"మీరు ఇద్దరులాగా వున్నారు. మీ ఇద్దరూ కలిసి ఎంత సంపాయిస్తున్నారేం?" అన్నాను కొంచెం వ్యంగ్యంగా.
ఆమె అహంకారానికి దెబ్బ తగిలి వుంటుంది. చిరచిరలాడుతూ కనుబొమలు చిట్లించి అన్నది__
"మా నాయన చాలా గొప్పవారు."
"ఓహోఁ అలాగా! మీ నాయనగారి నామధేయం?" అన్నాను, కొంటెగా నవ్వుతూ.
"నారాయణమూర్తి, జస్టిస్ పార్టీ లీడర్. ఆయనకు గొప్ప గొప్ప వాళ్ళంతా తెలుసు!"
"ఏదీ, నేను ఆయన పేరు ఎక్కడా వినలేదే" అన్నాను. నేను ఆ గొప్ప వాళ్ళలో ఒకదాన్నయినట్లు.
ఈమె దగ్గర తగ్గి మాట్లాడితే ప్రయోజనం లేదనుకుని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందుకున్నాను__
"మా నాన్న కూడా చాలా గొప్పవారే. నాకూ పనిచేయాల్సిన అవసరంలేదు. ఏదో సరదాగా చేస్తున్నాను" అన్నాను.
మా నాన్న ఎవరని అడిగితే కనీసం ఒక చిన్న మంత్రిగారి పేరుకు తక్కువ చెప్పకూడదనుకున్నాను. ఇప్పుడు ఆమె నేను చెప్పింది వినే స్థితిలో లేదు. తను చెప్పేది నేను నమ్మటం లేదనే బాధలో, ఇంకా ఏం చెప్పాలా? అనే సందిగ్ధంలో పడ్డదిలాగున్నది. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు విప్పారిన ముఖంతో అన్నది :
"మా ఆయన కలెక్టరు!"
ముందే నేను పెళ్ళికాలేదని చెప్పినందుకు పశ్చాత్తాపపడుతూ అన్నాను__
"ఎక్కడ?"
"బళ్ళారిలో"
వెంటనే 'బిల్లు కలెక్టరా?' అందామనిపించింది. మరల ఒకసారి ఆమె వేష భూషణాల్ని పరికించి చూడసాగాను. ఈ రోజుల్లో చౌకగా వచ్చే ఇరవైఏడు ముఫై రూపాయల బెంగళూరు సిల్కు చీరా, క్రేప్ జాకెట్ చూస్తే కొంచెం ఆస్తిపాస్తులు వున్నదానిలాగే వున్నది. మెడలో చౌకబారు పూసలదండా, చేతులకు మట్టిగాజులు చూస్తే మా స్నేహితురాలు ఒకసారి అన్న మాటలు గుర్తొచ్చాయి. 'అరవ దేశంలో ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో ఎంత బీదవాళ్ళకైనా సరే ఒక పట్టుచీరా, వెండి మరచెంబూ తప్పక వుంటాయి. ప్రయాణాలకు బయలుదేరితే ఇంటి కోడళ్ళు పట్టుచీర కట్టి వెండి మరచెంబు చేత్తో పట్టుకొని, చంకలో నిలవకుండా జారిపోయే పిల్లవాణ్ణి పైకి లాక్కుంటూ, వెనక్కు కూడా తిరిగి చూడకుండా ధీమాగా నడిచే భర్త వెనక నడుస్తుంటారు."
"మాకు బళ్ళారిలో పెద్ద బంగాళా వున్నది!"
ఆలోచనల్లో మునిగివున్న నేను యధాలాపంగా అనేశాను. "ఆఁ ఈ రోజుల్లో బంగళాలకు ఏమి తక్కువ. మాకూ వున్నవి అడయారులో రెండు!"
'ఐతే ఇటు వెళ్తున్నావేం?' అన్నది విసురుగా.
'ఇక్కడా ఒక బంగాళా వుంది' అన్నాను నవ్వుతూ.
వచ్చే కోపాన్ని అణుచుకొంటూ అన్నది 'ఎక్కడ?'
'నేను వెళ్ళేచోటే' అన్నాను పెంకెగా.
"నేను చెప్పిందంతా అబద్దం అనుకుంటున్నావు లాగున్నది. ఇక నన్ను మాట్లాడించకు" అన్నది విసురుగా తల తిప్పుతూ.
ఇంతసేపూ ణా బలవంతంమీదనే మాట్లాడినట్లు అన్న ఆమె మాటలకు నాకు కోపం వచ్చింది.
'అబ్బే, మీరు చెప్పిందంతా నిజమేననుకుంటున్నా. అయితే నాకు తెలియకడుగుతా. కలెక్టర్ గారి సతీమణి అయివుండీ, ఇంత చీకటిపడి, ఈ బస్సుల్లో ప్రయాణం చేయాల్సిన ప్రారబ్ధం!' అన్నాను.
"మా కారు వూళ్ళూ వుంది. ఇక్కడ ఎందుకుంటుంది?" అన్నది.
"కారు లేకపోయినా, కనీసం టాక్సీలోనన్నా పోవాలి. అబ్బే, మీ గొప్పతనానికి ఇలా రావటం, ఏమీ బాగాలేదు. పైగా పెట్టెను స్వయంగా మోయటం అంతకంటే బాగాలేదు," అంటూ నవ్వాను.
ఆమె కళ్ళు చింతనిప్పుల్లా అయినై. అవమానంతో కూడిన కోపంతో ఆమె పెదవులు వణుకుతున్నాయి. నా పాచిక పారినందుకు విజయగర్వంతో ఈమె కళ్ళల్లోకి చూశాను. ఆమె ముఖం తిప్పుకున్నది. చచ్చిన పాముకు కొట్టటం దేనికని ఊరుకున్నాను.
వివాహితలైన స్త్రీలు.....అందరూ కాదనుకోండి.
తమ భర్తల గొప్పతనాన్ని-అంటే సంపాయించటంలో పెద్దతనాన్ని ఇలా బస్సుల్లో, రోడ్లంట ఎందుకు-పనికట్టుకుని ప్రచారం చేసుకుంటారా అన్న మీమాంస కలిగింది.
ఇలాంటి ధోరణి గల పరిచయస్తులు కూడా నాకున్నారు. మా రమ కొంచెం ఇంచుమించుగా ఇలాగే చెబుతుంది. 'మీ ఆయన ఏం చేస్తుంటారు?' అని ఎవరైనా అడిగితే, ఆ ప్రశ్న కోసమే మొహంవాచి వున్నట్లు- 'డాక్టరూ!' అనేస్తుంది.
'యం.బి.బి.ఎస్సా?' అంటే__
'యం.బి.బి.యస్ తప్ప మరెవరూ డాక్టరు కారా?' అని ఎదురు ప్రశ్న వేస్తుంది.
అసలు సంగతేమంటే రమ భర్త హోమ్యో డాక్టరు. అలా అని ఆయన ఇంటిముందు బోర్డు కట్టుకున్నా, ఈ భార్యా రత్నం మాత్రం ఇతర్ల దగ్గిర ఆ సంగతి ఒప్పుకోవలసి వచ్చేసరికి, నానా హంగామా చేసి, తను బాధపడి ఇతర్లను బాధపెడుతుంది.
ఇలాంటివారికి వ్యక్తిత్వాలంటూ వుండవా? లేక ఇంకా కలల్లోనే బ్రతుకుతూ, వాస్తవ జీవితంలో వాటికి సమన్వయం కుదరక తలకిందులవుతుంటారా? అనిపిస్తూంటుంది. అందుకనే ఈ రకం వాళ్ళంతా నాకు పొట్లపాదుల్లాగా, కాకరతీగల్లాగా కన్పిస్తూంటారు. అందుబాటులోవున్న ఏ ముళ్ళకంపకో అల్లుకొని, తరవాత మారాకు తొడిగేందుకైనా వీలు చిక్కక కునారిల్లుతూంటారు.
ఇలాంటి భావాలన్నీ అప్పట్లో నాకు చాలా అస్పష్టంగా తోచినై. నేను దాదాపు ఆమెతో జరిపిన సంభాషణంతా వుబుసుపోక కిందనే జమకట్టాను. కానీ వానజల్లులో బస్సు దిగి ఆమె కూడా నాతోపాటే అక్కడికి వచ్చి నిలబడింది. ఇక్కడే ఈ జరిగిందంతా ఓ కథకు క్లైమాక్సులాగా తయారయింది.
"నమస్తే! ఎక్కడి నుంచి?" అన్నాడు ఓ నడికారు మనిషి, ఆమె షెల్టర్ లోకి వచ్చి నా పక్కన నిలబడగానే.
"మాంబళం నించి" అన్నదామె నాకేసి బిత్తరపోయి చూస్తూ.
"బళ్ళారిలో వారం రోజుల కిందట రామనాథం కనిపించాడు. నేను రైలు దిగీ దిగకముందే నా ముందు నిలబడ్డాడంటే నమ్మండి. ముందు నా దగ్గిర టిక్కెట్ వుందో లేదో చూసికానీ, కుశల ప్రశ్నలు వేయలేదంటే ఆశ్చర్యపడనవసరం లేదు. అసాధ్యుడిలాగున్నాడు!"
ఆమె ముఖం వెలవెలపోయింది. ఏదో అనేందుకు గొంతు సవరించుకునేలోపలే అతను "మళ్ళీ కలుసుకుంటాను, బస్సు వచ్చింది!" అంటూ బస్సుకేసి పరిగెత్తాడు.
నేను నవ్వుతూ ఆమెకేసి చూశాను. ఏదో అందామనిపించింది. ఏమనేదాన్నో ఇప్పుడైతే చెప్పలేను. కానీ అంతలో రిక్షావాడు అక్కడకు వచ్చి 'రిక్షా రిక్షా' అన్నాడు.
నేను, "కలెక్టర్ భార్య, రిక్షా ఎలా ఎక్కుతుందోయ్!"అనేసి, రిక్షాకోసం కాబోలు ముందుకు రాబోతున్న ఆమె కంటే ముందే పోయి రిక్షా ఎక్కి కూర్చున్నాను.
('ఆంధ్రజ్యోతి' మాసపత్రిక - 1953 దీపావళి సంచిక నుంచి)