ్ళయి ఎందుకు వెళ్ళిపోతారూ? వీళ్ళు చేసే నిర్లక్ష్యంవల్లా, పెట్టె  బాధలవల్లా! బాధ అంటే కొట్టడం తిట్టడం మాత్రమే కాదు! ఇంకా  ఎన్నో సూక్ష్మమైన పదానాలున్నాయి.
    ఉదాహరణకి కట్టుకున్న  భార్య ముందు ఇంకో అమ్మాయి ఏక్టివ్ నెస్ నీ,  అందచందాల్నీ పొగిడినా మనసుకి రోతగానే వుంటుంది! ఇలా ఓకే ఇంట్లో  వుంటు, దంపతులు విడివిడిగా,  మ్యారేజ్ డేలు సెలెబ్రేట్ చేసుకోవడం కూడా బాధగా!
    నేను  టేప్ రికార్డర్ ఆన్ చేసి, మోహది హాసన్ గజల్స్ వింటూ టీ  చెయ్యడానికి వంటింట్లోకి వెళ్ళాను. టీ కలుపుతూ ఆలోచించాను. అతను  ఈ పాటికి బెడ్ మీదకి చేరి ఆనందంగా వుంటాడు.
    ఆ ఊహ  రాగానే మనసంతా చేదుగా మారింది. చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను టీ చేదుగా గొంతులోకి జారింది!
    ఉహూ! ఆ ఆలోచన  పిరికివాళ్లు చేసేది! నేను చచ్చిపోతే అతనికేం నష్టం! ఒక్కరోజు రొటీన్ తల్లక్రిందులయిందని బాధపడ్తూ ఆ రోజంతా  నన్ను  తిట్టుకుంటూ నా శవంపక్కన గడుపుతాడేమో! అలా  కాదు! అతను నాలా బాధపడాలి... యమ చెర అనుభవించాలి.... ఎలా? ఏదైనా చెయ్యాలి.
     నా గుప్పెళ్ళు బిగుసుకున్నాయి.
    ఫస్ట్ ఏనివర్సరీ! మొదటి పెళ్ళిరోజు ఇదేనా అతను నాకిచ్చే ప్రాముఖ్యత! ఇందుకేనా అతన్ని ఏరికోరి పెళ్ళిచేసుకున్నాను. అలాంటివాడ్ని ఏంచెయ్యాలీ? తెల్లవారుతుండగా తట్టింది నాకో బ్రహ్మాండమైన ఆలోచన! మా మొదటి పెళ్ళిరోజున నాకా ఆలోచన  రావడం నా దురదృష్టం.
                                                   *        *        *
    లక్ డీ కాపూల్ లో అశోకా హొటల్ దగ్గరున్న ఆ    ఆఫీసు పట్టుకోవడం నాకు పెద్దగా కష్టం కాలేదు. 'విమెన్ ప్రొటెక్షన్ సెల్ అంటే ఎలా వుంటుందో అనుకుంటూ వచ్చిన  నాకు  అది ఓ  మామూలు  పోలిస్ స్టేషన్ లాగే కనిపించింది.
    "రా...అమ్మా...రా!" అంటూ అక్కడ కూర్చున్న ఓ లేడీ ఇనస్పెక్టర్ ఆహ్వానించింది. ఆవిడపేరు  పులకేశి అని ఆవిడ  గుండెలమీద  వ్రాసుంది. ఆవిడ  వయసు  నలబై పైనే వుంటుంది. కాస్త భారీకాయం.
    నేను నమస్కారం పెట్టగానే కుర్చీ చూపించింది.
    "ఏవిటి కంప్లైంట్?" అని అడిగింది.

 Previous Page Next Page