Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 12

    కాలింగ్ బెల్ నొక్కు.....అవసరం ఉండదు-సుధ తనకోసం ఎదురు చూస్తూ వాకిట్లోనే నిలబడి వుంటుంది.
   
    "నిన్నరాత్రే రావాల్సిందికదూ? ఇప్పుడా వస్తున్నారూ?"
   
    కృష్ణకు ఒళ్ళు జలదరించింది.
   
    ఏమిటీ ఘోరం?
   
    ఎందుకిలా ఐపోయింది?
   
    ఇదంతా కలా నిజమా?
   
    సుధనుగురించి తను ఎంత హీనంగా ఆలోచించాడు?
   
    ఎంత నీచంగా ఊహించాడు.
   
    ఒకవేళ సుధ జగన్ ప్రియురాలే కావచ్చు. ఐతేమాత్రం? ఆమెను గురించి అంత దుర్మార్గంగా ఊహించడమా? ఆమె నిస్సహాయురాలు. తండ్రిని కాదని ఏం చెయ్యగలదు?
   
    మగవాడు జగన్ దిగజారిపోయాడు. జగన్ ప్రాణాలు తియ్యడానికి ప్రయత్నించిన రమణమూర్తి కూతురు ఎదురుతిరిగితే సహిస్తాడా? గొంతు పిసికి ఏ నూతిలోకో, గోతిలోకో తోసేసి వుండేవాడు.
   
    జగన్మోహన్ ను ప్రేమించింది.
   
    అతనికి బిడ్డను కంది.
   
    ఐతే అతడితో కాపురం చెయ్యలేకపోయింది.
   
    అది ఆమె తప్పుకాదు.
   
    సుధను గురించి తను నిర్ధాక్షిణ్యంగా ఆలోచించాడు. అతి క్రూరంగా ఆలోచించాడు. తన సంసారం ఏమైంది? తన నాగరికత ఇంతేనా వాస్తవానికి సుధ తనను ద్వేషిస్తూ ఉండాలి. ఆమె ఇష్టా అయిష్టాలను తెలుసుకాకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాడు. పెద్దవాళ్ళు ఏర్పాటుచేశారు. తను అంగీకరించాడు. ఇందులో సుధ తప్పు రవ్వంతకూడా లేదు-ఆమెను తను అడగలేదు.
   
    ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోలేదు.
   
    ఇప్పుడామెను నిందించి ప్రయోజనం లేదు.
   
    తన వివేకం ఏమైంది? తన సంస్కారం ఏమైంది?
   
    కడుపులో చిచ్చు రగులుతున్నా, గుండెల్లో కుంపటి రాజుతున్నా, సుధ తనను-భర్త రూపాన్ని-కనురెప్పలకింద దాచుకొని పూజిస్తుందంటే ఆమెలో ఎంత ఔన్నత్యం ఉండాలి? ఆమెది ఎంత విశాలహృదయం అయిఉండాలి?
   
    మగవాడికి తనను అర్పించడమేతప్ప, స్వార్ధం తెలియని అమాయకురాలు. మమతానురాగాలను మనసులో నింపుకొన్న వ్యక్తిత్వం ఆమెది.
   
    విమానం తెల్లటి మబ్బుల్లోంచి, అంచెలంచెలుగా కిందకు దిగుతూంది.
   
    పక్కసీట్లో కూర్చున్నాయని నడుముకు బెల్టు బిగించుకుంటున్నాడు.
   
    మైక్రోఫోన్ లో ఎయిర్ హోస్టెస్ ఎనౌన్స్ మెంటు విన్పిస్తోంది.
   
    ఇంకా కొద్ది క్షణాలే బేగంపేట ఎయిర్ పోర్టులో దిగడానికి!
   
    మరికొన్ని క్షణాల్లో విమానం రన్ వే మీద వాలి పరుగుతీసి, మెల్లగా ఆగింది.
   
    డోర్ దగ్గిర, నమస్తే చెబుతూ నిలబడివుంది మిస్ విమలా చౌదరి.
   
    బయటకు వస్తున్న కృష్ణను పరిశీలనగా చూస్తూ "ఆర్ యూ ఆల్ రైట్ నౌ సర్?" అని అడిగింది.
   
    "ఫర్ ఫెక్ట్ లీ! థాంక్యూ మిస్ చౌదరీ!"
   
    ఆమె చిరునవ్వుతో తలపంకించింది.
   
    లేడర్ దిగి, కృష్ణ తలెత్తి పైకి చూశాడు.
   
    ఆమె తనవైపే చూస్తున్నట్లు గ్రహించాడు.
   
    చెయ్యెత్తి మెల్లగా ఊపాడు.
   
    ఆమె అలఓకగా చెయ్యి ఊపింది.
   
    "నైస్ గరల్!" అనుకుంటూ ముందుకు కదిలాడు.
   
    పదినిముషాల్లో లగేజ్ వాన్ వచ్చింది. రన్నింగు బెల్టుమీదనుంచి సూటుకేస్ అందుకొని, బయటికి వచ్చి టాక్సీ ఎక్కాడు మురళీకృష్ణ.
   
                                             8
   
    మురళీకృష్ణ ఊహించినట్టుగా, తను వచ్చేసరికి వాకిట్లో సుధ ఎదురు చూస్తూ నిలబడిలేదు.
   
    ఇంట్లోకెళ్ళి చూశాడు.
   
    హాల్లోగానీ, బెడ్ రూమ్ లోగానీ కన్పించలేదు. సుధ ఇంట్లో వున్న జాడేలేదు. వంటింటిలోకి వెళ్ళి చూశాడు. అక్కడాలేదు.
   
    పెరట్లో బట్టలుతుకుతూ పంకజం కన్పించింది.
   
    "మీ అమ్మగారెక్కడే పంకజం?"
   
    "బాబుగారూ! వచ్చేశారా?" వళ్ళంతా కళ్ళుచేసుకొని లేచినిలబడింది పంకజం.
   
    సుబ్బుచేతులు కడుక్కొని, ముఖంమీద పడిన ముంగురులను వెనక్కు తోసుకుంటూ కృష్ణదగ్గిరకు పరిగెత్తుకొచ్చింది పంకజం.
   
    "కాఫీ పెట్టమంటారా?"
   
    "సుధ ఎక్కడికెళ్ళింది?"
   
    "గుడికెళ్ళిందండీ!"
   
    "గుడికా? ఎందుకూ?"
   
    "గుడికెందుకెళతారూ? బలే అడుగుతున్నారే?" పంకజం పకపక నవ్వింది.
   
    "అదికాదు పంకజం. మీ అమ్మగారికెప్పుడూ గుడికెళ్ళే అలవాటులేదు. ఇపుడెందుకు వెళ్ళిందీ అని?"
   
    "మీరు లేరుగా అందుకని!" ఆమె కొంటెగా చూస్తూ అంది.
   
    "ఆఁ నేను లేకపోతే?" తనను తానే ప్రశ్నించుకున్నట్టుంది కృష్ణ అన్నతీరు.
   
    "మీరుంటే మీ పూజ. లేకపోతే దేవుడి పూజ. భర్తే దైవమంటారుగా బాబూ?"
   
    "చాలా నేర్చావే పంకజం! రేపు నీ మొగుడికి పూజచేస్తావా?"
   
    "పూజా? నేనా? ఊఁహూఁ! ఆడే నా కాళ్ళకు పూజచెయ్యాలి."
   
    "ఇపుడే అన్నావుగదే భర్తయే దైవమని?"
   
    "ఆమాటకొస్తే భార్యకూడా దేవతే!"
   
    "ఈ మధ్య ఏ సినీమా చూశావు పంకజం?"
   
    "ఎక్కడ బాబూ! అమ్మగారు సినీమాకు పోనీస్తేనా? మీరెల్లినరోజు నుండి ఈడే ఉండిపోయినా! ఈరాత్రి వదుల్తార్లె! మీరొచ్చేశారుగా?"
   
    "సరేగానీ, సుధ ఎప్పుడొస్తుందంటావ్?"
   
    "వచ్చేస్తారులే బాబూ! ఇప్పుడేగా వెళ్ళారు! పూజలు, గీజలూ అయిపోవద్దా ఏమిటీ?"
   
    "ఏం పూజలే నీ బొంద పూజలూ__ఎప్పుడూ లేందీ....?"
   
    "నాకేటి తెలుసు బాబూ?" మెడ వెనక గోక్కుంటూ వంటింటిలోకి నడిచిందామె.
   
    పంకజమిచ్చిన కాఫీ తాగాడు. గడ్డం చేసుకున్నాడు. స్నానానికి బాత్ రూమ్ లోకి వెళ్ళాడు కృష్ణ.
   
    షవర్ వదిలి కింద నిలబడ్డాడు. ఒళ్ళు తడిశాక సబ్బు పట్టించాడు.
   
    సుధ గుడికెందుకు వెళ్ళినట్టు?
   
    దేవుణ్ణి ఏమని ప్రార్ధించిందో?
   
    జగన్ మద్రాస్ లోనే ఉంటున్నాడని ఆమెకు తెలుసా?
   
    తను మద్రాస్ వెళ్ళాడు. అందుకే ఆ రహస్యం తనకు తెలియకుండా వుండాలని దేవుడిని ప్రార్ధించడానికి గుడికెళ్ళిందా? ఆ రహస్యం తనకు తెలుస్తుందని అనుమానం రావడానికి ఆస్కారం ఏముంది?
   
    జగన్ తన స్నేహితుడని ఆమెకు తెలిసే అవకాశంలేదు.
   
    సుధా తన భార్య అయిందని జగన్ క్కూడా తెలియదు.
   
    ఒంటిమీద సబ్బు బుడగల్లాగే, బుర్రలో అనేకాలోచనలు మెదిలి జారి, పగిలిపోతున్నాయి.
   
    షవర్ పూర్తిగా వదిలి తల నీళ్ళధారలకింద పెట్టాడు.
   
    తలనుంచి మురికి ఒంటిమీదగా కారిపోతూంది.
   
    ఆ మురికితోపాటు తలలోని దిమ్ముకూడా పోయి హాయిగా అనిపించసాగింది.
   
    "ఎంతసేపండీ స్నానం?"
   
    బాత్ రూమ్ తలుపు తడుతూ సుధ అనడం విన్పించింది.
   
    కృష్ణ షవర్ కట్టేసి, టవల్ అందుకున్నాడు.
   
    "వస్తూనే బాత్ రూంలో జొరబడ్డారు. త్వరగా రండీ!"
   
    డోర్ పక్కన నిలబడి తియ్యగా, ముద్దుముద్దుగా రాగాలు తీస్తూ వుంది సుధ.

 Previous Page Next Page