కలసిన మనసుల్ని కనపడని దేవత కలకాలం చల్లగా వుండమని ఆశీర్వదించింది. మెడలో దండలతో, పసుపు తాడుతో అడుగు లోపలకి వేసింది మాధవి. జన్మజన్మలకీ విడవనన్నట్లు చెయ్యి పుచ్చుకుని వెనకాలే నడుస్తున్నాడు అజయ్.
ఏమిటే ఇది? ఆశ్చర్యంగా అడిగింది అమ్మమ్మ.
అజయ్, నేనూ గుళ్ళో పెళ్ళి చేసుకున్నాం అమ్మమ్మ. క్షమించు నీకు చెప్పడానికి టైము లేకపోయింది. మమ్మల్ని ఆశీర్వదించు. పాదాలకు నమస్కరించారు.
గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్ళి చేసుకునే ఖర్మేం పట్టిందే! హవ్వ! నలుగురూ ఏమనుకుంటారు? రేపు బిడ్డో పాపో పుడితే గుళ్ళో దేముడొచ్చి మీరిద్దరూ భార్యభర్తలేనని సాక్ష్యం చెబుతాడా? కనీసం ఊళ్లోవాళ్ళనయినా పిలవకుండా, కట్టుగుడ్డలతో ఐనా వాళ్లెవరూ లేకుండా పసుపుతాడుతో పెళ్ళి చేసుకునేంత అవసరం ఏమొచ్చిందే? కళ్ళనీళ్ళు పెట్టుకుని పిచ్చిదానిలా కుర్చీలో కూర్చుండిపోయింది ఆమె.
అమ్మమ్మా! అజయ్ మిలటరీలో చేరారు. అర్జంటుగా మూడురోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి. అందుకనీ...ఇలా చెయ్యవలసి వచ్చింది తలవంచుకుని మెల్లగా అంది మాధవి.
"ఏమిటీ? మిలటరీలో చేరాడా? అంటే యుద్ధానికి వెళుతున్నాడా? అయ్యయ్యో? ఎంతపని చేశావే? మూడురోజుల ముచ్చట కోసం చెప్పా చెయ్యకుండా బంగారం లాంటి జీవితాన్ని పాడుచేసుకున్నావా తల్లీ... ఇదేం ప్రేమే అమ్మా..." శోకాలు పెట్టింది అమ్మమ్మ.
"అమ్మమ్మా! ఆశీర్వదించమని అడిగితే దీవెనలు బదులు శోకాలు పెడుతున్నావా? అమ్మమ్మా నీకు తెలీదూ, నీ మనుమరాలు తప్పు చెయ్యదని. నా నిర్ణయం తప్పంటావా అమ్మమ్మా?"
"ఏం చెప్పనే తల్లీ! నీ మనసు నాకు తెలిసినా లోకానికి తెలీదు కదే తల్లీ! గుళ్ళో దండలు మార్చుకున్నారు. అది పెళ్ళితో సమానమే అని గొంతు చించుకుని అరిచినా, ఎవరూ లెఖ్ఖ చెయ్యరమ్మా... లోకులు కాకులు. కుక్కని పొడిచినట్లు పొడుస్తుందమ్మా సంఘం తప్పు చేసిన ఆడదాన్ని. పెళ్ళికి పదిమందిని పిలవడం సాక్ష్యం కోసమేనమ్మా."
"అమ్మమ్మగారూ! మీ బాధ నాకు తెలుసు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. మా నాన్నగారు ఇప్పుడు చాలా దిగులుతో వున్నారు. నేను వెళ్ళడం ఆయనకిష్టం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఆయనతో పెళ్ళి గురించి మాట్లాడలేను. నేను కొద్దికాలంలోనే ఆయనకి అన్ని విషయాలు చెబుతాను. అంతదాకా దయచేసి భరించండి. మాధవి నా ప్రాణం. మీకెంతో నాకూ అంతే."
"ఏమో నాయనా! ఏదీ కాదనలేకపోతున్నాను. భగవంతుడు మిమ్మల్ని చక్కగా చూసి సంతోషంగా వుంచాలని ఆశీర్వదించడం తప్ప నేను చేయగలిగేదేముంది? మాధవి సంతోషమే నా సంతోషం. దానికోసమే బతికున్నాను. దాని కోరిక కాదనలేను, సమాజాన్నీ ఎదుర్కోలేను. ఆ భారాన్ని నీమీదే వేస్తున్నాను బాబూ!"
"అమ్మమ్మగారూ! ఆమె నా భార్య. ఆమెని సంతోషపెట్టడం నా విధి కాదూ! కొంచెం వ్యవధిని ఇవ్వండి. సగౌరవంగా ఇంటికి తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తాను."
"సరే నాయనా! అంతకన్నా నాక్కావలసిందేముందీ? వుండండి హారతిస్తాను" అంటూ వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చి హారతిచ్చి కూర్చోబెట్టింది. అమ్మమ్మ చేతి వంట అమృతంలా అనిపించింది ఆ రాత్రి వాళ్ళిద్దరికీ. భోజనాలు చేసి గదిలోకెళ్ళాడు. కొత్త అనుభూతులతో, ఆనందంతో, ఒక రకమైన భయంతో కొత్త జీవితాన్ని కోరుకుంటూ.
భగవంతుడిపైన భారం వేసి కళ్ళు తుడుచుకుంది అమ్మమ్మ.
ఆలోచిస్తూ పడుకున్న అజయ్ ని చూస్తూ సిగ్గుతో ముడుచుకుపోయింది మాధవి. ఆమెను చూసి లేచి అడుగులో అడుగు వేసి నడిపిస్తూ మంచం మీద కూర్చోమన్నాడు. ఒక నిమిషం ఇరువురూ నిశ్శబ్దంగా వున్నారు. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. బరువైన కళ్ళతో అజయ్ కేసి చూసి, పాలగ్లాసు నోటి కందించి అడిగింది. ఏమిటాలోచిస్తున్నారు అని.
"మధూ! క్షణం వరకూ ఈ పాలు వేరూ, ఇందులో పంచదార వేరూ. కాని ఈ క్షణం నుంచీ రెండూ కలిసిపోయి ఒకటైపోయాయి. పాలనీ, పంచదారనీ వేరు చెయ్యడం ఎవరి శక్యమూ కాదు!"
"అవునండీ! వివాహమూ అంతే! ఆ మూడు ముళ్ళూ పడే దాకా ఎవరికి వాళ్ళు. ఆ క్షణం నుంచీ ఒక్కటయి బ్రతుకుతారు. అది జ్ఞాపకం చెయ్యడానికేనేమో మొదటి రాత్రి ఈ పాలు తాగించుతారు."
"అంతే కాదు మధూ! ఆ పాలలో తియ్యదనం, కమ్మదనం మన జీవితాలలోనూ రంగరించుకు పోవాలని"
ఆమెను బలంగా హృదయానికి హత్తుకున్నాడు.
"ఊ..." మంత్రముగ్ధలా కౌగిలిలో ఒదిగిపోయింది. వెన్నెల చంద్రునిలో ఐక్యమయిపోయింది. చీకటి దుప్పటిలా కప్పేసింది.
ఎప్పుడు సూర్యోదయమవుతుందో, ఎప్పుడు చంద్రోదయమవుతుందో ఏమీ తెలియకుండా కాలాన్ని మరచిపోయి కలిసిపోయారిద్దరూ. మూడు రాత్రులు, మూడు పగళ్ళూ దాటిపోయినా ముచ్చట తీరలేదు. ఎక్కడ నుంచి పుడుతున్నాయో మాటలు? ఎన్నో జన్మల నుంచి మిగిలిపోయిన మాటలన్నీ ఒక్కసారే చెప్పుకోవాలన్నట్లు ఎడతెరిపి లేకుండా కబుర్లలో మునిగిపోయారు అజయ్, మాధవిలు.
అర్ధరాత్రి దాటిపోయింది. మరికొన్ని గంటలయితే తెల్లవారిపోతుంది. అజయ్ వెళ్ళిపోవాలి. ఇరువురి హృదయాలలోనూ ఏదో బాధ. ఎవరికి వారు పైకి కనబడనీయకుండా దాచుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు.
"అజయ్! కాసేపు నిద్రపోండి. పొద్దున్నే ప్రయాణం చెయ్యాలి" నుదుటి మీద చిన్నగా జో కొడుతూ అంది.
"నో. ఒక్క క్షణం కూడా వృధా కావడానికి వీలు లేదు. కళ్ళారా నిన్నే చూడాలి. మనసంతా నీ మాటలే నిండాలి. మళ్ళీ ఎప్పటికొస్తానో" - బాధతో ఆమెను పసివాడిలా చుట్టేశాడు.