సత్యనారాయణతోపాటు, పైజామా, లాల్చీలో వున్న ఓ యువకుడు వస్తున్నాడు లోపలకు.
సరోజ ఆ యువకుడిని ఓ క్షణం చూసి లోపలకు వెళ్ళిపోయింది.
"బాగానే ఉన్నట్టున్నాడు" లోపలకు వెళుతూ అనుకొన్నది సరోజ.
"పద్మా! పద్మా!" సత్యనారాయణ కేకలు పెట్టాడు.
గబగబా బయటికి వచ్చిన పద్మ భర్త ప్రక్కన మరో కొత్తవ్యక్తిని చూసి రెండడుగులు వెనక్కువేసింది.
"పద్మా!ఇతను నా స్నేహితుడు హరికృష్ణ, రచయిత అని చెబుతూ వుంటాను చూడు..."
"నమస్కారం!" అన్నది పద్మ చేతులు జోడించి.
"నమస్కారం" ప్రతి నమస్కారం చేశాడు.
"మీ గురించి ఎప్పుడూ చెబుతూ వుంటారు" అన్నది పద్మ.
"నిజంగానా? కోసేస్తున్నాడనుకున్నాను" అంటూ హరికృష్ణ సత్యనారాయణ వీపుమీద దబదబ బాదాడు.
"బాబోయ్! వుండరా! నీపాత అలవాటు పోనిచ్చావ్ కాదు" నవ్వుతూ పక్కకు జరిగాడు సత్యనారాయణ.
"ఎప్పుడొచ్చారు?" పద్మ హరిని అడిగింది.
"నిన్నవచ్చాడట. రాస్కెల్ కు ఇంతవరకు మనం గుర్తురాలేదు" అన్నాడు భార్యకు సమాధానంగా సత్యనారాయణ.
"చూడు చెల్లెమ్మ! నేను రచయితల కాన్ఫరెన్స్ కు వచ్చాను. నిన్నటినుంచీ సభలహడావిడిలో వుండిపోయాను. కొంచెం తీరిక చిక్కగానే వీణ్ని వెతుక్కుంటూ ఆఫీసుకు వెళ్ళాను" అన్నాడు హరికృష్ణ.
"ఎక్కడ దిగారు?" అడిగింది పద్మ.
"కాన్ఫిరెన్స్ వాళ్ళే లాడ్జి ఏర్పాటు చేశారు"
"ఎక్కడ చేశారు?"
"హొటల్ మనోరమలో"
"ఒరేయ్ నేను ఈ ఊళ్ళో వుండగా నువ్వు లాడ్జిలో దిగుతావా?" కోపం నటిస్తూ అన్నాడు సత్యనారాయణ.
"ఇక్కడకు వచ్చెయ్యండి. ఇక్కడినుంచే మీటింగులకు వెళ్ళవచ్చును" అన్నది పద్మ.
"ఏరా మాట్లాడవ్?"
"అలాగే!"
కాన్పరెన్స్ అయిపోయాక కూడా హరికృష్ణ సత్యనారాయణ బలవంతంమీద మరో వారం రోజులు వుండి పోవడానికి అంగీకరించాడు!
హరికృష్ణ రెండురోజుల్లోనే ఇంట్లో కలిసి పోయాడు.
హరికృష్ణ కథలు రాస్తాడని తెలుసుకొని సరోజ బోలెడంత ఆశ్చర్యపోయింది.
కథలు చదవడంతప్ప అంతవరకూ రాసే వాళ్ళను చూడని సరోజకు హరికృష్ణ అద్భుతమైన వ్యక్తిగా కన్పిచంసాగాడు!
సరోజ అందానికి ముగ్దుడైన హరికృష్ణను ఆమె అమాయకత్వం ఆకర్షించింది.
సరోజ హరికృష్ణ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు.
పద్మ పిల్లలతో దూరపుబంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళింది!
హరికృష్ణ వచ్చేసరికి సరోజ పుస్తపఠనంలో లీనమై వుంది!
హరికృష్ణ వచ్చింది ఆమె గమనించలేదు!
ఓ క్షణం కన్నార్పకుండా సరోజను చూస్తూ నిలబడ్డాడు!
"ఏమిటి అంత లీనమై చదువుతున్నారు?"
సరోజ ఉలిక్కిపడింది!
చేతిలో పుస్తకం జారి క్రింద పడింది.
హరికృష్ణను చూసి గాబారాగా లేచి నిల్చుంది.
"ఇంట్లో ఎవరూ లేరా?"
"వదిన పెళ్ళికి వెళ్ళింది.
హరికృష్ణ వంగి కిందపడ్డ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు!
అది ఒక ప్రఖ్యాత రచయిత్రి రాసిన 'పగిలిన వీణ' అనే నవల! పేజీలు తిగగేస్తూ కూర్చున్నాడు.
"తీసుకోండి" సరోజ కాఫీ కప్పు అందించింది హరికృష్ణకు.
కాఫీ సిప్ చేస్తూ "నా నవల చదివావా?" అడిగాడు హరికృష్ణ!
"ఏదీ! నిన్న మీరు ఇచ్చిందేనా? ఆకలి జ్వాలేనా?
"అదే! ఏం బాగా లేదా? నవ్వుతూ అడిగాడు.
"కొద్దిగా చదివాను" నసుగుతూ అన్నది సరోజ.
"ఏం బాగాలేదుగదా? అందులో ప్రేమలూ, పెళ్ళిళ్ళు లేవుగా? అందుకే నీకు నచ్చలేదు" చిరునవ్వుతో అన్నాడు!
"బోర్ గా వుంది. బీదవాళ్ళూ, స్ట్రయికులూ ఏవేవో వున్నాయి. నాకు అర్థంకాలేదు" అన్నది సరోజ.
"పూర్తిగా చదివితేగడా అర్థం అవుతుంది."
"ఇంటరెస్టింగ్ గా లేదు! మీరు కూడా ఇలాంటి నవలలు రాయకూడదూ?" చేతిలో పుస్తకాన్ని చూపుతూ.
"అంటే....అదే అహల్యం సుందరమ్మ రవికుమార్. క్రాంతికుమార్ ,మొదలయిన వాళ్ళు రాసే నవలల లాంటివా?"
"ఆ....అవును! నాకు రవికుమార్ రాసిన 'రాగిణి' అనే నవల అంటే బలే ఇష్టం. ఇప్పటికి మూడు సార్లు చదివాను" సరోజ ఉత్సాహంగా అన్నది.
హరికృష్ణ సరోజ ముఖంలోకి చూస్తూ ఓ క్షణం మౌనంగా వుండిపోయాడు.
"మీకు అలాంటి నవలలు రాయడం రాదా?"
హరికృష్ణకు నవ్వొచ్చింది!
"రాదేమో ఎప్పుడూ? ప్రయత్నించలేదు."
"ప్రయత్నించకూడదూ? రాస్తారు గదూ?"
"నువ్వు రాయమంటున్నావుగా! ఇక నుంచి రాస్తాను" అన్నాడు ముసిముసిగా నవ్వుతూ హరికృష్ణ!
"నిజంగా?" ముఖమంత కళ్ళు చేసుకొని ఉత్సాహంగా అడిగింది సరోజ!
సరోజ అమాయకత్వానికి జాలివేసింది!
నవ్వు వచ్చింది.
ఆమె చేతిలోని నవలలాక్కుని గిరాటు వెయ్యాలని "రాస్తాను. ఎలాంటి ప్రేమకధ రాయమంటావ్?" అడిగాడు హరికృష్ణ తన భావాలను అణచుకుంటూ.
సరోజ ఆలోచనలో పడింది.
హరికృష్ణ సరోజ ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు.
"ఎలాంటి అంటే....ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు" అన్నది సరోజ కళ్ళు తిప్పుతూ.
"పోనియ్. నేను కొన్ని ప్లాట్సు చెబుతాను, అందులో నీకు నచ్చింది చెప్పు. ముందు అది రాస్తాను" అన్నాడు సిగరెట్ తీసి పెట్టెమీద కొడుతూ.
సరోజ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కుర్చీలో ముందుకు జరిగి కూర్చుని 'చెప్పండి' అన్నది ఉత్సాహంగా.
"మరేమో ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చాలా పొడవుగా అందంగా, ఇద్దరమ్మాయిలు ఒకేసారి తలలు దాచుకోగలిగినంత వెడల్పు చాతీ, కత్తుల్లా తళతళ లాడే చూపులు."
ఆగి సరోజ ముఖంలోకి చూశాడు హరికృష్ణ.
సరోజకళ్ళు మిలమిల లాడిపోతున్నాయి.
"ఊఁ తర్వాత" కుతూహలాన్ని భరించ లేనట్టుగా అడిగింది.
"ఆ అబ్బాయి ఒక అందమైన సోగకళ్ళ అమ్మాయిని ప్రేమించాడు. ముందు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అసహ్యించుకుంటూ దూరంగా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ దేశాలమీద పడతాడు. కొంతకాలానికి ఆ అమ్మాయి తనను తాను తెలుసుకుటుంది. ఆ అబ్బాయిని ప్రేమించేస్తుంది. ఆ అబ్బాయి ఆ యింటి నుంచి వెళ్ళిపోతాడు.