Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 11


    రహమాన్ ఖాళీసీసాను బండి తడికకు కట్టిఉన్న చిన్న సంచిలో పెట్టాడు.

 

    'అమ్మయ్య !'

 

    సీసా ఇక్కడుందన్న మాట ! ఛ! తను ప్రతిదానికీ భయపడే పిరికివాడై పోయాడు.

 

    "రహమాన్ నీవయసెంత ?"

 

    "ముప్పయ్ ఆరు."

 

    నేను మరోసారి అదిరిపడ్డాను.

 

    "నీవయస్సు ముప్పయ్ ఆరైతే నువ్వు నలభైసంవత్సరాల క్రితం భూతరాజును ఎలా చంపావు?"

 

    "అదా మీసందేహం? యోగి గురించి చెప్పాగా? అతడే ఇరవైరోజులు ఏవేవో మూలికలు తినిపించాడు. మరో ఏభైఏళ్లదాక నీవయసు ఆగిపోతుందని చెప్పాడు. మరో పదేళ్లు నేను బతుకుతాను. భూతరాజుమీద కసితీర్చుకుంటాను." కసిగా అన్నాడు.

 

    దయ్యంమీద మనిషి కసితీర్చుకోవడం ఏమిటి? వీడికి పిచ్చేమో.

 

    వీడుకూడ కట్టుకథలే చెప్తున్నాడు.

 

    "అయితే రహమాన్ నన్ను దారితప్పించి ఏంచెయ్యాలనుకొన్నాడు?"

 

    "ఆదారిలో ఒకపొలంలో పెద్దనుయ్యిఉంది. దాంట్లోకితోసి చంపాలని అతని ప్రయత్నం. అలా చేసిన తర్వాత వాడి ఆత్మకు విముక్తి లభిస్తుంది. అది వాడికి కలగకుండా చేస్తున్నాను. అందుకే నేను మీలాంటి వాళ్లను రక్షించి తీసుకెళ్తూ ఉంటాను."

 

    "అసలు నీకు భూతరాజు మీద అంతకోసం ఎందుకూ?"

 

    "వాడు నా చెల్లెల్ని మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి. నా చెల్లెలు గర్భవతి అయింది. వాడు పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాడు. నా చెల్లెలు ఊళ్లో మంచినీళ్ల బావిలో పడి చచ్చిపోయింది. చచ్చిపోతూ తన చావుకు కారణం రాసింది. భూతరాజు తనను మోసం చేశాడనీ, వాడిమీద ప్రతీకారం తీర్చుకొని తన ఆత్మకు శాంతి కలిగించమని కోరింది."

 

    ఆగి ఏదో వింటున్నట్టు చెవులు రిక్కించాడు.

 

    వీడు కూడా ఏదో ఏడ్పు విన్పిస్తుందని చెప్తాడు కాబోలు!

 

    "ఊఁ. చెప్పు ఆగిపోయావేం?"

 

    "అప్పటినుంచి నేను పగబట్టాను. బైరవమూర్తి దగ్గర అతని కుడిభుజంగా ఉండే భూతరాజును చంపడు సామాన్యమైన విషయంకాదు. నా చెల్లెలు చనిపోవడానికి కారణం నాకు తెలియనట్టే నటించాను. భూతరాజుతో స్నేహం చేశాను.

 

    నమ్మించి మోసం చేశాను. ఏదో పనిమీద స్టేషన్ కు వెళ్దాం రమ్మన్నాను. వాడు నమ్మి నాతో వచ్చాడు. చాలా పొద్దుపోయేదాకా స్టేషన్ లోనే ఉన్నాం. ప్యాసెంజరుకు నా స్నేహితుడొకడు వస్తాడని చెప్పాను."

 

    "వచ్చాడా?" అన్నాను యాంత్రికంగా.

 

    "ఎలా వస్తాడూ?"

 

    "ఏం?"

 

    "అసలు వచ్చేవాళ్లంటూ ఎవరూ లేరు. అతన్ని పొద్దుపోయేంత వరకూ స్టేషన్ లో ఉండాలని నా ప్లాన్. ప్యాసెంజరు వెళ్ళిపోయాక ఇద్దరం దుమ్మలగూడెం బయలుదేరాం."

 

    "మీది దుమ్మలగూడెమా?"

 

    "అవును." ముక్తసరిగా అని చెప్పసాగాడు.

 

    "వాడు- ఆ భూతరాజుగాడు నిన్ను రోడ్డు వదిలి దగ్గర బాటలో వెళ్దామంటూ ఆ కాలిబాటకు రమ్మని ఎందుకు బలవంతం చేశాడను కొన్నావ్?"

 

    "ఆ దారి అడ్డదారని చెప్పాడు. దుమ్మలగూడెం త్వరగా వెళ్ళొచ్చన్నాడు."

 

    "ఆ దారి దుమ్మలగూడెం పోదు. ఆ రాత్రి-అదే నేను అతడ్ని చంపదల్చుకొన్న రాత్రి-అతడితో అలాగే చెప్పాను. అతను నమ్మాడు. ఆ దారినవెళ్తే ఒక కిలోమీటర్ తర్వాత ఒక పాడుబడ్డ దేవాలయం, దానికి ముందొక పూడిక తియ్యని బావి ఉన్నాయని నాకు తెలుసు. ఆ దారిన మానవమాత్రుడు ప్రయాణం చెయ్యడు రాత్రిపూట. బావిదగ్గరకు రాగానే నాకు దాహం వేస్తోందనీ, ఎలాగయినా నీళ్లు చేదడానికి అవకాశం ఉంటుందేమో చూద్దామనీ తీసుకెళ్ళాను. ఇద్దరం తొంగి చూస్తున్నాం. నేను ఒక్కసారిగా అతడ్ని ముందుకు తోశాను. అనుమానం లేనందువల్లా, ఒక్కసారిగా తొయ్యడంవల్లా అతడు ఆ బావిలో పడిపోయాడు. అతను నాకంటే బలవంతుడు. రెండోకంటికి తెలియకుండా వాడ్ని చంపడం అసాధ్యం అని నాకు తెలుసు. వాడు దయ్యం అయ్యాడు. అశాంతిగా తిరుగుతున్నాడు. రోజూ స్టేషన్ కు మానవాకారంలో వస్తాడు. నీలాంటి వాడ్ని దొరకబుచ్చుకొని, కబుర్లు చెప్పి అడ్డతోవన తీసుకెళ్ళి బావిలో తోసేస్తాడు."

 

    "అలా చెయ్యడంవల్ల లాభం?" పెదవులు నాలికతో తడుపుకొని అడిగాను.

 

    "దయ్యానికి లాభం ఏమిటి? దయ్యపు చేష్ట! తను పడిన ఆ బావిలో ఎవర్నయినా తోసేసిన కొద్దిరోజులు వాడు చాలా సంతృప్తిగా ఉత్సాహంగా ఉంటాడు. అందుకే వాడికి ఆ అవకాశం రాకుండా నేను అడ్డుపడి వాడి వలలో పడినవాళ్లను రక్షిస్తుంటాను" అంటూ నిట్టూర్పు విడిచాడు రహమాన్.

 

    నా బుర్ర మొద్దుబారి పోయింది.

 

    నవలకు హత్యా సంబంధమైన రహస్య వివరాలను సేకరించడానికి బయలుదేరిన నేను దయ్యాల మధ్య ఇరుక్కున్నానా?

 

    ఒకవైపు భయంతో నా నవనాడులూ బిగుసుకుపోతున్నాయి. అయినా వాడి బారినుండి బయటపడ్డాననే సంతోషం మరోవైపు.

 

    "ఇంకా నయమే. బావిలో తోసేస్తున్నాడు తల పగలగొట్టి మెదడు తినకుండా!" ఆ దృశ్యం ఊహించుకొని వణికిపోయాను.

 

    "ఛ! అదేంటి సార్ ! మావాళ్లు అలా చెయ్యరే?"

 

    నేను తృళ్లిపడ్డాను. వీడు మావాళ్లంటున్నాడేమిటి?

 

    "అవి నాకు కన్పిస్తాయి. నాతో మాట్లాడతాయి. వాటితో నాకున్న అనుబంధంతోనే మావాళ్లు అన్నాను సర్."

 

    వీడు నా మనసును తెరిచిన పుస్తకాన్ని చదివినంత తేలిగ్గా చదివేస్తున్నాడు. నా ఊహల్నీ భయాల్నీ ఇట్టే పసిగడ్తున్నాడు. వీడికి నిజంగానే అతీతశక్తులు ఉన్నట్టున్నాయి. సందేహం లేదు. వీడు సామాన్యుడు కాడు. అవును! దయ్యాలకు మనుషులు భయపడాలిగాని మనుషులకు దయ్యాలు భయపడటం ఏమిటి? నాన్ సెన్స్! వీడు కోతలు కోస్తున్నాడు.

 Previous Page Next Page