"అక్కడ...అదే...ఆ దేశంలో నువ్వు కలుస్తావు కదూ?" ఉద్వేగంగా అడిగింది.
"మనం కలుసుకుంటాం" సాలోచనగా అన్నాడు.
"ఎప్పుడు? ఎక్కడ" ఆతృతగా అడిగింది.
"అది మన కర్మకు వదిలేద్దాం. ఏ సంఘటనా కాకతీయంగా కాదు. ప్రతి సంఘటనా ముందే మన జీవితంలో నిర్ధారించి వుంటుంది. అందుకే హిందువులు శివుని ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదంటారు."
సీత ఆలోచనలో పడింది. అతని మాటలు ఆమెకు అర్థం అయినట్టూ కానట్టూ కూడా ఉన్నాయి.
"కర్మను నమ్మమంటారా? ఎందుకూ?"
"అప్పుడు నీకు ఆత్మబలం చేకూరుతుంది. మానవమాత్రుడు నిన్ను ఏమీ చెయ్యలేడనీ, నిన్ను కాపాడే శక్తి ఏదో నీ వెనక వుందనీ నువ్వు నమ్మాలి.
అప్పుడే నువ్వు ధైర్యంగా బ్రతగ్గలవు. దృక్పథం కూడా విశాలం అవుతుంది.
ఆగి సీత ముఖంలోకి ఓ క్షణం చూసి మళ్ళీ అందుకున్నాడు.
"కొండలమీద నుంచి సన్నగా ప్రవహించే నీటి ధారను చూసే వుంటావు. అది కొంతదూరం వెళ్ళాక విస్తరించి సెలయేరుగా మారుతుంది. మరికొంత దూరం ప్రవహించాక అది బృహత్ రూపాన్ని ధరించి నదిగా మారుతుంది. అంతలో అది ఆగిపోదు. దాని పయనం కొనసాగుతూనే వుంటుంది. సముద్రంలో విలీనం అయేంతవరకూ అది క్రమ వికాసం పొందుతూ ముందుకు సాగుతూనే ఉంటుంది.
సీత కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది.
"నువ్వు చెప్పింది నాకు అర్థం అయింది. నేను కొండ మీదనుంచి ప్రారంభమైన సన్నటి జలధారను కాదు. నేను కేవలం ఒక బిందువును మాత్రమే."
అతను సన్నగా నవ్వాడు.
"నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు. జలబిందువు చిన్నదే కావచ్చును. అలాంటి ఎన్నో జలబిందువుల ఆస్థితం వల్లనే విశాల సముద్రం ఏర్పడుతుంది.
ఆమె మౌనంగా ఉండిపోయింది.
"కొన్ని అనుకోని సంఘటనలు నీకు ఎదురుకావచ్చు. వాటివల్ల నీకు జీవితం మీద గౌరవం పెరగవచ్చు."
ఆమె అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
"కొన్ని సంఘటనలు మనిషిని బెదరగొడ్తాయి. కొన్ని జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తాయి. జీవితంలో సుఖాలకంటే కష్టాలే ఎక్కువ" అన్నది సీత.
"కష్టాలంటే మనకు భయం. బాదిస్తున్నట్టు సుఖం గుర్తుండదు. అందుకే జీవితంలో కష్టాలు ఎక్కువ అని భాధపడిపోతే వెంటనే రెండోది పైకి లేస్తుంది. భవిష్యత్ మీద నమ్మకం ఉండాలి.
మళ్ళీ మనం "నమ్మకం గురించి ఆలోచిస్తున్నాం" అన్నది సీత.
అతను నవ్వాడు.
ఆమె తలపైకెత్తి నక్షత్రాలను చూస్తూ కొద్దిక్షణాలు ఉండిపోయింది.
"నువ్వు కన్పించాక నాకు జీవితం అంటే ఇష్టం ఏర్పడింది" అన్నది ఆమె అతనికేసి చూడకుండానే.
"రెండోసారి కన్పించావ్... అంటే... ఇప్పుడు...?"
"ఇప్పుడు నాకు జీవితం విలువలు అర్థం అవుతున్నాయి. జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నట్టుగా భావిస్తున్నాను."
"అవును! జీవితం విలువైనది. అంతేకాదు. మనం జీవితయాత్రలో ఎదురైనా ఎందరో వ్యక్తులు మనల్ని ప్రభావితం చేస్తారు. ఆ విషయం మనకు జీవిత సంధ్యాకాలంలో అర్థమవుతుంది. జీవితం ముగింపుకి వచ్చినట్టు భావన వచ్చాక మనం గతంలోకి చూస్తాం. మన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులనూ, సంఘటనలనూ తల్చుకుంటూ, మననం చేసుకుంటాం. అంతేకాదు మనం ఎంతమందిని మనవైపుకు ఆకర్షించామో అన్న విషయాన్ని కూడా తిరగతోడుకుంటాం" అని ఆగి ఆమె ముఖంలోకి చూశాడు.
సీతకు అతని మాటలు వింటున్నకొద్దీ వినాలనివున్నది...
"మీ మాటలు వింటూంటే నాకేమనిపిస్తూందంటే-"
"ఊ చెప్పు! ఆగావే?"
"ఎప్పుడో ఒకనాడు నేను ఏ రాజకుమారుడినో పెళ్ళాడి రాణిని అవుతాననీ..."
"ఇంకా...."
"మరో జోన్ ఆఫ్ ఆర్క్ నై ఫ్రాన్స్ ను రక్షిస్తాననీ" ఆగి అతని ముఖంలోకి చూసింది.
"ఏం? ఎందుకు కాకూడదూ? ఎన్నో అసంభవాలను కొన్ని సంభవాలు కావడం మనకు తెలియని విషయంకాదు."
"నా జీవితంలో అలాంటి అసంభవాలు సంభవిస్తాయని నేను అనుకోలేదు. కాని నువ్వు చెపుతున్నావు గనక అలా జరగాలని కోరుకుంటాను."