"అన్నీ అబద్దాలా?"
"అవునమ్మా!"
"బాబూ! ఆళ్ళు పెద్దోళ్ళు! మనకెందుకు పేచీలు? మనం బాకీ వున్నాం. అది మెల్లగా తీరే దాక మనం మెత్తగా వుండాల!"
"మనం వుండాలన్నా వుండనియ్యరమ్మా! రేపు వాళ్ళ పనికి పోవాలంట. చూడు మనకుండేది ఆ రెండెకరాలే వాటిని బాగా చేసుకుంటే మనకి అన్నీ సరి పోతాయి. ఇప్పుడు చేసుకోకపోతే అదను తప్పుతుంది."
"అదనో పదనో! ఏం చేస్తాం" నిరాశగా అందామె.
నిట్టూర్చేడు సోము.
"ఒరే! మనం జాగ్రత్తగుండాలి. మన గూడెంలోనే కొందరు వాళ్ళ మనషులుండారు, నోరు జార కూడదు!" కొడుక్కి జాగ్రత్త చెప్పింది.
తలాడించాడు సోము.
చీకట్లు బాగా ముసురుకున్నాయి.
కంచంలో సంకటి వడ్డించి తెచ్చింది చంద్రమ్మ. బయటే గుడ్డి వెన్నెల్లో ఇద్దరూ భోజనం చేసారు.
జానయ్య వస్తాడేమోనని ఎదురు చూస్తూ వుండిపోయారిద్దరూ.
5
ఆ రాత్రి నాయుడు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు మిత్రులందరూ కలిసి శేఖర్ వాళ్ళతో కలిసిపోయాడు. అతనికి తిండి విషయంలో తీర్ధం విషయంలో పట్టింపులు లేవు.
మంచి హుషారుమీద పేక కలిపారు.
"ఊళ్ళో రాను రాను అరాజకం ప్రబలిపోతోంది. మన ఊళ్ళోవాళ్ళు చట్టాలూం సూత్రాలూ నేర్చుకుంటున్నారు" అన్నాడు మునసబు.
"మనం జాగ్రత్త గుండాలి. లేకపోతే ఎప్పుడో పుట్టి ముంచుతారు అన్నాడు నాయుడు.
"ఈరోజు చూడలేదా? వాడు జానెడు లేడు ఎలా ఎదిరించాడో" అన్నాడు చౌదరి.
"వాడిదేం ఉందిలే రేపో మాపో వాళ్ళ నాయన వస్తే నేరుగా వచ్చి కాళ్ళట్టుకుంటాడు అదికాదు సంగతి. తాచెడిన కోతి వనమంతా చెరిచిందన్నట్టుగా వాడు ఊళ్ళో వాళ్ళని ఆకట్టుకుంటే కష్టం. కమ్యూనిజం నేర్పిస్తే మనపని గోవిందా" అన్నాడు శేఖర్.
ఎవరూ మాటాళ్ళేదు దానికి. అతనెంత కలిసిపోయినా యిలాటి వ్యవహారాల్లో కొంచెం దూరంగానే వుంచుతారు ముగ్గురూ. కరణం శేషయ్య వీళ్ళతో ఆలోచన కలిపేవాడే కానీ చేతులు కలిపేవాడు కాదు. ఊళ్ళో కొంత జనం అతని పిసినిగొట్టుతనాన్ని, దురాశనీ ఏవగించుకున్నా మంచివాడనే అంటారు. ఆ ముసుగు వుండటం మంచిదేలే అంటారు వీళ్ళు.
ఎవరూ పలక్కపోయేసరికి ముక్కవిసిరి "నేనెంత చెప్పినా చౌదరికి యిలాంటి చిల్లర మల్లర వ్యవహారాలే కాని అసలు వ్యవహారం పట్టదు. ఏం చేద్దాం?" అన్నాడు శేఖర్.
"ఏమిటది?" నవ్వుతూ అడిగాడు నాయుడు.
"అది కాదు నాయుడూ! భార్గవి విషయం అనుకోడేం? ఒకే వీధి.... దగ్గర దగ్గర ముళ్ళు-ఒకే కులం. కత్తులు కలిపితే యీసారికి ఆ ఆస్తి అంతా యితని చేతికి వచ్చేది కదా"
చౌదరి మాటాళ్ళేదు.
"అవునోయ్! భార్గవి బంగారు బొమ్మలా వుంటుంది. పాతికేళ్ళకే విధవయి కూర్చుంది. ఆ సదాశివం ఆదర్శం ఆదర్శం అంటూ బ్రతికినన్నాళ్ళూ దేశం పట్టుకు తిరిగేడు. ఒక్క కొడుకు కలగ్గానే హరీ మన్నాడు భార్గవి ముఖాన బొట్టు, చేతికి గాజులు అలాగే వుంచేసింది సదాశివం అలా అని చేతిలో చేయి వేయించుకున్నాడట. ఇప్పటికీ శుక్రవారం, మంగళవారం వాళ్ళ పెళ్ళిరోజనీ శనివారం, బర్తుడే అని బుధవారం పూలు పెట్టుకుంటుంది. చెబితే తప్ప భర్త పోయాడని ఎవరికీ తెలియదు!" అన్నాడు మునసబు.
"బాగా స్టడీ చేసినట్టున్నావే!"
చౌదరి కంఠంలో కొంత అసూయ ధ్వనించింది.
మునసబు సమాధానం యివ్వకుండా ముక్క అందుకుని షో చేశాడు.