అప్పటికి అర్ధగంటనుంచి బస్సుకోసం చూస్తున్నాను. నాకు కావలసిన బస్సు తప్పితే తతిమ్మా బస్సులూ ఎడతెరపి లేకుండా పోతున్నాయి. ఆరు గంటల వరకూ ఆఫీసు పనిచేసి విసగి వేసారి వున్నానేమో! పైగా వానజల్లొకటి లంకించుకున్నది. చాలా చిరాగ్గా వుంది. టప్ టప్ మని ఎవరో చిల్లపెంకులు గురిచూడకుండా విసిరినట్లు అక్కడో చినుకు, ఇక్కడో చినుకు. తలెత్తి చూశాను. ఆకాశం చిన్నా పెద్ద మేఘాల్ని కంబళీల్లా కప్పుకుంటోంది. ఇక వాన తప్పదు. అక్కడవున్న షెల్టర్ లోకి వెళ్లబోయాను. ఇంతలోనే నేను ఎక్కవలసిన బస్సు వచ్చింది.
దిగవలసినవాళ్ళు దిగకముందే కొందరు తోసుకుంటూ ఎక్కసాగారు. ఎలాగయితేనేం నేనూ బస్సు కడ్డీ పట్టుకో గలిగాను. ఎక్కుతూండగానే ఎవరిదో మోచెయ్యి పొడుచుకున్నందువల్ల ముక్కు నొప్పి పుట్టడమే కాకుండా, కళ్ళజోడు కూడా ఒక చెవ్వునుంచి తప్పుకున్నది: అదృష్టంకొద్దీ కింద పడలేదు. ఆ వచ్చే అరవయి జీతపురాళ్ళలో మిగిల్చి కొత్త జోడు కొనాలంటే ఏ ఆరునెల్లో పట్టవచ్చు. ఇంతలో ఏదో వీపుకు గట్టి వస్తువు కొట్టుకొని ప్రాణం కడబట్టినంత పని అయింది.
తీరా చూస్తే ఒక యువతి. చూట్టానికి డొక్కశుద్ది కలదానిలాగానే వున్నది. చేతిలోవున్న లెదర్ సూట్ కేసుతో నన్ను నెట్టుకుంటూ పోయి, ఆడవాళ్ళకు రిజర్వుచేసిన వెనుక సీటులోనే కూర్చున్నది. కోపం వచ్చినా చేసేదేమీ లేక ఆమె పక్కనే కూర్చున్నాను. కళ్ళజోడు సవరించుకుంటూ, పక్కనే కూర్చున్న ఆమెను మింగుదామా అన్నట్లు చూశాను. ఆమె తక్కువ తింటేగా! నన్ను మింగుదామా అన్నట్లు ఆపాదమస్తకం చూస్తున్నది. నన్ను శల్యపరీక్ష చేస్తున్న ఆమె చూపులు 'నేను ఎవరిననుకున్నావ్' అని సవాలుచేసి అడుగుతున్నట్లున్నాయ్.
ఆమె తీక్షణ వీక్షణాల ముందు నా చూపులు అట్టేకాలం నిలబడలేకపోయాయి. ముఖం పక్కకు తిప్పుకుని ఏదో ఆలోచించుకోసాగాను. దాదాపు ఆమె విషయమే మరచిపోయాననే చెప్పాలి.
"అనాగరిక జంతువులు! వెధవ తొక్కిసలాట!" అన్న ఆమె మాటలకు వులిక్కిపడి నాకు తెలియకుండానే అనేశా "ఎవరూ?" అని.
"వీళ్ళే" అంటూ నిల్చో టానికి కూడా చాలినంత లేక బస్సు కుదుపులకు ఉయ్యాలలూగుతున్న ఓ అరవయి సంవత్సరాల ముసలమ్మను, పది సంవత్సరాల పిల్లను__బహుశా ఆమె మనమరాలు కావచ్చు__చూపించింది.
బస్సులో ఎక్కేటప్పుడు ఆమె చూపిన సభ్యతా నాగరికతా నాకు గుర్తుకొచ్చింది. ముక్కు ఇంకా నొప్పి పెడుతూనే వుంది.
ఆమె మాటల తీరూ, ముఖంలో వుట్టిపడే హుందాతనం, కళ్ళలోనుంచి తొంగిచూస్తున్న అహంభావం చూస్తే; ఎప్పుడూ ఎవర్నీ అనవసరంగా పలకరించని నాకు కూడా, ఆమెతో మాట్లాడబుద్ది పుట్టింది.
"ఏమండీ, మీరు తెలుగువారా?" అన్నాను.
"అవును" ఒక్కొక్క అక్షరాన్నీ నొక్కుతూ అన్న ఆ మూడక్షరాల ఆ 'అవును' లో ఎంత బరువు కన్పించింది!
"నీవూ?" నేను మొదట్లో, ఆ ఏకవచన ప్రయోగం నన్ను ఉద్దేశించింది కాదేమో అనుకున్నాను. కాని మరల అదే ప్రశ్న వినబడింది. తలతిప్పి చూశాను. నన్నే అడుగుతోంది. నాకు చెడ్డ కోపం వచ్చింది. కానీ ముందు పలకరించిన నేరానికి పశ్చాత్తాపపడుతూ అన్నాను, "అవును, నేను తెలుగుదాన్నే" అని.
"మద్రాసులో ఏమి చేస్తున్నావూ?" రాగయుక్త స్వరంతో అడిగింది.
"పని చేస్తున్నానూ" ఇంకొంచెం రాగంతీస్తూ చెప్పాను.
ఆ తరువాత రాబోయే ప్రశ్న ఏదో నాకు తెలుసు. ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఎదురు ప్రశ్న వేశాను__
"నీవేమీ చేస్తున్నావూ?" అన్నాను అదే స్వరంతో.
"నేనేమీ చేయనవసరం లేదు" అన్నదామె తడుముకోకుండా, ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్లు. నేను గతుక్కుమన్నాను. కాలాంతకురాలే అనిపించింది.
"ఎందుకని అవసరం లేదూ?" అన్నాను ఉక్రోషం కొద్దీ.
"నేను గొప్ప కుటుంబంలోని దాన్ని. నాకు పనిచేయాల్సిన అవసరం లేదు."
పనిచేయటం, స్వతంత్రంగా జీవించటం చాలా హేయమైనట్లూ, పనిచేసే వాళ్ళంతా తక్కువ కుటుంబాల వాళ్ళన్నట్లూ, మాట్లాడే ధోరణి, అహంకారం చూస్తే, ఈమెకు ఒక పాఠం నేర్పకుండా వదలకూడదనిపించింది. ఇలాంటివాళ్ళు తమకంటే పైవాళ్ళను చూసినప్పుడు కుళ్ళిపోతూ, కిందివాళ్ళను చూసినప్పుడు తమ ముందు వాళ్ళంతా చీమలూ, దోమలూ అనుకొని తృప్తిపడతారు. పైకి ఎగరటానికి ప్రయత్నిస్తూ ఇంకొంచెం కిందకు జారుతూంటారు పాపం!
"ఏమి పనిచేస్తున్నావూ?" అన్నది ఆమె మళ్ళీ!
ముఖంలో లేని గాంభీర్యాన్ని, నిండుతనాన్నీ తెచ్చి పెట్టుకుంటూ అన్నాను__
"కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను."
"జీతమెంత?"
వచ్చేది అంతకంటే చాలా తక్కువైనా ఆమెకు రెండువందలకంటే తక్కువ చెప్పబుద్ది పుట్టలా.
"రెండు వందలు" అన్నాను.
షాక్ తిన్నట్లు సీటులో ఠక్కున కదుల్తూ, నా కళ్ళలోకి ఓమారు సూటిగా చూసి, 'ఫర్వాలేదే, నీవే నయం! ఒక్కదానివీ రెండు వందలు సంపాయిస్తున్నావూ!' అన్నది నొక్కి పలుకుతూ.
ఆ వాక్యంలోని ధ్వని నాకు బోధపడలేదు. వినిపించనట్లు నటించాను. ఆమె వొదిల్తేనా? అదే వాక్యాన్ని వత్తి వత్తి మరల నా చెవి దగ్గర అన్నది. వళ్ళు మండి _