"దయ్యాలు కూడా మనుషులకు భయపడ్తాయి!"
నేను తృళ్లిపడ్డాను. మళ్లీ నా మనసులో రేగిన ప్రశ్నలకు వీడు సమాధానం ఇచ్చాడు.
"అందరు మనుష్యులకూ కాదు. కొందరికే. అతీతశక్తుల్ని సంపాదించుకొన్న వాళ్లకు. దయ్యాలను మేము మా చెప్పుచేతుల్లో ఉంచుకొని వాటిచేత ఎన్నో పనులు చేయిస్తాం. ఆ భూతరాజుగాడ్ని నేను అలాగే ఏడిపిస్తున్నాను. ఈ ప్రాంతాల్లో తిరిగే రౌడీ దయ్యాలన్నీ నా అదుపులో ఉన్నాయి. వాటిద్వారానే వాడిని పీడిస్తున్నాను."
"ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది."
"అదేంటి బాబూ! మీరు రచయిత గదా? ఈమధ్య రచయితలు ఈ విషయాలు వివరంగా రాస్తున్నారుగా! పైగా దయ్యాలమీద రిసెర్చిచేసి, వాస్తవాలనే రాస్తున్నామని కూడా చెబుతున్నారుగా? మీరు చదవలేదా?"
"నేను అలాంటి ట్రాష్ చదవను."
రహమాన్ అదోలా నవ్వాడు. పిచ్చివాడ్ని చూసి తెలివైనవాడు నవ్వే నవ్వు అది. దయ్యాల కథలు రాస్తూ సరదాకు రాశానని చెప్పడం కూడా కాదు. వాస్తవాలూ, నేను చూసి అనుభవించినవని కూడా రాస్తున్నారా? ఇంతకంటే ద్రోహం మరొకటిలేదు.
"దయ్యాలు కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి బాబూ! జీవితంలో మంచిగా బ్రతికిననాడు దయ్యం అయికూడా మంచిగానే ఉంటాడు. అలాంటివాడు విముక్తికోసం ఎదురుచూస్తూ బాధపడుతూ ఉంటాడేగాని మరొకర్ని పీడించడు. శొడీగా బతికినవాడు, ఇతర్లను పీడించి బతికినవాడు, దయ్యం అయికూడా పీడిస్తాడు."
"రహమాన్! ఆగు! నీవాగుడంతా నేను నమ్మను-" అన్నాను కోపంగా.
రహమాన్ ముఖం పక్కకు తిప్పుకొన్నాడు. మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం మరీ భయంకరంగా అన్పించింది. వీడితో తర్కించి కోపం తెప్పించడం నాకే హాని! అనవసరం చిక్కుల్లో పడ్డాను.
మళ్ళీ వీడితో వాదించి కొత్త చిక్కులు కొనితెచ్చుకోవడం మరీ బుద్ధిలేనితనమే అవుతుంది.
ఎలాగయినా వాడి కోపం తగ్గించి మళ్ళీ మాటల్లో పెట్టాలి. లేకపోతే ఏంచేసినా చెయ్యగలడు.
"రహమాన్!"
"అయ్యా!" గుర్రుగా అన్నాడు.
"కోపం వచ్చిందా?"
వాడు మాట్లాడలేదు.
"అసలు విషయం నేను ఆత్మల్ని నమ్మను, దయ్యాల్నీ భూతాల్నే కాదు దేవుడ్ని కూడా నమ్మను. అందువల్లనే అప్పుడప్పుడు నీ మాటలకు అడ్డొస్తున్నాను. ఫర్వాలేదు చెప్పు."
"నమ్మనివాళ్లకు చెప్పి నమ్మించాల్సిన పని నాకేం లేదు. త్వరలోనే మీరు అనుభవించబోతున్నారు. అప్పుడు నమ్మక ఏంచేస్తారు? ఈ లోపల నాకెందుకీ కంఠ శోష!"
"నా విషయం, నా నమ్మకాల గురించి చెప్పాను. అంతే! నేను ఓపెన్ మైండుతోనే ఉన్నాను. ఎవరైనా రుజువు చేసినా, నా అనుభవంలోకి వచ్చినా నమ్మక ఏంచేస్తాను? చెప్పు!" మృదువుగా అడిగాను.
వాడు మాట్లాడలేదు.
"మంచివాడు దయ్యం ఎందుకవుతాడు? మంచివాళ్లకోసం స్వర్గ ద్వారాలు బార్లాగా తెరిచి వుంటాయని మా శాస్త్రాల్లో చెప్పారుగా?" అన్నాను ప్రశ్న వేస్తేగాని వాడు మాటల్లోకి దిగడని.
"మంచివాడు అకాల మరణం చెందితే దయ్యం అవుతాడు. అతడి నిర్దేశించిన జీవితం పూర్తి అయేంతవరకూ అతనికి ఊర్ధ్వ లోకాల్లోకి ప్రవేశం ఉండదు. అంతవరకూ దయ్యాల రూపంలో ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటారు. ఈ విషయం కూడా రచయిత్రిగా మారిన ఓ రచయిత చెప్పాడు."
నాకు మళ్ళీ పిచ్చికోపం వచ్చింది.
"ఇలాంటి విషయాలు అనుభవించి రాశామనేవాళ్లను సైకియాట్రిస్టు దగ్గరకు పంపించాలి. పాపం! వాళ్లు కావాలని అబద్ధాలు రాస్తున్నారనుకోను. అలాంటి హల్యూసినేషన్స్ కు గురి అయి అది వాస్తవంగా భావించి రాస్తున్నారు. నీకూ అలాంటి పిచ్చే ఉన్నట్టుంది. భూతరాజు దయ్యంకాదు. మనిషే! నీలాంటి మనిషే!" అన్నాను ఉద్రేకంగా.
వాడు అదోలా నా ముఖంలోకి చూశాడు.
వాడి చూపులు నావళ్ళంతా ముళ్లులా గుచ్చుకున్నాయి.
నాలో నేనే చెంపలు వేసుకున్నాను.
వెధవ బుద్ధి!
ఊరికే వినకూడదూ?
మరో గంటకు ఊళ్లోకి చేరతాం!
అంతవరకూ వాడు చెప్పేదాన్ని వింటే సరిపోలా?
బండి ఏదో చెట్టు కిందగా పోతోంది.
నేను ఉన్నట్టుండి కెవ్వున అరిచాను.
బండి టాపుమీదకు ఏదో దూకింది.
నేను అరుస్తూ బండిలోనుంచి నాకు తెలియకుండానే దూకాను. వెలికిలా పడ్డాను. నా గుండెలమీదకు ఏదో ఆకారం ఎక్కి కూర్చుంది. అంతవరకే నాకు తెలుసు.
ఇదంతా క్షణంలో సగంసేపులో జరిగింది.
ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
కళ్ళు తెరిచాను.
పైన మబ్బుల మధ్యనుంచి చందమామ పరుగులు తీస్తున్నాడు.
నేను ఎక్కడున్నాను?
ఏమైంది నాకు?
రాత్రినుంచి జరిగిన విషయాలు గుర్తొచ్చాయి.
ఏదో బండి టాపుమీద పడటం, నేను కింద పడటం, నా గుండెల మీద ఏదో ఆకారం కూర్చోవడం లీలగా కళ్ళలో కదిలింది.
మళ్లీ భయంతో వళ్ళంతా బిగుసుకుపోయింది.